సూర్యాస్తమయం

కన్నడం : కళ్యాణమ్మ
తెలుగు : డా|| దేవరాజు మహారాజు

‘రాజా మాన్‌సింగ్‌ నీకిక తిరుగులేదు. నీ వీరోచిత కార్యక్రమాలు ఇటు కాబూల్‌ నుండి అటు బంగాళాఖాతం దాకా చర్చనీయాంశాలయ్యాయి. ఇక నీకు ఎదురే లేదు. మొగల్‌ సామ్రాజ్యానికి మూలస్థంభానివి. నీ యశస్సు దేశం నలుమూలలా పాకిపోయింది. అదీ గాక, జనం నిన్ను తలెత్తి చూడలేకపోతున్నారు. ఢిల్లీ పాదుషాయే నీ చెల్లెలు జోదాబాయితో పాణిగ్రహణం చేశాడు. అంటే ఇక నీ గౌరవం ఎన్ని రెట్లు పెరిగిపోయిందో వేరే చెప్పాలా?’… రాజపుత్ర వీరుడు రాజా మాన్‌సింగ్‌ ఒక నిర్జన ప్రదేశంలో తన గురించి తాను ఆలోచించుకుంటున్న సమయంలో దూరంగా ఒక యువతి కనిపించింది.
ఆమె ఎవరో అతను పోల్చుకోలేకపోయాడు. అతని ఆలోచనలు ఆమెవైపు సాగాయి… ‘ఎవరదీ!! ఇంతటి నిర్జన ప్రదేశంలో. ఈ ఆరావళి పర్వతశ్రేణుల్లో, సంధ్యాసమయాన ఒంటరిగా అందమైన యువతి నావైపే నడచి వస్తోంది? ఆశ్చర్యం?… నేలమీద పచ్చిగడ్డి చెదిరిపోతుందేమోనన్నంత సౌకుమార్యంగా నడిచి వచ్చే ఆ సుందరి ఎవరై ఉంటుందీ?… వనదేవత కాదు గదా?’
మాన్‌ ఆలోచనలు పరిపరి విధాల పోతున్న దశలో ఆ అందమైన యువతి సమీపించింది.
సంప్రదాయకమైన దుస్తులు ధరించడం వల్ల, ఆమె ముఖం ముసుగుతో ఉంది. ఆమె ఎవరో గుర్తుపట్టడానికి మాన్‌సింగ్‌కు అవకాశమే లేదు. అయినా ధైర్యవచనాలు పలికాడు.
”వనితా! దగ్గరకు రా! భయం లేదులే. నేను రాజపుత్ర వీరుణ్ణి. స్త్రీలను గౌరవించడం ఎలాగో మాకు బాగా తెలుసు.”
”పచ్చి అబద్దం!” – స్త్రీ గొంతు చించుకుని అరిచింది. రాజా మాన్‌సింగ్‌ ఊహించని పరిణామం అది. వెంటనే అతనికి చిర్రెత్తుకొచ్చింది.
”ఏయ్‌! ఎవరు నువ్వు? తెలిసే మాట్లాడుతున్నావా? రాజా మాన్‌సింగ్‌నే అబద్దాల కోరును చేస్తావా?”
”యేం? తప్పేముంది? తప్పేదేముంది? ఇంకా చాలా చాలా అనగలను” – ఆ స్త్రీ కంఠస్వరంలో తీవ్రత హెచ్చిందే కాని, తగ్గలేదు.
మాన్‌సింగ్‌ ఆశ్చర్యంలోంచి తేరుకోలేకపోయాడు. అసలు ఒక స్త్రీ తనకు ఎదురుపడి ధైర్యంగా మాట్లాడడమనేది ఊహించుకోలేక పోతున్నాడు. ఏమైనా హుందాగా ప్రవర్తించడం మంచిది అనుకుని ”యువతీ చెప్పు. నేను నీకు రక్షణ కల్పిస్తాను. ఆడదాని శరీరాన్ని అంటుకోవడం మాన్‌సింగ్‌ కత్తికి అలవాటు లేదు. నిర్భయంగా చెప్పు నీ సమస్యస్యేమిటో”
”నీ ఖడ్గం ఇంతకు మునుపే నీ సోదరుల రక్తంతో తడిసి ముద్దయ్యింది. ఇది అంత కంటేనా?” యువతి ఎద్దేవా చేసింది.
”చెప్పేదేదో సూటిగా చెప్పు సుందరీ! డొంకతిరుగుడు మాటలేలా?” అన్నాడు మాన్‌సింగ్‌ అసహనంగా. యువతి తన కోపాన్ని తగ్గించుకుని, మెత్తగా, గంభీరంగా, నిబ్బరంగా మాట్లాడింది.
”సూటిగానే చెబుతున్నాను వీరుడా! నీతోటి రాజపుత్ర సోదరుల రక్తాన్ని నీ ఖడ్గం చవిచూసిన విషయమే గుర్తుచేస్తున్నాను. మేవారు వీరుడు రాణా ప్రతాప్‌తో యుద్ధానికి తలపడి కదా మొగలుల పంచన చేరావూ? రాణాప్రతాప్‌ సామాన్యుడనుకున్నావా? రాజపుత్రుల ఆత్మగౌరవాన్ని నిలిపిన ఘనుడు. భారత జాతి రత్నం!”
