హేమ
‘రేపు నేను పతివ్రతామ తల్లిని కాను ప్రబంధ కన్యను కాను
పంచదార చిలుకను కాను పంచాది నిర్మల వారసురాల్ని” – ఓల్గా
పోటెత్తిన సంద్రపు అలలపై వెండి జలతారులా మెరిసే వెన్నెల్లాగా కరవాక మహిళ స్ఫూర్తి, చైతన్యాన్ని, మన ఆలోచన, ఆచరణలో భాగంగా చేసుకొని వారి పోరాటానికి బాసటగా వుంటామని నూరేళ్ళ మహిళా దినోత్సవం సందర్భంగా బాస చేసిన కొన్ని రోజులకే మన నిబద్దతనే ప్రశ్నిస్తున్నట్టుగా ‘ఆమె’ కరవాక మహిళపై దాడి. ఆ దాడి గురించి వడ్డితాండ్రలోని మహిళా నాయకురాలు దమయంతిని అడగండి! స్త్రీలు పిల్లలు అని కూడా చూడకుండా మూసిన తలుపుల గుండా పొగ బాంబులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేసి బయటకు నెట్టేసిన ప్రభుత్వ దాష్టికాన్ని గురించి వివరిస్తుంది. భయపడి పొలాల్లోకి పారిపోతే గ్రామాల చుట్టూ కాపుకాసి తప్పతాగి స్త్రీలపై అసభ్యంగా ప్రవర్తించి వెంటాడి పెరేడు జరిపించిన పోలీసుల గురించి ఆమె కన్నీటి కథల ద్వారా మనకు తెలియచేస్తది. ఎనభైఏళ్ళ మరో అనంత మాణిక్యమ్మ బట్టలు వుతకడానికి వెళుతుంటే ఆమె నక్సలైటు ప్రతినిధిగా కనిపించిందేమో మానవ హక్కుల సాక్షిగా నర్సన్నపేట జైలు పాలయ్యింది. కాల్పులు జరిగిన ఆకాశలక్కవరంలో చనిపోయిన ఎర్రన్న, నాగేశ్వరులు, సహచరిణులను అమరవీరుల స్మారక సభలో పలకరిస్తుంటే కన్నీళ్ళు ఎందుకు చెల్లెమ్మా కత్తులు దూయవే చెల్లెమ్మా అన్న చిన్ననాటి ఉద్యమపాట, మనకు స్ఫురణకు వస్తది. మోతెత్తిన నినాదాల ప్రతిధ్వని ఈ దోపిడి వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తామని ‘ఆమె’ చేసిన బాసగా హోరెత్తింది.
ఒక్క బాధితులేనా భూమిపై బంధం, ప్రకృతిపై మనసు పడ్డ ప్రతి బిడ్డ ‘పోరు శ్రేణిలో’ ముందుంది. ఏ ఉద్యమ నాయకుని చదువుకున్న బిడ్డల్ని కలవండి. తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో తమ ప్రజలు చేసే ధర్మ పోరాటానికి మరింత పదును పెడుతుంది. భూమిని వనరులను దోపిడి వర్గాల నుంచి విముక్తి చేయాలని నడుం బిగించిన ప్రజల బిడ్డ లక్ష్మి మనకు స్వాగతం చెబుతుంది. సోంపేటలో అయితే అట్టడుగుకు అణిచివేయబడ్డ కులాల నుంచి ‘నేను సైతం’ అంటూ ఉద్యమానికి ముందు నిలిచింది. కేరీరే జీవిత లక్ష్యంగా ముడిపడి వున్న పెట్టుబడిదారి ఆలోచనలకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగాల్ని సైతం వదలుకోవడానికి సిద్ధపడ్డ డాక్టరమ్మలు వున్నారు. ప్రభుత్వం కొడుకుని నక్సలైటుగా ముద్రవేస్తే దానికి గర్విస్తానని చెప్పి వాన్‌పిక్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోసిన తల్లులు వున్నారు. అన్ని ఉద్యమాలకు పుట్టినిల్లుగా మారిన వేటపాలెం ‘వెంకమ్మలు’ ఉన్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట మహిళా సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పితృస్వామ్య భావజాలానికి అడ్డుగుట్ట వేసి పోరులో సగమై చరిత్ర సృష్టించిన రాములమ్మలు, ఆధిపత్య బ్రాహ్మణ కులంలో జన్మించినా ఆచారాలు, వ్యవహారాలు భూతల్లి విముక్తి తర్వాతనే అని తోటి స్త్రీలతో కలిసిపోయిన సావిత్రిలు ఉన్నాయి. కేసులకు కన్నీళ్ళకు వారు వెనుదిరగలేదు. ఎస్.కోటలో జిందాల్ పెట్టిన కొలిమిపై సవాలు విసిరిన దేవుడమ్మ, సంద్రం మాదేనంటూ ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగసిపడిన గంగవరం, పరవాడ, కరవాక మహిళ, ఆంధ్ర వలస పెట్టుబడిదారుల దోపిడిపై పిడికిలెత్తుతున్న తెలంగాణ తల్లులు, తొలిసారిగా ఎన్నికలలో గళమెత్తిన పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాట మహిళలు, ధ్వంసం అవుతున్న గుట్టుల రట్టును బయటపెడుతున్న కరీంనగర్ నిర్మల అలాగే ఇతర రాష్ట్రాలలో వనరుల దోపిడికి వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యానటేష్, ఉల్కా మహాజన్, అక్రమంగా కేసులు బనాయించబడ్డ న్యాయవాదులు. ”మాకు మా హక్కులు కావాలి, మానవ హక్కులు కావాలి” అని ఈజిప్టులో ఉద్యమానికి ఊపిరిలూదిన ఆస్మా మెహఫౌజ్ యిలా ఎందరో… మెజార్జీ వాదుల ఆధిపత్య భావజాల సాహిత్యంపై సవాలు విసురుతున్న దళిత బహుజన, మైనార్టీ వర్గ స్త్రీమూర్తులు మనకు తెలియని మన చరిత్ర సృష్టికర్తలుగా మనముందున్నారు.
నూరేళ్ళ మహిళా ఉద్యానవనంలో పూసిన ఈ మట్టిపూలు చేస్తున్న పోరాటంలో వైవిధ్యం ఉంది. పౌరహక్కుల గురించి, పునరుత్పత్తి విధుల గురించి, కుటుంబ సంబంధాల గురించి, స్త్రీపురుష సంబంధాలను ప్రభావితం చేసే పితృస్వామ్య సంస్కృతి గురించి పోరాడిన స్త్రీమూర్తుల సాహసాన్ని ఊపిరిగా తీసుకొని రైతాంగ గిరిజన ఉద్యమాల బాటలో ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద సంస్కృతికి, మతోన్మాదానికి, కులతత్వానికి వ్యతిరేకంగా ప్రకృతి ముద్దుబిడ్డలుగా పిడికిలెత్తుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కొనసాగిస్తున్న మనం (ఉద్యమకారులతో సహా) మొన్న పితృస్వామ్యానికి ఎదురొడ్డి నిలిచిన సావిత్రి బాయిపూలే, కుల మత రక్కసిని ప్రశ్నించి ప్రాణాలు పోగొట్టుకున్న కారంచేడు ఆలిశమ్మ వర్గ పోరాటాల విశిష్టతను చాటిచెప్పిన పంచాది నిర్మల, చాకలి ఐలమ్మ, వలసవాదాన్ని తిప్పి కొట్టిన ఝాన్సీరాణి, తెలంగాణ లక్ష్మి స్మరణలో వారి వర్ధంతినో, జయంతినో మన ఆశయాల సాధన కోసం మన మహిళా దినోత్సవాలుగా ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించాలి! ఏది ఏమైనప్పటికీ ‘కారా’ మాష్టారు అన్నట్టు ‘ఆమె’ ఆవేశం అర్థం చేసుకోవాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు ఆమె గుండె మనకుండాలి.
సామాజిక న్యాయం, శాంతి కోసం పోరాడుతున్న ఈ సందర్భంలో ‘ఆమె’కు పరిపరి దండాలు. ఇవిగో స్నేహపూరిత ఆత్మీయ వందనాలు!… ఆకాశమై కమ్మేస్తున్న ‘ఆమె’కు నినాదాల నీరాజనాలు!!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
వివిధ సమస్యల మీద పోరాడుతున్నఎందరో మహిళల గురించి చదివితే బతుకు మీద చాల ఆశ కలిగింది.ఇంకోంచం వివిరంగా రాస్తే చాలా బాగుండేది.