కన్నభిరాన్‌కి కృతజ్ఞతాభివందనాలతో

శంకరన్‌గారు చనిపోయినపుడు హెచ్‌ఆర్‌ఎఫ్‌ మురళి మా ఆఫీసులో వున్నాడు. మేమిద్దరం ఏదో విషయం మీద సీరియస్‌గా మాట్లాడుకుంటున్నపుడు అతనికి ఫోన్‌ వచ్చింది. శంకరన్‌గారు చనిపోయారని ఎవరో చెప్పారు. మురళి వెంటనే వెళ్ళడానికి తయారైపోయాడు. ‘నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు ఇలా ఒకరి తర్వాత  ఒకరు, బాలగోపాల్‌ చాలా బాధగా వుంది. గొట్టిపాటి నరేంద్రనాథ్‌, వనజ, బాలగోపాల్‌ ఇపుడు శంకరన్‌. బాధితుల పక్షాన పనిచేసే, మాట్లాడేవాళ్ళు కనుమరుగైపోవడం చాలా విషాదంగా వుంది. మురళీ” అంటే మీకు మరింత బాధ కల్గించే విషయం ఇంకోటుంది అన్నాడు. ‘ఏమిటది?’ నేను ఆతృతగా అడిగేను. ‘కన్నభిరాన్‌కి ఆరోగ్యం బాగా లేదు. ఒక కాలు తీసేసారు తెలుసా?’ అంటూ అతను వెళ్ళిపోయాడు. ”ఆ…” అంటూ నేను అలాగే వుండి పోయాను. చాలా దు:ఖం కల్గించే వార్త అది. అదే మూడ్‌లో శంకరన్‌ గారింటికి వెళ్ళాను. కన్నభిరాన్‌ కళ్ళల్లో మెదులుతూనే వున్నారు. శంకరన్‌ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు కానీ ఆయన గురించి ఎంతో విని వున్నాను. ప్రశాంతంగా వున్న ఆయన ముఖం చూడగానే కళ్ళల్లో నీళ్లొచ్చాయి. కన్నభిరాన్‌గారి కాలు తీసేసిన విషాదం కూడా అందులో కలగలసి ఆ రోజంతా బాధగానే గడిచింది.
కన్నభిరాన్‌ గురించి రాయడానికి, ఆయనను స్మరించుకోవడానికి నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తావించాలి. 1983లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వోద్యోగులు దీర్ఘకాలం సమ్మె చేసారు. 53 రోజులపాటు జరిగిన సమ్మె అది. అపుడు నేను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఎ.పి.ఎన్‌.జి.వో అసోసియేషన్‌లో చాలా చురుకుగా పాల్గొంటున్న రోజులు. ఉమన్స్‌ వింగ్‌కు గాను సిటీ కన్వీనర్‌గా వున్నాను. 53 రోజుల సమ్మెలో పెద్ద ఎత్తున జరిగిన నిరసన కార్యక్రమాలు ధర్నాలు, పికెటింగ్‌లు, ర్యాలీలు అన్నింటిలో ముందుండేదాన్ని.సమ్మె ముగింపుకు వచ్చే ముందు సెక్రటేరియట్‌ దగ్గర గుర్రాలనెక్కిన మౌంటెడ్‌ పోలీసులు మా మీద లాఠీఛార్జీ చేసినపుడు మేము కిందపడిపోతే ప్రమీల అనే ఉద్యోగినికి కన్ను మీద లాఠీ తగిలి రక్తం చిట్లింది. నా మీద నుంచి గుర్రం నడిచిపోయింది. ఒళ్ళంతా దెబ్బలు. ఆ రోజు ఆ దృశ్యం ఎంత భయానకంగా ఉండిందంటే, ఇపుడు గుర్తు చేసుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. ఎంతో మంది ఉద్యోగులు గాయపడ్డారారోజు.
సమ్మె మరింత తీవ్రమైంది. రామారావు ఎక్కడా దిగి రావడం లేదు. సమ్మెలో పాల్గొనకుండా ఆఫీసులకు హాజరౌతున్న ఉద్యోగులను ఆపే కార్యక్రమం ఇచ్చింది అసోసియేషన్‌. మేము కొంతమందిమి హైదర్‌గూడాలో వున్న పంచాయితీ రాజ్‌ కార్యాలయంలో పికెటింగ్‌ చేసాం. ఒక్క ఉద్యోగినిని కూడా లోపలికెళ్ళకుండా అడ్డుకున్నాం. ఆఫీస్‌ ప్రధాన ద్వారం ముందు బైఠాయించాం. పోలీసులొచ్చారు. బరా బరా ఈడ్చారు. లాఠీల్తో కొట్టారు. నన్ను, అరుణ అనే ఉద్యోగినిని అరెస్ట్‌ చేసారు. పోలీస్‌ జీప్‌లో ఎక్కించుకుని నారాయణగూడా పోలీస్‌స్టేషన్‌కి తీసుకెళ్ళారు. కేసు బుక్‌ చెయ్యకుండా సాయంత్రం వదిలేస్తారని మా వాళ్ళు చెప్పారు కానీ మమ్మల్ని వదలలేదు. సాయంత్రందాకా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి, రాత్రివేళకి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి తెచ్చారు. కంట్రోల్‌రూమ్‌లో క్రిమినల్స్‌ ఉంటారని తెలుసు. వాళ్ళతో పాటు మమ్మల్ని ఉంచుతారని ఊహించలేదు. మేము ఎంత గొడవ చేసినా పట్టించుకోకుండా క్రిమినల్స్‌తో పాటు మమ్మల్ని రాత్రంతా కంట్రోల్‌రూమ్‌లో పడేసారు. అర్ధరాత్రివేళ అసోసిసియేషన్‌ సభ్యులొచ్చి దుప్పట్లు ఇచ్చి, రేపు ఉదయమే బెయిల్‌ దొరుకుతుందని, మన కేసులన్నీ కె.జి.కన్నభిరాన్‌ గారు చూస్తారని, ఆయన రేపు కోర్టుకొచ్చి బెయిల్‌ ఇప్పిస్తారని చెప్పి వెళ్ళిపోయారు. దుప్పటి చుట్టుకుని కూర్చుని ఆ రాత్రంతా జాగరణ చేసాం. తిండి లేదు. నిద్ర లేదు. మా చుట్టూ వున్న నిందితుల్ని చూడాలంటే భయం. అలాగే ఆ రాత్రి గడిచింది.
మర్నాడు పోలీస్‌ వాహనంలోనే సివిల్‌ కోర్టుకి తీసుకొచ్చారు పోలీసులు. బట్టలు నలిగిపోయి, జుట్టు చెదిరిపోయి, ఎర్రబడ్డ కళ్ళతో కోర్టు ఆవరణలో ఓ చెట్టు కింద నిలబడ్డాం. కన్నభిరాన్‌ ఎప్పుడొస్తారా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న మాకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది. ఒకరిద్దరు అడ్వకేట్‌లు మా వేపు అదోలా చూడడం గమనించాం. ఒకడైతే సమీపానికి వచ్చి ఏ లాడ్జిలో దొరికారు. మీ కేసు నేను వాదిస్తాను. ఎక్కువ ఫీజు ఇవ్వక్కరలేదులే అంటూ వెకిలిగా నవ్వాడు. ఏమనుకుంటున్నాడు వీడు మా గురించి. రాత్రంతా వ్యభిచారం చేసి లాడ్జీలో దొరికిన మనుష్యుల్లా కనబడుతున్నామా? వీడికి. కోపం కట్టలు తెంచుకుంది. బాగా తిట్టి పంపాం వాడిని. కాసేపటికి ఇంకొకడు వచ్చాడు. ”కొత్తా ఏమిటి? అంత కోపమెందుకు? మీ కేసు వాదిస్తామంటే తిడతారేంటి? ఇంతకీ ఏ హోటల్‌లో రైడ్‌ జరిగింది?” నేను వాడిని కొట్టినంత పనిచేసాను. ఛీ..ఛీ.. వీళ్ళు న్యాయవాదులా? ఇంత సంస్కార హీనంగా మాట్లాడతారా? కోర్టుకొచ్చే మహిళలు వ్యభిచారులే అయ్యుంటారని వీళ్ళ ఘోరాభిప్రాయం చూసాకా అసహ్యమన్పించింది. కోపం, ఉక్రోషంతో రగిలిపోతున్న వేళ దూరంగా మా వాళ్ళు, కన్నభిరాన్‌గారు వస్తూ కనబడ్డారు. ఆయన్ను చూడగానే నాకు బాగా ఏడుపొచ్చేసింది. వాళ్ళు ఇలా మాట్లాడారని ఆయనకు చెప్తాం. ఎవరయ్యా అలా మాట్లాడింది. వీళ్ళు ప్రభుత్వోద్యోగులు. సమ్మెలో పాల్గొని అరెస్ట్‌అయ్యారు. ముందు వెనకా చూసుకోకుండా మాట్లాడ్డమేనా? అని గట్టిగా కేకలేసారు. పది నిమిషాల్లో మాకు బెయిల్‌ మంజురైంది. మేము ఇంటికెళ్ళిపోయాం ఓ అరగంట తర్వాత.
సిటీ సివిల్‌ కోర్టులో ఆ రోజుల జరిగిన సంఘటనలో అవమానపడి, దు:ఖపడుతూ  నిల్చుని వున్న మాకు కన్నభిరాన్‌ కనబడగానే కొండంత ధైర్యం వచ్చింది. ఆయన రావడం ఆలస్యమై వుంటే ఆ రోజు అక్కడ ఏమై వుండేది? ఆయన్ని చూడగానే ఎంత సంతోషం కల్గిందో నేనిపుడు వర్ణించలేను. చల్లగా, చిన్నపిల్లాడిలా నవ్వే కన్నభిరాన్‌ నవ్వు నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టే వుంది. నాకున్న ఇలాంటి అనుభవాలు లక్షలాదిమందికి వుండి వుండొచ్చు. ఎందుకంటే ఎంతోమంది హక్కులకోసం పోరాడిన మనిషి ఆయన. పౌరహక్కులకు చిరునామా కన్నభిరాన్‌. ఆయన మరణం హక్కుల ఉద్యమానికి తీరని లోటు. సామాన్య మనుష్యుల కోసం, బాధితులకోసం నిరంతరం ఆలోచించి, వాళ్ళ కేసుల్ని వాదించి, వాళ్ళకి కొండంత అండగా వున్న కన్నభిరాన్‌లాంటి వ్యక్తులతో పెనవేసుకున్న చిన్న అనుభవ శకలమైనా మనపట్ల మనకి గౌరవం పెంచేదిగా వుంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. బాలగోపాల్‌, కన్నభిరాన్‌లాంటి నిబద్ధత కల్గిన, అరుదైన మనుష్యులు బతికిన కాలంలో మనమూ బతికాం, వాళ్ళతో ఎంతో కొంత సమీపంలో మెలిగాం అనే ఆలోచన గొప్ప తృప్తినీ, సంతోషాన్ని ఇస్తుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

2 Responses to కన్నభిరాన్‌కి కృతజ్ఞతాభివందనాలతో

  1. ఆర్థికంగా ఉన్నత కుటుంబంలో పుట్టిన కన్నాభిరాన్ గారు తన జీవితంలో నిలబడింది పేద ప్రజల పక్షానే. లాయర్ వృత్తి మీదే కాన్సంట్రేషన్ పెట్టి ప్రొఫెషనల్‌గా జీవించకుండా ప్రజల మనిషిగా జీవించారు.

  2. swamy says:

    తెలుగు పేర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.