కొండేపూడి నిర్మల
బాణామతి చేశాడనే నేపంతో ఒక నిరుపేద వృద్ధుడ్ని గ్రామస్థులంతా కలిసి నిట్టనిలువుగా తగలబెడితే జిల్లా ఎడిషన్‌లో ఒక అప్రధాన వార్త అవుతుంది అక్కడికసలు న్యాయమూ, చట్టమూ, ప్రభుత్వమూ తొంగి చూడవు. అదే మరి డబ్బున్న స్వామిజీ జుట్టులోంచి విబూది రాల్చడమూ, నోట్లోంచి శివలింగాన్నీ తియ్యడం కొన్నాళ్ళ పాటు వాయిదా వేసి కేవలం మూత్రం సాఫీగా అవడం కోసం ఆస్పత్రిలో జేరితే దేశమంతా అట్టుడికిపోతుంది.
న్యాయమూ, చట్టమూ అంతర్జాతీయ వైద్యమూ అక్కడే సాగిలపడతాయి. మంత్రులందరూ తమ క్యాబినెట్స్ వదిలేసి ఎప్పుడెప్పుడూ పేషంటు బాబా కళ్ళు తెరుస్తారా, హారతి ఇద్దామా, అని బానిసల్లా ఎదురు చూస్తూ వుంటారు.
ఈ మాటలు నిన్న నేను అంటూ వుండగానే మా పక్కింటి ఆవిడ టప టపా చెంపలు వేసుకుని ”మీరు మరీనండీ, వూరి చివరి మంత్రగత్తెతో వీరిని ఎలా పోల్చుతారు. వీరు ప్రజల బాగుకోసం ఎన్ని సేవలు చేశారో, నూట నలభై దేశాల్లో వారికున్న పరపతి ఎంతో…” నా మట్టి బుర్రకి అర్ధమయ్యేలా చెప్పాననుకుంది.
నిజానికి నాకేమీ అర్థం కాలేదు.
ఏ మనిషికయినా విపరీత సంపద ఎలా సిద్దిస్తుంది..? దొంగనోట్లు అచ్చేస్తే వస్తుంది. కష్టపడి గోడలు దూకితే వస్తుంది. శ్రుతి మించి వ్యాపారంచేస్తే వస్తుంది. అక్రమ షరతుల ఒప్పందంతో నిధుల సేకరిస్తే వస్తుంది. ఆదాయ ఖర్చుల మీద న్యాయసంబంధమయిన ఆడిట్ వుంటే అది అక్రమ ఆస్తిగా మారే వీలే లేదు. మరి ఒకటి పాయింట్ ముప్పై లక్షలు ఎలా పోగుపడ్డాయి. ఇందుకుగాను చేసిన వ్యాపారమేమిటి..? ప్రజల బలహీనతలేనా..? వేలాది మంది టెకెట్లు కొంటే ఎవడికి లాట్రీ తగులుతుందో వాడికి, బంపర్ డ్రా తీసినవాడు భాగ్యప్రదాతలాగానే కనిపిస్తాడు. ఇలాగైతే ఓటు వేసినవాడికల్లా నానో కారు బహూకరిస్తానని ప్రకటించిన తమిళనాడు అభ్యర్తి పరందాముడే కదా… నిత్యానందస్వామీజీ మీద రాని కోపం, ప్రపంచ కప్పు గెలిస్తే నగ్నంగా ప్రదర్శనలిస్తానని చెప్పిన పూనమ్‌పాండే మీద ఎందుకు రావాలి. ఒకరిది రస సిద్ధి అయినప్పుడు ఇంకొరికి దేహశుద్ది చేస్తామని చెప్పడానికి భజరంగ్ దళ్ ఎవరు..?
నాకు తెలిసి మన బుర్రలో మూడే గదులున్నాయి. ఒకటి వున్న డబ్బు పోతుందనే భయంతో ఏర్పడిన భక్తితోనూ.. రెండు డబ్బు రావడం కోసం తెచ్చుకున్న భక్తితోను, మూడు డబ్బుని అనుభవించడానికి ఏర్పాటు చేసుకున్న రక్తితోనూ ..నిండిపోయాయి.
ప్రజలు అమాయకులే, క్యాన్సరు తగ్గుతుందనుకుని వస్తారు. పిల్లలు పుట్టనందుకు వస్తారు. .పరీక్ష తప్పినందుకు వస్తారు. ఒక సన్యాసి కాళ్ళతో తంతాడు. ఇంకోడు నాలుకతో నాకుతాడు, ఇంకోడు ఇంకేదో చేస్తాడు. ఏది చేసినా దైవకార్యాలే అని నమ్మాలి. నమ్మకానికే కాదు, దురాశకీ, ఆశకీ కూడా హేతువు లేదు.
డబ్బు పరపతీ కనుక వుంటే బాణామతి ముసలయ్యని ఎవరూ చెట్టుకి కట్టి నిప్పంటించరు… ఎలాగోలా ప్రభుత్వాన్ని పట్టుకుని బాణామతి కోర్సుకి అనుమతి తీసుకుంటారు. దేశవ్యాప్తంగా వారసులు సిండికేట్ బ్రాంచీలు పెడతారు. రాజకీయ నాయకులంతా అసెంబ్లీలో మైకులు విరుచుకోవడాలు మానేసి మంత్రించిన నిమ్మకాయలు తీసుకుని శ్మశానాలకి బయలేర్దుతారు.
అప్పుడు బాణామతి ముసలయ్యని ఒక పట్టాన మరణించనివ్వరు.. పోనీ బతకనిస్తారా అంటే అదీ లేదు. ఉత్తి పుణ్యాన తొందర ఎందు కంటారు…? ఇంకో అవతారం కర్నాటకలోనా, కేరళలోనా అని ప్లాన్ చేసుకోవాలి కదా… ఈ సంపదలు ద్రవించకుండా ఆ సంపదలు గుడి కట్టడానికి ఏ అవతారం నమ్మకంగా వుంటుందో, సదరు ఆవతారానికి ఏ పోలికలు, హెయిర్ స్టయిల్ బావుంటుందో బొమ్మ గీసుకోవాలి కదా… వీలయితే రాబోయే కొత్త హీరో సినిమా మాదిరి ఇప్పటినుంచే ప్రచారం చేసుకోవాలి కదా… అవతారమంటే మాటలా…ఎందరు వారసులు నటించాలి. ఎందర్ని రేవు దాటించాలి…అబ్బ..ఎంత సృజనాత్మకతో కదా…ఏ హాలీవుడ్ సినిమాకి అయినా ఇన్ని ట్విస్టులుంటాయంటారా…?
ఇందాకా మా పక్కింటావిడ మళ్ళీ లిఫ్టులో ఎదురయింది… మొహం అంత సీరియస్‌గా వుందేమిటో..?.. వుంటే వుండనీ, నా అభిప్రాయం నేను చెప్పాను.
మన కళ్ళు చూడటానికి కాకుండా మూసుకోవడానికే వాడుకుంటే వుంటే, మన చెవులు వినడానికి కాకుండా పూలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటే, మన నోరు ప్రశ్నించడానికి కాకుండా భజన చెయ్యడానికే మోగుతూ వుంటే బహుశా ప్రపంచం ఏ మార్పు లేకుండా ఇలాగే వుంటుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
నిజాలను వివర ము గా భా గా చెప్పారు
అద్భుతం.
దటీజ్..,
కొండేపూడి నిర్మల !
సర్వం జిత్తు
నిర్మల గారి కలానికీ
వారి అక్షర తూణీరాలకీ
నేను చిత్తు చిత్తు