కె. లలిత
కుటుంబాలు, సమాజం కలిసి బతుకు తెరువు బాధ్యతంతా స్త్రీల మీదే మోపటం ప్రస్తుత పరిస్థితిలో సర్వసాధారణంగా కనిపించే విషయం. ప్రజాక్షేమం, సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించే విధానాలు కూడా అదే విధంగా ఆడవాళ్ళపై అదనపు భారాన్ని మోపటం చూస్తున్నాం. ఇదంతా గత రెండు దశాబ్దాలుగా జరుగుతున్న ‘అభివృద్ధి’లో భాగం. ఈ ‘అభివృద్ధి’ క్రమం ‘ప్రజా భాగస్వామ్యం’ (ఆలిళిచీజిలి చీబిజీశిరిబీరిచీబిశిరిళిదీ) ‘స్వశక్తి’ (ఐలిజితీ నీలిజిచీ) ‘ప్రజాసమీకరణ’ (ఐలిజితీ ళీళిలీరిజిరిచిబిశిరిళిదీ), ‘సాధికారికత’ (లిళీచీళిగీలిజీళీలిదీశి) ‘పాలనా విధానం’ (వీళిఖీలిజీదీబిదీబీలి) వంటి సిద్ధాంతాల ‘రూపాన్ని తీసుకుంటోంది.
ఆధునిక రాజ్యవ్యవస్థలో కొత్త పదజాలం కొత్త సిద్ధాంత రూపకల్పన వంటి సాంకేతిక అంశాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకోవటం కనిపిస్తోంది. ఒకప్పుడు సంక్షేమ రాజ్యంగా, సమసమాజ రాజ్యంగా కూడా గుర్తించబడ్డ భారతదేశం 80ల నుండి కొత్త ఆర్థిక విధానాలను రూపొందిస్తూ 90ల నుండి నయా ఉదారవాద విధానాలతో ప్రపంచీకరణతో స్పందిస్తున్నది. ఈ మధ్య కాలంలో ఆంధ్రరాష్ట్రంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో గత రెండుదశాబ్దాలుగా జరుగుతున్న మార్పులను, ముఖ్యంగా స్త్రీలను సమీకరించే క్రమం మీద చర్చలను – ఈ కొత్త భావజాలం, పదజాలానికి ఊపిరిపోసే రాజకీయవ్యవస్థను, దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవటం అవసరం.
ఆధునిక రాజ్యవ్యవస్థ విశ్లేషణ
ఈ వ్యవస్థలో ‘పొలిటికల్’ అనే అంశానికున్న పదునుపోయి పైన వుదహరించిన కొత్త సిద్ధాంతాలతో, ఒక కొత్త రాజకీయ అజెండా మన ముందుకు వచ్చింది. ఈ వ్యవస్థ స్వభావం పూర్తి సాంకేతికంగానూ, శాస్త్రీయంగానూ, న్యాయ సంబంధమైనదిగానూ – ఒకే మాటలో చెప్పాలంటే, దేనికీ సంబంధించని ఒక తటస్థ వ్యవస్థగా కనిపిస్తుంది.
ప్రజాస్వామ్యాలు ఆధునిక యుగానికి చెందినవి. ఆధునికతను క్లుప్తంగా విశ్లేషించాలంటే వివేకత, శాస్త్రీయ పరిజ్ఞానం (ఐబీరిలిదీశిరితీరిబీ చదీళిగీజిలిఖివీలి) అనే అంశాలలో ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి తన అవసరాలకు అనుగుణంగా ప్రకృతిని, ప్రపంచాన్ని మార్చుకోవడానికి మనిషికి తోడ్పడింది అనే చెప్పాలి. ఇటువంటి వ్యవస్థలో మతం, మత సంస్థలతో సంబంధం లేకుండా రాజ్యం, సార్వభౌమాధికారాన్ని నిర్వహిస్తుంది. రాజ్యం, సమాజం అభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతాయి. ఇటువంటి ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలే సార్వభౌములు. హక్కులు, సమానత్వం కలిగినటువంటి వాళ్ళు పౌరులు. ఆధునిక, ఉదారవాద ప్రజా స్వామ్యంలో ప్రతి వ్యక్తికీ హక్కులు, స్వేచ్ఛ అనేవి ముఖ్యమైనవి. అదే విధంగా రాజ్యాధికారం ప్రజల హక్కులను పరిరక్షించాలి. అధికారం, సార్వభౌమత్వం ప్రజలే రాజ్యానికి కల్పించాలి. అంటే ప్రజల అంగీకారం మీదే రాజ్యం నడవాలి. ఇదే వుదారవాద, ప్రజాస్వామ్య సిద్ధాంతం. 18, 19 శతాబ్దాలలో పాశ్చాత్య దేశాల ఆర్థిక సామాజిక వ్యవస్థలో వచ్చిన మార్పులు, ప్రజాస్వామ్య పోరాటాల మూలంగా ప్రజాస్వామ్య సిద్ధాంతాలలో కూడా కొత్త విశ్లేషణలకు దారి తీసింది. ‘పౌరసమాజం’ అంటే ఆస్తి కలిగి మార్కెట్‌లతో సంప్రదింపులు చేయగలిగే వారు అని కార్ల్‌మార్క్స్ విశ్లేషిస్తే, ఆంటోనియో గ్రామ్‌సి (ఇటలి దేశపు కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త) రాజ్యం, పౌరసమాజం అనే పదాలని పునర్విశ్లేషిస్తూ పౌరసమాజం అంటే ఆర్థిక వ్యవస్థ, ఆస్తి హక్కులకు సంబంధించినది మాత్రమే కాదని సాంస్కృతిక సంస్థలు, విద్యా సంస్థలు, మత సంస్థలు తదితరమైనవన్నీ కూడా పౌరసమాజానికి చెందినవే అని చెప్పాడు. ఈ పౌరసమాజంలో రాజ్యం తన అధికారాన్ని కేవలం పోలీసు, న్యాయ వ్యవస్థ వంటి యంత్రాంగాలతో మాత్రమే కాకుండా ప్రజల అంగీకారం (్పుళిదీరీలిదీశి) తో నిర్వహిస్తుంది. అంటే పౌరసమాజంలోని సంస్థలు కూడా రాజ్యాధికారాన్ని నిర్వహించేవే.
ప్రజాస్వామ్యం, పౌరసమాజం రాజ్యం వంటి అంశాలకు అర్థవంతమైన విశ్లేషణను ఇచ్చిన పార్థాఛటర్జీ రచనల్ని గమనిస్తే పారిశ్రామికీకరణ జరిగిన పాశ్చాత్య దేశాలలో పుట్టుకొచ్చిన ప్రజా స్వామ్యాలు ప్రజలను ‘పౌరులు’, ‘పాలితులు’ అనే రెండు భాగాలుగా లెక్కగట్టాయి. ఈ ప్రజాస్వామ్యాలలో ‘పౌరులు’ సిద్ధాంతరంగ పరిధిలో ఉంటే, ‘పాలితులు’ పాలసీ రంగంలోకి కుదించుకుపోయారు. ఈ సందర్భంలో జనానికి ‘ప్రజాస్వామ్యం’ అంటే పార్థాఛటర్జీ చెప్పిన ‘పాలితుల రాజకీయం’ (పాలిటిక్స్ ఆఫ్ గవర్నడ్). దాని అర్థంలో ప్రభుత్వ పాలితుల గురించి పాలసీలు తయారు చేయటం మాత్రమే. ఇంతకీ పౌరులెవరు? పాలితులెవరు? ఈ సమాజంలో ఆస్తి కలిగి ఉన్నవాళ్ళు, విధానాలను తయారు చేసి అమలుపరిచేవారు పౌరులయితే, ఎటువంటి ఆస్తులూ, వనరులూ లేని వాళ్ళంతా పాలితు లవుతారు. ఆస్తి, ఉత్పత్తి వనరుల మీద ఎటువంటి హక్కులు లేని జనసమూ హాలుగా, పాలితులుగా లెక్క గట్టడం జరుగుతుంది. ఈ సమూ హాలన్నింటినీ పరిపాలించటానికి ఒక పటిష్టమైన పాలనా యంత్రాంగం అవసరం అవుతుంది. ప్రజాస్వామ్యరాజ్య వ్యవస్థలో ప్రజాప్రతి నిధులైన శాసనసభ, మంత్రివర్గాలు విధానాలను రూపొందిం చేవైతే, ఆ విధానాలనమలు చేసేందుకు పాలనా యంత్రాంగం ఉంటుంది. ఇప్పటి వ్యవస్థలో పాలనా యంత్రాంగం రోజు రోజుకూ మరింత అధికారాన్ని సంత రించుకుంటోంది. ఈ అధికార యంత్రాంగానికున్న ప్రధాన లక్షణం – రాజ్యాన్ని ‘ప్రభుత్వ పరిపాలన’ కింద కుదించి వేయడం. ఈ వ్యవస్థలో పాలి తులకు అధికార యంత్రాంగంలో భాగస్వామ్యం ఉండదు. ఈ వ్యవస్థ ఆమోదయోగ్యం కావాలంటే ‘పాలితుల’ సంక్షేమాన్ని కాపాడుతున్నట్లుగా కనిపించాలి. అటువంటి యంత్రాంగంలో శాసనసభలు, చట్టసభల కంటే ‘పాలితుల’ మీద ఒక కన్నేసి ఉంచటానికి పనికొచ్చే పటిష్టమైన పాలనా యంత్రాంగం ఒకటి ప్రధానం అవుతుంది.
ఇక్కడ ‘పరిపాలన’ అంటే రాజకీయాలకి సంబంధించినది కాదు. అది పరిపాలనకు సంబంధించిన పాలసీలను తయారు చేయటం. ఇందులో సాంకేతిక నిపుణులుంటారు. రాజకీయ ప్రతి నిధులు కాదు. ఒక్క ఎన్నికల సందర్భంలోనే పాలితులు కూడా ”పౌరుల”నిపించుకుంటారే గాని మిగిలిన అన్ని వేళలా వాళ్ళూ పాలితులుగానే మిగిలిపోతారు. ఈ సమయంలో ‘పౌరసమాజం’ కూడా ఒక కొత్త ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. గత రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థలు, ఎన్‌జీవోలు ఈ ‘పౌర సమాజం’ అనే భావానికి కొత్త అర్థాలను ప్రతిపాదిస్తున్నారు. ఈ భావనలో రాజ్యయంత్రాంగం బయటి పరిధిలో ఉండే ప్రతి సంస్థా (ఎన్‌జివో, సి.బి.ఒ. ఎస్.హెచ్.జీలు) పూర్తి స్వేచ్ఛ కలిగి ఉండి ఒకే లక్ష్యంతో, పనిచేసేవిగా కనిపిస్తాయి. ఈ పౌరసమాజం, పాలితులకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తుంటుంది. ఎన్జీవోలు, ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న కార్పోరేట్ (రంగం నిర్వహించే) సామాజిక బాధ్యతా సంస్థలు, (్పుళిజీచీళిజీబిశిలి రీళిబీరిబిజి జీలిరీచీళిదీరీరిలీరిజిరిశిగి) కార్యకర్తలు తదితరులందరినీ పౌరసమాజంలో భాగంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ వ్యవస్థలో పౌర భాగస్వామ్యం అంటే అర్థం ఏమిటి, దాని లక్ష్యం ఏమిటి అని ప్రశ్నించుకోవలసిన అవసరం వుంది. అదే విధంగా పౌరులంటే ఎవరు? రాజ్యానికీ, పౌరసత్వానికి, రాజకీయాలకు వున్న సంబంధం ఏమిటి అనే ప్రశ్న కూడా ఎదురవుతుంది. ఈ సందర్భంలోనే ఒక వ్యక్తి ్త జీవితంపై, సంక్షే మంపై రాజ్యం బాధ్యత తగ్గిపోయి వ్యక్తి బాధ్యత పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రజలపట్ల సంక్షేమ వైఖరిని అవలంబించిన రాజ్యం దానికి నీళ్ళొదిలి బాధ్యతలను తగ్గించుకునే క్రమం ఇది. ఈ సమాజంలో ప్రధానపాత్ర మార్కెట్‌ది, పారిశ్రామికరంగానిదే వుంటుంది. రాజ్యానికి, రాజకీయాలకు, వ్యక్తులకీ మధ్య ఇప్పుడు మార్కెట్ ప్రధానం అవుతుంది. పైన చెప్పిన పౌరసమాజమే కాకుండా మార్కెట్ ఒక ప్రత్యేక అంశం అవుతుంది. ఆ సంబంధంలో రాజ కీయ ప్రభావం తగ్గుముఖంపట్టి ప్రభుత్వాలు రాజకీయ ప్రతికూల వ్యూహాలు రూపొందించే అవసరం ఏర్పడుతుంది. ఈ కొత్త పౌరసమాజ స్వభావంలో ‘రాజకీయ అంశం’ స్థానాన్ని ‘సాంఘిక’ (సోషల్) అనే అంశం ఆక్రమించు కుంటుంది. ఇదే సమయంలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థలు, ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామిక విలువలకు కొత్త అర్థాలను ఇస్తాయి. వికేంద్రీకరణ అనే కొత్త సిద్ధాంతం పాలితులు, రాజ్యాల మధ్య సంబంధాన్ని నియంత్రిస్తుంది. ఈ సందర్భంలో సామాజికంగా చెలామణి అయ్యే భావజాలం అంతా పంచాయితీరాజ్ వంటి స్థానిక రాజకీయ సంస్థలను నీరుగార్చేవే ఉంటాయి. ఒకే మాటలో చెప్పాలంటే ‘పౌరసమాజం’ ఆచరణలో సాంఘిక రంగంలో రాజకీయ కార్యక్రమాలకు స్థానం వుండదు.
స్వేచ్ఛకై, గౌరవనీయంగా బ్రతకడానికి మానవుల తపన, చేసే పోరాటాలు, స్థాపించే వ్యవస్థ ఇవన్నీ రాజనీతి (చీళిజిరిశిరిబీరీ) యొక్క అధ్యయనాంశాలు. ఉదారవాద దృక్పథంతో రాజ్యం, రాజకీయ అధికారం రాజ్యవ్యవస్థ అన్నీ అందరి అవసరాలను తీర్చగలిగే ఒక వ్యవస్థగా రూపొందింది. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు/ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాలుగా గుర్తించబడి రాజ్యాధికారాన్ని ప్రజా సంక్షేమానికై నిర్వహిస్తాయనే సూత్రంపై నిర్మించబడ్డాయి. అంటే రాజ్యవ్యవస్థ ఒక తటస్థ వ్యవస్థగా చూడబడుతుంది.
రాజకీయాలు అంటే రాజ్యాధికారం, రాజ్యవిధానాలకు, ప్రజా అవసరాలకు, హక్కులకూ మధ్య జరిగే ఘర్షణలు, ఒప్పందాలు (దీలివీళిశిరిబిశిరిళిదీరీ) అనే అర్థం అంతరించి, ప్రభుత్వం ఒక తటస్థ వ్యవస్థగా సామాజిక అవసరాలను, ప్రజా అవసరాలను తీర్చేదిగా ప్రతిస్పందిస్తూ పరిపాలనను కొనసాగిస్తుంది. పాలన (గవర్నెన్స్) (వీళిఖీలిజీదీబిదీబీలి) అంటే అవినీతి లేని సులక్షణమైన ప్రజా విధానాలను అమలు చేయడమే.
ఈ రకమైన ‘ఆధునిక’ దృక్పథంతో వేగంగా నడుస్తున్న ఇప్పటి వ్యవస్థలో పాతరకం రాజకీయ ఘర్షణలకు స్థానం లేదు. అదంతా బూజుపట్టి పోయిన గతం. ఇప్పుడు శత్రువుల్లేరు. ప్రతి సమస్యలోను అందరూ వారి వారి ప్రయోజనాల కోసం మసిలే లబ్ధిదారులే (స్టేక్ హోల్డర్స్). అందర్నీ తృప్తిపరచి అందరి దృక్పథాలు అర్థం చేసుకుని వాటి మధ్య సయోధ్య కుదిర్చే అవసరం సమాజం ముందుంటుంది. ఈ సందర్భంలో ఒక మంచి బాధ్యతాయుతమైన స్త్రీ తన కుటుంబానికి, కమ్యూనిటీకి మేలు చేకూర్చే పద్ధతిలో కృషి చేయాల్సిన అవసరం మరింత పెరుగుతుంది. తన చుట్టూ వున్న సమాజంలో ఆర్థిక, సాంఘిక అభివృద్ధికంతటికీ తనదే బాధ్యతగా పూనుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీలు
మునుపటి సమాజం పేదరికాన్ని సమాజపు బాధ్యతగా గుర్తిస్తే ఈ ఆధునిక సమాజంలో అది వ్యక్తి బాధ్యతగా మిగిలిపోయింది. ఇంతవరకు ‘పని శ్రమ’గా పరిగణిస్తున్న అంశాలు ఇప్పుడు బతుకు తెరువు కింద, జీవనాధారం కింద కుదించబడ్డాయి. ఇంతకుముందు పని పొందటం ఒక హక్కు అయితే, జీవనాధారాన్ని వెతుక్కోవటం ఇప్పుడు బాధ్యత అయింది. అదే క్రమంలో సంక్షోభంలో వున్న వ్యవసాయ రంగంలోని పేద స్త్రీలు అందులోనూ అత్యధిక శాతంగా వున్న దళిత స్త్రీలు వారి జీవనోపాధి వారే ఏర్పరచుకోవలసిన క్రమంలోకి నెట్టివేయబడుతున్నారు. స్వయం సహాయక బృందాలు (ఎస్.హెచ్.జి.) ఈ క్రమానికి పరాకాష్ట. అందుకే మనం ఇంతవరకు చర్చించిన అంశాలను అర్థం చేసుకోవటానికి ఉపయోగపడే ఒక చక్కని ఉదాహరణ ఆంధ్రరాష్ట్రంలో పేరుపొందిన ఎస్.హెచ్.జి. ఉద్యమం. మన రాష్ట్రంలో ప్రధానంగా సంక్షోభానికి గురవుతున్న వర్గాలలో స్త్రీలు, పిల్లలు ఎక్కువ. లేబర్ మార్కెట్‌లో ఎటువంటి నిపుణతలు లేకుండా అతితక్కువ వేతనాలు, పని దొరకకపోవడం మూలంగా అభద్రతకు గురవటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో స్త్రీలు, పిల్లలే ముఖ్యులుగా ప్రస్తుతం కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్త్రీల జీవితాల్ని పరిశీలిస్తే మరీ ముఖ్యంగా గ్రామీణ స్త్రీల జీవితాల్ని పరిశీలిస్తే పైన చెప్పిన ‘స్వశక్తి’ వంటి నూతన అంశాలు స్పష్టమవుతాయి.
ఆర్థిక సంస్కరణ, ప్రపంచీకరణల మొదటిదశ 80లలో వేగం పుంజుకున్నది. అంతకు ముందు స్త్రీలు వామపక్ష వుద్యమంలో భాగంగా రాజకీయ లక్ష్యాలతో పనిచేసిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రానిది. 70ల మధ్య ప్రాంతం నుంచి ప్రత్యేక స్త్రీల సంఘాలుగా కూడా ఏర్పడి స్త్రీలు వుద్యమాలను నిర్మించారు. 80లలో కొత్తగా రూపం పోసుకుంటున్న స్వచ్ఛంద సంస్థలు (ఎన్.జి.ఒ) ప్రత్యేక స్త్రీల సంఘాలను ఏర్పరచి కార్యక్రమాలను నిర్వహించటం కనిపిస్తుంది. 90ల దశకంలో ఆంధ్ర రాష్ట్రమంతటా సారా వ్యతిరేక వుద్యమం వూపందుకుంది. దీనికి వామపక్ష స్త్రీల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా మద్దతుగా నిలిచాయి. ఉద్యమంలో నిర్ధిష్టమైన పాత్ర మాత్రం గ్రామీణ స్త్రీలదే. అయితే ఈ ఉద్యమం తర్వాత వచ్చిన పరిణామాలలో ఒక కీలక అంశం వుంది. గ్రామీణ స్త్రీలు ”మా వూరికి సారా వద్దు” అనే నినా దాన్నే ప్రధానంగా ఉద్యమ లక్ష్యంగా నిలబెడితే మధ్యతరగతి వర్గం దృక్పథాన్ని పుణికిపుచ్చుకున్న స్వచ్ఛంద సంస్థలు, వామపక్షవాద పార్టీలన్నీ కూడా సంపూర్ణ మద్యపాన నిషేధాజ్ఞను సాధించాయి. దీని పర్యవసానం గురించి మాట్లాడటం అంటే చెప్పిందే తిప్పి చెప్పటం అవుతుంది. ”సంపూర్ణ మద్యపాన నిషేధం” అంటే మనమున్న వ్యవస్థలో మద్యం మారాజులకు ఒక వరమే తప్ప, పేద ప్రజానీకానికి పనికొచ్చేదిగా కాదని ఆంధ్రరాష్ట్రం ఉదాహరణ ఒక్కటే కాదు గుజరాత్ వంటి అనుభవాలు కూడా మనకున్నాయి.
సారా వ్యతిరేక ఉద్యమ పరిణామాలలో కీలకమైనది – స్త్రీలు పొదుపు ప్రారంభించడం. దీనికి ప్రభుత్వ ప్రోద్బలం కూడా తోడయింది. అప్పటి తెలుగుదేశం (ఎన్.టి.ఆర్.) ప్రభుత్వ విధానాల మూలంగా 2 రూపాయలకు కిలో బియ్యం కొనగలిగే పరిస్థితి వుండేది. గ్రామ గ్రామానికీ సారా పంపిణీని తిరస్కరించి స్త్రీలు కొన్ని జిల్లాలలో పొదుపు కార్యక్రమాన్ని సక్రమంగా కొనసాగించగలిగారు. అయితే ఆ విధంగా కూడగట్టిన కోట్ల రూపాయల్ని ఏ విధంగా వినియోగించాలనే ఆలోచన ప్రభుత్వం అప్పటి పరిస్థితుల్లో చేయలేకపోయింది.
1995లో ఐక్యరాజ్యసమితి సంస్థలలో భాగమైన యు.ఎన్. డి.పి. చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఆంధ్ర ప్రభుత్వం స్వయంగా స్వయం సహాయక బృందాల్ని ఏర్పరచడం ప్రారంభించింది. కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంట్లలో పొదుపు, అప్పు (ఊనీజీరితీశి బిదీఖి బీజీలిఖిరిశి) అనే వ్యూహంతో అటు పేదరిక నిర్మూలనకు, ఇటు స్త్రీల విముక్తికి దారితీసే ఒకే ఒక సాధనంగా రూపొందించడం జరిగింది. ఇక్కడ కనిపించే వ్యూహంలో వ్యవస్థ స్త్రీల అవసరాలను తనలో విలీనం చేసుకునే ప్రయత్నం ఒకపక్క నిర్వీర్యం చేసే ప్రయత్నం మరోపక్క కనిపిస్తాయి. తరువాత 1995, 2000, 2001, 2002, 2003లలో వరుసగా తయారయిన అంతర్జాతీయ సంస్థల డాక్యుమెంట్లలో పేద స్త్రీల సాంఘిక సమీకరణ గురించి విస్తృత ప్రస్తావనలు కన్పిస్తాయి. రిపోర్టులలో ఇప్పటి వరకు లక్షల సంఖ్యలో పెరిగిపోతున్న స్వయం సహాయక బృందాలను ఆంధ్ర రాష్ట్రపు జెండర్ రెవల్యూషన్‌గా ప్రపంచ బ్యాంకు ప్రపంచమంతటా చాటించటం మనందరికీ తెలిసిన విషయమే.
ఐతే ఈ స్వయం సహాయక బృందాలకు వున్న లక్ష్యాలేమిటి? వీటన్నిటి సమూహాలు సంఘటితమైతే ఒక పెద్ద వుద్యమంగా రూపొందే అవకాశం వుందా? ఒక ప్రత్యేక రాజకీయ శక్తిగా ఇవి పనిచేయగలవా? పాలసీ ఎజెండాలను ప్రభావితం చేయగలవా అనే ప్రశ్నలు ఎదు రౌతాయి.
ఎస్‌హెచ్‌జీలు – నిర్మాణ రూపాలు
స్వయం సహాయక బృందాలలో విభిన్న రకాలు వున్నాయి. 1. బృందాలు తమ సంస్థలను తామే నిర్వహించుకునే పద్ధతి. ఉదాహరణకి సి.డి.ఎఫ్, రోషన్ వికాస్, ఎ.ఎస్.పి. కొన్నిసార్లు వీటికి విదేశీ సంస్థల పెట్టుబడులు కూడా వుంటాయి. 2. కేవలం పొదుపు, వడ్డీలపై కేంద్రీకరించే ద్రవ్యసంస్థలు. ఇవి నిజానికి బ్యాంకులు, భీమా సంస్థలలాగానే పనిచేస్తాయి. ఉదాహరణకి బేసిక్స్, స్పందన, స్వాస్, షేర్. 3. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రత్యక్షంగా బృందాలను నిర్వహించే పద్ధతి. 4. డ్వాక్రా, సెపాప్, వెలుగు వంటి ప్రభుత్వ పథకాలు బృందాలను నిర్వహించే పద్ధతి.
ఈ పద్ధతులన్నిటిలోనూ గ్రామాలలోని ఏ స్త్రీ అయినా సభ్యత్వం పొందవచ్చు. సభ్యులు చాతనైనంత పొదుపు చేసుకోవచ్చు. కానీ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం నిర్వహించే పథకాలలోని స్వయం సహాయక బృందాలు అన్నింటిలోనూ ఆర్థిక, సాంఘిక, సాధికారికత ప్రధాన అంశంగా వుంటుంది. అంతే కాకుండా నాయకత్వం, ఆర్థిక కార్యక్రమాలను చేపట్టే నిపుణత, దృక్పథంలో మార్పులు వచ్చే విధంగా శిక్షణను ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యత. కార్యక్రమాలలో కొన్ని ఆరోగ్యం, విద్య, తాగునీరు, పారిశుధ్యం వంటి కనీస అవసరాలను మెరుగుపరిచే బాధ్యత కూడా అందులో భాగం.
స్వయం సహాయక బృందాల స్వరూపంలో సమస్యలు
ప్రధానంగా పొదుపు మీద కేంద్రీకరణ వున్న కారణంగా పొదుపు చేయలేని నిరుపేద స్త్రీలకు ఇక్కడ స్థానం ఉండదు. చాలా సందర్భాలలో డ్వాక్రా వంటి బృందాలలో ఆధిక్యత పరిస్థితులు మెరుగ్గా వున్న స్త్రీలదే వుంటుంది. సాధారణంగా ఈ బృందాలన్నీ చిన్న టౌన్‌లకు, పట్టణాలకు సమీపంలో వున్న గ్రామాలలో ఎక్కువ కనిపిస్తాయే తప్ప మారుమూల గ్రామాలలో గిరిజన గ్రామాలలో పనిచేస్తున్న దాఖలా లేదు. అత్యధిక భాగం బృందాలు తక్కువ స్థాయిలో పొదుపు చేసుకుని ఎటువంటి ఆర్థిక వనరుల్ని పెంపొందించుకునే శక్తులు లేనివిగానే వుండడం కనిపిస్తుంది. దీనికి కారణం పొదుపు చేసుకున్న మొత్తాలు ఎక్కువ లేకపోవటం, వాటికి అనుగుణంగా బ్యాంకులు ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి ఎటువంటి సహకారం అందకపోవటం ప్రధానం. దాని ఫలితంగా కొత్త ఆలోచనలతో ఆర్థిక కార్యక్రమాలని రకరకాల స్థాయిలలో బిజినెస్ స్థాయిలని పెంచు కోవడానికి అవకాశం లేకపోవటం కనిపిస్తుంది. ఫైనాన్స్ సంస్థలు కూడా ఇటువంటి కార్యక్రమాలలో స్త్రీలు, పురుషుల ఆలోచనలకు తేడాలుంటాయని గ్రహించకపోవటం ఒక పెద్ద లోపం. తరతరాలుగా వ్యవసాయ రంగంలో కూలిచేస్తూ బతికిన స్త్రీలు ఒక్కసారిగా చిన్నపాటి మొత్తాలతో బిజినెస్‌లు చేయటం అంత సులువైన విషయం కాదు. ఆ బిజినెస్‌ని చిన్నస్థాయి నుంచి పైస్థాయి వరకు తీసుకెళ్ళే శక్తి సామర్ధ్యాలు, స్తోమత, మార్కెట్ సంబంధాలు స్త్రీలకు వుండక పోవచ్చు. మొదటగా వారి ఆత్మస్థైర్యం లోపించవచ్చు. కుటుంబ పరిధి బయట సమస్యల్ని పరిష్కరించుకోగలిగే శక్తి లోపించటానికి స్త్రీలను కట్టిపడేసే సాంఘిక విలువలు దానికి కారణం. ఆర్థిక, రాజకీయ రంగాలలో స్త్రీల పాత్రను కుదించే అవరోధాలు కంటికి కనిపించనివిగా వుంటాయి. మగవాళ్ళతో స్వయం సేవక బృందాలు లేకపోవటం అనేది మరొక సమస్య. పెద్ద మొత్తాలతో వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని నిర్వహించగలిగే అవకాశం మగవాళ్ళకెక్కువ. మగవాళ్ళ మీద ఏ బాధ్యతా పెట్టక పోవటం ఆడవాళ్ళను మరింత మానసిక ఘర్షణకు గురిచేస్తుంది. అంతేకాకుండా స్త్రీల స్వయం సేవక బృందాల ద్వారా పెద్ద మొత్తాల అప్పులు తీసుకోవటానికి, పురుషుల ప్రోద్బలం కుటుంబాలలో ఎక్కువవుతుంది.
ఇన్ని సమస్యలతో కూడుకున్న పరిస్థితిలో కూడా సభ్యత్వం తీసుకున్న స్త్రీలందరూ క్రమం తప్పకుండా అప్పును తీర్చగలగటం, దాదాపు 98 శాతం అప్పు తిరిగి ఇవ్వటం సర్వసాధారణం. అప్పులు ఎగ్గొట్టడం అనే పరిస్థితి ఎన్నడూ ఉండదు. ఇటువంటి క్రమశిక్షణతో మంచి పేరు తెచ్చుకున్న ఈ సంస్థలు, బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలను విపరీతంగా ఆకర్షించాయి. మైక్రో ఫైనాన్స్ సంస్థలు నిర్మించే బృందాలలో ఎక్కువ మొత్తాలను (వడ్డీరేటు కూడా ఎక్కువ) అప్పులు ఇవ్వటానికి అవకాశం ఏర్పడింది. ఒక్కసారిగా ఐసిఐసిఐ వంటి బ్యాంకులు పెద్ద మొత్తాలలో అప్పులు ఇవ్వడానికి ముందుకు రావటం కొన్ని కొత్త సమస్యలకు దారితీసింది. పెద్ద మొత్తాల్ని అప్పుగా తీసుకోవటానికి స్త్రీలు సాహసించకపోయినా ఇండ్లలో మగవాళ్ళ ప్రోద్బలం, వత్తిడితో అప్పులు తీసు కోవటం వాటిని సరిఅయిన సమయానికి లెక్కకట్టి తిరిగి ఇచ్చే స్తోమత లేని స్త్రీలు విపరీతమైన మానసిక వత్తిడికి గురవడం సమస్య రూపాన్నే మార్చేసింది. దానికి తోడు అప్పు ఇచ్చిన ఫైనాన్స్ సంస్థలు వసూళ్ళకి నిరంకుశ ధోరణిని అవలంబించడం కొన్ని సందర్భాలలో జరిగింది. కొన్ని సందర్భాలు స్త్రీల ఆత్మహత్యలకు కూడా దారితీశాయి. మగవారి బృందాలు లేకపోవడం మూలంగా వచ్చే సమస్యలన్నీ స్త్రీల బాధ్యతలే అయినాయి. ఇవన్నీ చూస్తే వచ్చే అవాంతరాల్ని అధిగమించటానికి నిరంతరం స్త్రీలకు అండనిచ్చే సంస్థలుండాలి అని స్పష్టమవుతుంది.
అంతే కాకుండా బృందాలలో అధికభాగం దళితకులాల స్త్రీలకు చెందినవి కావు అని ఈ మధ్య జరిగిన అధ్యయన నివేదికలో తెలుస్తుంది. (ఎమ్ హార్పర్ అధ్యయనం) అట్లాగే స్త్రీలపైన ఆధారపడిన కుటుంబాలు కూడా ఇందులో కనిపించవు. రోడ్డుకు దగ్గరగా వున్న గ్రామాలలో బృందాలు సక్రమంగా ఉన్నాయేకాని, మారుమూల ప్రాంతాలలో వున్న దాఖలాలు లేవు.
స్వయం సహాయక బృందాల రాజకీయ పాత్ర – సాధికారికత
ఈ బృందాల సమూహాలన్నీ గ్రామస్థాయిలో గ్రామ సంఘంగా ఏర్పడినా దానికి ఎటువంటి రాజకీయ ప్రాతినిధ్యమూ లేదు. పంచాయితీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలో చోటు వుంది. స్వయం సహాయక బృందాలకు అది లేదు. డ్వాక్రా వంటి ప్రభుత్వ పథకాల నిర్వహణలో రాజకీయ ప్రాతినిధ్యం వున్న పంచాయితీరాజ్ సంస్థలను కూడా నీరుగార్చి స్వయం సహాయక బృందాలను ప్రత్యక్షంగా ప్రభుత్వ విభాగాల అజమాయిషితో నిర్వహించటం జరుగుతున్నది. దీని మూలంగా అధికారంలో వున్న రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలుగా స్వయం సహాయక బృందాలు జీవించగలవేగాని స్వయం ప్రతిపత్తి వున్న రాజకీయ సంఘాలుగా కాదు. ఎన్నికల ముందు ప్రభుత్వాలు ఎరగా చూపించి స్వయం సహాయక బృందాల నాయకత్వానికి కొన్ని సౌకర్యాలు కల్పించటం అందరికీ తెలిసిన విషయమే. పై నుంచి కింది వరకు కేంద్రీకృతమైన రాజకీయ నిర్మాణంలో పనిముట్లుగా మిగిలి పోతున్నాయే తప్ప స్వయం సహాయక బృందాలకు పంచాయితీల నుంచి ప్రభుత్వం వరకు ఎవరినీ నిలదీసే స్తోమత లేదు. ఈ సందర్భంలో భాగస్వామ్యానికి వున్న విలువ ఏమిటో సరిగా అంచనా కట్టాలి. (ఇదే రాజ్య వ్యవస్థ 73, 74వ రాజ్యాంగ సవరణ లతో 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా (లోక్‌సభ) పంచాయతీ రాజ్ వ్యవస్థ కొత్త జీవాన్ని పోసుకుంది. ఆంధ్రలో ఈ చట్టం 1994లో వచ్చింది. ఎన్నికలు ప్రతి అయిదు సంవత్సరాలకు ఖచ్చితంగా జరగాలనీ, నిమ్న కులాలకు, గిరిజనులకు, స్త్రీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని, వాటికి సక్రమం గా నిధులందచేయాలనీ ఈ సవరణ లక్ష్యం. దీనితో రాజకీయ ప్రతిపత్తి లేని కులాలు, స్త్రీలకు కొంత ప్రాతినిధ్యానికి అవకాశం ఏర్పడింది. స్త్రీలకు క్రమేణా, నాయత్వ సమర్ధతలను పెంచుకునే అవకాశం మొదటిసారి కలిగింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా స్త్రీలకు అండగా నిలిచిన సందర్భాలున్నాయి).
ఎన్నికలు స్త్రీలకు స్థానిక రాజకీయాలలో చోటు కల్పిస్తూనే ఇంకొకవైపు, స్వయం సహాయక బృందాలను స్థానిక రాజకీయ సంస్థలకు ఆ రాజకీయ సంస్థలకు సమాంతరంగా నిర్మించే క్రమం ఆశ్చర్యం కలిగిస్తుంది.
పంచాయితీరాజ్ గత చరిత్ర చూస్తే 1950-60లలో దేశం మొత్తంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. అన్ని రాష్ట్రాలలోకీ మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రలు ముందుంటే ఆంధ్ర రాష్ట్రానిదే ప్రథమస్థానంగా ఉండేది. శాసనసభ సభ్యులతో పోలిస్తే జిల్లా పరిషత్ ఛైర్మన్‌కు ఎక్కువ రాజకీయ అధికారం, పలుకుబడి ఉండేవి. ఒక బ్లాక్‌లో ఉన్న ప్రభుత్వ సంస్థలన్నీ – పరిశ్రమలు, నీటిపారుదల, ఆరోగ్యం, జనాభా లెక్కల వంటి విభాగాలన్నీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసరుకు రిపోర్టు చేయాల్సిన బాధ్యత ఉండేది. క్రమేణా ఈ పరిస్థితిలో మార్పు చోటుచేసుకుంది. పంచాయితీరాజ్ వ్యవస్థని పూర్తిగా అవినీతికరం అనే ముద్రతో అన్ని మూలల నుంచీ దాడి ప్రారంభమైంది. గ్రామసర్పంచ్‌లు, సమితి ప్రెసిడెంట్లు, తాలుకా జిల్లా పంచాయితీ అధికారులను దుశ్శాసనుల్లాగా చిత్రించిన సాహిత్యం, సినిమాలు (60, 70లలో) కొల్లలుగా వచ్చాయి. పంచాయితీరాజ్ వ్యవస్థ అధికారుల్ని చేజిక్కించుకున్న వ్యక్తుల అవినీతి, కులపక్షపాతం, బంధుప్రీతి మూలంగా ఈ వ్యవస్థ ప్రజలకు బొత్తిగా నిరుపయోగమై పోయిందనే వాదనలు వ్యవస్థను పూర్తిగా నీరుగార్చివేశాయి. ఆ వాదనల్లో నిజం ఉన్నా, వాటి పర్యవసానాలు మాత్రం పూర్తి వేరుగా కనిపిస్తున్నాయని ఇప్పుడర్థమౌతోంది. 70ల వరకు ‘చిన్నరైతుల అభివృద్ధి సంస్థ’ (ఎస్.ఎఫ్.డి.ఎ) వంటి సంస్థలు ప్రారంభమై క్రమంగా జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజెన్సీ (డిఆర్‌డిఎ)గా రూపుదిద్దుకున్నాయి. ఇప్పుడు గ్రామాలలో అమలయ్యే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఆర్.డి.ఏ విభాగం ద్వారానే జరుగుతాయి. విద్య, వైద్య విభాగాలు రాష్ట్ర రాజధాని నుంచీ కింది మండల్ స్థాయి వరకు లైన్ డిపార్ట్‌మెంట్‌ల నిర్మాణంలో పనిచేస్తుంటాయి. ఇకపోతే మండల్ పరిషత్ అధీనంలో ఉన్నది గ్రామాల తాగునీటి సౌకర్యం, విద్య వ్యవహారాలే తప్ప మిగతా వన్నీ అటు డి.ఆర్.డి.ఏ లైన్ విభాగాల ఆధ్వర్యంలోనే ఉంటాయి.
ఈ మొత్తం క్రమాన్ని పరిశీలిస్తే స్థానిక రాజకీయ కేంద్రాల నుంచి అధికారం క్రమేణా ప్రభుత్వ యంత్రాంగం వైపుకు దారి ఎట్లా మళ్ళిందనే విషయం అర్థమవుతుంది. పేద ప్రజల కోసమే వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చామని ఇచ్చే వివరణ వీటన్నింటిలో ప్రధానం.
పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా మళ్ళీ సమాంతర వ్యవస్థల నెందుకు ఏర్పరచారని గతంలో చంద్రబాబునాయుడిని ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ ఛైర్మన్ కె.సి.పంత్ ప్రశ్నించాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని, అభివృద్ధి కార్యక్రమాల మీద అసలైన ఆసక్తి ఉన్న ప్రజాసంస్థలు (నీటి వినియోగదారుల సంఘం, స్వయం సహాయక బృందాలు) చాలా ముఖ్యం అని చంద్రబాబు సమాధానం.
స్వయం సహాయకత ఇందులో ఎంతవరకు వుంది అని మనకి మనం ప్రశ్నించుకోవాలి. స్త్రీల జీవితాల్ని మెరుగుపరచడానికి వారి ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం పెరగటానికి అక్షరాస్యత, విద్య, ఆరోగ్యం వంటి అంశాలే కాక కుటుంబాన్ని నిర్వహించటానికి అవసరమైన బండచాకిరీ నుంచి కూడా స్త్రీలకు విముక్తి కావాలి. వీటన్నిటితో పాటు వారికంటూ స్వంత వనరులంటూ వుండాలి. కొంత మేరకు స్వయం సహాయక బృందాల వల్ల దైనందిన వినియోగానికీ, అత్యవసరాలకీ కొంత వెసులుబాటు లభిస్తున్నా, వారి జీవితాలలో మౌలిక మార్పులు మాత్రం రాలేదు. స్వయం సహాయకతలో పిల్లల సంరక్షణ, కుటుంబం లోని వృద్ధుల సంరక్షణ, ఇతర ఇంటి పనులు అన్నీ స్త్రీల బాధ్యతలుగానే కొనసాగుతున్నాయి. కానీ వేటిలోనూ ప్రత్యేకమైన వెసులుబాటు కలిగిన సాక్ష్యం లేదు. అటు స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ కొత్త తరహా ఆలోచనల్ని రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించదు. అవన్నీ అటుంచి ఈ బృందాలపై అదనంగా వేసే భారాలే పెరుగు తున్నట్లు కనిపిస్తుంది.
స్వయం సేవా బృందాలు ఒక కొత్త తరహా మార్కెటింగ్ వ్యూహంగా రూపొందాయి. మారుమూల గ్రామాలకు సేవలందిం చటం కష్టతరమే కాకుండా, విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి బ్యాంకులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నాయి. అదే మార్గంలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, చివరికి బహుళజాతి సంస్థలు కూడా ప్రయాణ ిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ పక్షపత్రికలో (2003, జులై) నాయుడు ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు, ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనటమేకాక, దోపిడీదొంగలను, నక్సలైట్లను, సంఘ వ్యతిరేక శక్తులను తిప్పికొట్టటానికి పూనుకోవాలని పిలుపు నిచ్చాడు. వీటిద్వారా ఈ బృందాలు రాజకీయాల్లో పాల్గొనవచ్చని ఆయన ఉద్దేశం.
కుటుంబ నియంత్రణ కార్య క్రమాలనుంచి అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాల అమలు, బాధ్యత ఈ బృందాలదే. రాష్ట్రంలో జనాభా వుత్పత్తి రేటు గణనీయంగా తగ్గిపోవ టాన్ని గొప్ప విజయంగా మన ప్రభుత్వం, దేశం, ప్రపంచ బ్యాంకులు చాటుతున్నాయి. కాని నిజానికి ఎన్నో సందర్భాలలో కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో పాల్గొనక పోతే బృందాలకు అప్పుపుట్టదని ఇతర పథకాలకి అర్హత వుండదనే బెదిరింపులతో బలవంతంగా వత్తిడి పెట్టినట్టు సాక్ష్యాలు కూడా వున్నాయి. ఈ నిర్ణయాలన్నీ ఎంతవరకు సొంత చొరవతో స్త్రీలు చేయగలుగుతారు అనేది పెద్ద ప్రశ్న. బహుళ జాతీయ సంస్థలకి కూడా ఈ బృందాలే అవసరం. నల్గొండ జిల్లాలో హిందుస్థాన్ లివర్ కంపెనీ నిర్వహించిన అధ్యయనంలో స్త్రీలు ప్రతి నెలా కుటుంబం మీద పెట్టే ఖర్చుల వివరాలన్నీ అంచనా వేయటం జరిగింది. సబ్బులు, తలనూనెలు, షాంపులు, ఫేర్‌అండ్ లవ్‌లీ క్రీములు వాడటంపై ఎంత ఖర్చు పెడతారని తెలుసుకోవటం ఆ అధ్యయనానికి ప్రధాన లక్ష్యం. ఇప్పటికే గ్రామాలలో కంపెనీల విస్తరణకు అవకాశాలు ఏర్పడు తున్నాయని స్పష్టమవుతోంది. స్త్రీలను గ్రామాలలో ‘రూపాయికి ఒక ప్యాకెట్’ వినియోగదారులుగా తయారుచేసే మార్కెట్ విస్తరణకు ఈ ధోరణి దారితీస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి డబ్బు పట్టణాలకు, విదేశాలకు తరలివెళ్తుందే కాని, స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచడానికి కాదనే విషయం అర్థమవుతూనే వుంది.
ఇంత చేసినా స్త్రీల జీవితాల్లో పెద్దస్థాయిలో దుష్పరిణామాలు ఎదురయితే ఆదుకుని అండగా నిలిచే సంస్థలు ఇప్పటికీ కరువే. ఈ క్రమం అంతా నాణానికి ఒక వైపు అయితే, రెండోపక్క అంశం బ్యూరోక్రటైజేషన్. ఎన్నుకోబడ్డ స్థానిక రాజకీయ ప్రతినిధుల ప్రాముఖ్యత తగ్గిపోయి, పాలనా అధికార యంత్రాంగం బలం రెండింతలుగా పెరగడం ఇంకొక అంశం. వ్యాసం ప్రారంభంలోనే ఆధునిక వ్యవస్థ లక్షణాల గురించి ప్రస్తావన వచ్చింది. యంత్రాంగం కొత్తగా శక్తిని సంతరించుకోవడం కూడా అందులో ఒకటిగా చెప్పుకున్నాం. కొత్తగా పరిపాలనార్థం రూపొందించిన ప్రభుత్వ విధానాలు, పాలసీలతో స్థానిక రాజకీయ ప్రతినిధుల స్థానంలో పరిపాలనా యంత్రాంగం అధికారాన్ని పటిష్టం చేసుకోగలుగుతోంది. ఈ అంశానికి ఎస్.హెచ్.జి ఉద్యమం చక్కటి ఉదాహరణ.
ఎస్.హెచ్.జి.ఉద్యమానికి నేపథ్యం గురించి ప్రస్తావించినప్పుడు సారా వ్యతిరేక ఉద్యమం గురించి చెప్పుకున్నాం. అప్పటి స్త్రీల పొదుపు లక్ష్మి కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి మంచి స్పందన వచ్చింది. ‘పేదరిక నిర్మూలన పథకం’లో భాగంగా ‘వెలుగు’ సంస్థను స్వయం ప్రతిపత్తి గల సంస్థగా ప్రభుత్వం రూపొందించింది. బూజుపట్టిపోయిన అధికార యంత్రాంగపు సంస్కృతి, వాసనలు సోకని ఒక కొత్త పద్ధతిలో ‘వెలుగు’ కోట్ల రూపాయల బడ్జెటుతో గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను నిర్వహించడానికి పూను కుంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags