– ఎస్. జయ
ఆమెకు శిల్పకళలు, శిఖరాలు, లోయలు, పచ్చిక మైదానాలు అంటే పరవశం. కవిత్వం అంటే పరవశం. ఆకాశమల్లెల్ని పిల్లన గ్రోవిని చేసి, అక్షరాలతో అడుకుంటుంది. కాసేపు బాల్య స్మృతులతో ఆనంద డోలికల్లో వూపుతుందా అంతలోనే, యాభైలోపడి, మెనోపాజ్తో, పరుగుల జీవితం విరామం పొంది ఏకాకితనంలో వేదనాభరిత అనుభూతులు మన గొంతు నరాల్ని సాగదీస్తాయి. ఎంతైనా శిఖరం మీంచి లోయలోకి తోసేసినట్టు ఒక భయంకంపిత విషాదం మనసులో గూడుకట్టుకుంటుంది. విచిత్రమేమిటంటే నిరాశ, నిస్పృహ కలిగించదు. ‘ఆకాశమల్లె’ ఒక ఆలోచనై మనల్ని వెన్నాడుతుంది.
ఆమె మనసు నిండా కవిత్వం. పూర్తయిన పద్యాలే కాదు పూర్తికాని కవితా వాక్యాలు, కొన్ని అక్షరాల పరిమళాల్లో ఆమె బతుకు వేదనను మరిచిపోతుంది. మనసుకయిన గాయాల్ని కనబడకుండా ముసుగులు కప్పినా అది తాత్కాలికమే, ఎప్పటికైనా ముసుగులు తీయాల్సిందే అంటుంది ఆమె. అంతేగాదు బాధాతప్త హృదయాన్ని లోలోపలి తలపుల చాటున దాగిన పద్య సుగంధాలతో సేదతీర్చడమంటేనే ఆమెకు ఇష్టం. అయితే హిమజ తన వేదనను మాత్రమే కవిత్వం చేయలేదు. చుట్టూ వున్న వారి వేదనలను తన వేదనగా మార్చుకుంది. స్త్రీల అస్తిత్వం వేదనను మరీ ముఖ్యంగా నడిమి వయసు స్త్రీ అస్తిత్వ వేదనను కవిత్వం చేసింది. బాల్యంలో ఆకాశ మల్లెల్లాంటి స్నేహితు లుంటారు, వయసులో ప్రేమతో దేహాన్ని, మనసును మరిపించే స్నేహితుడూ వుంటాడు, అతనితో పాటు ఊపిరి సలపని మరెన్నో బరువుల, బాధ్యతలు వుంటాయి. అను కోకుండా స్త్రీ జీవితంలోకి ఒక్కసారిగా ”విరామం” తొంగిచూస్తుంది. దేహానికి కాదు బాధ్యతల నుంచి, బరువుల నుంచి, ఊపిరాడని పనుల నుంచి ఏదో శూన్యం లోంచి వూడిపడినట్టు కనిపించే విరామం. మనసును చెదలా తొలుస్తుంది ఈ విరామం. విరామాన్ని మించిన అశాంతి వుండదు జీవితంలో ఎవరికైనా.
ఎదురుచూడని విరామం ముంగిట్లో వాలితే… అపుడు తనలోకి తను చూసుకో బోతే… ఏముంది. ఒంటరితనం. నిస్సహాయత లోంచి ”వడలిన దేహపు మనోగతం” స్వగతంగా పలవరించింది. ఈమె కవిత్వం నిండా.
ఆకాశ మల్లెలు ఏరుకొని పిల్లనగ్రోవి నూదిన ఆనందం ఒకవైపు ”ప్రేమ” అంటే దేహమా? మనసా? సందేహం మరోవైపు ఆమెను వుక్కిరిబిక్కిరి చేశాయి. అయితే అది చాలా తక్కువ కవితల్లోనే వ్యక్తమయింది. కొన్ని కవితలు చదివితే ఇంత విషాదమా నడిమి వయసులోని స్త్రీ జీవితం అనిపిస్తుంది. ఈ విషాదం వయసుదా? మనసుదా? మనసుంటే మార్గాలెన్నో. ఇది చాలా మంది సమస్య అని అర్థమయింది. మార్గాన్వేషణ కూడా హిమజ చెప్పాలి ముందు ముందు. చెప్పగలుగుతుంది ఆమె అందుకు భరోసా ఈ కవితల్లో ప్రతిఫలిస్తోంది.
”వారిది అన్యోన్య దాంపత్యం” అంటూ ప్రారంభమైన ”ఆమె కథ” కవిత హిపోక్రసీ చాటున దాగిన వేదనను ప్రస్పుటం చేస్తుంది.
”పాత్ర” కవితలో
”వేకువ నుంచి
రాతిరి వరకు – పోషించిన
అన్ని రకాల పాత్రలకు
సంపూర్ణ న్యాయం చేసి
ఏకాంతాన- నాపాత్రకు నేనే
చేసుకుంటున్న అన్యాయాన్ని తలచి, వగచి…
నా కలల కన్నీటి కూజాను వంచి
తాగుతాను ప్రేమ దాహార్తినై
తాగిన ప్రతి కన్నీటి చుక్కా
మండుటెండ మనసుపై బడి
ఇంకిపోయి…
ఇరిగిపోయి… ఆవిరై…
ఫెటిల్మని… ఇలా..నాలా…” అంటుంది.
ఆమె వ్యక్తీకరించిన నిరాశను చూసి కాసేపు నిశ్శబ్దం అవుతాం.
మళ్లీ తానే మరో కవిత ”మాస్క్”లో ఇలా రాస్తుంది.
”వేదనా వృత్తంలో ముల్లులా
ఊగిసలాడే కంటే
స్థైర్యమే ఇప్పుడు కావాల్సింది.”
ధైర్యంలో నిబ్బరంగా నిలబడే
* * *
అయితే ఒక మినహాయింపు.
ఆమె తన వేదన నుంచి వుపశమనం పొందడానాకి కవిత్వాన్ని ఆశ్రయిస్తానని చెప్పకుంది.
అద్భుతమైన కవితలు ”ఆలంబన”, ”భావన”, రాయని నాడు…” రాసింది.
”ఆలంబన” కవితలో
”అక్షరాల్ని ఆలంబనగా అల్లుకున్నాకే
అస్తిత్వం వ్యక్తిత్వమై వెలిగింది
ఎన్ని వెతలను మరిపించిందీ అక్షరం
మరెన్ని మమతల్ని
మరలా తెచ్చి ఇచ్చిందీ అక్షరం
…..
పసితనంలో అమ్మ వూపిన ఊయల
ఇపుడు గురుతు లేకుంటేనేం
ఆలోచన ఆవిష్కృతమవగానే
నన్ను ఆనందపుటూయల లూపే
అక్షరమా!
నువ్వు నా తోడున్నంత కాలమూ
నేను అక్షయాన్నే!”
పుస్తకం వివరాలు:-
‘ఆకాశమల్లె’- రచన హిమజ
వెల. రూ. 50
లయ ప్రచురణలు
అన్ని బుక్ సెంటర్లలో లభ్యం.