మరొక భూస్వామి కమతంలో పనిచేస్తున్న జాన్ ఫ్రాంస్వాజ్ మీద ప్రేమ పెంచుకుంటాడు. కానీ గర్భవతి అయినా లిజాను పెళ్ళాడితే తను కూడా స్థిరపడవచ్చన్న చిన్నపాటి స్వార్థంతో లిజాను పెళ్ళాడ్డానికి ఒప్పుకుంటాడు! అంతలో బ్యుతో వచ్చి లిజాను వివాహమాడతానని ఒప్పుకోవడంతో తన పనుల్లో తాను పడతాడు జాన్! లిజాను పెళ్ళాడి వాళ్లింట్లోనే కాపరం పెట్టిన బ్యుతోకి పదహారేళ్ళ ఫ్రాంస్వాజ్‌ని సైతం సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధి పుడుతుంది. అతడిని అసహ్యించుకుంటూ నిరంతరం తన్ను తాను రక్షించుకుంటుంది ఫ్రాంస్వాజ్! అతడు కనపడితే చాలు ఒళ్ళు మండిపోతుంది ఆమెకి!
రోజ్ మరణంతో (రోజ్ మరణానికి కారణం బ్యుతోనే! తల్లితో దెబ్బలాడి ఒక తోపు తోయడంతో కిందపడి గాయాలపాలై మరణిస్తుంది) ఒంటరివాడైన పువాన్‌కి ఒప్పందం ప్రకారం నెలనెలా ఇవ్వాల్సిన డబ్బు, ధాన్యం ఇవ్వడం మానేస్తారు జీసస్, బ్యుతోలు! ఫానీ తన వద్ద వచ్చి ఉండమంటుంది కానీ ఆవిడ పరిశుభ్రతా నియమాలు తట్టుకోలేక పారిపోతాడు పువాన్. అతడి దగ్గర మిగిలున్న కాస్త డబ్బూ కాజేయడానికి తన వద్దకు రమ్మంటాడు జీసస్. అతడి ఇల్లొక మురికికూపం! అక్కడ ఉండలేకపోతాడు పువాన్. గతిలేక వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని భరించలేక బ్యుతో ఇంటికి చేరతాడు. అక్కడ అనుక్షణం బ్యుతో ఫ్రాంస్వాజ్‌ని లొంగదీసుకుని అత్యాచార ప్రయత్నాలు చేయబోవడం చూసి సహించలేకపోతాడు.
ఆ పిల్ల పడే యాతన ఊరంతటికీ తెల్సు. ఇల్లంతా ఈ విషయమై గొడవలు, లిజాకి బ్యుతో చేతిలో తన్నులు! తన మొగుడితో గడపడానికి ఒప్పుకోమని చెల్లెలికి లిజా వేడుకోళ్లు.
ఇహ బ్యుతో బాధలు పడలేక అతడిని తీవ్రంగా ద్వేషిస్తూ జాన్‌ని పెళ్ళి చేసుకుంటుంది ఫ్రాంస్వాజ్! మరదలు, ఆమె భూమీ తనకి దక్కకుండా పోయినందుకు పీక్కుంటాడు బ్యుతో! లిజా, ఫ్రాంస్వాజ్‌ల మధ్య శతృత్వం ప్రారంభమవుతుంది. ఒకరికొకరుగా బతికిన ఆ ఇద్దరూ ఆస్థి వల్ల బద్దశత్రువులైపోతారు. ఫ్రాంస్వాజ్ గర్భవతి అవుతుంది. ఆమెకు పిల్లలు లేకుండా చేస్తే ఆమె భూమికి తామే వారసులమవుతామని లిజా, బ్యుతో ఆలోచించి ఒక మూఢనమ్మకం ప్రకారం ఆమె పొట్టమీద శిలువ ఆకారంలో చేత్తో గీయాలని నిర్ణయించుకుంటారు.
ఒంటరిగా పొలానికొస్తున్న ఆమెను బ్యుతో అటకాయిస్తాడు. ఆమెపై అత్యాచారం చేసాడు. అందుకు లిజా సహకారం!
అక్కాచెల్లెళ్ళ మధ్య భీకర పోరాటం! ఆవేశంలో లిజా తోసిన తోపుకు ఫ్రాంస్వాజ్ కొడవలిమీద పడుతుంది. ఈ ఘాతుకాన్నంతా గడ్డివాము వెనుకనుంచి పువాన్ చూస్తాడు. ఫ్రాంస్వాజ్ మాత్రం పట్టుతప్పి కొడవలిమీద పడ్డానని అందరికీ చెప్పి మూడురోజుల తర్వాత మరణిస్తుంది. ఆస్థి మొత్తం లిజా బ్యుతోల పరమవుతుంది.
ఫ్రాంస్వాజ్ హత్యను పువాన్ చూశాడని తెలుసుకున్న బ్యుతో దంపతులు అతడినీ హతమారుస్తారు.
జాన్ ఒంటరివాడైపోతాడు. ఫ్రాంస్వాజ్ ఆస్థి తన పేరుపై రాయనందుకు నొచ్చుకున్నా, ఇక అక్కడ ఉండబుద్ధి కాక యుద్ధంలో చేరేందుకు వెళ్ళిపోతాడు!
ఇంకా ఈ నవల్లో అనేక పాత్రలు కనిపిస్తాయి. పువాన్ సోదరి లగ్రాంద్, ఊళ్ళోని మరో భూస్వామి అలెగ్జీ, అతనిమీదా అతని కమతం మీదా పెత్తనం చేస్తూ పరాయి మగాళ్ల కోసం పాకులాడే దాసీ జాక్ లిన్, పట్నంలో వ్యభిచార గృహం యజమానిగా జీవితాన్ని గడిపే కూతురు ప్రభావం మనవరాలు మీద పడకుండా ఆ పిల్లను ఒక మేధకురాలిగా పెంచే చార్లెస్, ఎలోదీ… ఇంకా ఊళ్లోని పెద్దమనుషులూ… ఎన్నో పాత్రలు! అన్నీ పొలం చుట్టూనే తిరుగుతూ భూమికి సేవ చేయడానికి పరితపించే పాత్రలే! అంతే కాదు… వీళ్ళు భూమికోసం ఎంత దారుణాలకైనా ఒడిగడతారు. పగలూ కక్షలూ పెంచుకుంటారు. అత్యాచారాలకు, హత్యలకు పాలుపడతారు. ఒక ఇంటిమనుషులే బద్దశత్రువులైపోతారు. అందరు కలిసినపుడు సంప్రదాయం ప్రకారం తాగి తందానాలాడతారు.
ప్రతి పాత్రను ఎమిల్ జోలా తీర్చిదిద్దిన పనితనం ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఒక్కో పాత్ర మనోగతం ఆ పాత్ర చుట్టూనే నవలంతా తిరుగుతుందేమో అనిపిస్తూ ఉంటుంది చదువుతుంటే. ఆస్థి పిల్లలకిచ్చి దిక్కులేని చావు చచ్చిన భూస్వామి పువాన్ లాంటి వృద్ధులు మన చుట్టూ ఉన్నారేమో అని వెదబుద్దేస్తుంది. (పెద్దగా వెదక్కుండానే కనపడతారు) తన పేరుమీద కొంతైనా ఆస్తి దాచుకోకుండా పిల్లలకు సర్వం సమర్పించే తల్లిదండ్రులకు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే గతి పడుతుందన్న సత్యం ఈ నవలలో పువాన్ కథ రుజువు చేస్తుంది.
ఫ్రాన్స్‌లోని పొలాల వర్ణనా, ఆ వ్యవసాయ క్షేత్రాల వాతావరణం, వాళ్ళ తిండీ తిప్పలూ ఇవన్నీ కథ తాలూకు చిక్కని పరిమళాన్ని అద్దుకుని మరింత అందంగా కనిపిస్తూ ఉంటాయి. అదే సమయంలో యూరోపియన్ సమాజపు వావీ వరసలేని విచ్చలవిడి శృంగార సంబంధాలు వెగటు పుట్టిస్తాయి కొన్ని చోట్ల!
ఫ్రాంస్వాజ్ తనకంటే పదిహేనేళ్ళు చిన్నదన్న ఎరుకతో ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఆమె పట్ల తన ప్రేమను తెలియపర్చాలన్న జాన్ తహతహ చాలా సున్నితంగా కనిపిస్తుంది. మరోవైపు జీవితంలో అనుక్షణం అసహ్యించుకున్న బ్యుతో తన మీద అత్యాచారం జరిపిన క్షణాల్లో ఫ్రాంస్వాజ్ పరవశించి ఆనందించడం పాఠకుడిని ఉలిక్కిపడేలా చేస్తుంది. బ్యుతోని తాను తీవ్రంగా అసహ్యించుకున్నప్పటికీ తాను ప్రేమించింది అతడినే అని గ్రహించి సిగ్గుతో కుంచించుకుపోతుంది. తన ఆస్థిని సైతం జాన్ పేరు మీద రాయక తన చావుకి కారకురాలైన అక్కకే వదిలిపోయి అందరిలోకీ ప్రేమాస్పదురాలిగా మిగిలిపోతుంది.
అడుగడుగునా స్వార్థపరులైన మనుషులు రైతుల మొండితనం, మూర్ఖత్వం, స్వలాభం, కృతఘ్నత, కుట్ర, మోసం, దగా ఇలాంటి వాటినన్నిటినీ వాళ్ళ కఠోరశ్రమ, కటిక దారిద్య్రాల వెలుగులో సరిగ్గా అర్థం చేసుకోవాలని ముందుమాట రాసిన డగ్లస్ పార్మీ అంటాడు. వాటన్నిటికీ ఒక కారణం ఉంటుంది కాబట్టి ఆ గుణాల ఆధారంగా వాళ్ళని అసహ్యించుకోకూడదంటాడు. వాళ్ళని ”చెడ్డవాళ్ళు”గా కాక మామూలు మనుషులుగా అర్థం చేసుకోవాలంటాడు.
ఈ నవలకోసం జోలా అనేక విషయాలపై సేకరించిన నోట్సు కట్టలు కట్టలుగా పారిస్ నేషనల్ లైబ్రరీలో భద్రంగా ఉందట!
ఎమిల్ జోలా రాసిన పుస్తకాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ నవల ఒక్కటీ ఒక ఎత్తు! ఆయన అభిమాన రచన కూడా!
భూమే ఈ నవల్లో నాయకుడు, నాయిక, ప్రతినాయిక, అన్నీ! దాని చుట్టూ పాత్రలన్నీ తిరుగుతాయి తప్ప వాటికంటూ ఇతరత్రా సాధించాల్సిన జీవన సాఫల్యమంటూ ఏమీ కనపడదు. రుతువులు, పంటలు, ఊడ్పులు, కోతలు, నూర్పిళ్ళు, అతివృష్టి, అనావృష్టి, ఆధునిక పరికరాల వల్ల జీవనోపాధి కోల్పోయే కూలీలు… సర్వం ఈ నవల్లో అత్యద్భుతంగా వర్ణిమవుతాయి.
ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని పుస్తకాల్లో ఈ నవలకు తప్పక చోటు దొరుకుతుంది. సహవాసి గారి అనువాదం సంగతి మళ్ళీ మళ్ళీ చెప్పడం అబ్బురపడటం అనవసరం! కానీ చెప్పకుండా ఉండలేనంత సహజత్వం, అందం!!
అచ్చతెలుగు గ్రామీణ పదాలు, మాండలికాలు ఫ్రెంచ్ నవల అనువాదంలో వాడుతూనే కథ నేటివిటి ఏ మాత్రం చెడకుండా తీర్చిదిద్దడం చూస్తే సాక్షాత్తు అనువాదకుడే ఫ్రాన్స్ వెళ్ళొచ్చి ఈ నవల రాసాడా అనిపించక మానదు. బాటిల్స్ అనేమాట వాడాల్సినచోటల్లా అనువాదకుడు ”బుడ్లు” అనే మాట వాడతాడు. అలాగే ”ఇటు వచ్చేతలికి” (వచ్చేసరికి), ”పడ్డ” (గేదె), ”మూడడుగులకోతూరి” (మూడడుగులకోసారి).. ఇలా అనేక పచ్చి తెలుగు పదాలు తగులుతుంటాయి. స్వేచ్ఛానువాదంలో రారాజు సహవాసేనని ఒప్పేసుకుంటూ ఇంకోసారి టోపీలు తీసేస్తున్నా!
అయితే ఈ నవల వెలువడిన 50 ఏళ్ళ తర్వాత ఎమిల్ జోలా అల్లుడు నవల్లో వర్ణితమైన గ్రామానికి వెళ్ళాడట. ఆ నవల్లో ఉన్నవన్నీ స్వార్థం మూర్తీభవించిన పాత్రలు కాబట్టి, వాటికి మోడళ్ళు ఆ గ్రామస్థులే కాబట్టి వాళ్ళేమైనా నొచ్చుకున్నారేమో అని విచారించాడు. ఆ నవల గ్రామస్థులందరికీ పరిచితమే! కొట్టిన పిండే!
అయితే వాళ్ళు తమ పల్లెను, పల్లీయుల్ని దారుణంగా పోల్చాడని కించిత్తైనా ఎమిల్ జోలా మీద కోపం తెచ్చుకోలేదట. కానీ ఎవరికి వారు ఆయా పాత్రలతో తమను మాత్రం పోల్చుకోకుండా ”ఫలానా చెత్త పాత్ర మాత్రం…అదిగో ఆయనదే” అంటూ ఇరుగుపొరుగుల్ని మాత్రం చెత్త పాత్రలతో ఇట్టే పోల్చేశారట.
ఈ నవలను 1983లో వేసింది హైదరాబాద్ బుక్ ట్రస్ట్. మళ్లీ ఇంతవరకు వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలీదు. కాని ఇలాంటి అత్యద్భుతమైన పుస్తకాలను మళ్లీ మళ్లీ జనబాహుళ్యంలోకి తీసుకొచ్చి పాఠకులకు ఉత్తమ ప్రపంచ సాహిత్యాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత మంచి పబ్లిషర్లు తీసుకోవాలి. వాటికి పాఠకాదరణ తప్పకుండా ఉంటుంది కూడా. సనవాసి నవలకు లభించిన ఆదరణే ఇందుకు తార్కాణం!
ప్రస్తుతం ఈ పుస్తకం బయట ఎక్కడా లభ్యం కావడం లేదు. అప్పట్లో కొని దాచుకున్న వారి వద్ద తప్ప!
నా కలెక్షన్లో ఉన్న ఒక అద్భుతమైన నవల ఎమిల్ జోలా భూమి! దొరికితే మాత్రం చదివే అవకాశం వదులుకోవద్దు!
(మనసులో మాట-బ్లాగ్‌స్పాట్ నుంచి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags