మహిళా సర్పంచ్‌ల రాజకీయ అవగాహన

డా. కె. రామలక్ష్మి
‘మహిళా సాధికారత’ వల్ల కేవలం వారు అభివృద్ధి చెందడమే కాదు సమాజం కూడా పురోగతి చెందుతుంది. స్థిరమైన వృద్ధి సాధనకు మహిళల శక్తిసామర్థ్యాలు చాలా కీలకం. భారతదేశంలో 73వ రాజ్యాంగ సవరణ 1993 ఏప్రిల్‌ నుండి అమలలోకి వచ్చింది. ఇది దేశ రాజకీయరంగంలో పలుమార్పులు తెచ్చింది. ‘మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం’ అన్నది ఈ సవరణలోని ముఖ్యాంశమని శ్రీమతి నిర్మలా బుచ్‌ అభిప్రాయం.
73వ రాజ్యాంగ సవరణ మహిళలకు మూడింట ఒక వంతు వాటాను కేటాయించడం తప్పనిసరి చేసింది. షెడ్యూల్‌ |ఒలోని 29 అంశాలకు సంబంధించి సమగ్ర జాబితా ప్రకారం ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయానికి సంబంధించిన ప్రణాళికలను, పథకాలను రూపొందించుకొని అమలుపరచాల్సిన బాధ్యత పంచాయతీలకు ఉంది. ఇది ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన మహిళలకు గ్రామంలోని పరిస్థితులను మెరుగుపరిచే అవకాశాల్ని కల్పించింది. అంతేకాక వారి వ్యక్తిత్వ వికాసానికి, సాధికారతకు తోడ్పడుతుంది. 73వ రాజ్యాంగ సవరణ ఫలితంగా దాదాపు 10 లక్షల మంది మహిళలు మూడంచెల పంచాయతీరాజ్‌ విధానంలో సభ్యులు, ఛైర్మన్‌ల స్థానాలను సంపాదించు కున్నారు.
మహిళా సర్పంచ్‌లు ఉన్న వివిధ పంచాయతీలలో ఆయా మహిళలలోని నాయకత్వ లక్షణాలు క్షేత్రస్థాయిలోని సంస్థల నిర్వహణ తీరుపై ప్రభావాన్ని చూపిస్తాయి. 73వ రాజ్యాంగ సవరణ మహిళలకు రాజకీయ రంగ ప్రవేశాన్ని కల్పించి తద్వారా వారు సమాజంలో తమకొక హోదాను సంపాదించుకొని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే అవకాశాన్ని కల్పించింది.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని మా కళాశాలలో బి.ఎ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న 20 మంది విద్యార్థినులు ‘మానవ వనరుల అభివృద్ధి’ (హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌)కి సంబంధించిన పాఠ్యాంశంలోని క్షేత్ర పర్యటనలో భాగంగా అధ్యాపకురాలు డాక్టర్‌ రామలక్ష్మి పర్యవేక్షణలో వరంగల్‌ హసన్‌పర్తిలోని సంస్కృతీవిహార్‌లోని మానవ వనరుల శిక్షణా కేంద్రంలో వరంగల్‌ జిల్లాలోని 30 మంది మహిళా సర్పంచ్‌ల కోసం నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమానికి హాజరై, శిక్షణ పొందుతున్న సర్పంచ్‌ల ఉత్సాహాన్ని, ఆసక్తిని స్వయంగా గమనించడంతోపాటు వారి సామాజిక ఆర్థిక నేపథ్యం, రాజకీయ అవగాహనను తెలుసుకునే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించి రూపొందించిన ప్రశ్నావళి ద్వారా సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఆయా వివరాలను పరిశీలిద్దాం.
30 మంది మహిళా సర్పంచ్‌లలో 25-30 ఏళ్ళ వయస్సు గలవారు 10 మంది, 30-35 మధ్య వయస్సు గలవారు ఏడుగురు, 35-40 వయస్సు గలవారు ఏడుగురు, 40-45 వరకు వయస్సు గలవారు 4గురు కాగా 45 ఆపై వయస్సు గలవారు ఇద్దరు(2)గా గుర్తించడం జరిగింది. 30 మందిలో డిగ్రీ వరకు చదివినవారు ఇద్దరు, ఇంటర్‌ వరకు ముగ్గురు, పదవ తరగతి లోపు చదివినవారు ఐదుగురు కాగా ఇరవైమంది చదువులేనివారుగా, మొత్తం 30 మందిలో 10 మంది యస్‌.సి., 8 మంది యస్‌.టి., 8 మంది బి.సి., నలుగురు ఒ.సి. మహిళలుగా గుర్తించారు. వారంతా మహిళా రిజర్వేషన్‌ విధానం వల్లనే తాము సర్పంచ్‌ పదవిని చేపట్టగలిగామని తెలియజేశారు. వీరంతా వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం.
కుటుంబంలో ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా అన్న ప్రశ్నకు 15 మంది ఉన్నారని, 15 మంది లేరనీ చెప్పడం జరిగింది. రాజకీయాల్లోకి రావడం ఇష్టమేనా అన్న ప్రశ్నకు 25 మంది ఇష్టమే అని 5గురు ఇష్టం లేదనీ అయితే తరువాత ఇష్టపడుతున్నామనీ భావించారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుందా అన్న ప్రశ్నకు 30 మందీ (100 శాతం) ఉంటుందనీ, భర్త, ఇతర సభ్యుల ప్రోత్సాహంతోనే తామీ పదవిలో కొనసాగుతున్నామనీ చెప్పడం జరిగింది. అయితే కొన్నిసార్లు ఇంటిపనీ బయటిపనీ భారంగా ఉంటుందనీ అయినా సంతోషంగానే ఉందనీ చెప్పారు. 73వ రాజ్యాంగ సవరణ గురించి తెలుసా అన్న ప్రశ్నకు 13 మంది తెలుసనీ, 17 మంది తెలియదనీ చెప్పారు. సమావేశాలకు హాజరవుతారా అని అడిగితే 30 మందీ అవుతామనీ, అందువల్లనే గ్రామానికి సంబంధించిన వివిధ సమస్యలను తెలుసుకోగలుగుతున్నామని భావించారు. కుటుంబంలో నిర్ణయాలు మీరే తీసుకుంటారా అన్నప్పుడు 20 మంది తామే తీసుకుంటామనీ, 10 మంది భర్త, కుటుంబంలోని ఇతర పెద్దలు తీసుకుంటారనీ తెలియజేశారు. గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు మీరే తీసుకుంటారా అన్న ప్రశ్నకు 14 మంది తామే తీసుకుంటామనీ, 16 మంది భర్త నిర్ణయంతో ఏకీభవిస్తామనీ చెప్పడం జరిగింది. పదవివల్ల మీరు ఎక్కువ గౌరవాన్ని పొందుతున్నారా అన్న ప్రశ్నకు 30 మందీ (100 శాతం) పొందుతున్నామని తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధిగా గ్రామ పరిస్థితిని మెరుగుపరచ గలుగుతున్నారా అన్న ప్రశ్నకు 30 మందీ ప్రయత్నం చేస్తున్నామనీ, చాలా చేయాలని ఉన్నా కొన్నింటిని మాత్రమే చెయ్యగలుగుతున్నామనీ ముఖ్యంగా వరకట్నం వేధింపులు, లైంగిక వేధింపులు, మద్యపాన నిషేధం లాంటి సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని చెప్పడం జరిగింది. మహిళలు అధికారంలో ఉంటే మహిళా సమస్యలు పరిష్కారమవుతాయా అన్న ప్రశ్నకు 26 మంది అవుననీ, మహిళలే మహిళల గురించి అర్థం చేసుకోగలుగుతారనీ, 4గురు మహిళలే అక్కరలేదనీ, చెయ్యాలనుకుంటే ఎవరైనా చెయ్యగలరనీ భావించారు.
మహిళా ప్రతినిధిగా మీరెలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అన్న ప్రశ్నకు చదువు లేకపోవడం, ఇంటి బాధ్యతలు కొన్ని సమస్యలుగానే అనిపిస్తాయనీ, మహిళలు ఎదగడాన్ని మగవాళ్ళు సహించరనీ, ఆడవాళ్ళకేం తెలుసు అనే చులకన భావంతో చూస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు 27 మంది చేస్తామనీ, ముగ్గురు (3) చేయమనీ తెలియజేశారు.
