అనువాదం : ఆర్. శాంతసుందరి
ఇవాళ ఆ విషయాలు తల్చుకుంటే గుండె బరువెక్కిపోతుంది. ఆయన లేకపోవటంవల్ల నాకన్నా ఈ దేశానికే ఎక్కువ నష్టం కలిగింది. స్త్రీలు ఔన్నత్యం సాధించదల్చుకుంటే వారి ప్రయత్నంలో పాలుపంచుకునే పురుషుల సంఖ్య దురదృష్టం కొద్దీ చాలా తక్కువ. ఆయన నా ఒక్కదానికి మాత్రమే చెందినవారు కారు. నేనే అదృష్టవంతురాలిని. అంత గొప్ప మహావ్యక్తి నావాడు. ఆయన బతికుండగా ఆయన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేదన్నది వేరే సంగతి. ఆయన నా భర్త, నా వాడు, నా సర్వస్వం. కానీ ఆయనపట్ల నాకు భక్తిభావం ఎలా ఉంటుంది? అదే నా కళ్లకి గంతల్లా అడ్డుపడి ఉండాలి.
ఇంకో కారణం కూడా కావచ్చు. భక్తీ, ప్రేమా ఒకేచోట కలిసి ఉండలేవు. భక్తి తల వంచేట్టు చేస్తుంది, ప్రేమ హృదయానికి హత్తుకుంటుంది. ఆయన పట్ల నాకు భక్తి ఉండి ఉంటే పువ్వులూ, పూజాద్రవ్యాలూ పట్టుకుని పరిగెత్తేదాన్నేమో! ఆయన నాకోసం బజారుకి పరిగెత్తి మిఠాయిలు తెచ్చేవారు కారు. నిద్రపోతుంటే మధ్యలో లేపి నీళ్లు తాగమని గ్లాసు అందించేవారు కారు. నాకు నిద్ర పట్టకపోతే విసనకర్రతో విసిరేవారు కారు. నా అతి చిన్న అవసరాలని కూడా ఎప్పటికప్పుడు తీర్చేవారు కారు. ఇవన్నీ లేకపోతే ప్రేమ దూరంగా పారిపోతుంది. కానీ ఇవాళ ఆయన నాతో లేరు. అందుకే ఆయనంటే భక్తి కలుగుతోంది. శారదా బిల్లు మీద అంత చర్చ జరిగింది. కానీ ఆయన పోయిన నాలుగు నెలలకిగాని అది పాసు కాలేదు. ఆయన ఉంటే ఎంత సంతోషించేవారో!
ఇలా ఆలోచిస్తూ బాధపడుతూ కాసేపు నన్ను నేను మర్చిపోతాను. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకి తప్పక శాంతి లభిస్తూనే ఉంటుంది. కానీ నాకెంత అశాంతిని వదిలిపోయారు!
జ జ జ
1933లో కాశీ విశ్వవిద్యాలయంలో ఒక పెద్ద సభ జరిగింది. రకరకాల కార్యక్రమాలు జరిగాయి. వాటిలో కథాసదస్సు కూడా ఒకటి. దానికి మా ఆయన అధ్యక్షుడు. అది మార్చి నెల. నేనింట్లో ఒంటరిగా ఉన్నాను. ఆయన సభకి వెళ్లేందుకు బైలుదేరుతూ, ‘నువ్వు కూడా రారాదూ? ఇంట్లో ఒక్కదానివీ ఏం చేస్తావు? పైగా నువ్వు సభకి రావటం అవసరం కూడానూ,’ అన్నారు.
మొదటి మీటింగ్ పదకొండు గంటలకి ప్రారంభమైంది. దానికి మాలవీయగారు అధ్యక్షులు. రెండో మీటింగ్ రెండున్నరకి. అంటే మేం అక్కడ అంతదాకా వేచి ఉండాలి.
”ఈ లోపల మౌల్వీ మహేశ్ ప్రసాద్ గారిని కలిసి వద్దాం. అప్పటిదాకా ఇక్కడ ఉండి లాభమేమిటి?” అన్నారు. నేనూ సరేనన్నాను. ఇద్దరం కలిసి వెళ్లాం. కానీ ఆయన ఆ సమయంలో భార్యాసమేతంగా ఎక్కడికో వెళ్లాడు.
”మళ్లీ ఇంకెక్కడికన్నా వెళ్లాలి!” అన్నాను.
విశ్వవిద్యాలయం హాస్టల్ పక్కనే ఒక కాలవ తవ్వుతున్నారు. ఆ పక్కనే ఒక చెట్టుంది. మేమిద్దరం దానికింద కూర్చున్నాం. మొదటి మీటింగ్‌లో మా ఆయనకి ఒక పూలమాల వేశారు. ఆ మాల నా మెడలో వేస్తూ, ”మనిద్దరం మళ్లీ సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఉంది!” అన్నారు.
”అయితే ఇప్పటిదాకా మీరు బ్రహ్మచారేనా?” అన్నాను.
”జనం ఏమనుకుంటూ ఉంటారో కాస్తయినా ఆలోచించావా?”
”గంగాస్నానం చేసి వచ్చి, ఇక్కడ సేద తీరుతున్నామని అనుకుంటారు.”
”సర్లే, గంగాస్నానం చేసేవాళ్లలో నా పేరూ, నీ పేరూ చేరదు. చూసేవాళ్లు తెలివితక్కువవాళ్లేం కారు,” అన్నారు.
మేమిద్దరం కాలవ వెంట నడవసాగాం. అక్కడ చాలామంది యువతీయువకులు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ పచార్లు చేస్తూ కనిపించారు. వాళ్లని చూస్తే మనం వింటూ ఉన్న ఇంగ్లాండులో లాటి వాతావరణమే ఇక్కడ కూడా ఉందని అనిపించింది. ఆయన మొహాన ఆనందమన్నది కనబడలేదు. దిగులుగా ఉన్న ఆయనను చూసి నాకు కూడా దిగులేసింది.
మన బానిసదేశం ఎప్పటికి బాగుపడుతుందో, ఏమీ అర్థం కావటం లేదు. ఇక్కడ ఇంకొకళ్లని అనుకరించటం ఎంతగా పెరిగిపోయిందో చూడు. అలా అనుకరించే వాళ్లు తామే అందరికన్నా గొప్ప మేధావులమనీ, తెలివైనవాళ్లమనీ అనుకుంటున్నారు. అది కూడా పూర్తిగా అనుకరించరు, సగం సగమే! చెడ్డ విషయాలని వెంటనే అనుకరిస్తారు, మంచివాటిని చూడనుకూడా చూడరు. వాళ్లలో అంతా చెడే ఉందనీ అనలేం. ఎండాకాలం ఫ్యాను కిందే కూర్చునే ఇంగ్లీషువాడు, అవసరమైతే నిప్పులు చెరిగే మండుటెండలో మైళ్లకి మైళ్లు ఉత్సాహంగా పరిగెత్తుతాడు. ఎంత పెద్ద ప్రమాదాన్నైనా లెక్కచెయ్యడు. అది వాళ్ల దేశానికి చాలా అవసరం. ఇలాటివాటినించి మనం దూరంగా పారిపోతాం. అందుకే మనం స్వాతంత్య్రం సాధించలేకుండా ఉన్నాం.
”ఇప్పుడీ విమర్శలవల్ల ఏమిటి లాభం?” అన్నాను.
”ఇలాటి పరాధీన దేశానికి విలాసాలతో ఏం పని?”
”ఇంగ్లీషువాళ్లలాగ బతికితేనే కదా స్వాతంత్య్రం సంపాదించుకోగలం?”
”విలాసాలు స్వాతంత్య్రానికి శత్రువులు,” అన్నారు.
”ఎంతైనా ఇంగ్లీషువాళ్లకి కూడా సుఖంగా బతకటమే ఇష్టం; మరి వాళ్లెందుకు బానిసలుగా బతకటం లేదు?”