”ఆపు నీ వ్యర్థ పేలాపన! నా ముందు మళ్ళీ ఆ పేరెత్తావా నువ్వు స్త్రీవన్న విషయం కూడా మరిచిపోతాను.” – మాన్‌సింగ్‌ కోపం కట్టలు తెంచుకుంది. స్త్రీ ఏమాత్రం తగ్గలేదు. ధీటుగా బదులిచ్చింది.
”తల్లి రొమ్ము గుద్దే నీవంటి దేశద్రోహికి ఏదైనా సాధ్యమే. అందులో ఆశ్చర్యమేముంది?”
”నాలో రగులుతున్న కోపజ్వాలలకు ఆజ్యం పోస్తున్నావు యువతీ! జాగ్రత్త!!” ఖడ్గం దూసి కోపంతో ఊగిపోయాడు మాన్‌సింగ్‌.
”నీ ఖడ్గం నన్ను ఏ మాత్రం జడిపించలేదు. చూసుకో. నీ ఖడ్గపు ధగధగల్లో నీ మాతృమూర్తి రక్తపుచారలు కనిపిస్తున్నాయి. నీవంటి దేశద్రోహికి అంత పౌరుషం అనవసరం. ఆత్మద్రోహంతో కుంగిపోతున్నావు. తప్పులు సరిదిద్దుకో!”
”పడతీ జాగ్రత్త!! నీ అందం నిన్ను ఎల్లవేళలా రక్షిస్తుందని భ్రమించకు! ఆడదాన్ని చూసి చలించిపోవడానికి నేనేమీ మొగల్‌ వంశస్థుణ్ణి కాదు.”
ఊహించని విధంగా స్త్రీ పకపకా నవ్వింది. మెచ్చుకుంటున్నట్లుగా చప్పట్లు చరిచింది.
”భేష్‌. భేష్‌. బాగా సెలవిచ్చారు మాన్‌సింగ్‌ గారూ!.. అంటే మొగలుల పట్ల మీకూ గౌరవభావం లేదన్న మాట! అలాంటప్పుడు ఎందుకు మీ చెల్లెల్ని మొగలు చక్రవర్తి కిచ్చి పెండ్లి చేశారూ? ఎందుకూ ఆయన పంచన చేరి మాతృభూమికి ద్రోహం చేశారూ? ఎందుకు మీ సోదరుల రక్తం కళ్ళజూశారూ?” యువతి ప్రశ్నలు కురిపించింది. మాన్‌సింగ్‌ తబ్బిబ్బయ్యాడు.
”యువతీ నీకివ్వాళ చావు తథ్యం. ఇదిగో కాచుకో.” – అంటూ మాన్‌సింగ్‌ కత్తి ఝళిపిస్తూ అడుగు ముందుకేశాడు.
”హూ! రాజపుత్ర వనిత చావుకు ఎప్పుడూ భయపడదు” నిర్లక్ష్యంగా జవాబిచ్చింది స్త్రీ.
మాన్‌సింగ్‌ వెనక్కి తగ్గాడు. ”రాజపుత్ర వనితా? ఎవరమ్మా నువ్వు?”
”ఇప్పుడు కాదు. ఒకప్పుడు నేనూ రాజపుత్ర వనితనే.”
”ఎవరూ? నీ గొంతు ఎక్కడో విన్నట్లుందే! ఇటు రా. కాస్త వెలుగులోకి… గుర్తుపట్టలేకపోతున్నాను. అక్బరంతటివాడు గజగజ వణికే ఈ మాన్‌సింగ్‌ సంరక్షణలో ఉన్నావు. భయం లేదు. నువ్వెవరు? నీకేం కావాలి?” ఓపిక తెచ్చుకుని సహనం పాటించాడు మాన్‌సింగ్‌.
”అక్బర్‌ కూడా నిన్ను అసహ్యించుకుంటాడని పాపం నీకు తెలియదు. ఏం చేస్తాం? అది నీ అజ్ఞానం!!”
”అక్బర్‌ నన్ను అసహ్యించుకోవడమా? అసంభవం. అతని రాజ్యానికి మూలస్థంభాన్ని నేనే.”
”కావొచ్చు. వీరుడు ఎప్పుడైనా ఆత్మగౌరవంతో పోరాడే వీరుణ్ణే గౌరవిస్తాడు. సంధి మార్గంలో శరణుజొచ్చినవాణ్ణి ‘శహభాష్‌’ అని వీపు చరవొచ్చు. అంతేగాని గౌరవించడు. అక్బర్‌ గౌరవించేది ముమ్మాటికీ రాణాప్రతాప్‌నే.”
”ఆఁ – ఇప్పుడర్థమయ్యింది. నువ్వు తప్పకుండా రాణాప్రతాప్‌ పంపిన గూఢచారిణివయ్యుంటావ్‌” – గొప్ప నిజం కనుక్కున్నానన్నట్టు సంతోషం ప్రకటించాడు.
స్త్రీ నిశ్శబ్దంగా తన ముసుగు తొలగించి, మాన్‌సింగ్‌ వైపు కోపంగా చూసింది. మాన్‌సింగ్‌ నమ్మలేకపోయాడు. ఎదురుగా ఉన్నది తన చెల్లెలు జోధాబాయి. అక్బర్‌ చక్రవర్తి సతీమణి. భారతదేశానికే రాణి!!
”ఆఁ – జోధాబాయి. నా చెల్లీ? ఏమిటమ్మా నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్‌? భారతదేశమంతా ఈనాడు నీ కనుసన్నల్లో మెలుగుతుందే?
సకల సౌఖ్యాలు, సర్గసుఖాలు గలదానివి ఎందుకమ్మా నీ ముఖంలో అంత విచారం? నేను నీకేం లోటు చేశాననీ? చక్రవర్తికి భార్యగా చేశాను. భవిష్యత్తులో భావి చక్రవర్తులకు తల్లివవుతావ్‌? ఇంకేం కావాలమ్మా? నన్ను నిందిస్తావెందుకూ?” – మాన్‌సింగ్‌ నీరుగారిపొయ్యాడు.
”చేశావు. అంతా నీ స్వార్థం కోసం చేశావు. ఆత్మగౌరవాన్ని మంటగలిపావ్‌. స్వంతవారిని కించపరుచుకుని, పరాయివాడి పంచన చేరావు. ఇంకేం కావాలి? నా దుఃఖానికి ఈ కారణాలు చాలవా?” తీవ్రంగా స్పందించింది జోదాబాయి. సోదరుడైన మాన్‌సింగ్‌ వైపు అసహ్యంగా చూసింది. ఆ అసహ్యాన్నే మాటల్లో పెట్టింది –
”నీ సోదరులపై నీకు ప్రేమలేదు. నీ జన్మభూమిపై నీకు గౌరవం లేదు. ఢిల్లీ సుల్తాన్‌లతో నువ్వు నిర్వహించే రాజరికాలు, రాజకీయాలు నాకు అనవసరం. ఢిల్లీ రాణినై ఉండికూడా నేనెంత పేదరాలినో నీకెలా తెలుస్తుంది?… ఛీ-” ఛీత్కరించి గిరుక్కున వెనుతిరిగింది జోబాయి. మాన్‌సింగ్‌ నిరుత్తరుడయ్యాడు. అతని చేతిలోని ఖడ్గం నిస్సహాయంగా జారిపోయింది.
రచయిత్రి గురించి…
కళ్యాణమ్మ మాతృభాష తమిళం. కాని బెంగుళూరులో ఉండి కన్నడ పాఠశాలలో చదువుకోవడం వల్ల ఆమె బాల్యం నుండి కన్నడంలోనే రచనలు చేయడం ప్రారంభించారు. 1921-1963 మధ్య ‘సరస్వతి’ అనే పిల్లల పత్రిక ఒంటిచేత్తో నిర్వహించారు. అప్పుడే బాలసాహిత్య ప్రాముఖ్యతను గుర్తించిన రచయిత్రి, సంపాదకురాలు, ప్రచురణకర్త అయ్యారామె. ఎనిమిదిమంది సంతానంలో ఈమె రెండవవారు. పదోయేట పెండ్లి చేస్తే, మూడు నెలలకే విధవరాలయ్యారు. ఎన్నో ఆరోగ్యసమస్యలు ముఖ్యంగా మూర్ఛవ్యాధితో బాధపడుతూ ‘సరస్వతి’ పత్రిక నడిపారు.
కళ్యాణమ్మ రచనల్లో ఒక ప్రత్యేకత ఉంది. స్త్రీ దృక్కోణం లోంచి రచనలు చేసినా, అవి జాతీయ సమైక్యతను కాపాడడానికి, దేశభక్తిని పెంపొందించడానికి ఉపయోగపడ్డాయి. ‘సూర్యాస్తమయం’ కథ 1540-97 మధ్యకాలాన్ని ప్రతిబింబించింది. రాజపుత్ర సోదరులకు ద్రోహం తలపెట్టి, తన స్వార్థం కోసం, అధికార దాహంతో మాన్‌సింగ్‌ అక్బర్‌ పంచన చేరాడని జోదాబాయి తీవ్రంగా నిరసిస్తుంది. కన్నడ రచయిత్రి తిరుమలాంబ – కళ్యాణమ్మ సమకాలికురాలు. తిరుమలాంబది ఆధ్యాత్మిక భక్తి ధోరణి అయితే కళ్యాణమ్మది సామాజిక అభ్యుదయ ధోరణి. బాలవితంతువులకు పునరావాస కేంద్రం స్థాపించారు. తొలిసారిగా మహిళల బ్యాడ్‌మింటన్‌ ప్రవేశపెట్టారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.