30 మందీ తమ గ్రామాలలో అక్షరాస్యతను సాధించడం కోసం, నీటిసరఫరా, వీధిలైట్లు, మురుగునీటిపారుదల, రోడ్ల నిర్మాణం, పాఠశాలల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం, జాతీయ ఉపాధి హామీ పథకం, పారిశుధ్యంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం లాంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదనీ, ఆయా సమస్యల పరిష్కారంలో జాప్యంలాంటి సమస్యలను ఎదుర్కోవడం వల్ల పూర్తిస్థాయిలో సాధించలేకపోతున్నామనీ భావించారు.
మహిళా సాధికారత గురించి మీ అభిప్రాయం అన్న ప్రశ్నకు మహిళలంతా చదువుకోవాలనీ, వారికి మరిన్ని అవకాశాలు కల్పించాలనీ, ఇంటి పనిని కుటుంబ సభ్యులందరూ పంచుకోవాలనీ, స్త్రీ పురుషులు కలిసి సమిష్టిగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ, మనం హక్కులను అనుభవిస్తూ బాధ్యతలను నిర్వర్తించాలనీ ముఖ్యంగా హింసలేని సమాజం కావాలనీ, మహిళలు అన్ని రంగాలలో రాణించాలనీ భావించారు. బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు నిర్మూలించబడాలనీ అప్పుడే గ్రామీణాభివృద్ధి తద్వారా సమాజాభివృద్ధి సాధ్యమనీ అభిప్రాయపడ్డారు.
పన్నులను సరిగ్గా వసూలు చేయడం ద్వారా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చని ఒక సర్పంచ్‌ భావిస్తే, ఆధారపడే తత్వాన్ని వదులుకుంటే అభివృద్ధి సాధించవచ్చని మరొక సర్పంచ్‌ భావిస్తే ‘అధికారం పొగడ్తల, పరామర్శల సంగమం’ అని ఇంకొక సర్పంచ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
చివరగా మహిళా సర్పంచ్‌లైన మీకు శిక్షణ ఏ విధంగా ఉపయోగపడుతున్నది అన్న ప్రశ్నకు శిక్షణ వల్ల అనేక విషయాలు తెలుస్తున్నాయన్నారు. తమలో తమకు స్నేహసంబంధాలు పెంపొందించుకోగలుగుతున్నామన్నారు. తాము నాయకత్వ లక్షణాలను అలవరచుకోవడానికి ఈ మూడురోజుల శిక్షణ చాలా తోడ్పడుతున్నదనీ ఇట్లాంటి శిక్షణావకాశాలు మరిన్ని కావాలనీ తెలిపారు. ఈ శిక్షణ తమలో మహిళలు ఎలాంటి అధికారాన్నయినా చేపట్టవచ్చనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించిందనీ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు స్వంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని తాము నమ్ముతున్నామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ శిక్షణనిచ్చే సిబ్బంది, అధికారులు తమను చాలా ప్రోత్సహిస్తున్నారని, మంచి సమాచారాన్ని తమకు అర్థమయ్యే రీతిలో బోధిస్తున్నారనీ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సంబంధిత అధికారులు కూడా శిక్షణలో పాల్గొన్న మహిళా సర్పంచ్‌లు శిక్షణ లక్ష్యాన్ని గ్రహించి తమకు పూర్తిగా సహకరిస్తున్నారనీ, వారంతా సమయపాలనను పాటిస్తూ, తమ అవగాహనా శక్తిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనీ వారిలోని శక్తిసామర్థ్యాలను, నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమనీ తెలిపారు.
గ్రామంలో ప్రథమ పౌరులైన ఈ మహిళా సర్పంచ్‌లంతా సమాజాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తూ, తమ శక్తిసామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ, తమ రాజకీయ ప్రస్థానంలో ఆత్మగౌరవంతో అడుగు ముందుకేసి, సమస్యలనధిగమిస్తూ విజయం సాధిస్తారని ఆశిద్దాం – అభిలషిద్దాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో