పుష్పాంజలి
కలలూ, కాలమూ ముందుకూ, మనిషి ఆలోచనలు వెనక్కూ మళ్లుతున్నాయి. తమ రక్తాన్ని మషీరంగా మార్చి స్త్రీల గుండెల కలతనూ, కలకలాన్ని వెళ్లగక్కే ధన్యజీవులు కొందరైతే, స్త్రీవాదాన్ని చూసి ఉలిక్కిపడేవాళ్లు అనేకమంది వాళ్ల ఆలోచనావిధానం సంకుచిత పరిధికి పరిమితం. స్త్రీవాదం అంటే అదేదో ఒక నీచ నికృష్ట అంశమని వాళ్ల ఉద్దేశ్యం. ఈ శతాబ్దం ఇటువంటి అనేకమంది మనుషుల్ని వెంట తీసుకెెళ్తూ ఉంది. ఈ తరుణంలో విశాఖపట్నం నుంచి శ్రీ మోదు రాజేశ్వరరావు గారు ”అసిపుత్రి” ”అది మృగాడు” లాంటి ఆవేశం, ఆలోచనా కలగలిపిన హెచ్చరికాపూర్వమైన వచన కవితలు వెలువరించడం ముదావహం.
”అది మృగాడు” పైపై మెరుగులకు భ్రమసి, జీన్స్‌పాంట్ల క్యూట్‌నెస్‌కూ సెల్‌ఫోన్ల గలగలకూ, బరువైన పర్సులకు, టూవీలర్స్ స్పీడుకూ మైమరచిపోయే అమాయకపు యువతులకు ఒక హెచ్చరిక. మృగవాంఛలకు బలైన ఎందరో యువతుల ఆత్మశాంతికి నివాళి. ఇందులో ప్రతికవితా ఒక తీవ్రమైన, బలమైన హెచ్చరికగా వినిపిస్తుంది.
”ఒక చేత్తో పూలగుత్తి, మరో చేత చురకత్తి
లేదంటే బైటికి తీస్తాడు నీ ఊపిరితిత్తి!” అంటూ రాబోయే ప్రమాదాన్ని సూచించారొక కవితలో.
”మొదట్లో నీ పలకరింపు / వాడికి పులకరింపు, నీ నంబరు మూడో నాలుగో అయితే నీ ఫోన్‌లే పాచికంపు” అంటూ మోసపు పలకరింపులకు దూరంగా ఉండ మన్నారు.
”ఇన్ని జరుగుతున్నా ఇంకా తెరవరా మీ కళ్లు / రోజుకొకరు బలైనా గానీ ఒదలదేమో మీ మత్తు!” అంటూ మన చుట్టూ జరుగుతున్న దురాగతాలు చూసి పాఠాలు నేర్చుకో మంటారు.
”వెర్రిచిలకల్లా” వేటగాళ్ల వలలో పడొద్దంటారు మరో కవితలో.
”వాడు జానకితో జగదంబ జంక్షన్లో ఆరణితో ఆర్.టీ.సీ. కాంప్లెక్సులో, కరుణతో కంబాల కొండలో, జూలీతో జులాజికల్ పార్క్‌లో…” అంటూ రోజుకొకరితో రొమాన్సు జరిపే జులాయీల గురించి హెచ్చరిస్తారు.
”పచ్చటి చిలకలన్నీ వాడి అంజనంలో చిక్కుకున్నాయ”న్న ఆవేదన వెడలగ్రక్కుతారు మరో కవితలో.
”ముందు ముద్దులే! తర్వాత హద్దులు చెరిపేద్దామనే” ప్రేమ మోసగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండమంటారు.
మరో కవితలో ”చదువుకోసం కాలేజీల్లో చేరి, కర్తవ్యం మరచిపోయి, సునామీ బారిన పడే” యువతులకు రాగల ప్రమాదం సూచిస్తారు.
”బండీ, బట్టలూ, సోకూ అరువు తెచ్చుకుని అమ్మాయిలను మోసం చేయడం తమ ధ్యేయంగా పెట్టుకున్న వారిని గుర్తించి, దూరంగా ఉండమంటారు.
”నీతో మాట్లాడుతూనే నీ ఫ్రెండ్ వంక వోరకంట చూస్తాడు. అప్పటికీ నువ్వు గ్రహించకపోతే నీ తర్వాతిస్థానం నీ ఫ్రెండ్‌దే” అంటూ అవినీతిరాయుళ్ల ప్రవర్తన ఆవేదనాపూర్వకంగా వెడలగ్రక్కుతారు.
అమ్మాయిలు ఎదుర్కొనే అనేక విధాలైన సమస్యలనూ, ఆపదలనూ ప్రతి కవితలోనూ సరళమైన భాషలో వివరించారు రచయిత. ”మెసేజీలతో మనసును మసాజ్ చేసే” మటాష్‌రాయుళ్లను గుర్తించమంటారు.
వీరి కవితలన్నీ అక్షరసత్యాలే. సరళమైన పలుకులతో కఠినంగా కాషన్ ఇచ్చే ప్రబోధ గీతాలే.
ఇంకా ”రూములకు పిలిచి కాకుచేసే దొంగాటగాళ్లూ, ఆత్మహత్యో, హత్యో చేయగలమని బెదిరించే, బ్లాక్‌మెయిలర్లూ, నువ్వులేందే బ్రతకలేనని గడ్డం పెంచే వేషధారులూ, ప్రేమను వేర్వేరు అమ్మాయిలతో షిఫ్ట్ డ్యూటీలా చేసే తిరుగుబోతులూ అవసరం తీర్చుకొని అమానుషంగా హత్యలు చేసే క్రూరులు, గిఫ్ట్‌లనీ సినిమాలనీ రంగులవల విసిరే దగాకోర్లూ, డ్రింకుల్లో మత్తుమందు కలిపి ”జంక్” పుట్టించే కేటుగాళ్లూ కోకొల్లలుగా ఉన్న ఈ ప్రపంచంలో ఎల్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పిస్తారు రచయిత.
అతి సరళంగా అరటిపండు వొలిచి నోట్లో పెట్టిన విధంగా ఇట్టే అర్థమయ్యే వచన కవితా సంపుటి ”అది మృగాడు”. ”అది మగాడి రూపంలో ఉండే మృగం” అని చెప్పడానికే ”అది మృగాడు” అన్న శీర్షిక పెట్టారనుకుంటాను. చివరి కవితలో ముందు చదువుకొని మంచి జీవితాన్ని ఏర్పరచుకోమనీ, తర్వాతే ఎంచుకొని ప్రేమించమనీ సందేశమిచ్చి ముగించారు.
మోసపు ప్రేమ వేటలో బలైపోతున్న చిన్నాపెద్దలకు సరైన సందేశమిచ్చి ముందుకు నడిపే వచన కవితా సంపుటి ఇది. అందరూ చదివి తీరాల్సిందే ననిపించే మంచి పుస్తకం.
( పుస్తకం వెల. రూ. 25., ప్రతులకు : సత్యమూర్తి ఛారిటబుల్ ట్రస్ట్)
సప్తగిరినగర్, చినముషిడివాడ మెయిన్‌రోడ్, విశాఖపట్నం 530051,
ఫోన్: 9391811226)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags