సయ్యద్ నశీర్ అహమ్మద్
పరాయి పాలకుల పెత్తనం నుండి స్వదేశీయులను విముక్తిగావించేందుకు నడుం కట్టి ముందుకు నడిచిన మహిళామతల్లులు కొందరు ఆ లక్ష్యం సాధించగానే విశ్రాంతంగా కూర్చోలేదు. స్వదేశీ సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో కలవడానికి ఇష్టపడని దశలో ఆయా సంస్థానాధీశుల అభిమతాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం మేరకు ఉద్యమించారు. అంతటితో ఆగకుండా భూమికోసం-భుక్తికోసం-భూస్వాముల దాష్టీకాల నుండి విముక్తి కోసం సాగిన సాయుధపోరాటంలో కూడా తమదైన పాత్ర నిర్వహించారు. ఆ తరువాత ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ, ప్రధానంగా మహిళల సమస్యల పరిష్కారం మీద దృష్టిసారించి తామెవ్వరికీ ఏమాత్రం తీసిపోమంటూ నిరూపణకు నిఖార్సయిన నిజంగా నిలిచి చరిత్ర సృష్టించిన మహిళా పోరాటయోధులలో రజియా బేగం ఒకరు.
1914 ప్రాంతంలో హైదరాబాదు సంస్థానంలో రజియా బేగం జన్మించారు. ఆమె తల్లి హైదరాబాదుకు చెందిన వారు కాగా తండ్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. నైజాం సంస్థానంలోని పలు ప్రాంతాలలో ఆయన న్యాయాధికారిగా పనిచేశారు. తల్లిదండ్రులు ఉదార స్వభావులు కావటంలో తమ సంతానానికి తగినంత స్వేచ్ఛ కల్పించారు. ఆ విధంగా తండ్రి నుంచి లభించిన స్వేచ్ఛ ఫలితంగా రజియా బేగంకు అన్నదమ్ములతో పాటు చిన్ననాటనే స్వతంత్రభావనలు అలవడ్డాయి. సన్నిహిత బంధువర్గం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదమ్ములు, ఆమెతో పాటు ఉద్యమాలలో పాల్గొన్న కుటంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు.
రజియా బేగం 12 సంవత్సరాల వయస్సులోనే తన అక్కయ్య జమాలున్నీసా బాజి ఇతర కుటుంబ సభ్యులతో కలసి ‘నిగార్’ పత్రికను చదవటం ఆరంభించారు. ఆనాడు నైజాం సంస్థానంలో నిగార్ పత్రిక మీద నిషేధం ఉంది. లక్నోకు చెందిన నియాజ్ ఫతేపూరి సంపాదకత్వంలో నిగార్ పత్రిక వచ్చేది. ఆ పత్రిక ఛాందసత్వానికి, మతమౌఢ్యానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా స్వాతంత్య్రం, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్ష్యాన్ని ముందుకు తీసుకపోవడానికి కృషి చేసింది. అందువల్ల ఈ పత్రిక అత్యంత ప్రమాదకరమైనదని నైజాం ప్రభుత్వం భావించి సంస్థానంలోకి దాని ప్రవేశాన్ని నిషేధించింది. (హైదరాబాదు సంస్థానంలో రాజకీయ చైతన్యం, విద్యార్థి-యువజనుల పాత్ర (1938-1956), ఎస్.ఎం. జవాద్ రజ్వి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ 1985, పేజి.25)
ఈ నిగార్ ఉర్దూ పత్రిక చదవటం వలన మతపరమైన ఛాందసాలకు వ్యతిరేకంగా, బ్రిటీషర్ల మిత్రుడిగా మారిన నిజాం మీద జమాలున్నీసా తనదైన స్వతంత్ర అభిప్రాయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ, నేను ఏడో తరగతిలో వున్నప్పటి నుండి ప్రార్థనలు చేసేదాన్ని. ఖురాన్ చదవటం నేర్చుకున్నాను. నమాజ్ చేయటం, ‘రోజా’ అంటే రంజాన్ పండుగప్పుడు ఉపవాసాలు చేయటం ఇవన్నీ చేసేది. కాలేజీ కొచ్చిన తర్వాత ఇవన్నీ మానేశాను. ఈ కర్మకాండలన్నీ మానేశాను. దేవుడు, కర్మకాండలు వేర్వేరనిపించింది. ‘నిగార్’ ప్రభావం ఉండేది, అని ఆమె స్వయంగా చెప్పుకున్నారు. ఆ అభిప్రాయాల స్థిరత్వానికి ఆమె కుటుంబ వాతావరణం కూడా బాగా తోడ్పడింది. ఆమె అన్నదమ్ములు, అక్కయ్య జమాలున్నీసా కూడా స్వతంత్ర ఆలోచనలు కలిగిన వ్యక్తులు. ప్రజల పక్షంగా పోరాటాలతో పాల్గొన్న ఉద్యమకారులు. ఆనాడు నిజాం మీద వ్యతిరేకతతోపాటుగా, మత సంబంధమైన కొన్ని ఆచార సంప్రదాయాల విషయంలో కూడా సమకాలీన సమాజానికి భిన్నంగా ప్రవర్తించటం వలన రజియా బేగం పలు ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ఆ విషయాలను ప్రస్తావిస్తూ, మమ్మల్ని కాఫిర్లనేవాళ్ళు. మతద్రోహులమని పిలిచేవాళ్ళని ఆమె చెప్పుకున్నారు. (మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు – ఒక సజీవ చరిత్ర), స్త్రీ శక్తి సంఘటన, హైదరాబాద్, 1986, పేజి. 173)
తల్లితండ్రులు ఉదారస్వభావులైనప్పటికి సన్నిహిత బంధువర్గం మాత్రం సనాతన సంప్రదాయవాదులు కావటంతో రజియా బేగం, ఆమె అన్నదమ్ములు, ఆమెతో పాటు ఉద్యమాలలో పాల్గొన్న కుటుంబ సభ్యులు పలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ ఇబ్బందులను ఏమాత్రం ఖాతరు చేయకుండా తాము నిర్దేశించుకున్న మార్గంలో రజియా బేగం, తనసోదరి జమాలున్నీసాబాజి అన్నదమ్ములు అన్వర్, అఖ్తర్‌లతో కలసి ముందుకు సాగారు. ప్రజలను చైతన్యవంతుల్ని చేయటం ప్రధానాశయంగా సాగిన ఆమె ఆ దిశగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు.
ఆ విషయాలను రజియా బేగం వివరిస్తూ, మా కుటుంబం చాలా సంకుచిత స్వభావం కలది. ఒక్క మా తండ్రిగారే ఉదార స్వభావం కలవాడు. మేము పల్లెటూళ్ళో ఉండేది. బాజీ పెళ్ళయ్యిన (జమాలున్నీసా బాజి) తరువాత మాకు పట్నంలో ఒక చోటంటూ దొరికింది. మేము ఉర్దూ, పర్షియన్ నేర్చుకున్నాం. ఇంగ్లీషు వచ్చేదికాదు. ఒక గోడపత్రిక ‘తమీర్’ అని ప్రారంభించాం. అంతా చేత్తోనే రాసేవాళ్ళం. మేం చదివి ఇతరులను కూడా చదివించేవాళ్ళం. ఇంగ్లీషు నేర్చుకోవడం ప్రారంభించాను. రెండు డిక్షనరీలు ఉర్దూ-ఇంగ్లీషు-ఉర్దూ పెట్టుకుని నేర్చుకున్నాను. షేక్స్‌పియర్, విక్టర్ హ్యూగో చదివాను. అర్థమయినపుడు యెంతో ఆనందించాను. మెల్లిగా అనువాదాలు చేయడం ప్రారంభించాను. ‘ఇవాన్’ అనే పత్రిక చదవటం మొదలుపెట్టాను. చిన్న చిన్న కథలు రాయటం, తర్వాత ఉస్మానియా జర్నల్‌లో ప్రచురించటం మొదలు పెట్టాను. ఒక నవల కూడా రాశాను, అని అన్నారు. (మనకు తెలియని మన చరిత్ర పేజి. 173)
ఆ విధంగా స్వయం కృషితో విద్యార్జనవైపు దృష్టిసారించిన రజియా తనకు నచ్చని ఆచారాలను పద్దతులను ఎంతో ధైర్యంతో వ్యతిరేకించారు. ఆ ప్రయత్నంలో మిత్రులను సంఘటిత పర్చి సంఘం ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సాహిత్య కార్యక్రమాల పట్ల అత్యధిక శ్రద్ధచూపారు. ఆ కార్యక్రమాలలో, యూనుస్ సలీమ్, ముస్లిమ్ జియా, ఇంకా చాలామంది రచయితలు నియాజ్, జాకిర్, హుస్సేన్, సాహిర్, జిగర్, సిద్దిఖీ లాంటి కవులు వచ్చేవాళ్లు, కొంతమంది మా ఇంట్లోనే వుండేవాళ్లు. సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా జరిగేవి. మేమంతా మార్కిస్ట్స్ సాహిత్యం చదవలేదు. కాని నిగార్‌లో కొన్ని వ్యాసాలు వచ్చేవి. ఉర్దూ పత్రికలు చాలా ఉండేవి. రాజకీయల సమస్యలు కూడా చాలా చర్చించేది. యుద్ధం, జర్మనీ, హిట్లర్, మొదలైనవి. ఉర్దూ, ఇంగ్లీషు పుస్తకాలు చాలా తెప్పించుకుని ఎన్నో నేర్చుకునేవాళ్ళం, అని రజియా వివరించారు.
చదువు మీద ఆసక్తిగల రజియా బేగం ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. ప్రధానంగా ఆంగ్లం నేర్చుకోవాలనుకున్నారు. అందుకు ఓ యువకుడ్ని నియమించుకున్నారు. అయితే ఆ ఏర్పాటును సంబంధీకులు వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఆమె సోదరి జమాలున్నీసా బాజి చెబుతూ, రజియాకు ఇంగ్లీషు చెప్పటానికి ఒక బ్రాహ్మణ అబ్బాయి వచ్చేవాడు. మా కుటుంబం అభ్యంతరం పెట్టింది. బంధువులంతా వెలివేశారు. చాలా కొద్దిమంది అమ్మాయిలు ఆ రోజుల్లో చదువుకునేవాళ్ళు. మా అమ్మ మమ్మలెప్పుడూ సపోర్టు చేసేది. ఒక స్నేహితురాలిలాగా, అని తల్లిదండ్రుల ధోరణిని వివరించారు. ఈ విధంగా తల్లి-తండ్రి ప్రోత్సాహంలో రజియా బేగం యం.ఎ. వరకు చదువుకున్నారు. ఆమె చదువు, విముక్తి పోరాటంలో భాగస్వామ్యం పెనవేసుకుని సాగాయి.
అక్క, అన్నదమ్ములతో కలసి ఆమె కూడా జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. ప్రముఖ స్వాతంత్య్రసమరయోధుడు మౌల్వీ హస్రత్ మోహాని రజియా బేగం కుటుంబానికి సన్నిహిత బంధువు. ఆయన తరుచు హైదరాబాదుకు రావటమే కాకుండా ప్రపంచయుద్ధం సమయంలో ఆయన హైదరాబాదులో చాలా కాలం ఉన్నారు. ఆయన ప్రభావం రజియా కుటుంబం మీద ఉండేది. ఆ ప్రభావం నుండి రజియా బేగం తప్పించుకోలేక పోయారు. స్వతహాగా స్వేచ్ఛాయుత భావాలు గల ఆమె బ్రిటీషు బానిసత్వం నుండి విముక్తిని కోరుకున్నారు. ఆ కృషిలో భాగంగా ఆమె స్వదేశీ ఉద్యమంలో పాల్గొన్నారు. జాతీయోద్యమ కార్యక్రమాల నిర్వహణకు అవసరమగు నిధులను నాయకులకు అందచేయటంలో చిన్నతనం నుండే బాధ్యతలు నిర్వహించారు. ఈ దిశగా చురుకుగా పనిచేస్తూ కూడా మొదట్నించీ జాతీయోద్యమంలో వుండేవాళ్ళం. మేమేం చేయడంలేదని ఎప్పుడూ అన్పించేది, అని రజియా సోదరీమణులు చెప్పుకున్నారు.
ఆ క్రమంలో సాగుతున్న రజియా కుటుంబానికి కమ్యూనిజం పరిచయం కావటంతో ప్రజల పక్షాన నిలచి పోరాడే స్వభావం గల రజియా అక్కచెళ్ళల్లు మ్యూనిస్టు పార్టీ వైపుకు మొగ్గుచూపారు. ఆ పరిచయం మరింత ముందుకు వెళ్ళింది. ఆ విషయాన్ని వివరిస్తూ, 1941లో అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి వుండేది. మఖ్దూం, నజర్ హైదరాబాద్ ఎప్పుడూ వస్తూండేవారు. మేం నలుగురు అక్కచెల్లెళ్ళం. ఈ మీటింగులకి బహిరంగంగా వెళ్ళేవాళ్ళం. అమ్మకూడా వచ్చేది. కొంతమంది చిల్‌మన్ల (చాటున) వెనుక కూర్చునేవాళ్ళు… సజ్దాద్ జహీర్, ఓంకార్, పర్షాద్ లాంటి వాళ్ళు చాలా మంది అండర్‌గ్రౌండ్‌లో వున్నప్పుడు మా యింట్లో వుండేవాళ్ళు, అని పేర్కొన్నారు.
ఆ పరిచయాల కారణంగా ఏర్పడిన నూతన అభిప్రాయాల వలన రజియా బేగం కుటుంబం 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనలేదు. అయితే క్విట్ ఇండియా ఉద్యమం పట్ల సానుభూతి ఉండేదని ఆమె స్వయంగా వెల్లడించారు. 1942 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం విధించిన సందర్భంగా కూడా రజియా బేగం రహస్యంగా కమ్యూనిస్టుల కార్యకలాపాలకు తోడ్పాటు అందించారు. నిజాం సంస్థానంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే పలు ఇక్కట్లు పడుతుండగా, నిషేధిత కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులుగా మరిన్ని కష్టాలు పడాల్సిన భయానక వాతావరణంలో కూడా రజియా బేగం కుటుంబం కమ్యూనిస్టు ఉద్యమకారులకు చేయూత నిచ్చారు.
ఈ కార్యక్రమాలకు కొనసాగిస్తూనే 1944లో రజియా బేగం యం.ఎ పూర్తి చేశారు. చదువుకుంటూనే ఆమె తన సోదరి జమాలున్నీ బాజితో కలసి జాతీయోద్యమ కార్యక్రమాలు, కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలలో రహస్యంగా పాల్గొంటూ వచ్చారు. చివరకు భారతీయులు స్వరాజ్యాన్ని సాధించుకున్నాక వెనువెంటనే ఆరంభమైన ఇండియన్ యూనియన్‌లో నైజాం విలీనం కోసం సాగిన పోరాటంలో తనదైన పాత్ర వహించారు. ఆ పోరాటం అంతిమ దశకుచేరుతున్న సందర్భంగా అంకురించిన తెలంగాణ పోరాటంలో రజియా బేగం కుటుంబం యావత్తు పాల్గొంది. ఆమె సోదరి జమాలున్నీసా బాజి, ఉద్యమకారులైన తన అన్నదమ్ములు అన్వర్, అఖ్తర్ ఇతర సన్నిహిత బంధువులు కూడా తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాత్రధారులయ్యారు.
ఈ సందర్భంగా రజియా బేగం పోలీసుల దాష్టీకాలను ఎదుర్కొన్నారు. పలు మార్లు అరెస్టులకు గురయ్యారు. జైలులో కూడా గడిపారు. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ, ఆ రోజుల్లో చాలా మంది కామ్రేడ్లుతో పోరాటం గురించి మాట్లాడేదాన్ని, జైల్లోవున్నప్పుడు, ఒక స్త్రీ కామ్రెడ్‌తో మాట్లాడేదాన్ని. ఒక డైరీ కూడా రాసేదాన్ని. అది దొరికితే ఇంకా చాలా వివరాలు తెలుస్తాయి. నాకొక గది ఉండేది, అని ఆమె అన్నారు. ఆనాడు తెలంగాణ పోరాటయోధులు రావి నారాయణ రెడ్డి నాయకత్వంతో రజియా తన సోదరి-సోదరులతో కలసి పాల్గొన్నారు. నాయకుల ఆదేశాలను తు.చ తప్పక పాటిస్తూ, ఆడమగ భేదం లేకుండా ఎటువంటి ప్రమాదకర పని అప్పగించినా, ఏ తెలియని ప్రదేశానికి వెళ్ళిరమ్మని పంపినా ఏమాత్రం అధైర్య పడకుండా ఎంతో సాహసంతో ఆ బాధ్యతలు రజియా బేగం నిర్వర్తించారు.
ఉద్యమకార్యక్రమాలలో భాగంగా పోరాట యోధులకు ఆశ్రయం కల్పించటం, ఆయుధాలను దాచి పెట్టటం, ఉద్యమకారులకు అందచేయటం, ఉద్యమకారులకు సమాచారాన్ని చేరవేయటం తదితర పనులను తమ ఇంటిని, ఆ పరిసర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని రజియా బేగం నిర్వహించారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు డాక్టర్ మహేంద్ర, రావి నారాయణ రెడ్డి, మఖ్దూం మొహిద్దీన్, రాజ్ బహుద్దూర్ గౌడ్, జవ్వాద్ రజ్వీ తదితరులకు ఆమె ఇంట్లో ఆతిధ్యం, ఆశ్రయం లభించింది. ఆ ఆశ్రయం నుండి నాయకులను మరింత సురక్షిత ప్రాంతాలకు చేరవేయటం లాంటి కార్యక్రమాలను పోలీసుల నిరంతర నిఘా నీడల్లో కూడా రజియా సమర్థవంతంగా నిర్వహించారు.
1951 ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలా? కొనసాగించాలా? అనే అంశం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో, అఖ్తర్, గోపాలన్ (ఎ.కె. గోపాలన్), జ్యోతిబసు, ముజఫర్ అహమ్మద్‌తో ఏర్పడిన డెలిగేషన్ ఒకటి వచ్చి – 1951లో సాయుధ పోరాటం కొనసాగించాలా? విరమించాలా? అనే విషయం చర్చించడానికి వచ్చారు… ఆ విషయం గురించి చాలా రాత్రి వరకు మీటింగులు, చర్చలు జరిగేవి అని ఆమె వివరించారు. ఈ విషయంలో తన తండ్రి ఎంతో సహకరించారని వచ్చి నాయకులకు రజియా కుటుంబం తమ ఇంటి ముందు గల గృహంలో బస ఏర్పాట్లు చేశారని ఆమె వెల్లడించారు.
తెలంగాణ పోరాటం ముగిశాక పార్టీలో కొంత మేరకు స్తబ్దత ఏర్పడింది. ఆ తరువాత ఎన్నికలు రావటంతో రజియా ఆ కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. సోదరి జమాలున్నీసా బాజితో కలసి ఆమె ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. చదువు మీద, మహిళా అభ్యున్నతి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి సారించారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు వివిధ వృత్తులలో శిక్షణ, మహిళలలో చైతన్యం కలిగించేందుకు రాత్రి బడులు, గ్రంథాలయాలు ఏర్పాటు, ప్రగతిశీల సాహిత్యం చదివించటం, ఆయా అంశాల మీద చర్చలు జరపటం ఈ కేంద్రాలలో జరిగేది. ఈ కేంద్రాలకు ప్రమీలా తాయి లాంటి ప్రముఖులు విచ్చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు నేతలు రజియా బేగం కుటుంబంలోని మహిళలు పలు మహిళా కేంద్రాలను ప్రారంభింప చేసి ఆ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఆ కార్యక్రమాలలో భాగంగా కలకత్తా, ఢిల్లీ లాంటి ప్రాంతాలతో జరుగుతున్న అఖిల భారత మహిళా సంఘాల సమావేశాలలో ఆమె పాల్గొంటూ మహిళా ఉద్యమాలకు చేయూతనిచ్చారు.
చిన్నప్పటి నుండి రచనా వ్యాసాంగం మీద అధిక ఆసక్తి చూపిన రజియా బేగం 1944 ఎం.ఏ చేసి వుమెన్స్ కాలేజిలో లెక్చరర్ అయ్యారు. ఆ తరువాత 1966లో యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజిలో చేరారు. పర్షియన్‌లో పి.హెచ్.డి. ఇరాన్‌లో చేశారు. సరోజిని నాయుడు కుమార్తె లీలామణి నాయుడుతో కలసి కాలేజీలో సాహిత్య గోష్ఠులు జరుపుతూ ఔత్సాహిక కవులకు-రచయితలకు తోడ్పాటు అందించారు. తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాల తరువాత రజియాకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె తండ్రి రిటైర్ కావడంవల్ల, మిగతా వాళ్ళంతా పార్టీలో పని చేస్తుండటం వల్ల ఆమె కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. ఆర్థికంగా స్థిరపడి కుటుంబ భారాన్ని మోస్తున్నప్పటి పురుషులతో సమానమన్పించకపోవటంతో ఆమె ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని మరింత విస్తారంగా వివరించారు.
ఇంట్లో అంతా తోడ్పడేవాళ్ళు పురుషులు కూడా కొంత పనిచేసేవాళ్ళు. పిల్లలు కూడా కొంత చేసేవాళ్ళు. అయినప్పటికీ కొంత మన బాధ్యతే అన్పిస్తుంది. కొన్ని కారణాలు పరిశీలించాలి. స్త్రీగా వుండటమనేది ఒకటి. యుగాల నుంచి వస్తున్న సాంఘిక వ్యవస్థ ఆమెను తక్కువ స్థాయిలో వుంచింది. ఆర్థిక స్వాతంత్య్రం వున్నప్పటికీ, స్త్రీ పురుషుని కంటే తక్కువగానే భావిస్తుంది. అతని మీదే ఆధారపడుతుంది. స్త్రీ ఒంటరిగా ఉండటం మనేటటువంటి భయం ఘోరమైంది, ప్రపంచమంతటా వుంది. ఆమె తను ఒంటరిగా బయటకెళ్ళడానికి భయపడతారు, పురుషులైతే ఒంటరిగా వెళతారు, ఎవరూ బాధించరు. పురుషుడికి స్వేచ్ఛవుంది. స్త్రీలను ఏ విధంగా చూస్తారనే దాని గురించి పుస్తకాలు రాస్తున్నారు. ఈ బంధాలెలా తెంచుకుంటామనేది చూడాలి. సిండరెల్లా అనే చక్కని పుస్తకంలో, స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం ఉన్పప్పటికీ ఇంకా విముక్తి పొందకుండా వుండటమనే సమస్య గురించి చర్చించారు. ఆరోజుల్లో ఆర్థిక స్వాతంత్య్రమే ముఖ్యమైన సమస్య అనుకునేవాళ్ళం. నేను చదువుకుని, సంపాదించి ఎవరి మీద ఆధారపడకుండా వుంటానని నిర్ణయించుకున్నాను. నాన్నకు చెప్పాను, ఆయన ఏమీ అభ్యంతరం పెట్టలేదు, కాని బంధువులు విమర్శించారు. తర్వాత కూడా పెళ్ళి గురించి ఆలోచించలేదు. నాపనిలో నిమగ్నురాలినై, దాని గురించి ఆలోచించలేదు. బహుశ సరియైన సమయంలో ఎవరూ కనిపించలేదేమో! అన్ని సంబంధాలు కూడా వరకట్నం, బేరాలతో నియమించబడేవి. అవంటే అసహ్యం వచ్చి, ఎవరితోటీ ఆ విషయం గురించి మాట్లాడకపోయేది. నాన్న కూడా వాటిని వ్యతిరేకించేది. మా కుటుంబంలో చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు.
ఈ వాక్యాలు ఆమెలోని విప్లవాత్మక భావాలకు అద్దం పడతాయి. ఆ అభిప్రాయాలతో స్నేహం చేసిన రజియా బేగం చివరి వరకు వివాహం చేసుకోలేదు. చిన్న వయస్సు లోనే జాతీయోద్యమం, ఆ తరువాత కమ్యూనిస్టు ఉద్యమం, ఆ క్రమంలో ఇండియన్ యూనియన్‌లో నైజాం విలీనోద్యమం, అటు తరువాత తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు రజియా బేగం ఉద్యమాల చరిత్రలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
(ఈ వ్యాసం ప్రధానంగా 1986లో స్త్రీ శక్తి సంఘటన (హైదరాబాద్) ప్రచురించిన ‘మనకు తెలియని మన చరిత్ర (తెలంగాణా రైతాంగ పోరాటంలో స్త్రీలు – ఒక సజీవ చరిత్ర)’ గ్రంథంలోని రజియా బేగం ఆమె సోదరి జమాలున్నీసా బాజి తమ ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం ఆధారంగా రూపొందించటం జరిగింది. ఆ గ్రంథం సంపాదకులు, ప్రచురణకర్తలకు నా ధన్యవాదాలు. – రచయిత)
భారత స్వాతంత్య్రోద్యమం ముస్లిం మహిళలు, పుస్తకంలోనిది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags