ఆకుపచ్చని రక్తం

తురగా ఉషారమణి
పెద్ద చెట్టు. ఏనాడు, ఎక్కడ నుంచి వచ్చి పడ్డ విత్తో, నాటుకుని, కొమ్మలు పరచుకుని, మహావృక్షమై కూర్చుంది. వేప మొక్క కదా మంచిదేలే అని ఊరుకున్నారు ఆ పక్కన ఇంటివాళ్ళు. పైగా అంతా ఖాళీస్థలమే. బోలెడు చెట్లు. ఆ అడవిలో ఇంకో చెట్టు. అంతేగా! నారు పోసినవాడి నీరుతోనే పెరిగింది ఆ మొక్క. రెండేళ్లలో పూత వచ్చేసింది. ఆ ఏడాది ఉగాది పచ్చడికి ఆ వేపపూతే వాడుకున్నారు. ఆ ఏడాదేనా, పక్కనేడాదా? అబ్బా, ఎవరికీ గుర్తు, ఎప్పుడో ఎనభై ఏళ్ళనాటి మాట…
ఇంకా కాఫీలు కూడా తాగలేదు, వీధిలో ఏదో హడావిడి. హైవే పక్కన కావడంతో ఎప్పుడు ట్రాఫిక్‌ శబ్దాలు ఉన్నప్పటికీ ఇది మరీ గుమ్మంలోనే. ‘ఆ చప్పుడు ఏమిటిరా?’ పేపర్‌ చదువుకుంటున్న కొడుకుని అడిగింది ప్రసూన. ‘హైవే వెడల్పు చేస్తున్నారుట అమ్మా, ఆ పని మొదలుపెట్టినట్లు ఉన్నారు’ చెప్పాడు సునీల్‌. ”రోడ్డు పెద్దది చేస్తున్నారా, ఎందుకు, సరిపోవడం లేదా?’ కొడుకు దగ్గరనుంచి జవాబు లేకపోవడంతో ‘సరేలే, ఏదో ఒకటి, మనకి గొడవ లేకపోతే చాలు’ అంటూ పనిలో పడింది ప్రసూన.
ఎండకి డస్సిపోయినట్లు అవుతోందని, పొద్దున్నే పని మొదలుపెట్టేస్తోంది ప్రసూన. ఇదివరకులా ఓపిక ఉండడం లేదు. ‘మా చిన్నతనంలో ఎంత చురుకుగా ఉండేవాళ్ళం, మీరేమిటిరా,” అని సెలవలకు ఇంటికి వచ్చే మనవల్ని అప్పుడప్పుడు మెత్తగా మాటలతో పొడిచి, సరదా పడే ప్రసూనకి ఈ మధ్య పరాచికాలకు కూడా పనిగట్టుకుని ఓపిక తెచ్చుకోవాల్సి వస్తోంది. దాహం వేసినా లేచి మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి కూడా కాసేపు ఆలోచిస్తోంది. కోడలు స్కూల్లో టీచర్‌, ఏడున్నరకి వెళ్లి, రెండింటికి వస్తుంది. రాత్రి వంట చూసుకుంటుంది. కొడుకు బిజినెస్‌ కోసం సిటీకి వెళ్ళి వస్తాడు రోజూ. నలభై కిలోమీటర్లు. పిల్లలు ఇద్దరినీ హాస్టల్‌లో పెట్టారు. ప్రసూన తన కుటుంబం గురించి అందరితో సగర్వంగా చెప్పుకుంటుంది. ”చక్కగా సంసారం నడుపుకుంటారు అబ్బాయి, కోడలు. ఏదో సిటీకి దూరం, ఆనాటి ఇల్లు కనక, ఇంత విశాలంగా, హాయిగా ఉంటున్నాము. మా పిల్లల గురించి నాకు దిగులు లేదు. బోలెడు సమర్ధత,” అని చెప్తుంటుంది. ”నిజమేలెండి, ఊరి బయట స్థలాలు కూడా లక్షల్లో. మీరేదో ఆనాడు కొని పడేసారు కనుక…’ అంటారు విన్నవాళ్ళు కూడా….
ప్రసూన పెళ్లి అయ్యి ఆ ఇంట్లో అడుగు పెట్టిన నాటికి, ఆ వేప మొక్క కాస్తా అంత చెట్టు అయింది. వాకిట్లో ఒక పక్కకి చక్కగా నిలబడ్డ ఆ చెట్టు చుట్టూ ప్రసూన మామగారు గట్టు కట్టించారు. ఊరివాళ్ళు వస్తే, అక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, ఎండాకాలంలో వచ్చి మామిడిరసం, చలికాలంలో కాఫీలు తాగేవారు అందరూ. రాత్రి చల్లగాలిలో ప్రసూన, వాళ్ల ఆయనా అక్కడే తిరుగుతూ మాట్లాడుకునేవారు. పగలుపూట నల్లని మాను, కొమ్మలు, లేత ఆకుపచ్చ ఆకులతోనూ, వెన్నెల రాత్రుల్లో చందమామ పైన లైట్లా వెలుగుతుంటే, వెండి కొమ్మలతోను మెరిసే చెట్టుని ఆశ్చర్యంతో చూసేది ప్రసూన. కాస్త చిగురుపట్టే కాలం రాగానే, ఆ చేదు ఆకులు తిని, కోయిల తెగ తీయగా కూసేస్తుంటే, ఆ సృష్టి విచిత్రానికి సంభ్రమపడేది. మొత్తంమీద వాకిట్లో వేపచెట్టు ఇంటివాళ్ళ దైనందినంలో భాగం అయిపోయింది…..
అమ్మా, బయలుదేరుతున్నా! సునీల్‌ చెప్పి బైక్‌ తీసి వెళ్ళిపోయాడు. సాగనంపేందుకు బయటికి వచ్చిన ప్రసూన, అక్కడ హడావిడి చూసి ఆశ్చర్యపోయింది. పెద్ద లారి ఒకటి, ట్రాక్టర్‌ ఒకటి ఆగి ఉన్నాయి. ఒక ఇరవై మంది మనుషులు. కొంతమంది పచ్చని హెల్మెట్లు పెట్టుకుని, కొంతమంది తలకి గుడ్డలు చుట్టుకుని, అంత అంత ఆకారాలతో కర్కశంగా ఉన్నారు. ప్రసూనని చూడగానే ఇద్దరు దగ్గరకి వచ్చారు. ‘అమ్మా, కొంచెం నీళ్ళు ఇస్తారా?’ అని అడిగారు. చిన్న బిందె, గ్లాసు పట్టుకుని వచ్చింది ప్రసూన. ‘ఏంటి బాబూ, రోడ్డు పెద్దది చేస్తున్నారా? ఎందుకు?’ అడిగింది. ‘బస్సులు, కార్లు ఎక్కువ అయినాయి కదమ్మా, మొత్తం సిటీ నుంచి రెండువందల కిలోమీటర్లు పెద్ద ప్రాజెక్టు. మీ ఊరి దగ్గర రాత్రిపూట యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి అంట. రోడ్డు పడితే, బావుంటుంది.’ ‘నిజమేలే, ఈ మధ్య కార్లు పెరిగాయి,’ అన్నది ప్రసూన. ‘ఇంక మూడు రోజులు, ఈ మొత్తం చెట్లు తీసేస్తే, పది రోజుల్లో పని స్టార్ట్‌ అవుతుంది,’ కూలివాడు చెప్పి గ్లాస్‌ ఇచ్చి వెళ్ళిపోయాడు. ప్రసూన మ్రాన్పడిపోయింది. చెట్లు తీసేయడమా? అదేంటి, ఏదో రోడ్డు పెద్దది చేస్తామన్నారు, ఓ పది అడుగుల జాగా ఉంది కదా, అక్కడ వెడల్పు చేసుకోవచ్చుగా’ అనుకుంది. అయినా, మన చెట్ల వరకు రారేమోలే. ఏమి తోచనట్లుగా లోపలకి నడిచింది….
