గల్ఫ్‌ బుచ్చమ్మ

హేమ
ఒక ముని మాపు వేళ కల్లోల సముద్రాలకావల బ్రతుకు తెరువు కోసం కంటిపాపదాయని కన్నీటిని చీర చెంగుకు ఒత్తుకుంటూ పిల్లల్ని గుండెలకు హత్తుకొని కడసారి వీడ్కొలు చెబుతుంది ‘ఆమె’. కొంగు ముడివేసుకొని గంపెడు ఆశలతో సహచర్యం కోరుకొని అత్తారింటికి అడుగు పెట్టిన ఆరునెలలకే అప్పుల బాధ తాళలేకో, ఆడబిడ్డ పెళ్ళికో, చారెడు అరక స్వంతం చేసుకోవడానికో, మరిన్ని అప్పులు చేసి వలస వెళ్ళిపోయే మగని నిశ్శబ్ద నిష్క్రమణకు సాక్షిగా నిలిచిపోతుంది ‘ఆమె’. ఆమె ఎవరో కాదు. తమ వారి భవిష్యత్తు కోసం రెక్కలల్లారుస్తూ గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్ళే స్త్రీమూర్తి ఒకరైతే, బీడు భూములపైన కలల విత్తనాలు చల్లుకుంటూ ఆశల లోగిలిలో అతని కోసం ఎదురు చూసే గల్ఫ్‌ వలస కార్మికునికి భార్య/ తల్లి ‘ఆమె’.
గురజాడ అప్పారావు రచించిన ‘కన్యాశుల్కం’ లోని బుచ్చమ్మ పాత్రలాంటిదే ఈమె బ్రతుకు చిత్రం. గిరీశం మాటల్లో చెప్పాలంటే ‘ఓ పూర్‌ విమెన్‌’. కాలం మారినా విజ్ఞానం వికసించినా అణిచివేత, దోపిడి రూపాలు మాత్రం మారాయనటానికి ఈమె సజీవ సాక్షి. గిరీశంలాంటి వాళ్ళు ఎందరో ఆశలు కల్పించి జీవితాలతో ఆడుకుంటారు. ప్రపంచీకరణ నేపధ్యంలో ‘ఆమె’ శరీరం ఒక సరుకు మాత్రమే కాదు డబ్బు సంపాదించే ఒక యంత్రంగా కూడా మారింది. గడపదాటటమే కష్టమయిన పితృస్వామ్య సమాజంలో సంద్రాన్కి ఆవల భిన్నమైన సమాజంలోకి ఆమె విసిరివేయబడింది. అక్కడ ఆహారం వేరు. అలావాట్లు వేరు. కట్టుబాట్లు వేరు. భాషరాదు. బాధొస్తే పంచుకునే నేస్తముండదు. భారమైన పనితోపాటు యజమానుల హింసా దౌర్జన్యాలను పంటిబిగువున భరించాలి. ఒక్కోసారి వేశ్యవృత్తిలోకి నెట్టి వేయబడుతుంది. ఒంటరి కొవ్వొత్తిలా కరిగిపోయే ‘ఆమె’ తన కుటుంబానికి, దేశానికి సంపదను చేకూర్చే అంతర్జాతీయ వలస కార్మికులు.
ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు లెక్కల ప్రకారం సుమారు 5 మిలియన్ల మంది వలస కార్మికులైతే అందులో 14.6% మహిళా కార్మికులు ఉన్నారు. మొత్తం 7,37,300 మందిలో 3,68,650 మంది యింటి పని కార్మికులైతే మిగతావారు నర్సులు మరియు కొంత నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులే. వీరి వలన 52 మిలియన్‌ డాలర్లు దేశానికి విదేశీ మారకద్రవ్యం అందుతుందని అంచనా. పాస్‌పోర్టు చట్టం 1967 ప్రకారం యజమాని నుంచి ఖచ్చితమైన విధి విధానాలతో క్లియరెన్సు వుండాలి. 2002 జూలైలో 30 సంవత్సరాల కంటె తక్కువ వయస్సున్న స్త్రీలను గల్ఫ్‌ దేశాలకు పనికి వలస వెళ్ళకూడదని నిబంధనలు పెట్టారు. అయినా ఏజెంట్లు, బ్రోకర్లు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు  కుమ్మక్కై వేలాదిమంది యువతుల్ని నిబంధనలకు వ్యతిరేకంగా పంపుతున్నారు. 2007 వ సంవత్సరంలో భారత ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే మహిళా యింటిపని కార్మికులకు కనీస  వేతనం 400 డాలర్లు ఉండాలని, 2500 డాలర్లు డిపాజిట్‌ చెయ్యాలని ప్రతిపాదించినా, కార్మిక సంక్షేమం పట్టించుకునే దేశాలకు మాత్రమే వీసా మంజూరు చేస్తామని ప్రకటించినా అవి పేపర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. కేవలం రూ. 4000 నుంచి 7000 వరకే వీరి వేతనం పరిమితమవుతుంది. వీరికి ఏ దేశీయ, అంతర్జాతీయ చట్టాలు న్యాయాన్ని, రక్షణను యివ్వలేకపోతున్నాయి.
వలస పోయిన స్త్రీకి జీవితం ఒంటరితనపు ఎడారిగా మిగిలితే, సజీవ జ్ఞాపకాలతో సహచరుని జాడలు వెతుక్కునే వలస కార్మికుని సహచరి జీవితం అంతకంటే దుర్లభం. భర్త చేసిన అప్పులకు బందీ అయ్యి వడ్డీ వ్యాపారస్థులు, వారి ఏజెంట్ల అఘాయిత్యాలకు బలవుతుంది, అప్పటివరకు కాస్తో కూస్తో చేదోడు వాదోడుగా వున్న భర్త భారాన్ని కూడా మోయాల్సి వస్తుంది. తెలంగాణ జిల్లాలకు చెందిన మస్తానమ్మ మాటల్లో చెప్పాలంటే ‘మొగుడు మొద్దులు లేని నీకు షోకులేంటి’ అని ఆమె కట్టుబొట్టుపై కూడా పరోక్ష నియంత్రణ వుండనే వుంటుంది. తొలకరి జల్లై పలకరిస్తాడని పలవరించే ఆమెలాంటి ఎందరికో స్వప్న సంద్రంలో సూర్యాస్తమయమైనట్టు సహచరుడు శవమై వచ్చిన సందర్భాలెన్నో!
అన్ని మానవ హక్కులు హరించబడుతున్న ఈ ఎడారి పూలు వెలుగు రేఖలను వెదుక్కుంటూ యిప్పుడిప్పుడే సంఘటితమవుతున్నారు. మరికొందరు ఆ పరిస్థితుల నుండి తప్పించుకొని స్వదేశానికి చేరుకొని కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు. కేరళలోని కులశేఖర పత్తి గ్రామానికి చెందిన మహిళ వేసిన పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జె. చలమేశ్వర్‌ మరియు పి. ఆర్‌ రామచంద్రాన్‌, షార్జాలో జరిగిన సెక్స్‌ రాకెట్‌ గురించి విచారించి రిపోర్టు చెయ్యమని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తే అనేక వాస్తవాలు వెలుగు చూసాయి. ఈ సంఘటన దేశంలోని గల్ఫ్‌ బాధితులకు పోరాటస్ఫూర్తిని యిచ్చింది. అలాగే యిప్పటివరకు అసంఘటితంగా వున్న గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఒక్కటవ్వడానికి తెలంగాణ జిలాల్లలో కదులుతున్నారు. ఇంతకీ ఈ స్త్రీ మూర్తులు సంఘాల డిమాండ్లు వారు మాట్లాడిన అంశాలు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను.
కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌ దేశాలతో వలస కార్మికుల పని కుదుర్చుకునే ఒప్పందాలలో వారి పనిగంటలు, సంఘాలు ఏర్పాటు చేసుకొనే హక్కు, వారి డబ్బు సరియైన బ్యాంకు ద్వారా స్వదేశానికి చేరవేసే ఏర్పాటు, సెలవులు, తమ వారితో సంభాషించడానికి ఫోన్‌ ఏర్పాటు , ఇతర పని విధానాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఏజెంట్లు బ్రోకర్ల అవినీతి, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దేశాన్ని వదిలిపెట్టే ముందు పని సంబంధిత శిక్షణ యివ్వాలని, స్త్రీ మహిళా ఇమ్మిగ్రేషన్‌ అధికారులను నియమించాలని డిమాండు చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కేంద్రం అమలు చేసే జీవిత భీమా పథకాన్ని తమకు వర్తింపచేయాలని ప్రతిపాదిస్తున్నారు.  ఈ పథకం ప్రకారం మొదటి సంవత్సరంలో రూ. 62 ఆ తర్వాత సంవత్సరాలలో రూ. 12 కడితే ఆ కుటుంబ యజమాని గల్ఫ్‌లో ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు, ప్రమాదం జరిగితే రూ. 32 వేలు, రెండు ప్రసవాలకు రూ. 5000 మంజూరవుతాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గల్ఫ్‌లో చనిపోయినవారి చావులకు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి కుటుంబాలను ఆదుకోవాలని ఉద్యమిస్తున్నారు.
ఈ కాలమ్‌ ముగించే సమయానికి గల్ఫ్‌ డైలీ న్యూస్‌ వార్త ఏమిటంటే 70 ఏళ్ళ యజమాని హింస భరించలేని 22 ఏళ్ళ ఇధియోపియన్‌ స్త్రీ ఆ పురుషుని మర్మాంగాలు కోసి వేసిందని.. ఆమె ఆవేదనని అర్ధం చేసుకున్న మానవ హక్కుల కార్యకర్తలు అక్కడ దోపిడి, దౌర్జన్యాలపై ఎలుగెత్తి చాటుతున్నారు. మరి మనం కూడా ‘ఆమె ‘ పోరాటానికి మద్దతు తెలిపే సమయమాసన్నమైంది. అయినా ‘పుట్టిన గడ్డ మీద బుక్కెడు బువ్వ దొరికితే నా బిడ్డకు యిన్ని కడగండ్లు రావు కదా”! అన్న ఆ తల్లి ప్రశ్నకు జవాబు దొరికెదెప్పుడో! విషాద, నిశ్శబ్ద శిధిల జ్ఞాపకాల్ని కౌగిలించుకొని కనుమూసిన ‘ఆమె’కు తొలి వెలుగుల సూర్యోదయమెప్పుడో కదా!!!

Share
This entry was posted in ఆమె @ సమానత్వం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.