”వాళ్లు స్వాతంత్య్రం సాధించుకున్నాక సుఖాలు అనుభవిస్తున్నారు. అంతకు ముందు వీళ్లు జంతువులన్నా ఎక్కువగా శ్రమపడ్డారు. అలసట, విశ్రాంతి, విలాసాలు అంటే ఏమిటో కూడా ఆ రోజుల్లో వీళ్లకి తెలీదు. కానీ మనదేశానికి ఈ విలాసాలవల్ల స్వాతంత్య్రం ఎన్నటికీ రాదు. తపస్సు, త్యాగం, ఆత్మసమర్పణ, వీటివల్లే మనం స్వాతంత్య్రం పొందగలం. నీ దేశంలో దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఇదంతా నిన్ను రోజురోజుకీ మరింత బానిసని చేస్తోంది!”
”ఈ అలవాట్లన్నీ చిన్నప్పుడు వచ్చేవి కావు. పెద్దయ్యాక వీళ్లకి ధైర్యం వస్తుంది.”
”వీళ్లని నువ్వు చిన్న పిల్లలంటున్నావా? తలిదండ్రులు సరిగ్గా తిండి కూడా తినకుండా వీళ్లని చదివిస్తున్నారని వీళ్లకి తెలీదా? వీళ్లని చూడు, రాజకుమారులూ, రాజకుమార్తెలూ విహరిస్తున్నట్టు లేదూ చూడటానికి? అమ్మాయిల్ని చూడు సీతాకోకచిలుకల్లా ఎలా ఎగురుతున్నారో! ఇక ఇక్కడ వీళ్లు నేర్చుకునేదేముందోకాని, తలిదండ్రుల దగ్గర అబ్బిన గుణాలు కూడా మిగలవు. ఇక వీళ్ల పెళ్లిళ్లకి తలితండ్రులు బోలెడంత డబ్బు ఖర్చు చెయ్యాలి. ఎందుకంటే ఈ ఖరీదైన అలవాట్లని అత్తారింట్లో కూడా కొనసాగించలేకపోతే వీళ్ల జీవితం దుర్భరమై పోతుంది,” అన్నారు.
”గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక ఉద్యోగాలు చేసి సంపాదించుకోరూ? అసలు పెళ్లే చేసుకోకుండా ఉండలేరంటారా?” అన్నాను.
”ఇంకోళ్ల డబ్బు మంచినీళ్లలా ఖర్చుపెట్టే వీళ్లు తమ సంపాదనలోంచి ఎవరికోసమైనా ఒక్క పైసా ఖర్చుపెడతారా?” అన్నారు.
”మీరు సుదర్శన్ గారి కథ చదివే ఉంటారు. అందులో ఒక కుర్రాడు తండ్రి తన చేతిఖర్చుకోసం ఇచ్చిన మొత్తం డబ్బుని ఖర్చుపెట్టేస్తూ ఉంటాడు. తండ్రి ఆలోచించి ఒక ఉపాయం కనుక్కుంటాడు. ‘బాబూ నువ్వు కూడా ఎంతో కొంత సంపాదించు. ఇంకొకరి సంపాదన మీద ఎన్నాళ్లని బతుకుతావు?’ అంటాడు. ఆ కుర్రాడు నాలుగైదుసార్లు తల్లి నడిగి డబ్బు తీసుకుని తనే సంపాదించానని తండ్రికి చెపుతాడు. తండ్రి ఆ డబ్బుని బావిలో పడెయ్యమంటే కొడుకు అలాగే చేస్తాడు. చివరికి వాడు కష్టపడి పనిచేసి తెచ్చిన డబ్బుని తండ్రి బావిలో పడెయ్యమనేసరికి వాడు అభ్యంతరం చెపుతాడు. అదేవిధంగా ఈ అమ్మాయిలూ, అబ్బా యిలూ కూడా బరువు, బాధ్యతా మీద పడితే నిద్రలేస్తారు,” అన్నాను.
”ఆ కథలోనివాడు చిన్నపిల్లవాడు. వీళ్లు యౌవనంలో ఉన్నారు. చెడు అలవాట్లు బాగా పాతుకుపోయాయి. వీళ్లు ఎందుకూ కొరగాకుండా పోతారు. ఒక సంగతి నువ్వెప్పుడైనా ఆలోచించావా? డాక్టర్ దగ్గరికి చాలామంది రోగులు వెళ్తారు; కొందరు కోలుకుంటారు, కొందరు చనిపోతారు. చనిపోయినవాళ్లు తమ అనుభవాలని ఈ లోకానికి చెప్పలేరు. ఇక బతికి బైటపడ్డవాళ్లు డాక్టర్ చేసిన వైద్యంవల్లే కోలుకోకపోయినా ఆ డాక్టర్‌నే పొగుడుతారు. ఈ కాలంలో ఈ పిల్లలూ అంతే, వీళ్లలో ఏ నలుగురైదుగురో బుద్ధిమంతులు ఉండచ్చు, కానీ అది వాళ్ల సొంత వ్యక్తిత్వమూ సంస్కారమూ. సమాజంలో రెండు విధానాలు కనిపిస్తున్నాయి. ఒక వర్గంవాళ్లు చిన్నప్పట్నించే ఏ పనిచేసినా వాళ్ల దృష్టి ఎప్పుడూ చేసే పని మీదే ఉంటుంది. ఒక పక్క చదువుకుంటున్న దేశ పరిస్థితి ఎప్పుడూ వాళ్ల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఇంకొందరు విలాసాలలో తలమునకలవుతూ బతికేసి, అవసరం వచ్చినప్పుడు కూడా ఆ ధోరణిని మార్చుకోలేక, తమని సరైన మార్గాన పెట్టుకోలేకపోతారు. ఇక వాళ్లు ఇంకొకరికి ఆసరా ఏమిస్తారు?”
”అంటే మీ ఉద్దేశం ఈ లోకంలో ఎప్పుడూ అందరూ నిస్వార్థంగా సన్యాసుల్లాగే బతికారా? బతకాలా?”
”చూడూ, ఇంకొన్నాళ్లలో దేశం వీళ్ల చేతుల్లోకే వెళ్లబోతోంది. అప్పుడు కూడా ఈ మతిలేనివాళ్లు ఇలాగే అవకతవక జీవితాలు గడుపుతూ ఉంటారు.”
”అయితే ఏమిటి మార్గం? ఈ లోకంలో మంచివాళ్లు చాలాకొద్దిమందే ఉంటారు, అది మీకూ తెలుసు. మరింక విచారం దేనికి?”
”కోపం రాదూ? చివరికి వీళ్లు పేదవాళ్లనే కదా దోచుకునేది?”
”మరి పేదవాళ్లు అప్రమత్తంగా ఉండచ్చు కదా? వీళ్లని పరీక్షించి చూసుకోవచ్చుగా?”
”వాళ్లు అమాయకులు. పనిచేస్తారు కానీ పని విలువ తెలియనివాళ్లు.”
”మరైతే వీళ్లు పన్నిన ఉచ్చులో పడకుండా ఉండలేరన్నమాటేగా? ఇంకో విషయం, మనిషి తన సంగతి తనే చూసుకోవాలి. అలా చెయ్యలేనివాడికి దేవుడు కూడా సాయం చెయ్యలేడు.”
”అప్పుడిక దిగులే ఉండదు. విషయం ఏమిటంటే, జనం కష్టాల్లో ఉన్నారు. అసలు మనదేశానికి ఒక పెద్ద డిక్టేటర్ అవసరం ఎంతైనా ఉంది.” ”బ్రిటిష్ ప్రభుత్వం కన్నా పెద్ద డిక్టేటర్ ఎవరుంటారు?”
”నీకు తెలీదు, ఇక్కడ టర్కీ దేశపు కమాల్‌పాషాలాటి వాడొకడు ఉండాలి. అలాటి మనిషి ఈ దేశంలో పుట్టనంతకాలం, మనకు బాగుపడే ఆశ ఉన్నట్టు నాకనిపించటంలేదు. ఇక్కడ స్వేచ్ఛ పనికిరాదు, ఏదైనా బలవంతంగా చేయించాల్సిందే!”
”అయితే మీరెందుకు బాధపడుతున్నారు? మీకేం సంబంధం? ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుందామని కూర్చున్నాం, మధ్యలో ఈ గొడవొచ్చింది. అయినా మీ పని మీరు సవ్యంగా చేస్తున్నారు కదా. లోకం ఎలాపోతే మీకేం?”
”నాలో ఇటువంటి అల్లకల్లోలం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది!” అన్నారాయన.
”సరే మీకు దానివల్ల బలం వస్తోంది. మీ వల్ల జనానికి కూడా మనోబలం పెరుగుతోంది. కానీ నాకేం లాభం?”
సభల్లో రచయితలు ఎన్నో కథలు చదివారు. మీ ఆయన ఉపన్యసించారు. అక్కడ కూడా దేశపరిస్థితి గురించే మాట్లాడారు. ఆయన పెట్టిన చీవాట్లు జనానికి సరదాగా అనిపించాయి కానీ వాళ్లు చేస్తున్న తప్పేమిటో వాళ్లకి అర్థం కాలేదని నాకనిపించింది. పైగా అక్కడి వాతావరణాన్ని బట్టి జనం అలాగే బతకాలని అనుకుంటారు. నాకైతే వాళ్ల తప్పేమీ ఉన్నట్టు అనిపించలేదు. అక్కడి వాతావరణాన్ని బట్టి అలా బతక్క తప్పదేమో, అనుకున్నాను. యౌవనమూ, నీటిప్రవాహమూ ఒకేలా ఉంటాయి. ఎక్కడ పల్లం ఉంటే అటే పరిగెత్తుతాయి. అంతేకాక మనదేశంలో యువకులకి ఒకటి ముఖ్యంగా బాగా నేర్పిస్తారు, విలాసంగా బతకటం. యువతీయువకులు విలాసజీవితం గడిపితే ప్రభుత్వానికే లాభం.
సభలకి హాజరై వెనక్కి వచ్చేశాక కూడా చాలారోజులపాటు మేమిద్దరం ఆ విషయాల గురించే చర్చించుకున్నాం. ఆయన మాటలు వింటే, తనకే కనక అధికారం ఉంటే ఈ లోకాన్ని పూర్తిగా మార్చేయగల శక్తీ, ఆసక్తీ ఆయనలో ఉన్నాయని నాకనిపించింది.
1934
చాలా రోజులుగా ఉదయంపూట ఆయన్ని కలవటానికి ఎవరో ఒకరు వస్తూపోతూనే ఉన్నారు. అందుకే రాత్రి మేలుకుని తన పని చేసుకునేవారు. ఒకరోజు, ”రోజూ రాత్రి మేలుకుని పనిచెయ్యటం మంచిది కాదు,” అన్నాను.
”మరైతే ఎప్పుడు చెయ్యమంటావు? రోజంతా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారుగా?”
”పోనీ కలుసుకోటానికి సమయం కేటాయించకూడదూ? అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరో రావటం, మీరు కబుర్లు చెపుతూ కూర్చోటం!”
”ఏం చెయ్యమంటావు?”
”మీరే ఏదో ఒకటి చెయ్యాలి.”
”పాపం వాళ్లు అంతదూరంనించి నాకోసం వస్తారు, అలాటప్పుడు వద్దంటే ఏం బావుంటుంది?”
”కానీ ఇరవైనాలుగ్గంటలూ ఈ గోల భరించటం కష్టం!”
”గొప్పవాళ్లు తమని కలవాలంటే ముందుగా చెప్పి రమ్మంటారు. వాళ్ల పద్ధతి అది.”
”మిమ్మల్ని గొప్పవాళ్లలా ప్రవర్తించమని నేననటంలేదు. ఏ పనైనా పద్ధతి ప్రకారం, సమయం చూసుకుని చెయ్యాలంటున్నాను.”
”నువ్వనేది నిజమే. కానీ అదంతా డబ్బున్న గొప్పవాళ్లకే సాధ్యం. నేను దేన్నైతే తప్పనుకుంటున్నానో, అదే చెయ్యనా? వాళ్లు కొత్తగా రాద్దామనుకుని నా సలహాలకోసం వస్తున్నారు. చుక్కానిలేని నావలాటివాళ్లు. సమస్యల పరిష్కారం కోసమే వాళ్లు అంతదూరంనించి వస్తున్నారు. నేను మాట్లాడనంటే వాళ్లెక్కడికెళ్తారు? ఇంక కొన్నాళ్లకి సాహిత్యాన్ని సృష్టించబోయేది మరి వాళ్లేగా? వాళ్లకి సరైన మార్గం చూపించటం మన బాధ్యత. ఆ బాధ్యత నేను సరిగ్గా నిర్వర్తించకపోతే అది నా తప్పే అవుతుంది. అప్పుడిక వాళ్లకి సాహిత్యం గురించి ఏమీ తెలీదు, సంస్కారం లేనివాళ్లు అని అనలేం. అదీగాక, మనలో ఏదైనా ప్రతిభ ఉంటే దాన్ని అందరికీ నేర్పించాలి,” అన్నారు.
”అందరికీ నేర్పిస్తానని మీరేమైనా కాంట్రాక్టు తీసుకున్నారా?”
”మరైతే ఏం చెయ్యమంటావు? పొద్దున్నే కొంతదూరం నడిచిరావటం కూడా అవసరం. రాగానే టిఫిన్ తిని నా గదిలో రాసుకోటానికి కూర్చుంటాను. నేను చదువుకుంటూ, రాసుకుంటూ, నీ పిల్లలకి కూడా చదువు చెపుతాను. ఆ తరవాత స్నానం అదీ చేసి, భోజనం కానిచ్చి ప్రెస్‌కి వెళ్తాను. అక్కణ్ణించి వచ్చాక పిల్లల్తో ఒక గంటసేపు కబుర్లు చెపుతాను. లేకపోతే వాళ్లు కూడా పాడైపోతారు. అంతేకాదు, అలా వాళ్లతో మాట్లాడుతుంటే నా అలసటంతా మాయమవుతుంది. ఆ తరవాత గుమాస్తా వస్తాడు. అతనికి చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. ఇక రాత్రి తొమ్మిదికి భోజనం. తరువాత నాకు మిగిలేది మహా అయితే ఒక గంట. ఆ టైములోనే ఏమైనా రాసుకున్నా, చదివినా. ప్రభుత్వం పదిగంటలకల్లా పడుకోమని ఉత్తర్వు జారీ చేసింది. దాన్ని పట్టించుకోకుండా ఉండగలను కానీ నీ ఆజ్ఞ పాటించకుండా ఉండగలనా! మరి నువ్వే చెప్పు, నాకు తీరిక దొరికేదెప్పుడు? ‘లీడర్’ (వార్తాపత్రిక) ప్రెస్‌లోనే చదివేస్తాను. ఒక్కొక్క క్షణానికీ నీకు లెక్క చెప్పగలను. అసలు రాత్రిని తగ్గించమనీ, పగటి సమయాన్ని పొడిగించమనీ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను!”
”కానీ మీరు రాత్రిపూట కూడా పనిచేస్తారుగా?”
”మధ్యలో లేచే మాట నిజమే, కానీ నీకు మెలకువ వస్తుందేమో అని భయం వేస్తుంది. మరి రాత్రి మేలుకోకపోతే పనెలా జరుగుతుంది?”
”అలా అయితే మీరు ఒంటరిగా, బ్రహ్మచారిలాగే ఉండిపోవలసింది. పెళ్లాం, పిల్లలూ, ఇవన్నీ మీకు అనవసరం!”
”అదేం కాదు. నువ్వుండబట్టే, ఇంటి వ్యవహారాలేవీ చూసుకునే అవసరం నాకు రావటం లేదు. డబ్బు సంపాదించటం నాకు పెద్ద కష్టమేం కాదు. కానీ సంసారంలోని చిక్కుముళ్లని విడదీయటం నాకు సాధ్యం కాని పని. ఆ విషయంలో, అదంతా నువ్వు నీ తలకెత్తుకున్నందుకు, నాకు చాలా సుఖంగా ఉంది.”
”కానీ మీరు పెళ్లి చేసుకుని ఉండకపోతే మిమ్మల్ని అడ్డుకునేందుకు నేనుండేదాన్ని కాదు. పగలూ రాత్రీ, మీ ఇష్టం వచ్చినట్టు పని చేసుకునేవారు.”
”కాదు, పొరబడుతున్నావు. నువ్వు లేకపోతే నేనింత పని చెయ్యగలిగేవాణ్ణి కాదు.”
”అయితే నాకు కోపం తెప్పించటానికేనా రాత్రంతా మేలుకుంటారు?”
”ఖర్చుపెట్టేందుకెవరూ లేకపోయినా డబ్బు సంపాదించేవాడు అడ్డగాడిద!”
”ఏం? అప్పుడంతా సుఖమేగా?”
”కాదు, రాణీ! అతనేం మనిషి? అలాటివాళ్ల బతుకు పశువుల బతుక్కన్నా హీనం!”
”అలా అయితే ఇది నాకే ప్రమాదమన్నమాట!”
”ప్రమాదమేమిటి? నీ కనుసన్నల్లో మెలుగుతూ ఉన్నందువల్లే నేనింతటి వాణ్ణయాను!”
”రచయితలకి ఎప్పుడూ ప్రమాదమే.”
”నువ్వు కూడా రచయిత్రివవుతున్నావుగా! హాయిగా ఉండు అంటే నామాట వింటున్నావా?”
”మీరు హాయిగా బతక్కపోయిన తరువాత నేను మాత్రం హాయిగా ఎలా ఉండగలను?”
”అలా అనటం తప్పు. నాకు చేసేపని కష్టంగా లేదే, ఆనందమే కలుగుతోంది.”
”అలా ఇరవైనాలుగ్గంటలూ పనిచెయ్యటం కష్టం కాక మరేమిటి?”
”అలా పనిచెయ్యమని ఎవరూ నన్ను బలవంతం చెయ్యటం లేదుగా? ఇలా ఆలోచించి చూడు, నన్ను కలవటానికి వచ్చేవాళ్లవల్ల లాభం నాకేగాని వాళ్లకి కాదు.”
”అలా అనుకుంటే నేనేం చెప్పలేను. కానీ నామీద దయుంచి, రాత్రిళ్లు మేలుకోకండి. మధ్యరాత్రి మీరలా లేస్తే జబ్బు పడతారేమోనని నేను భయపడి చస్తున్నాను.”
”నేను అంతే, నీకెక్కడ జబ్బు చేస్తుందోనని ఆందోళన పడుతూంటాను. నీకు ఒంట్లో బాగుండకపోతే నా పనంతా ఆగిపోతుంది.”
”పనిచెయ్యటంవల్ల నా ఆరోగ్యం ఎప్పుడూ చెడదు.”
”ప్రతిఏడూ నీకు ఏదో ఒక అనారోగ్యం ఉంటూనే ఉంది.”
”కానీ ఎప్పుడూ మంచం పట్టలేదుగా?”
”నేను మాత్రం ఎప్పుడు మంచాన పడ్డాను?”
ఇలా ఏదో ఒక విషయం గురించి నాతో ఆయన మాట్లాడుతూనే ఉండేవారు. నేను కోపంగా మాట్లాడితే ఆయన నవ్వుతూ జవాబు చెప్పేవారు.
– ఇంకా ఉంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
శాంత సుందరి గారి అనువాదాలన్నీ సరళం గా ఉండి ఆబ గా చదివించేస్తాయి.కానీ ఇంట్లో ప్రేమ్ చంద్ మాత్రం శివరాణీ గారు మనందరం కూర్చుని మట్లాడుకుంటున్నప్పుడు అందరి మధ్యకొచ్చి తనూ తన కష్టసుఖాలు మనతో కలబోసుకుంటున్నట్లే ఉంటుంది. భూమిక పాఠకులు కొందరు పత్రిక రాగానే ముందు ఈ ఆర్టికల్ చదువుతామని చెప్పారు. శాంత గారికి ధన్యవాదాలు.