కొండేపూడి నిర్మల
డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏ ఇంట్లో చూసినా పెళ్ళికెదిగి గుండెల మీద కుంపట్లలా వున్న మగపిల్లల తల్లులందరూ మాయా అద్దం ముందు కూలబడి వున్నారు. వాళ్ళకి కావలసిందల్లా ఒక సమాచారం.
కీ బోర్డు మీటలు నొక్కి నొక్కీ కొందరికీ చూపుడు వేళ్ళు వాచిపోయాయి. కొందరికీ మెడ తిప్పడం కష్టంగా వుండి సపోర్టు కోసం పట్టీ వేసుకున్నారు. కొందరికి ఒక దృశ్యం నాలుగు ముక్కలుగా కనబడుతోంది. పొద్దున్న కంప్యూటరు ముందు కూలబడితే సాయంత్రం దాకా అదే ధ్యాస. ఈ పిల్లాడికి పెళ్లవుతుందా. లేదా..? పెళ్ళి కూతురు అసలు పుట్టిందా లేదా..?
రాత్రికి ఎలాగోలా నాలుగు మెతుకులు కతికి మళ్ళీ తెల్లారి కంప్యూటరు ముందు కూచుంటే గడియారం గిర గిర తిరిగిపోతోంది. నవలలు లేవు. టివి లేదు. కబుర్లు లేవు. ఏమీ లేదు. ఎవరింటిలో చూసినా టక్కు టక్కు.. టక్కు.. కాలాన్ని కైమా చేస్తున్న చప్పుడు వినిపిస్తోంది. ఎందుకంటే స్టీలు గిన్నెల మాదిరి, చీరల షాపింగు మాదిరి, చిట్టీ పాటల మాదిరి ఇందులో ఎంత మాత్రమూ గ్లామరు గాని, సుఖంగాని లేదు. కాబట్టి అన్నిటినీ తప్పించుకున్నట్టే కన్న తండ్రులు ఎలాగూ తప్పించుకుంటారు. తప్పించుకోలేనిది తల్లులు మాత్రమే. దరిమిలా తల్లులంతా ఈ హింసానందంలో మునిగిపోయి తపా తపా కొట్టుకుంటున్నారు. తమాషాకి ఈ మధ్య నా దృష్టిికి వచ్చిన ఒక తల్లి కొడుకుల చాటింగు యధాతధంగా మీ ముందు పెడతాను.
……….
”అమ్మా నాకు టి నంబరు ఒకటి జీరో, ఒకటి జీరో, ఒకటి జీరో అమ్మాయి నచ్చింది. నువ్వు పంపిన టి నంబరు మూడు జీరో, మూడు జీరో నచ్చలేదు. అంచేత నేను చెప్పిన నంబరే ఖరారు చెయ్యవలసింది.”
బాబూ నీకు నచ్చిన ఒకటి జీరో, ఒకటి జీరో, ఒకటి జీరో పిల్ల శ్రేష్టమైన వృషభరాశిలో పుట్టిందిట, కావున మేషరాశి వాడినే చేసుకుంటుందిట. దురదృష్టశాత్తూ నువ్వు మీన రాశిలో పుట్టావు. కాబట్టి ఆశ వదులుకో అంతే కాదు నా మాట విని నాలుగు జీరో, నాలుగుజీరో, నాలుగు జీరోని గురించి ఆలోచించు.”
”అమ్మా, నువ్వు అడిగిన నాలుగు జీరో, నాలుగు జీరో, నాలుగు జీరోకి ఇంట్రస్ట్ కొట్టాను. కానీ ఆ పిల్ల నా కాన్వెంటు రికార్డులన్నీ తిరగదోడి, అప్పుడెప్పుడో నేను బడి ఎగ్గొట్టీ గోళీలాడినట్టు కనిపెట్టేసింది. ఇప్పుడు నేను ఇంజనీరునైనాగాని, ఆనాటి తప్పు ఏనాటికీ క్షమించదల్చుకోలేదుట. కాబట్టి నువ్వే ఆశ వదులుకో.”
”అమ్మా” భం” పేరు భం కాదేమో- అని నాకు అనుమానంగా వుంది. ఎందుకంటే అదే అమ్మాయి ”చం” అనే పేరిట ఇంకో వెబ్త్సెట్‌లో కనిపించింది. ఇప్పుడు నువ్వు ఏమి చెయ్యాలంటే, ఏమీ అనుకోకుండా వాళ్ళ ఇంటిలో పనిమనిషిగా చేరు, ఆ పిల్ల భం అవునో, చం అవునో తెలుసుకుంటావా ప్లీజ్, తప్పులేదు. పాత సినిమాలు గుర్తు చేసుకో. మీన రాశిలో పుట్టించకుండా మెడ మీద వరుసాగ్గా మూడు పుట్టు మచ్చలయినా లేకుండా నన్ను కన్నందుకు నీకీ శిక్ష తప్పదు.”
”బాబూ…పిజి చదివిన వాళ్ళెవరూ నిన్ను చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అంచేత మొన్ననే మునిసిపల్ స్కూలుకి వెళ్ళి టెన్తు తప్పిన అమ్మాయిల ఇంటిఫోను నంబర్లు తెచ్చాను.”
”అలా చెయ్యకమ్మా, అప్పుడు బాల్యవివాహాల రద్దు చట్టం కింద నిన్ను జైల్లో పెట్టి కుమ్మేస్తారు. ఈ వయసులో విరిగిన ఎముకలు అతకవేమో అని భయంగా వుంది..నిన్ను నేనలా చూడలేను. రాజమాతా ..చూడలేను.. అన్నట్టు కొత్తగా ఇప్పుడు ”నీ ఖర్మ నీ ప్రాప్తం” అని ఒక వెబ్సైెటు వస్తోందిట. అందులో పదివేలు కట్టి మొదట రిజిస్టరు చేసుకున్న వాడికి నాలుగు టీ నంబర్లు ఉచితమట.
”అవును. బాబు… ఆ బ్రాంచి ఇక్కడా వుంది. అందులో కనీసం ఉద్యోగం సంపాదించి అయినా కోడల్ని సాధించుకోవాలని వెళ్ళాను. మగపిల్లలున్న తల్లులకి ఆ ఉద్యోగం ఇవ్వరట, పదివేలు కట్టి మొదట రిజిష్టరు చేసి వచ్చేశాను. ఈ లెక్కన నీ పెళ్ళి కుదిరేసరికి నేను అప్పుల పాలయిపోవడం ఖాయంగా వుంది.బాబూ…””నువ్వే అలా బాధపడితే నాకెవరు ధైర్యం చెబుతారమ్మా..పెళ్ళి కుదరాలేగానీ, చదువు అప్పుతో బాటు పెళ్ళి సంబంధాల అప్పు కూడా తీర్చేస్తానమ్మా..తీర్చేస్తాను…”
”ఎంత మాటన్నావు..బాబూ..”
”ఇంకేం చెయ్యమంటావు..అమ్మా..” ఇదంతా ఎందుకు రాశానంటే, ఎనభై దశకంలో అనుకుంటా.. ”ఈ పిల్లకు పెళ్ళవుతుందా” అని ఒక సినిమా వచ్చింది. మంగళ గౌరి (కర్టెక్టేనా..?) అనే పేరుతో వున్న కథానాయిక ప్రతి పెళ్లి చూపులకి కూచుంటూ, తన ఫోటో పక్కన వున్న ఖాళీ ఫ్రేములో కొత్త పెళ్ళికొడుకు ఫోటో పెడుతూ, ఎంతో సంబరపడి, తీరా ఆ సంబంధం తప్పిపోగానే మళ్ళీ ఫ్రేము ఖాళీ చేస్తూ వుంటుంది. సినిమా అంతా అయిపోయి మనం బస్సులో ఇంటికొచ్చేస్తామేకానీ ఆ పిల్లకి పెళ్ళి కాదు. పెళ్ళి తప్ప ఆడపిల్లలకి ఇంకో లోకమే లేదు అనుకునే కాలంలో నడిచిన కధ అదీ. అప్పుడు అదీ బాధగానే వుంది. ఇప్పుడు ఇదీ బాధగానే వుంది. రెండింటికీ కారణం మనమే కాదా…? ఎంత మంది చిట్టి తల్లుల్ని మనం పుట్టకుండానే చంపేసి వుంటాం. మైనస్సులనీ, గుండెలమీద కుంపట్లు అనీ ఎవరో కామెంట్ చేస్తే చెంప పగలకొట్టకుండా ఎందుకలా భరించి వుంటాం..? డామిట్. మన కథలు వాటంతట అవే అడ్డం తిరుగుతాయా..? మనం తల కిందులుగా ప్రవర్తిస్తేనే అవి అడ్డం తిరుగుతాయి. కాదంటారా…?
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags