ఒక జాతీయ స్థాయి సమావేశంలో పాల్గొడానికి నేను ఇటీవల లక్నో వెళ్ళాను. నవాబీ సంస్కృతి అడుగడుగునా కన్పించే లక్నో గురించి నేను విన్నది వేరు. కన్నది వేరు.
ఎయిర్‌పోర్ట్ నుంచి సిటీలోకి వస్తూంటే కిలోమీటర్ల మేర నిర్మితమౌతున్న మెగా పార్కుల్ని చూసి టాక్సీ డ్రైవర్‌ని ”బయ్యా! ఏ క్యాహై” అని అడిగితే ‘మాయనగర్. మాయావతి నిర్మిస్తున్న కాన్షిరామ్‌పార్క్, అంబేద్కర్‌పార్క్’ అని ఒక ఛీత్కారపు గొంతుతో అన్నాడు. ”ఆమె జనం కోసం చేసిందేమీ లేదు. విగ్రహాలు పెట్టడం, వాటిని కూల్చడం మళ్ళీ పెట్టడం ఇదే పని” అన్నాడు కోపంగా. దారి పొడుగునా పెద్ద పెద్ద హోర్డింగులు. మాయావతి ఫోటోలు. మాయావతి విగ్రహాలు.
టాక్సీడ్రెవర్ చెప్పినట్టు ఇది లక్నోనా? మాయనగరా? అన్పించింది. నాకు ఆసక్తి కల్గించింది ముఖ్యమంత్రి మాయావతి మహా ప్రచార హోరు కాదు. మరెవరు? నేను ఉత్తర్ ప్రదేశ్ వెళితే తప్పకుండా కలవాలనుకున్న వ్యక్తి సంపత్‌పాల్ దేవి. లక్నో నుండి సమావేశంలో పాల్గోన్న మహిళల్ని అడిగాను. సంపత్‌పాల్‌ని కలిసే అవకాశముందా? అని. ఆమెని ఈ రెండు రోజుల్లో కలవడం కష్టమని ఆమె బుందేల్‌ఖండ్ జిల్లాలో వుంటుందని చెప్పినపుడు అయ్యో! అన్పించింది.
ఎవరీ సంపత్‌పాల్ దేవి? ఏం చేసిందని నాకింత ఆసక్తి ఏర్పడింది ఆమె పట్ల? భారతదేశంలోని అతిపేద జిల్లాల్లో ఒకటైన బుందేల్‌ఖండ్ జిల్లాలో పుట్టింది సంపత్. పన్నెండేళ్ళ వయస్సుకే ఐస్ క్రీమ్‌లమ్ముకునే వ్యక్తితో ఆమె పెళ్ళి జరిగింది. ఐదుగురు పిల్లల తల్లి. ప్రస్తుతం ఆమె వయస్సు నలభై ఒకటి. తిరుగబడే లక్షణాలు ఆమె రక్తంలోనే వున్నాయి. చిన్నపుడు తల్లిదండ్రులు ఆమెను పాఠశాలకు పంపడానికి తిరస్కరించినపుడు ఆమె గ్రామంలోని గోడలమీద, దుమ్మునిండిన రోడ్ల మీద రాస్తూ తన నిరసనని తెలియచెప్పింది. చేసేదేమీ లేక ఆమె గొడవ భరించలేక స్కూల్‌కి పంపారు. అయితే పన్నెండేళ్ళకే పెళ్ళి చేసి, భర్త ఇంటికి పంపేసారు. 13 సంవత్సరాలకే మొదటి బిడ్డకు తల్లయింది సంపత్.
కొన్నేళ్ళకి ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తగా ఉద్యోగంలో చేరింది కానీ ఆ ఉద్యోగం ఆమెకు తృఫ్తి నియ్యలేదు. ”నా కోసమే బతకాలని నాకు లేదు. ప్రజల కోసం పని చెయ్యాలని కోరిక” అంటుంది సంపత్‌పాల్. గ్రామంలోని స్త్రీలను ఐక్యపరిచి మీటింగ్‌లు పెట్టేది. భర్తల దౌర్జనాలకు గురై ఇళ్ళనుండి వెళ్ళగొట్టబడిన స్త్రీలు, భర్తలు రెండో పెళ్ళిళ్ళు చేసుకుని భార్యల్ని నిర్లక్ష్యం చేసి కేసులు, ఎందరో బాధిత స్త్రీలు ఈమె దగ్గరకు వచ్చేవారు. వీరందరి కోసం ఏమైనా చెయ్యాలని ఆలోచించిన సంపత్ ”గులాబీ గ్యాంగ్” కు రూపకల్పన చేసింది.
2006లో గులాబీ గ్యాంగ్, సంపత్‌పాల్‌దేవి ఆ గ్యాంగ్ లీడర్‌గా ప్రారంభమైంది. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళల్ని ఆదుకోవడానికి, తప్పుచేసిన భర్తల్ని నయనా భయానా సరిదిద్దడానికి ఈ గ్యాంగ్ పనిచేస్తుంది. ప్రస్తుతం గులాబీగ్యాంగ్‌లో 20,000పైగా మంది సభ్యులుగా వున్నారు. ఏ ఇంట్లో నయినా హింస జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే గ్యాంగ్ సభ్యులు ఆ ఇంటికి వెళతారు. భార్యల్ని కొట్టే భర్తల్ని కలిసి, ఇకపై కొట్టరాదని హెచ్చరిస్తారు. భర్త వీళ్ళ మాట విన్నాడా సరే లేకపోతే పెద్ద పెద్ద వెదురు బొంగుల్ని తీసుకుని ఆ ఇంటికెళ్ళి నాలుగు దెబ్బలు తగిలించైనా దారికి తెస్తారు. ”నేను ఒక కర్రతో గ్రామంలో తిరుగుంటే మగవాళ్ళు భయపడతారు. వాళ్ళను భయపెట్టడానికే మేం కర్రలుపయోగిస్తాం. మేము ఎపుడూ ఇలాగే చేయం కానీ నా చేతిలోని కర్రహింసలకి దిగే పురుషుల మైండ్‌సెట్‌ని ఖచ్చితంగా మారుస్తుంది. నేను బలవంతుణ్ణి అని విర్రవీగే పురుషుడు మా కర్రకి తలవొంచాల్సిందే” అంటుంది సంపత్‌పాల్‌దేవి.
గులాబీ గ్యాంగ్ సభ్యుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. సంపత్‌పాల్ ఓ డొక్కు సైకిల్ మీద గ్రామాల్లో పర్యటిస్తూ, చెట్ల కింద మీటింగ్‌లు పెడుతూ, ఆ గ్రామంలోని సమస్యల గురించి చర్చిస్తూ, కొత్త సభ్యుల్ని ఆకర్షిస్తుంది. కుటుంబ హింసకి పాల్పడే భర్తల్ని సరిదిద్దే క్రమంలో ఆమె లెక్కలేనన్ని కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె మీదున్న నేరారోపణలు ఏమిటంటే – చట్టవిరుద్ధంగా సమావేశమవ్వడం, ప్రభుత్వ అధికారులపై దాడి చెయ్యడం, అల్లర్లకి పాల్పడడం ఇలా ఎన్నో నేరాలు ఆమె మీద ఆరోపించబడ్డాయి. వీటన్నింటితోను, బాధిత స్త్రీలతోను ఆమె ఉద్యమం ముందుకెళుతోంది. బాధిత స్త్రీలు గులాబీదండు కార్యకర్తలుగా మారి తోటి బాధితులకి అండగా వుండడం ఈ గ్యాంగ్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
గులాబీదండుకి, సంపత్‌పాల్‌కి మీడియా గొప్ప ప్రాధాన్యతనిచ్చి ప్రచారం కల్పించడం విశేషం. గులాబీదండుకి ఈ రోజు ఫ్రాన్స్ ఛాప్టర్ మొదలైంది. ఫ్రాన్స్ గులాబీకి సిసిలీ రొమానే నాయకత్వం వహిస్తూ ”నాకింకా కర్ర పట్టు కోవాల్సిన అవసరం రాలేదు. నా గులాబీ చీరను మాత్రం పారిస్ వీధుల్లో చింపి ప్రదర్శించాను” అంటుంది. బి.బి.సి లో సంపత్ మీద పెద్ద స్టోరీ వచ్చింది.
రాజకీయాల్లోకి రావాలని గానీ, డొనేషన్స్ సేకరించాలని గానీ సంపత్‌కు లేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయవతి ఒక దశలో సంపత్ తనకు రాజకీయంగా పోటీ అవుతుందేమోనని భయపడి గులాబీ దండును అంతం చేయాలని చూసి, కుదరక తన పార్టీలో చేరమని పిలిచినపుడు సంపత్ నిర్ధ్వంద్వంగా తిరస్కరించింది. మాయవతి అవినీతికి పాల్పడిందనేది సంపత్ ఆరోపణ. అవినీతి రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసే కన్నా వాటికి దూరంగా వుంటే మేలని ఆమె నమ్మకం.
” నా బలం బొంగు కర్రల్లో లేదు. గులాబీ దండు సభ్యుల్లో వుంది. ఏదో ఒక రోజు మేం ఢిల్లీని వొణికిస్తాం” అనే సంపత్ నిజంగానే ఏదో ఒకరోజు గృహహింసకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టొచ్చు.
భర్తలు (భరించేవాళ్ళు) కనుమరుగై కేవలం మొగుళ్ళే (హింసించేవాళ్ళు) మిగులుతున్న ఈ రోజుల్లో ఢిల్లీ సంగతి తర్వాత, గల్లీ గల్లీకో సంపత్ పుట్టాలి. వెదురు బొంగులో, ‘గోరంత దీపం’ సినిమాలోలాగా చింతబరికెలో పుచ్చుకుంటే తప్ప పెచ్చు మీరిపోతున్న హింసకి అడ్డుకట్ట వేయలేమోమో! రకరకాల హింసలకి పాల్పడుతున్న ”అత్యాధునిక” పురుషులూ జరభద్రం.గులాబీదండు వచ్చేస్తోంది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
సంపత్ పాల్
పేరులోనే వుంది సంపద.
అది ధైర్యం అనే సంపద.
అలాంటి గులాబీ దండు ఇక్కడ కూడా వుంటే ఎంత బాగుండేది ?
ఇప్పుడనిపిస్తోంది, లోక్ పాల్ జన ప్రతివిధుల్లో ఈ ధీరవనిత పేరు కూడా వుంటే బాగుండేదేమో అని.
సంపాదకీయం స్ఫూర్తిదాయకంగా వుంది.
అభినందనలు, అభి వందనాలు.
“వెదురు బొంగులో, ‘గోరంత దీపం’ సినిమాలోలాగా చింతబరికెలో పుచ్చుకుంటే తప్ప పెచ్చు మీరిపోతున్న హింసకి అడ్డుకట్ట వేయలేమోమో!” అని రాశారు.
ఇది తప్పు!
“గోరంత దీపం” సినిమాలో వాణిశ్రీ పాత్ర చింత బరికె పుచ్చుకున్నది, చెప్పుడు మాటలతో విడాకులు అడిగిన భర్తని బాదడానికి కాదు. ఆ చెప్పుడు మాటలు చెప్పి, తనని లొంగదీసుకోడానికి ప్రయత్నించిన విలన్ని బాదడానికి. చెప్పుడు మాటలు విని విడాకుల మీద సంతకం పెట్టమని అడిగిన భర్తకి, ముద్దుగా ఆవకాయ ముద్ద నోట్లో పెట్టీ, “ఏమండీ” అని నాజూగ్గా పిలుస్తూ, ఆ విడాకుల కాగితం మీద సంతకం పెట్టేసి, అప్పుడు విలన్ని బాదుతుంది, అసలు బాదాల్సిన వాళ్ళని వదిలేసి. ఆ విలన్ పోతే, ఇంకోడు రాడా? చెప్పుడు మాటలు వినే వాళ్ళని నాలుగు బాదాలి గానీ!!
– ప్రసాద్