స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే

– ఇంటర్వ్యూ : డా. సుహాసిని

నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలం, ఆత్మకూరు గ్రామంలో శ్రీ కుఱ్ఱా సుబ్బరామిరెడ్డి,రాజమ్మలకు 28-8-1942లో ప్రథమ సంతానంగా శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మ జన్మించారు. ఈమె ఆత్మకూరు కాలేజీలో పి.యు.సి. దాకా చదివారు.

భర్త దోర్నాదుల రామిరెడ్డి గారు స్కూల్సు ఇన్స్పెక్టరుగా పనిచేస్తూ వివిధ జిల్లాలలో అనే ప్రాంతాలలో వుండటం వల్ల ఆయా ప్రాంతాల గ్రామీణ సామాజిక ఆర్థిక స్థితి గతులను అవగాహన చేసుకోగలిగారు. ఆ స్త్రీల స్థితిగతులను విశ్లేషిస్తూ తన రచనా వ్యాసంగాన్ని 1958 లోనే ప్రారంభించి కథలు కథానికలు, గేయాలు, నవలికలు లేఖాసాహిత్యం ఇలా విభిన్న ప్రక్రియలలో సాహిత్యాన్ని రచించారు. అవి విభిన్న పక్షమాసదిన పత్రికలలో వెలువడ్డాయి. ఎన్నో రేడియో ప్రసంగాలు చేశారు. పెక్కు వేదికల మీదనుంచి తన కవితా పఠనాన్ని ప్రసంగాలని వినిపించారు.

1996లో 50 కథలతో తన కధా సంకలనం ”తరుణీ-తరంగాలు” ముద్రిం చారు. ఆ గ్రంధం తేది 13-10-1996 వ తేదీన ఆవిష్కరించారు.

నెల్లూరు సింహపురి సాహితీ సమాఖ్యవారు” ఓ పూవు పూసింది” అనే మినీ కథకు ప్రథమ బహుమతి శ్రీయుతులు డా|| బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రదానం చేసారు. రాష్ట్రమనోరంజని ఆర్ట్స్ వారు ”మానవతా ఆలోచించు” ”సారా తాగొద్దు” అనే గేయాలకు అవార్డు ప్రధానం చేశారు. ”జీవిత పుస్తకంలో ఓ పేజీ” అనే కవితకు 1998 సంవత్సరంలో కుందుర్తి అవార్డు నిచ్చారు. 2005 లో అసంతృప్తి అనే కవితకు మరోసారి రంజనీ కుందుర్తి అవార్డు స్వీకరించారు. వనితా జ్యోతిలో ప్రచురించ బడిన ”సింగిల్పేజీ” కథలను సంకలించి ”మరో వసంతం కోసం” అనే పేర 2000 లో ముద్రించారు.

”ఒక మధ్య తరగతి రెడ్డి కుటుంబంలో పుట్టి పి.యు.సి వరకు మాత్రమే చదివి, గృహిణిగా, తల్లిగా తన బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తూ జీవించిన ఒక స్త్రీలో ఇంతటి లోకావగాహన, సమాజం పట్ల, ముఖ్యంగా సాటి మహిళల పట్ల యింతటి సానుభూతి కలిగి వుండటం చాలా అరుదైన విషయమే! ప్రశంసించదగిన విషయమే” అంటూ సత్యవేటి శ్రీకాంత్ ప్రశంసించారు. (మరో వసంతం… ముందుమాట). ఆయన ”ఈ చిరు కథలు” లేఖల రూపంలో అభివ్యక్తం కావడం నాకు తెలిసినంతలో ఇదే ప్రధమం. ఇలాంటి అపూర్వ సంవిధానానికి శ్రీకారం చుట్టిన ఆధునిక మహిళ నా ఎరుకలో శ్రీమతి దోర్నాదుల సుబ్బమ్మగారే ప్రథములు” అంటారు శ్రీకాంత్.

”దోర్నాదుల సుబ్బమ్మగారి తలపులు ఎంత చురుకైనవో కలం అంత బలంగానూ సాగింది. అనుభూతులూ, అనుభవాలు, కలగలిసి ఆర్ద్రంగా, అందంగా ద్రవించి కమనీయతను ఆపాదించుకుని అక్షరాలై దొర్లాయి. శ్రీహిత పక్షపత్రిక (అరిగే రాజేశ్వరమ్మ సంపాదకత్వంలో వెలువడేది) ” ధనదృవం ఋణ ధృవం అనే కథకు రెండవ బహుమతి యిచ్చారు.

స్త్రీల సమస్యలని వివిధ దృక్కోణాల నుంచి పరిశీలించి చక్కని అవగాహనతో ఆలోచింపజేసే అమృత గుళికలు ఈ లేఖలు” అంటూ అభినందించారు శారదా అశోకవర్థన్.

”ఈవిడ రాసిందానికంటే చేసిందే ఎక్కువ” అంటూ ఖాదర్ షరీఫ్ (సోమశిల) ఏకవాక్యంలో ఆమె జీవితంలో ఆశయాలను ఆచరణను అనుసంధించుకున్న రీతిని ప్రశంసించారు.

సామాజిక సేవ-ఆచరణ :
ఆత్మకూరు గ్రామంలో ఇందిరాగాంధీ మహిళా మండలికి అధ్యక్షురాలిగా, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు అనేకం నిర్వహించారు. గ్రామీణ మహిళలకోసం అనేకసార్లు, అధ్యయన తరగతులు నిర్వహించారు. ప్రతి ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా చైతన్యవంతంగా నిర్వహించి ప్రముఖులను వ్యక్తలుగా పిలిపించి అనేక అంశాల మీద ప్రసంగాలు ఇప్పిస్తూ వారిని మరింత చైతన్య వంతులుగా తీర్చిదిద్ది వారి సమస్యలను వారే ఎదుర్కునేలా చేశారు. మహిళా సంచార గ్రంధాలయాన్ని నెలకొల్పి స్త్రీలకు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల వృద్ధుల కొరకు ఒక వృద్ధాశ్రమాన్ని ఆత్మకూరులో ప్రారంభించారు.

ముక్తకాలు :
సుబ్బమ్మగారు ”దోర్నాదుల అక్షర శతకం” అనే (అఆఇఈలరవళి)ని వినిపించారు. ఈ శతకాన్ని తన తల్లిగారైన 80 ఏళ్ళ కుఱ్ఱారాజమ్మ గారికి అంకితం ఇచ్చారు. ”అక్షరసత్యాల దర్పణం- అక్షరశతకం” అంటూ విశ్లేషణాత్మకమైన ముందుమాటను అద్దేపల్లి రామ్మోహన్రావు గారు అందించారు. శతకాలలో ఎలాగైతే ముందు రెండు పాదాలలో ఏదో ఒక లోక వృత్తాన్ని చెప్పి మూడో పాదంలో మనం ఊహించని రీతిలో ఒక అసాధారణమైన విరుపుతో సామెతనో, సామాన్యీకరణనో, అక అర్థాంతరన్యాసాన్నో చెప్పి పద్యాన్నే ఒక మలుపు తిప్పి లోకానికి ఒక నీతిని చెప్పే సాధనంగా మలచుకోవడం శతక పద్యాలలో చూస్తాము. అలాంటి పద్య కౌశలాన్ని సుబ్బమ్మగారు ప్రదర్శించారు.

కవిత్వం:
స్త్రీ జీవితాలలోని అణచివేత పీడనలపై ఒక ధిక్కార స్వరంగా సుబ్బమ్మగారి కవిత్వం సాహితీలోకానికి సుపరిచితం. నెల్లూరు జిల్లా మల్లాది సుబ్బమ్మగా మిత్రులచే పిలువబడే ఈమె చక్కని రచయిత్రిగా ప్రతిష్టాత్మక రంజనీ కుందర్తి అవార్డు గ్రహీతగా కవిలోకంలో ఒక గుర్తింపును సాధించారు. శ్వేత సంతకాలు రచయిత్రులలో ఒకరైన ఈమె కవితలు కొన్ని చూసినప్పుడు ఈమె కలం బలం అర్థమౌతుంది.

ఈమె కవిత్వంలో ఒక ”పంచ్” వుంటుంది. అది పితృస్వామ్యం ముఖం మీద గురి చూసి గుద్దుతుంది. అప్పుడిక అవాక్కవడం మనవంతౌతుంది.
”నేను రోజుకు రెండుసార్లు మరణిస్తాను
ఒకసారి వంటగదిలోను
మరోసారి పడక గదిలోను…” అని బలంగా పలికిన కంఠం పేరు సుబ్బమ్మ.

స్త్రీల మీద వుండే రెండింతల శ్రమభారం వారి అనుత్పాదక శ్రమ అయిన ఇంటిచాకిరి గురించి ఆమె యిష్టా యిష్టాలతో పనిలేకుండా పడకగదిలోనూ రాజ్యమేలే యాంత్రికమైన స్వేచ్ఛారహిత లైంగిక జీవనాన్ని గురించి ఏకకాలంలో ఎంతో పదునుగా చెప్తారు.
ఈమె దీర్ఘ కవిత ‘మున్ముందుకు’ ఈమె అక్షరాల పదునుకి ఓ మచ్చు తునక.

”ఇప్పుడు ఈ చీకటి ముఖం మీద
నేను ఉమ్మేస్తున్నాను.
ఈ వీర్య సమాజపు గోడుని బహిష్కరించి
సరికొత్తగా ప్రారంభమవుతాను…” అనడంలోని ధిక్కార రావం’ ఈ పితృస్వామ్యం మీద ఎక్కుపెట్టిన బాణమౌతుంది. వేదనల్ని బహిరంగం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తూ.

”భయాల్ని ఉరికొయ్యకు వేలాడదీసి శవం తల దగ్గర రక్త సంతకం చేయాలి”
”ఇప్పుడు కావల్సింది
కవిత్వం కాదు
ఒక ఖడ్గసృష్టి” అంటూ ధైర్యమనే కవచం ధరించాల్సిన అవసరాన్ని అద్భుతంగా ”భయాల్ని ఉరికొయ్యకు వేలాడదీయడంగా అభివర్ణిస్తారు.

‘రక్త సంతకం’ ‘ఖడ్గ సృష్టి’ లాంటి పదాల ద్వారా తిరుగుబాటు అవసరాన్ని నొక్కి చెప్తూ ‘కొత్తగా ప్రారంభమవుతాను’ అనడంలోని ఆశావాద దృక్పథం, సందేశాత్మకంగా ముందు తరాలకు కానుక చేశారు.

ఏ వాక్యానికావాక్యమే బాధల సంకెళ్ళ సడి వినిపిస్తూ ముందుకు నడిపిస్తుంది. వయసు తలుపు బలవంతాన తనకు తెలీకుండానే తెరుచుకోడం ”అంతా పోగొట్టుకున్నాక- నిద్ర కరువై మెలకువ కళ్ళతో నేను బానిసనై సూర్యుడితో పోటీపడాలి” అనడం వెను స్త్రీ మీద రెండు రకాల దోపిడి కనిపిస్తుంది.

సావిత్రి ‘బందిపోట్లు’ కవిత స్ఫురింప జేస్తూ అలాగే నడిచినా ఓ కొసమెరుపుతో మరో కోణాన్ని చూపించిన వాక్యాలలో సుబ్బమ్మగారి ధిక్కార రావాన్ని ఇలా వినిపిస్తారు.’న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అన్న మనుసంతతిని నిగ్గదీసి ప్రశ్నిస్తున్నట్లుంటుంది.

”మొగుడొస్తే
దీని రెక్కలకి కళ్ళెమేస్తాడు
తల్లయితే
దీని తిక్క కుదుర్తుంది
ముసిల్దయితే
దీని కొవ్వు కరుగుతుంది
అరె- నేను ఆడదాన్నయ్యేదెప్పుడు

” ఆడవాళ్ళంతా అంతే/ మరో దుఃఖానికి జన్మనిస్తారు” తరాలు మారినా ఆడవారి దుఃఖం మారని స్థితిని ఒక్క వాక్యంలో ఆవిష్క రిస్తారు.

”దేహంలో అంతా తెగిపోతున్న బాధలే
స్వప్నాలన్నీ తెగ్గొట్టబడ్డ జ్ఞాపకాలే” – ఇది స్త్రీల బాధలమయమైన ఛిద్ర జీవితానికి యిచ్చిన నిర్వచనం.
నెల్లూరు మాండలికం కలగలిసిన వ్యక్తీకరణతో స్త్రీలని మందలిస్తారు, అక్కున జేర్చుకుంటారు. పెద్దదిక్కై మందలిస్తారు.

”ఇక్కడ స్వరాలు లేవు, సమూహాలు లేవు, వసంతాలు లేవు అన్నీ శవాలే” అంటూ స్త్రీల బాధలని సామాన్యీకరించి
”పరవశించకే పాపాత్మురాలా
వాడు పాడెకడ్తాడు” అంటూ హెచ్చరిస్తారు
”ఎందుకే ఎర్రిబాగుల్దానా
”పతివ్రత” బిరుదుకోసం
ఈ నరకయాతన
”లే – ఈ ప్రపంచం విశాలమైంది” అంటూ సంప్రదాయపు ఉచ్చులో చిక్కి వ్యక్తులుగా మనని గుర్తించని భర్తలతో మనసు లేని బతుకు లొద్దంటారు. క్షణ క్షణం చస్తూ అలా బతకొద్దని అడుగు ముందుకు వేయమని ఉద్భోధిస్తారు. ప్రపంచం విశాలమైంది. బతక లేకపోవు అనే ఆశని అందిస్తారు.

సుబ్బమ్మగారి కవిత్వంలో చిక్కనైన కవితా గుణం నాలుకపై నిలిచిపోయేలా వుండి ”సత్కవి జీవించు ప్రజల నాలుకల యందు” అన్న జాఘవా గారి వాక్యాన్ని నిజం చేస్తూ నిత్యం జ్ఞాపకముంటాయి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.