సి. సుజాతామూర్తి
తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం, సాగరతీరాన, నాగరిక సమాజానికి దూరంగా ఉన్న, ఐర్లండ్‌లో ఉన్న ఆర్యన్ ద్వీపవాసుల కష్టనష్టాల గురించీ, కుటుంబాలకు కుటుంబాలే సముద్రానికి అంకితమైన కుటుంబాల గురించీ, వారి జీవితాలు, స్వేచ్ఛా, ఆనందం, కూడూ, గుడ్డా, గూడూ కోసం ఎంత దారిద్య్రం అనుభవించారన్న విషయాల గురించీ, ఒక మనోదృశ్యకావ్యంలా రచించిన వష్ట్రరిఖిలిజీరీ శిళి శినీలి ఐలిబివ అనే ఏకాంకిక (రచయిత జాన్ మిల్లింగ్టన్ సిన్జ్)ను ఎంతో మనస్సుకు హత్తుకుపోయేలా తెలుగులోకి అనువదించారు శివలక్ష్మిగారు.
రెండుమూడు సంవత్సరాల క్రితం భూమిక రచయిత్రులందరూ, గంగవరం పోర్టు బాధిత స్త్రీలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు చూసిన అక్కడి వారి ఆక్రందన, భయం, మా సముద్రం పోయిందనే వేదన – ఇవన్నీ వాస్తవంగా చూసినప్పటికీ, శివలక్ష్మిగారి అనువాదం చదివాక వారి జీవితాలు నిత్యం సాగరమథనంలో ఎలా కొట్టుకుపోతాయో అన్న విషయం చాలా భయానకంగా కనబడింది.
ఎంతో ధైర్యవంతులమనీ, కష్టనష్టాలను ఎదుర్కోగల శక్తి స్త్రీలలో ఉందనీ, పొగుడుతూ పుస్తకాలు రాసినా, అవార్డులిచ్చినా, బాధితుల సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కారమార్గాలు చూపించగలిగే స్పందనలేని ఈ ప్రజలను శిక్షించాలా, లేక స్పందన కలిగేలా సమాజాన్ని తీర్చిదిద్దాలా అనేభావనతో నాలో నేనే ఆ ఏకాంకిక చదివాక చాలా ఆవేదనకు లోనయ్యాను.
ఏ కాలంలో, ఏ ప్రదేశంలోనైనా, ఎటువంటి సామాజిక పరిస్థితులైనా, ఆ ప్రదేశానికీ, సమాజానికీ, మిగతావారికీ సంబంధం లేదా? సమాజమంటే మనమే కదా? అందరం దానికి బాధ్యులమే కదా? ఎందుకీ వివక్ష? మగపిల్లలందర్నీ పోగొట్టుకున్న ‘మోరియ’ చేత ”ఇంక ఈ సముద్రం నన్ను ఏమీ చేయలేదని” అనిపించాడే కానీ అలాంటి మోరియాలు ఎంతమందో స్వార్థపూరితమైన దుష్టపరి పాలనల్లో, సమాజాల్లో, అటువంటి భయా నకమైన పరిస్థితుల్లో ఇరుక్కుని ఏమీ చేయలేక, ఒక విధివైపరీత్యమనో, విధాత రాసిన కర్మలాగానో భావిస్తూ జీవితాలు ఇప్పటికీ గడుపు తున్నారు.
అటువంటి ఆటుపోటులకు నిశ్శబ్ద సాక్షులుగా బలైపోతున్న మహిళలను ”ఎంతో ధైర్యవంతులనీ” ఉన్నతమైనవారిగా చూపిస్తూ అవార్డులు, పొగడ్తలు గుప్పిస్తారేగానీ వారికి పరిష్కార మార్గాన్నైతే చూపించరు. ఈ పొగడ్తలు, అవార్డులు ఏ విధమైన మార్పూ తేలేదు. కాక పోతే వాటివలన మరీ మనోధైర్యం పోగొట్టు కున్నా వాళ్ళకు ధైర్యం ఇచ్చేలా ఉపయోగ పడొచ్చు.
కానీ, బాగా ధైర్యంతో ఉండండి, మగ వాళ్ళు ఎలా చూసినప్పటికీ, ఏం చేసినప్పటికీ మీరు మాత్రం ఇలా జీవితాలర్పిస్తూ, కుటుంబా లను పోషిస్తూ ఉండండని చెప్పే ఈ ప్రపంచంలో, భ్రష్టుపడిపోయిన సమాజంలో ఇలా మనోధైర్యంతో నిలబడిన మగ ‘మోరియా’ ఏకాంకిక గూడా రావాలి. తలనొప్పీ దరిద్రం తనదాకా వస్తేగానీ తెలియదంటారు.
ఒక కుటుంబంలో ఏదైనా ఇటువంటి దుర్ఘటన జరిగితే, దానికి ఇంటిల్లిపాదీ, మొగైనా, ఆడైనా స్పందించి తమవంతు స్థైర్యాన్ని కూడగట్టుకుని వ్యవహరించేలా మనలో మనమే చైతన్యం తెచ్చుకుని ఒక నూతన సమాజాన్ని ఆవిష్కరిద్దాం.
ఇకపోతే శివలక్ష్మి స్వేచ్ఛానువాదం చివరిదాకా ఎంతో ఉత్కంఠభరితంగా, చక్కని భాషాశైలితో సాగి పోయింది. మోరియ వ్యక్తిత్వాన్ని, ఆవిడ అంతులేని బాధను తట్టుకుని, స్పందించిన తీరును ఎంతో దృగ్గోచరంగా తన అనువాదంలో చూపించింది. సముద్రానికి చేరువలో బాల్యం గడిపిన నాకు, ఆ ఏకాంకిక చదువుతున్నంతసేపు, దాని హోరుమనే ఘోషలో, ఉధృతంగా ఎగసిపడే కెరటాలు చూస్తూ, ఒడ్డున ఎదురు చూస్తున్న మోరియతో కూర్చున్నట్లే భావించాను. ఏ రచనలోనైనా, అనువాదంలోనైనా ఆ చెప్పదలుచుకున్న విషయాన్ని, అంత స్పష్టంగా అద్దంలో చూస్తున్నట్లు చెప్పిన ‘జాన్ మిల్టన్ సిన్జ్’కు, స్వేచ్ఛాను వాదకర్త శివలక్ష్మికీ ప్రేమాభివందనలు. శుభాకాంక్షలు.