సునీల్‌ పుట్టే టైంకి ప్రసూన మామగారు ఇల్లు ఇంకో నాలుగు గదులు వేసి పెద్దది చేయించారు. మేడ మీద అతిథుల కోసం ఒక గది కూడా కట్టించారు. పిల్లాడు పెరిగి పెద్ద అవుతుంటే, ఇంట్లో అందరికి ప్రతిదినం ఒక పండుగ, ఊళ్ళో వాళ్ళూ వచ్చి, రోజూ పలకరించి పోతుండేవారు. ఊరి మధ్యలో నుంచి ఇంజనీర్లు కొలతలు తీసుకుని, ప్రసూన వాళ్ళ ఇంటికి ఒక వంద మీటర్ల దూరం నుంచి సిటీకి రోడ్డు వేశారు. రహదారి పని జరిగినన్నాళ్ళు ప్రసూన మామగారు, ఊరి పెద్దగా నిలబడి, తనే రోడ్డు వేయిస్తున్నంత సగర్వంగా పని పర్యవేక్షించాడు. రోడ్డు పడ్డ కొద్దిరోజులకే ప్రసూన భర్త సిటీలో బిజినెస్‌ కూడా ప్రారంభించాడు. అంతా సజావుగా సాగిపోతోంది. ఈ సంతోషంలో, హడావిడిలో, పనుల్లో, ప్రగతిలో వేపచెట్టు తన పాత్ర పోషిస్తూనే ఉంది. వేపచెట్టుకి పెద్ద పాత్ర ఏముంటుంది లెండి? కాయలా, ఫలాలా… ఏదో ఇంత చల్లని నీడ, హాయిగా గాలి. అవి మాత్రం ఇస్తూనే ఉంది. అన్నట్లు, సునీల్‌ తన నీడలో పెట్టుకున్న చిన్న సైకిల్ని చూసుకోవడం, పిల్లాడి కోసం తన కొమ్మలకి కట్టిన ఉయ్యాలని పదిలంగా పట్టుకోవడం కూడా వేపచెట్టు బాధ్యతేలే. ఆ తర్వాత సునీల్‌ కాలేజ్‌ చదువుల్లో స్నేహితులతో గంటలకొద్దీ కబుర్లు, క్రికెట్‌ ఆటలు, ఇంకా కొద్ది కాలానికి సునీల్‌ ఇన్ఫార్మల్‌ బిజినెస్‌ మీటింగులు… అన్నీ చెట్టు నీడలో జరిగాయి…..
పన్నెండు దాటింది. ప్రసూనకి ఆకలి వేయడం లేదు. కోడలు రావడానికి ఇంకా టైం ఉంది, సునీల్‌కి ఫోన్‌ చేసింది. ”చెట్లు కొట్టేస్తారుట, నీకు తెలుసా అని. ‘అవునమ్మా ఏదో అన్నారు, కనుక్కుందాం. నేను మళ్ళీ మాట్లాడతా’ అని పెట్టేశాడు. మళ్ళీ బయటకి వచ్చి వీధిని పరికించింది. అంత దూరంలో పని మొదలుపెట్టారు. ఒక జనరేటర్‌, కరెంట్‌తో నడిచే పెద్ద రంపం, చెట్టు మొదలు దగ్గర ముగ్గురు కూర్చుని, రంపాన్ని అటు, ఇటు నడుపుతున్నారు. ప్రసూన గుండెలో గాభరా. కళ్ళు పెద్దవి చేసి, ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయింది. పదినిమిషాలు. రావుగారి ఇంటి దగ్గర పెద్ద చింతచెట్టు, బొమ్మలా కుప్ప కూలింది. ‘జరగండి, జరగండి…’ అంటూ కూలివాళ్ళు హడావిడిగా అందరిని ఆపేశారు. పదినిముషాల క్రితం ఆకాశాన్ని తాకుతోందా అన్నట్లు ఉన్న చింతచెట్టు, పెద్ద ఏనుగు చచ్చిపోయినట్లు పడి ఉంది. ప్రసూనకి చెమటలు పట్టాయి. జీవితంలో ఎప్పుడు చూడని దృశ్యం. పాత రోడ్డు వేసినప్పుడు, అక్కడక్కడా చిన్న కొమ్మలు తప్పితే కొట్టలేదు. ‘ఈ సైడ్‌ చెట్లు రేపు, ఎల్లుండి తీస్తామమ్మా. చెట్టు కొట్టి, లారిలోకి ఎక్కిస్తే టన్నుకి అయిదు వందలు ఇస్తారు. ఎన్ని కొడితే మాకు గడవాలి…’ కూలివాడు చెప్తున్నాడు.
ప్రసూన వేపచెట్టు వైపు చూసింది. సంక్రాంతి పండగకి మనవలు ఎగరేసిన గాలిపటాలు, రంగు వెలిసినా, కొమ్మల్లో చిక్కుకునే ఉన్నాయి. ఇద్దరు మనుషులు చేతులు చాపితే తప్ప చుట్టలేనంత పెద్ద మాను, రెండు అంతస్తుల ఎత్తు చెట్టు. చుట్టూ గట్టు అక్కడక్కడా పగుళ్ళు పడింది, కానీ నున్నగా కూర్చోవడానికి అనువే. హఠాత్తుగా చెట్టులో తన ముఖం కనిపించింది. వెండి వెంట్రుకలు, ముఖం మీద గీతలతో కలనేతగా, నవ్వుతూ తనవైపే చూస్తున్నట్లు అనిపించింది ప్రసూనకి. నువ్వూ, నేనూ, కలసి జీవితం… అంతా ఇక్కడే అంటున్నట్లు ఒక క్షణం భ్రమ. కళ్ళు తిప్పుకుని లోపలకి వచ్చేసింది.
ఆ రోజు పొద్దు గుంకేసరికి ఎనిమిది చెట్లు నరికి పడేసారు. అసలు ఎండ అంటూ కనపడకుండా, దట్టంగా, ఆకుపచ్చిని కాంతితో ఉండే ఆ ప్రాంతం అంతా ఒకేసారి భయంకరమైన వెలుగు. ఎడారిలో ఉండే కఠినమయిన తెల్లని ఎండ. కోడలు రాగానే ప్రసూన తన బాధ వెళ్ళగక్కింది. ‘అయ్యో, మరీ దారుణంగా నరికేసారే’ అంటూ నొచ్చుకున్నట్లు మాట్లాడి కోడలు, కాసేపు వింత చూసి, ఆ తర్వాత ఏవో పేపర్లు దిద్దుకునే పనిలో పడిపోయింది. సునీల్‌ రాత్రి వచ్చేటప్పటికి ఆలస్యం. ఇంక చెట్ల ప్రస్తావన రాలేదు. ప్రసూనకి రాత్రంతా నిద్ర పట్టలేదు. తను ఇరవై ఏళ్ళు కూడా లేనప్పుడే కాపురానికి వచ్చినప్పటి చెట్టు. తనతో పాటు పెరిగింది. ఇంట్లో పెద్దలందరి ఆత్మలు, ఆ చెట్టు నీడనే సేద తీరుతున్నాయి. పిల్లవాళ్ళ పగలు, రాత్రి గడుస్తున్నాయి. తనకు ఏదో స్నేహబంధం ఉన్నట్లు చెట్టు మీద మమకారం.
మళ్ళీ తెల్లారి అదే సీను. అదే హడావిడి. మారణహోమం చేసేవాడు, ముందే పనిలోకి వచ్చేస్తాడు ఎందుకో. ఉరి తీసేవాడు తెల్లారుఝామునే డ్యూటీకి ఎక్కినట్లు, కసిగా అనుకుంది ప్రసూన. కాస్త కాఫీ గొంతులో పోసుకుని బయటకి ఆదుర్దాగా వచ్చింది. ఎదురుగా బీభత్సం. నిన్న నరికిన చెట్లు ఇంకా అక్కడే ఉన్నాయి. యుద్ధభూమిలో వీరుల శవాలలాగ. రాలిన ఆకులు, కొమ్మలు… అంతా గందరగోళంగా ఉంది. గుండెలు కంగారు, లోపలకి వెళ్ళింది. ‘బాబూ, కనుక్కోరా కొంచెం. ఈ చెట్టు కొట్టరేమో. పక్కకే ఉందిగా. రోడ్డు ఆ పైనుంచి వేసుకోవచ్చు. నువ్వు వెళ్ళి చెప్పరా. పెద్ద పెద్ద మానులు కూడా మరీ పది నిముషాల్లో కొట్టేస్తున్నారు. తొందరగా వెళ్ళి, ఆ ఆఫీసర్‌తో ఒక మాట చెప్పు, మన చెట్టు వదిలేయమని.” ”అబ్బా… మనం ఏం చేస్తాం అమ్మా? అన్ని చోట్ల కొడుతున్నారు కదా. అయినా, మనం ఇక్కడ ఉండముగా, మనకెందుకు చెట్ల గోల.’ అన్నాడు సునీల్‌.
గుమ్మం దగ్గర నుంచున్న ప్రసూన ఒక్కక్షణం స్థాణువు అయింది. ‘అదేమిటిరా, ఎక్కడికి పోతాం?’ అంది. ‘పర్మనెంట్‌గా ఇక్కడే ఉంటామా అమ్మా? ఊరి బయట అడవిలో’ అన్నాడు సునీల్‌ గొంతు పెంచి. ‘అడవి ఏమిటిరా, పుట్టి పెరిగిన ఇల్లు… ఎంత దూరమని సిటీ నుంచి… అయినా అందరూ వెతికి వెతికి స్థలాలు కొనుక్కుంటుంటే…” ప్రసూనకి గొంతు పెగలడం కష్టమవుతోంది. ‘అవునమ్మా… కొనుక్కుంటారు మన ఇల్లు కూడా. తాత పుణ్యమా అని పెద్ద ల్యాండ్‌. పైగా హైవే పక్కనే… మంచి ధర పలుకుతుంది. ఇల్లు కూలగొట్టినా, భూమి విలువే బోలెడు.’ సునీల్‌ చకచకా చెప్తున్నవాడు తల్లి మొహం చూసి ఆగాడు. ప్రసూన గుమ్మం దగ్గర కూలబడింది. అసలు కొడుకు మాటలు వినిపించడం లేదు. చెమటలు పట్టి, నీరసంగా చూస్తోంది. వంటింట్లో ఉన్న కోడలు మంచినీళ్ళు పట్టుకొచ్చింది. ప్రసూన ఏదో అనబోతుంటే బయట రంపం చప్పుడు మొదలయింది. గబుక్కున లేవబోయి, మళ్ళీ వెనక్కి కూర్చుండిపోయింది. తన చెట్టే, చూడకుండానే తెలుస్తోంది. ఆ రంపం కోతేనా ఏదో గుండెలో రక్తం కారినట్లు నెప్పిగా ఉంది? సునీల్‌ తల్లిని చూసి తటపటాయించాడు. అసలే అనారోగ్యం పడిపోతోందా, అని ఒక క్షణం ఆందోళన పడి, భార్యకేసి చూశాడు. ఆమె కంగారుగా నీళ్ల గ్లాసు ప్రసూన చేతికి ఇచ్చింది. సునీల్‌ వచ్చి అమ్మ పక్కన నేల మీద కూర్చున్నాడు. ‘అమ్మా, నువ్వే ఆలోచించు. పిల్లల చదువులు ఉన్నాయి, నేను కూడా కారు కొనుక్కుంటా. నాకు వయసు పెరుగుతోంది. ఇంతదూరంనించి రోజు ప్రయాణం ఎక్కడ చేయను? సిటీలో మంచి ఫ్లాట్‌ చూసాం.” ప్రసూన మాట్లాడడం లేదు. బయట రంపం చప్పుడు పెరిగింది.
సునీల్‌ అమ్మ దగ్గరకి జరిగాడు. కరెంటు రంపం చప్పుడు మీద గొంతు పెంచాడు. ”అయినా, అమ్మా, నువ్వు మరీ దిగులుపడక్కర్లేదు. నువ్వు ఉండే చోట బోలెడు చెట్లు. అంతా పచ్చగా ఉంటుంది. చెట్లే కాదు, బోలెడు మంది స్నేహితులు కూడా!” ప్రసూన కళ్ళు తిప్పింది. ‘నేను ఉండే చోటా? ఎక్కడ?’  ”అదే అమ్మా… అంటే, ఫ్లాట్‌ చిన్నది కదా… సిటీలో అంతే కదా. మంచి హోం చూసాను నీకోసం. ఎంత తిరిగానో తెలుసా… మా అమ్మకి మంచి జాగా ఉండాలి ఈ వయసులో అని? ఇది ఊరి బయట, ప్రశాంతంగా ఉంటుంది. మేము ఎంత… కనీసం వారం, పదిరోజులకైన ఒకసారి వచ్చి చూస్తాం… నువ్వు హాయిగా ఉండచ్చు… మాకుమాత్రం ఇంకెవరు ఉన్నారు చెప్పు.’
సునీల్‌ మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రసూన చేతిలో గ్లాసు జారిపోయింది. చూపు బయటకి మళ్ళింది. రంపం పని పూర్తి అయింది. చెట్టు కూలింది. పచ్చగా చీర కట్టుకున్న ప్రకృతి మాత గుండె పట్టుకుని వాలిపోయినట్లు వేపచెట్టు మొదలంటా కూలింది. ఒక్క నిముషంలో అంతా నిశ్శబ్దం. సమర్ధవంతంగా పని పూర్తిచేసిన కూలీలు, పక్కకి వెళ్ళిపోయారు.ఎనభై ఏళ్ళజీవం ఆకుపచ్చని రక్తంగా కారిపోతోంది. చిరుగాలిలో కూలిన చెట్టు చిగుర్లు రెపరెపలాడుతున్నాయి. తెల్లని వేప పూత చురుకుగా కదులుతోంది. తన తల్లి పేగులు తెగి, నిర్జీవంగా కుప్పకూలిందన్న సందేశం ఇంకా ఆ చిగురుటాకులకి అందలేదేమో!

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

One Response to ఆకుపచ్చని రక్తం

  1. raani says:

    మంచి కథ.
    చెట్టుకీ మనిషికీ మధ్య గల అనుబంధం ఈనాటిది కాదు. ప్రసూనకీ చెట్టుకీ ఉన్న అనుబంధాన్ని వివరిస్తూనే పరాధీనమైపోతున్న వార్ధక్యాన్ని హ్రుద్యంగా చిత్రించారు.
    కథాంతంలో ప్రసూన చనిపోవలసిన అవసరం లేదు.
    కధాంతంలో ఏదో ఒక పరిష్కారాన్ని చూపించక పోతే పాఠకులు మనసు కష్టపెట్టుకుంటారేమో అనే అపోహ నించీ రచయిత్రి బయట పడితే…
    ఆవిడనించీ మరిన్ని మంచి కథలని ఆశించవచ్చు
    -రాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.