యం.సునీల్ కుమార్
(భూచట్టాలు, భూసంబంధిత అంశాలపై సమగ్ర సమాచారంతోపాటు మహిళలు-భూమి హక్కులు, వారికి చట్ట బద్దంగా కల్పించబడిన హక్కులపై సంపూర్ణ సమాచారంతో ఈ సరికొత్త కాలమ్ మొదలవుతోంది. యం. సునీల్ కుమార్ చాలా బిజీగా వుండే వ్యక్తి. భూమికి సంబంధించిన అంశాలను చర్చిస్తూ కాలమ్ రాయమని అడగానే అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు. – ఎడిటర్)
నింగిలో సగం నేలపై సగం మరి ఆ నేలలో సగంపై మహిళలకు హక్కులున్నాయా? తరతరాలుగా పేదలు భూమికోసం చేస్తున్న పోరాటాలలో మహిళల పాత్ర ఎంత? వారికి దక్కిన భూమెంత?? కుటుంబ ఆస్తిలో కూతురికి కూడా కొడుకుతోపాటు సమానహక్కు కల్పిస్తూ వచ్చిన చట్టం ఎంతమందికి ఆస్తిలో వాటానిచ్చింది?? అసలు ఆడవారికి భూమిపై హక్కులు ఎందుకు???? ఇలా ఎన్నో ప్రశ్నలు. మహిళల భూమి హక్కుల గురించి ఆచారం ఏం చెప్తుంది? సమాజమేమంటుంది? చట్టం ఏం నిర్దేశిస్తుంది??? మహిళల భూమి హక్కులు అనగానే అన్ని ప్రశ్నలే ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ భూమి చట్టాలు-మహిళల హక్కులపై సమాచారం అందించే ప్రయత్నమే ఈ శీర్షిక – ‘నేలకోసం న్యాయపోరాటం’.
భూమి నేటికి గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన జీవనాధారం. భూమి ఒక ఆదాయవనరు మాత్రమే కాదు భూమి ఉంటే ఒక భద్రత, అది ఒక బలాన్నిచ్చే ఆధారం, ధైర్యాన్నిచ్చే ఆదెరువు, కలలను సాకారం చేసే సాధనం. భూమి బ్రతుకు నిలబెడుతుంది. ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆడవారైనా మగవారైనా పేదలందరికి భూమే జీవితం. మహిళల ఆర్థిక స్వావలంబన భూమితో ముడిపడి ఉంది. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నా, వారిపై కుటుంబ హింస తగ్గాలన్నా వారు భూమి హక్కులు కలిగిఉండడం ఎంతో అవసరం. అంతేకాదు, నేడు మనదేశంలో 86 శాతం గ్రామీణ మహిళా కార్మికులు వ్యవసాయరంగంలో ఉన్నారు. అలాగే 20 శాతం గ్రామీణ కుటుంబాలకు మహిళలే పెద్దదిక్కు. ఈ మహిళలందరికి భూమిపై హక్కులు భద్రత గౌరవాన్ని ఇవ్వడమేకాక ఆహారోత్పత్తి పెరుగుదలకు కూడా దోహదం చేస్తుంది.
నేటికి మనరాష్ట్రంలో 14 శాతం గ్రామీణ కుటుంబాలకు వ్యవసాయభూమి కాని, సాగుభూమి కాని లేదు. 53 శాతం కుటుంబాలకు సాగుభూమి లేదు. మహిళల విషయానికి వస్తే చాలా కొద్దిశాతం మంది మాత్రమే భూమి హక్కులు కలిగి ఉన్నారని వివిధ అధ్యయనాలు చెప్తున్నాయి. మహిళలు భూమి పొందాలంటే కుటుంబ ఆస్తిలో వాటా అయినా రావాలి, ప్రభుత్వమైనా ఇవ్వాలి, స్వంతంగా కొనుగోలైనా చెయ్యాలి. హిందూ వారసత్వ చట్టం, 1956 మహిళలకు కుటుంబ ఆస్తిలో వాటా కల్పిస్తుంది. తద్వారా భూమిపై హక్కులు పొందే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారం 1986 సంవత్సరం వరకు కూతురికి తండ్రి సంపాదించిన ఆస్తిలోనే వాటా ఉండేది. అది కూడా తండ్రి తన ఆస్తిని విల్లు ద్వారా ఇతరులకు ఇవ్వకుండా చనిపోతేనే, కూతురికి ఆ ఆస్తిలో వాటా ఉంటుంది. కాని 1986లో మన రాష్ట్రంలో ఎన్‌టిఆర్ ప్రభుత్వం – హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేసి కూతురికి కొడుకుతో పాటు కుటుంబ ఉమ్మడి ఆస్తిలో సమానవాటా కల్పించింది. ఎన్.టి.ఆర్ చట్టంగా కూడా పిలవబడే ఈ చట్టసవరణ వలన మహిళలు కుటుంబ ఆస్తికి వారసులు కాగలిగారు. 2005 సంవత్సరంలో కేంద్రప్రభుత్వ హిందూ వారసత్వ చట్టానికి సవరణ చేసి మహిళలకు దేశవ్యాప్తంగా కుటుంబఆస్తిలో వాటా కల్పించింది.
మహిళలు భూమి హక్కులు పొందే మరో మార్గం ప్రభుత్వ భూముల కేటాయింపు. భూమిలేని నిరుపేదలు ప్రభుత్వం నుంచి భూమి పొందే అవకాశాన్ని చట్టం కల్పిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం పేదవారికి ఇచ్చే భూములన్నీ మహిళల పేరుమీదనే పట్టాలు ఇవ్వాలని 1984లో ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అంటే, 1984 నుంచి రాష్ట్రంలో భూమిలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన సాగుభూములు, ఇంటి స్థలాలకు మహిళలే పట్టాదారులై ఉండాలి. మరి ఈ 27 సంవత్సరాలలో ఎంతమంది మహిళలకు పట్టాలు వచ్చాయి? పట్టాలిచ్చిన భూములన్ని ఇంకా వారి చేతుల్లోనే ఉన్నాయా? పట్టాలిచ్చి భూములు చూపని కేసులెన్ని?
మహిళలు భూమి పొందే మరో మార్గం కొనుగోలు చేయడం. మహిళలు భూమి కొనుగోలు చేసినట్లయితే వారి పేరు మీద పట్టా పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు భూములు కానిచ్చే ప్రయత్నాలు మన రాష్ట్రంలో జరుగుతున్న ఇందిరా క్రాంతి పథం ద్వారా ఐదువేలమంది పేద మహిళలకు అర ఎకరం నుంచి ఎకరం భూమి కొనుగోలు చేసి ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి కార్పొరేషన్‌ల ద్వారా కూడా భూమి కొనుగోలు చేసి ఇస్తున్నారు. ఐఎన్‌ఆర్ పథకం కింద ఇంటి స్థలాలు కొని ఇవ్వడానికి ఈ సంవత్సరం నుంచి కేంద్రప్రభుత్వం మొదటిసారిగా నిధులు కేటాయించింది. మహిళలకు ఆర్థిక చేయూత అందిస్తేకాని భూములు కొనుగోలు చేసే స్థితిలో లేరు.
ఆడవారికైనా, మగవారికైనా చేతిలో పట్టా, స్వాధీనంలో భూమి, రికార్డుల్లో పేరు ఉంటేనే భూమిపై పూర్తి హక్కు ఉన్నట్లు. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా భూమి హక్కులు సమస్యల్లో చిక్కుకున్నట్లే. మహిళలకు ఈ సమస్యల చిక్కుముడులు ఎక్కువగా ఉంటాయి. భూమి సమస్యలు పరిష్కరించుకోవడానికి మహిళలు మగవారికంటే రెట్టింపు శ్రమించవలసి వస్తుంది. మనరాష్ట్రంలోని మహిళలు భూమి సమస్యల పరిష్కారానికి సంఘటితంగా చేస్తున్న కృషి ప్రశంసనీయం. భూమి సమస్యల పరిష్కారం ద్వారా లక్షల ఎకరాల భూములు పేదల, మహిళల చేతిలోకి వస్తుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags