హవ్వ! జండర్‌ ఈక్విటీలో మనది అట్టడుగు స్థానం

మార్చి నెల అనగానే గుర్తొచ్చేది మహిళాదినం. అంతర్జాతీయ మహిళా దినం మొదలై వందేళ్ళు గడిచిపోయాయి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మహిళాదినాన్ని శ్రామిక మహిళా పోరాట దినంగా జరుపుకుంటూనే వున్నాం. ఈ రోజును ఒక ఉత్సవంలాగా, ఒక పండుగలాగా జరపడానికి మార్కెట్‌ శక్తులు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఒక విమాన సంస్థ మార్చి ఎనిమిదిన మహిళలకు టిక్కెట్లలో రాయితీలిస్తుంది. మరో కాస్మెటిక్‌ కంపెనీ తమ వస్తువుల్ని మరింతగా ప్రచారం చేసుకోవడానికి మార్చి ఎనిమిది వాడుకుంటుంది. ప్రభుత్వం కూడా తానేమీ తీసిపోలేదని నిరూపించుకుంటూ కొన్ని మొక్కుబడి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మార్చి ఎనిమిది ఒక పోరాట దినంగా మొదలై, పోరాటం పూర్తి కాకుండానే, ఆశించినమార్పు సమాజంలో రాకుండానే ఒక ఉత్సవదినంగా మారిపోవడం అత్యంత విషాదకరం.
విషాదమని ఎందుకంటున్నానంటే గతవారం ముంబయ్‌లో జరిగిన నిధిగుప్తా ఆత్మహత్య విషయమే తీసుకుంటే మన సమాజం ఏ స్థాయిలో వుందో అర్ధమౌతుంది. నిధి బాగా చదువుకుని, చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లల తల్లి. పిల్లల్ని స్కూల్‌కి పంపడానికి తయారు చేసి, వాళ్ళని స్కూల్‌కి పంపకుండా 18 అంతస్థులు పైకి వెళ్ళి పిల్లల స్కూల్‌ బ్యాగులు పక్కనే పెట్టి, ఒకరి తర్వాత ఇంకొకరిని కిందికి విసిరేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకుంది. ముంబయ్‌ని దిగ్భ్రమకి గురి చేసిన సంఘటన ఇది. బాగా చదువుకున్న, సంపాదిస్తున్న  మహిళలు కూడా ఎందుకింత బేలలవుతున్నారు? అంత ఘోరమైన చర్యకి పాల్పడడం వెనుకవున్న సంఘటనలేమిటి? చదువు, సంపాదన కూడా ఆమెకి ఎందుకు గుండె నిబ్బరాన్నివ్వలేకపోయాయి?
నిధిని ఆత్మహత్య వేపు ప్రేరేపించిన అంశాలేమిటనేవి ఎప్పటికీ బయటకు రావు. ఆ ఇంటి నాలుగు గోడల మధ్య ఏం జరిగివుంటుంది.అనేది ఎప్పటికీ బయటకు రాదు. మానసికంగా ఎంత గాయపడితే అంత దారుణానికి ఒడిగట్టి వుంటుంది? ఆమె నివసిస్తున్న ఉమ్మడి కుటుంబం ఆమెకు ఎందుకు ధైర్యాన్ని ఇవ్వలేక పోయింది? ఇంట్లో ఎదురయ్యే హింస నుండి బయటపడటానికి ఈ రోజు గృహహింస చట్టముంది? కుటుంబ హింస నేరమని, ఆ హింస నుండి తప్పించుకోడానికి చట్టసహాయం తీసుకోవచ్చని చదువుకున్న నిధిగుప్తాకి తెలియదనుకోవాలా? లేక చట్టం మీదే నమ్మకం లేదనుకోవాలా? నిధి గుప్తా ఆత్మహత్య అనేక ప్రశ్నల్ని రేపుతోంది. స్త్రీలకు రక్షణ  స్థలాలుగా  కీర్తించబడే ఇంటినాలుగు గోడలు ఎలాంటి హింసను స్త్రీల మీద అమలుచేస్తున్నాయో, ఆ హింస నుండి బయటపడలేక ఆత్మహత్యలే శరణ్యమని చదువుకున్న స్త్రీలు కూడా అనుకుంటున్నారని నిధి ఆత్మహత్య నిరూపించింది.
నిజానికి భారతదేశం స్త్రీల రక్షణ కోసం ఎన్నో మంచి చట్టాలను చేసింది. సహాయ సంస్థలను నెలకొల్పింది. భారత రాజ్యాంగం సర్వహక్కుల్ని పురుషులతో సమానంగా ప్రసాదించింది. అయితే ఆచరణలోని వైఫల్యాలు, మహిళలకు భరోసా ఇవ్వడంలో దారుణంగా విఫలమవ్వడంవల్లనే, ఈ రోజు,  స్త్రీల మీద హింస ప్రతి సంవత్సరం పెరుగుతోంది. చట్టం దారి చట్టానిదే, హింసదారి హింసదే అన్నట్టుగా వుంది పరిస్థితి. దీనికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య ఆధ్యయఫలితాలు, ఆ రిపోర్ట్‌ ప్రకారం 50% స్త్రీలు ఇంట్లో హింసకు గురవ్వడం, గాయపడడం, మరణం కూడా సంభవించడం జరుగుతోంది. కుటుంబ హింస వల్ల స్త్రీలు రకరకాల అనారోగ్యాలకు గురవుతున్నారని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది.
అలాగే నేషనల్‌ క్రౖెెమ్‌ రిసెర్చి బ్యూరో ప్రకారం 2008-2009 మధ్యకాలంలో భర్తల వల్ల హింసకు క్రూరమైన దాడులకు గురైన  భార్యల శాతం 10% పెరిగిందట. దీనిని బట్టి చూసినపుడు స్త్రీలు ఎక్కువగా తమ కుటుంబ సభ్యుల వల్లనే, ముఖ్యంగా భర్తల  వల్లనే హింసలకు గురవుతున్నారు. అదీ గృహహింస నుండి మహిళలకు రక్షణ కల్పించే చట్టం అమలులో వున్న చోట. పురుషులు చట్ట భయం లేకుండా నిర్లజ్జగా, నిర్భయంగా హింసకి పాల్పడుతున్నారని అర్థమవుతోంది. దీనికి కారణమేంటి? భారతీయ పురుషుల దృక్పథం ఇంత ఇరుకుగా ఎందుకుంది? శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, బయట ప్రపంచాల్లో విజయకేతనాలు ఎగరేసే మగవాళ్ళు ఇంటి నాలుగ్గోడల మధ్య  ఎందుకింత క్రూరంగా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు? భారతీయ పురుషులు ఎంత జెండర్‌ ఇన్సెన్సివిటీతో వున్నారో, జెండర్‌ సమానత్వం పట్ల ఎంత బండతనంతో, మొరటుగా వున్నారో తెలిపే అంతర్జాతీయ అధ్యయన ఫలితాలు బయటపెట్టాయి.
ఇంటర్‌నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ రిసెర్చి ఆన్‌ విమెన్‌  నిర్వహించిన    ఇంటర్‌నేషనల్‌ మెన్‌ అండ్‌ జెండర్‌ ఈక్వాలిటీ సర్వే  ప్రకారం (వీటిని ఇంగ్లీషులోనే ఎందుకు రాస్తున్నానంటే ఎవరైనా ఈ సర్వే ఫలితాలను ఇంటర్‌నెట్‌లో చూడొచ్చు.  నేనెదో అతిశయంతో రాస్తున్నాననే అనుమానం మనవాళ్ళకు వెంటనే వచ్చేస్తుంది) భారతీయ పురుషులు జండర్‌ సమానత్వం విషయంలో ఎంత ఘోరంగా వెనకబడి వున్నారో అర్ధమౌతుంది. అభివృద్ధి  చెందుతున్న ఆరు దేశాలలో 18-59 వయస్సులో వున్న 8000 మంది పురుషుల్ని, 3500 మంది స్త్రీలల్లో ఈ సర్వే నిర్వహించారు. బ్రెజిల్‌, చిలి, క్రోషియా, ఇండియా, మెక్సికో, రువాండా దేశాల్లో ఈ సర్వే జరిగింది.
68% భారతీయ పురుషుల అభిప్రాయం ప్రకారం స్త్రీలు గృహహింసని భరించాలి. కుటుంబాన్ని నిలిపి ఉంచాలంటే స్త్రీలు ఈ హింసని సహించాలి అని చెబితే 65% మంది స్త్రీలను కొట్టాల్సిందే. కొన్ని సమయాల్లో కొట్టడం అవసరం అని చెప్పారు. అంతేకాదు గర్భం రాకుండా జాగ్రత్త పడ్డం స్త్రీల బాధ్యత. కండోమ్‌ వాడమంటే మాత్రం కొడతాం అని కొందరు చెప్పారు. మిగతా దేశాల్లో 87-90% శాతం పురుషులు ఇంటిపనుల్లో భాగస్వాములవుతామని, జండర్‌ సమానత్వం పాటించడానికి ప్రయత్నిస్తామని చెబితే కేవలం 16% మంది భారతీయ పురుషులు ఇంటిపనిలో పాలు పంచుకుంటామని చెప్పారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగామి దృక్పధంతో వుండే భారతీయ పురుషులు జండర్‌ సమానత్వ అంశంలో (జెండర్‌ ఈక్విటీ) అట్టడుగు స్థాయిలో వున్నారు.  కుటుంబ హింస ప్రమాదకర స్థాయికి చేరడం, నిధిగుప్తా లాంటి చదువుకున్న,సంపాదిస్తున్న మహిళలు కూడా ఆత్మహత్యలకి పాల్పడడం వెనుక భారతీయ పురుషుల తిరోగామి దృక్పథాలే కారణం. మహిళల మానవ హక్కుల పట్ల, జండర్‌ సమానత్వం పట్ల వీరిలో వున్న ఇన్‌సెన్సిటివ్‌ దృక్పథం మారనిదే మార్పు సాధ్యం కాదు. ఆధునిక యుగంలో బతుకుతూ ఇంత అమానవీయ, అవమానకరమైన పద్ధతుల్లో ఇంటా బయటా హింసకు పాల్పడుతున్న పురుషులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భమిది.  తమ లోపలి చీకటి ప్రపంచాల్లోకి వెలుతురు కిరణాలు ప్రసరించుకోవాల్సిన సందర్భమిది. హింసని విడనాడకపోతే అంతర్జాతీయంగా పరువు పోయేది పురుషులదే.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

4 Responses to హవ్వ! జండర్‌ ఈక్విటీలో మనది అట్టడుగు స్థానం

  1. టెక్నాలజీ విషయంలో ఆధునికతని అంగీకరిస్తారు కానీ ఆడ-మగ సంబంధాల విషయంలో ఆధునికతని మగవాళ్లు ఒప్పుకోరు.

  2. sunnyhithudu says:

    అది మగ వాల్ల తప్పు కాదు….

  3. raani says:

    సామాన్యంగా సంపాదకీయాలు రాస్తున్నప్పుడు, తమ తమ అభిప్రాయాల గురించి పాఠకుల్ని బలంగా ఆలోచింపజేయడంకోసం లెక్కల్ని ఆశ్రయిస్తారు. లెక్కలైతే చదువరులని వెంటనే ఆకట్టుకుంటాయి. కొన్ని సందర్భాలలో భయపెడతాయి కూడా. అందుకే లెక్కలు చెప్పేముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
    మీరు ఉటంకించిన ఇంటర్నేషనల్ మెన్ అండ్ జెండర్ ఈక్వాలిటీ సర్వే చేసిన సంస్థవారు
    8000మంది మగవారినీ 3500 మంది ఆడవారినీ ప్రశ్నించి ఇచ్చిన నివేదిక అది. కనీసం ప్రశ్నించే వ్యక్తుల సంఖ్య విషయంలో కూడా సమానత్వం పాటించలేని సంస్థ ఇచ్చిన నివేదికని ఉదాహరణగా తీసుకుని పాఠకుల్ని ఎలా ఒప్పించగలమని మీరు భావించారో నాకు అర్ధం కాలేదు.
    ఇందులో రెండు సూక్ష్మాలున్నాయి.
    ఒకటి, ఆ సంస్థ నివేదిక ప్రకారం వెలువడిన ఫలితాలకి ఏవో పూర్వ నిర్దేశిత ప్రయోజనాలుండి వుంటాయి.
    రెండు : అలా కాకపోతే, స్త్రీల పట్ల ఆ సంస్థకి మీరనుకున్నంతటి నిబద్ధత లేకపోయి వుండవచ్చు. ఒకవేళ నిబద్ధతే ఉన్న పక్షంలో స్త్రీ పురుషుల సంఖ్య సమానంగా వుండేది. అప్పుడు సంఖ్యల్లో తేడాలొచ్చి ఉండేవి.
    భారత దేశానికి సంబంధించినంతవరకూ పెళ్ళయిన స్త్రీలలో అత్యధిక శాతం ఉద్యోగస్థురాళ్ళు కాదు. కాబట్టీ పురుషులకి ఇంటి పనుల విషయంలో సహాయంచేసే అవకాశం వుండదు.
    ఇది మగవాళ్ళు చెప్పే సాకు మాత్రమే.
    అసలు నిజం ఏమిటంటే అలా సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం కల్పించేలా చెయ్యడంలోనే వుంది, అసలయిన కుట్ర. ఇది నిన్నమొన్నటి కుట్ర కాదు. దీనికి వేల సంవత్సరాల చరిత్ర వుంది. కళ కళ లాడేలా కళలలో చుట్టి కళ తప్పేలా చెయ్యడం తద్వారా స్త్రీ స్వయంగా బానిసత్వంలోనే స్వాతంత్ర్యాన్ని వెతుక్కునేలా చెయ్యడం మన భారతీయ కళా స్రష్టలకి మాత్రమే చెల్లుతుంది.
    అలా చెల్లుబాటయ్యేలా చెయ్యడానికి మన పుంభావసరస్వతులు అనుసరించిన కుహకాలని ఎండగట్టే శీర్షికలని ప్రచురించవలసిందిగా కోరుతూ…
    – రాణి

  4. sivalakshmi says:

    శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైనా మన పురుషులు ఆధునికత ను అంగీకరిస్తున్నారా అన్నది అనుమానమే!
    డాక్టర్లూ,ఇంజనీర్లూ,సైన్స్ ప్రపంచం లోనే రోజంతా గడిపేసే శ్రీహరి కోట షార్ సైంటిస్టు లతో సహా కొబ్బరి కాయలు కొట్టి ,పూజలు చేసి రాకెట్లను వదుల్తున్నారు. సైన్స్ కీ జీవితానికీ ఉన్న కార్య కారణ సంబంధాన్ని విశ్లేషించుకోకుండా – సైన్స్ వేరు, జీవితం వేరు అనుకోవడంమే దీనిక్కారణం.
    సమాజం లో శాస్త్రీయ దృక్పధం అలవడితేనే మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఎంత అమానవీయం గా ప్రవర్తిస్తున్నారో అర్ధమౌతుంది.మహిళలు కూడా “ఇది మామూలే”నని సరిపెట్టుకోవడం మాని ప్రశ్నిస్తారు.
    రాణి గారు చెప్పినట్లు పురుషులతో సమానంగా 8000 మంది స్త్రీలను ప్రశ్నిస్తే ఇంకా నిజాలు తెలిసేవి!అసలు ఏ సర్వే సంస్థ అయినా స్త్రీ-పురుషుల సమానత్వ భావన ఆచరణ లోఎలాగూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.
    “నాదీ సమాన బాధ్యతే”అని సిన్సియర్ గా ఇంటి పని లో పాలు పంచుకునే వారికి చేతులెత్తి దణ్ణం పెడదాం ! కానీ కొద్దో గొప్పో అప్పుడప్పుడూ సహాయం చేసే వాళ్ళు కూడా “నీ పనిని నేను చేశాను” అని ఫోజులు కొట్టే పురుష పుంగవులు కూడా ఉన్నారు !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.