భానుమతి గారి సృష్టి అత్త’మ్మ’

డా.ఎన్‌. విజయగౌరి
ఆ అత్తగారు గయ్యాళి కాదు. ఆ దాష్టికం కూడా ఆవిడలో కనబడదు. అక్కడ కోడళ్ళ దహనాలుండవు. కట్నకానుకలు తేలేదనే ఛీత్కరింపులుండవు. కొడుకుని కొంగుక్కట్టేసుకు తిరుగుతోందనే బాధగానీ, కొడుకు సంపాయించిందంతా కోడలి దోసిట్లో పోసేస్తున్నాడన్న ఏడుపుగానీ ఉండదు.
ఇంటి పనంతా కోడలే చేయాలన్న పట్టుదల ఉండకపోగా, ఆ నిర్వాకమంతా అత్తగారే చెలాయించటం మనకు కనిపిస్తుంది. కోడలూ, ఆవిడ సమరసంగా పోతారు. ఆవిడెవరో కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ సృష్టించిన ‘అత్తగారు’.
ఈ అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్టు, మెట్టినిల్లు నంద్యాల, స్థిరపడింది మద్రాసు. అయినా ఈ అమ్మణ్ణి ఆంధ్రదేశంలోని అన్ని మాండలికాల్ని అవలీలగా మాట్లాడేస్తుంది. అమాయకత్వానికీ, హాస్యప్రియత్వానికీ, ఉండీలేనట్లు కనిపించే గడసరితనానికీ నిదర్శనం ఈవిడ.
ఎవర్నీ నొప్పించని మనస్తత్వం అత్తగారిది. ఆమె విశ్వప్రేమ అనిర్వచనీయం. తనని నమ్ముకున్న, తను మాట యిచ్చిన వారినెవర్నైనా ఆవిడ మోసం చేయదు. అందుకే ఎలక్షన్‌ టైంలో ఓటువేయాల్సి వచ్చినప్పుడు పనివాళ్ళమాట కాదనలేక వాళ్ళు చెప్పిన గుర్తుకు, ముసలి ఆచార్లు నక్షత్రానికి వేయమంటే మొహమాటం కొద్దీ దానికీ, తనకిష్టమైన ఆవుదూడకీ ఓ ముద్రవేసి మరీ వచ్చారు.
ఆమె రేషనల్‌ థింకింగ్‌ ఎంతైనా మెచ్చుకోదగిందే. ఎన్నికల్లో ఎవరికే బొమ్మలిష్టమైతే వాటికి ఓట్లు వేసుకోవాలి గానీ ఈ రకంగా కొట్టుకోవటాలూ, యీడుచుకోవటాలూ ఏమిటని ఆవిడ వాదన. అంతకాడికి ఓట్లూ, పాడు ఏవీ లేకుండా పూర్వం రాజులకు మల్లే ఎవడు బలవంతుడైతే వాడే మిగతావాళ్ళని చావగొట్టి ‘రాజ్యం నాదే’నని ఆక్రమించేసుకోవచ్చునన్నది ఆవిడ అభిప్రాయం.
అత్తగారి దృష్టిలో దొంగలంటే నల్లగా ఉండి, నాపరాళ్ళల్లాగా పట్టుకుంటే చిక్కకుండా జారిపోయి పారిపోయేందుకు ఒంటినిండా నూనె రాసుకుని దొంగతనాలకు వస్తారు. కానీ ఈ మాయదారి కలియుగంలో దొంగలు బంధువులకు మల్లే దూరపుచుట్టాన్నంటూ పరిచయం చేసుకుని ఇళ్ళు దోచేస్తున్నారన్న వార్త విని, బంధువులెవర్నీ లోపలికి రానీయలేదు. దాంతో కోడలి తరఫు బంధువులంతా గగ్గోలెత్తిపోయారు. వచ్చినవాళ్ళు బంధువులేనని కొడుకు మందలిస్తే పశ్చాత్తాపపడి, మరోసారి బంధువులమంటూ వచ్చిన దొంగల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. మర్నాడు చూస్తే ఏముంది? ఇల్లు గుల్ల.
అసలు పిల్లల్లేక ఎంతోమంది గుళ్ళు, గోపురాలు పట్టుకు తిరుగుతూ ఉంటే, జనాభా పెరిగిపోతోందని మొత్తుకుంటూ గవర్నమెంటు వాళ్ళు ఫామిలీప్లానింగు ప్రచారమెందుకు చేస్తారో ఆవిడ అమాయకత్వానికి అంతుచిక్కని విషయం.
చేసిన తప్పులని సమర్ధించుకోటం ఆవిడకి వెన్నతో పెట్టిన విద్య. కోడలిచ్చిన బాల్‌పాయింట్‌ పెన్నును ఆవిడ తన తిరుచూర్ణం పెట్టెలో భద్రంగా దాచుకున్నారు. బంధువుల పెళ్ళికి బట్టలు కొనడానికి వెళుతూ, ఎవరెవరికి ఎన్ని బట్టలు కొనాలో లిస్టు రాయటానికి దాన్ని తీసుకెళ్ళారు. బట్టలు చూస్తుండగా పెన్నులోని ఇంకంతా చీరలన్నింటికీ అంటుకుంది. మరకలైన ఆ చీరలన్నింటి ఖరీదు యిమ్మంటారేమోనని భయపడ్డ కోడలికి ధైర్యం చెబుతూ, ‘పై మడత లోపలికి వేసి వాళ్ళే అమ్మేసుకుంటార్లే’ అని అంటారు.
పాలవాడు పోసే నీళ్ళపాలు తాగలేక, ఒక గేదెను కొనుక్కుని, ప్రేమతో దానికి మూడుపూటలా పత్తిగింజలు, సజ్జలు వగైరాలన్నీ పెట్టి మురిసిపోయారు. మూణ్ణాళ్ళల్లో ఆ మురుపు మూడుచెక్కలైంది. అజీర్ణంతో ఆ గేదె చచ్చిపోయింది. మూడుపూటలా దాన్నలా మేపినందుకే అది చచ్చిందని పాలవాడంటే ఆవిడ ససేమిరా కాదని అంటూ, పై పెచ్చు వాడి దృష్టి సోకే చచ్చిందని తీర్మానించేసారు.
ఆవకాయ పెట్టడమంటే నిమ్మకాయ పెట్టటమంత తేలిక ఆవిడకి. అందుకు ఓ ఐదువేలకాయ చాలనుకున్నారు. ఐదువేలంటే ‘ఇన్నని’ ఇతమిత్థంగా తెలియని అత్తగారు, రాశిపోసిన కాయల్ని చూసి, తన భయానికి తోటవాడు పదివేలకాయల్ని కక్కాడనుకుని సంతోషించారు. అన్నింటినీ తరిగించి, జాడీల్లో నింపేసి, వాటిపైన గుప్పెడు ఉప్పూ, కారం జల్లేసి చేతులు దులిపేసుకున్నారు. ‘ఇహ అయిపోయింద’ంటూ. మూడ్రోజుల తర్వాత బంధువులనందర్నీ భోజనాలకు పిలిచి, ఆవకాయకోసం జాడీలు తెరిచి చూస్తే, ఆవకాయకు బదులు బూజుకుప్ప ఉండటానిక్కారణం ఎంత ఆలోచించినా ఆవిడకవగతం కాలేదు.
అందరూ భోంచేసేవేళకి వంటవాడు వెంగళాచారి కూరో, పప్పో మాడ్చేసినా ఆపద్ధర్మోర్థం మాడువాసన రాకుండా అందులో పన్నీరు పోయించేవారు. వంటవాడింట్లో ఉన్నా, అందరూ ఇంట్లోనే ఉంటే ఆ పూట ఏదో ఒక స్పెషల్‌ చేసి వాళ్ళకి వడ్డించేసేయాలన్న తపన ఆవిడది. ఆ ప్రయత్నంలోని భాగమే ఆవిడ చేసి అరటిపొడి. ఆమె ఎక్కడ బాధపడుతుందోనని భోజనానిక్కూర్చున్న బంధువు వెంకట్రావ్‌ ఆ వేపుడుతో కలిసిపోయిన బొగ్గులు, తాలింపుతో కలిసిపోయిన ఆవాల్లోని ఇసుకను గ్లాసునీళ్ళతో మింగేసాడు. ఆవిడ చేసిన వడియాలు తుంచటానికి కానీ, కొరకటానికి గానీ సాధ్యపడకపోవటంతో వాటిని గోడవతల పడేసారు. వీధిలో పిల్లలు వాటిని ఏరుకుని రాకెట్లలాగా ఆకాశంలోకి ఎగరేసి ఆడుకోవడానిగ్గాను, తొక్కుడుబిళ్ళలుగాను, కాకుల్ని కుక్కల్ని తరమటానికి సాధనాలుగానూ వాడుకున్నారు. ఆ వడియాలు ఒక పిల్లవాడికి కొట్టుకుని రక్తం కారినప్పుడు పిల్లవాడి తల్లి ‘దిక్కుమాలిన వడియాలు’ అని వాటికి టైటిలిచ్చినా, అవన్నీ తోసిరాజని పట్టిన పట్టు విడవకుండా ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు పెట్టుకునేవారు.
తను నాటిన అరటిచెట్టుకు కాయలు కాయకపోవటం, ఆ చెట్టుపిలకలే పక్కింటి వాళ్ళు నాటితే వాటికి గెలలు వేయటం చూసి ఇంట్లో వాళ్ళశ్చర్యపోయినా ఆవిడ అందుకేం బాధపడలేదు. అందుక్కారణాలు, అవి కాయలు కాసే చెట్లు కాకపోవటం ఒకటి, పైగా ఆవిడ వాటిని కేవలం ఆకుల కోసమే నాటారన్నది మరొకటి. పంతం, పట్టింపు విషయానికొస్తే ఆవిడదే పైచేయి. పుట్టింటివారు పెట్టినన్ని నగలు అత్తింటివాళ్ళు పెట్టాలన్నది ఆవిడ అభిమతం. అందుకు వాళ్ళొప్పుకోకపోవటంతో కసిపోక మసిపూసుకున్నట్లు తనకున్న నగలన్నింటినీ చితక్కొట్టి పెట్లో దాచుకున్నారు. చివరికి దొంగలు పడి ఆకాస్త బంగారాన్ని ఎత్తుకుపోయారు. ఇరుగుపొరుగుల కష్టసుఖాలకు స్పందించే టైం ఇప్పుడెవరికుంది? కానీ అత్తగారలాంటి వ్యక్తి కాదు. పక్కింటి పర్వతమ్మ కడుపుతో ఉందని భావించి సంబరపడిపోయారావిడ. పర్వతమ్మను ఒకసారి డాక్టరుకు చూపిస్తానని ఆమె భర్త రాజప్ప ఎంత చెప్పినా వినకుండా, ఏడోనెల రాగానే పర్వతమ్మకు ఘనంగా సీమంతం చేసేశారు. పదమూడవనెల వచ్చి కూడా ఇంకా బిడ్డని కనని పర్వతమ్మను డాక్టరుకు చూపించారు. ఆమె కడుపులో పెరుగుతున్నది బిడ్డ కాదు గడ్డని ఆయన చెప్పగానే, అర్జంటు పనుందంటూ ఊరికి ప్రయాణం కట్టారత్తగారు.
పాత పంచాంగాలు తిరగేయటం ఆవిడకి సరదా. ఆ సరదాలో పొరపాట్న కిందటేడు పంచాంగం చూసి ఆ యేడు దుర్ముహూర్తంలో పక్కింటివాళ్ళ పిల్లాడికి అన్నప్రాశన చేయించేసేయటం, ఎల్లుండి ఏకాదశి అనుకుని, ఏకాదశి రోజునే భోంచేసేయటం షరా మామూలే ఆవిడకు. ఏదైనా ఉపద్రవం ముంచుకొచ్చినప్పుడు, ఎవరి మీదైనా మనసులోంచి ప్రేమ పొంగుకొచ్చినప్పుడు ఆచారాలను పక్కకు నెట్టివేసే విశాల హృదయం ఆవిడది. ఆచార వ్యవహారాలు క్రమశిక్షణకే గానీ మనుషులను అవస్థలపాలు చేయటానిక్కాదనే మానవతావాది ఆవిడ.
వైష్ణవుడు వండితే తప్ప భోంచేయని ఆవిడ బంధువులింట్లో జరిగిన పెళ్ళిలో అన్నంగిన్నెను అంటరానివాడు ముట్టుకున్నాడని తెలిసింది. కానీ అప్పటికే ఆకలితో మొహాలు వేలాడేసుక్కూర్చున్న బంధువులందర్నీ చూసి ఆ గిన్నె మీద తులసితీర్థం సంప్రోక్షించి ఆ అన్నాన్ని తినవచ్చు, దోషం లేదని తేల్చేసి, పోయే అందరి ప్రాణాల్ని నిలబెట్టారు.
ఆవును ఇంటికి తెచ్చుకోవటం ఎంత శుభప్రదమైనా దానికి దూరం నుంచే హారతిచ్చి స్వాగతించారు.
ఇంగ్లీషువాళ్ళు ఆకాశంలోకి ప్రయోగించిన శాటిలైట్లు, స్ఫుటునిక్కులు, స్కైలాబులు ధనుంజయవాయువల్లే తిరిగితిరిగి ఏనాడన్నా వాళ్ళనెత్తినే పడితే వాళ్ళేమైపోతారోనని జాలిపడతారు. మనదేశంలోని దేవుళ్ళంతా ఒక్కటిగా ఉండి వాటిని అవతలికి నెట్టేసి మనల్ని రక్షిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తారు. అలా వాటికి డబ్బులు తగలేసే బదులు, ఆ డబ్బును రైతులకిచ్చి బీడుభూముల్ని సాగు చేయించి నీటి సదుపాయం ఎందుకు చేయించరో అర్థం కాదావిడకు. డబ్బు వృధా కానీయరావిడ. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ మాయదారి కాలంలో పళ్ళ డాక్టరు ఆవిడ్ని పద్ధెనిమిది పళ్ళు కట్టించుకోమని చెప్పినా వినకుండా పధ్నాలుగే కట్టించుకుని అవస్థ పడ్డా ఆదా చేశాలెమ్మని పొంగిపోయారు.
ఆవిడ సరదా మనిషి కాలాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. ఇంట్లో కాఫీ పొడి అయిపోతే ఇంట్లో కాఫీపొడి ‘నిల్‌’, మీకు రేపొద్దుటే ‘నో కాఫీ’ అంటారు. దూరబ్బందువు వెంకట్రావుకి పెళ్ళికి తగిన పర్శాల్టీ, పరశురామాల్టీ (పర్సనాలిటి) లేదని ఆవిడ బాధ. తనని మనవడు ఉడికించినప్పుడల్లా ‘ఏయ్‌డామ్‌’ అంటూ వాడి బుగ్గలు పిసికేస్తారు.
ఎదుటివారినర్థం చేసుకుని, ఆ ప్రకారం నడిచిపోయే ఇటువంటి అత్తగారే ఉంటే ప్రతీకోడలూ ఆడుతూ, పాడుతూ పనులు చేసుకోవచ్చు. ఈ అత్తగార్ని తెలుసుకుని ఈ కాలం అత్తగార్ల గుండెల్లో పెరిగిన కట్నాల గోడలు అసూయతెరలు తొలగిపోతే ఎంత బావుంటుంది?!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.