పసుపులేటి గీత
దారంటే
బహుశా గుండెలకి తనను తాను హత్తుకుని
ఇంకా రాని బస్సు కోసం ఎదురు చూసే
ఒక పల్లెటూరి అమ్మాయి కావచ్చు
దారంటే
బహుశా ఆది తప్ప అంతేలేని
సుదీర్ఘమైన చీకటి మట్టినీడ కావచ్చు
దారంటే
బహుశా నేలకంటా వాలిన కొమ్మకు
ఉరేసుకున్న మనిషితో దోబూచులాడే చివరి శ్వాస కావచ్చు
దారంటే
బహుశా బళ్ళో చివరి గంటని
చెవి ఒగ్గి వినే పిల్లవాడి జేబులో పీచు మిఠాయి కావచ్చు
దారంటే
బహుశా రేపటి నోట్‌బుక్కులో
మొన్నటి హోంవర్కు కావచ్చు
దారంటే
బహుశా పెదవి మీది చివరి పఫ్‌లో
గుప్పుమనే చిటికెడు నికొటిన్ కావచ్చు
దారంటే
బహుశా ఇద్దరి సంపర్కాన్ని
ఒకే ఒక్క న్యూట్రల్ జెండర్‌గా మార్చే కండోమ్ కావచ్చు
దారంటే
బహుశా నీ కనుపాపలో ఛిద్రమయ్యే
నా చూపును దాచుకున్న క్షణం కావచ్చు
దారంటే
బహుశా నేనిటు వెళుతుండగానే నా కన్నుగప్పి
అట్నుంచటే నా బాల్యాన్ని ఎగదన్నుకు పోయే దొంగకాకి కావచ్చు
దారంటే
బహుశా ఈ వాలుకుర్చీ పాదాల దగ్గర
నువ్వు నాటిన పాట కావచ్చు
దారంటే
బహుశా మరణశయ్య మీది
దేవుడి తాలూకు చివరి హెల్త్‌బులెటిన్ కావచ్చు
దారంటే
బహుశా పాడుబడిన మేడమెట్ల మీద రాలిన
నా కంట్లో ఇంకిపోయే ఆకాశం కావచ్చు
దారంటే
బహుశా ఎడారి చెట్టు క్రీనీడలో
మొలిచిన నీటి పుట్టగొడుగు కావచ్చు
దారంటే
బహుశా నీటి పుట్ట కింద
చిగుళ్ళని పలవరించే నిరుపేద బీడుపాదు కావచ్చు
దారంటే
బహుశా నేను నా చేతుల్ని ఈ పాదులో నాటడం కావచ్చు
పాదుని దాటి పందిరి మీదికి అవి ఎగబాకనూ వచ్చు
గతించిన క్షణాలు వేళ్ళ సందుల్లోంచి
మరకలు, మరకలుగా ఒలికి పోనూ వచ్చు
ఏమో, చేతుల మీది గాయాలు పాళీలై
కాగితపు పందిరి సిరా పువ్వుల్ని పూయనూ వచ్చు
దారంటే
బహుశా ప్రశ్నార్థకంలాంటి
బాటసారి పాదముద్ర కావ ్చ
దారేదైనా…., దారేదన్నా….., దారేమిటన్నా…..,
దారంటే
బహుశా ప్రశ్నలన్నింటినీ
ముడుపు కట్టుకున్న ఒక్కటే జవాబు కావచ్చు
యన్.నిర్మలాదేవి
వంటల వల్లభుడు
ఎవరన్నారు మా ఆయనకు వంట రాదని
నన్ను రుచికరంగా వేపుకు తింటారు
బూరుపీకి చారు కాచి
ఘుమఘుమ పరిమళాల
తాళింపు పెడతారు
మెత్తని కత్తితో నా తడిగుండెను
ఉల్లిపాయలలా తరుగుతారు……
బుగ్గలపై ఎర్రని ‘బూరెలు’ పొంగించి
ఆశల కోరికల అంబలి కాచి
పిండిలా పరచుకున్న వెన్నెల వంటి
నా మనస్సును పిసికి ముద్దచేసి
వీపునే రాజేసి ‘పరాట’ కాలుస్తారు.
అణకువను అందాలను
అమోఘ భక్షాలుగా ఆరగిస్తారు
ఇప్పుడికి అనగలరా మా వారికి వంటరాదని?
కన్నీళ్ళతో సెగలపొగల కాఫీ రెడీ!
పెదవుల చిరునవ్వులను దోరగా వేపుతారు
కాలేయము కాల్చి కబాబులు కుచ్చికూర్చి
ఆనందంగా ఆరగిస్తారు
సుళ్ళు తిరుగుతున్న పేగులను మరిగించి
మసాలా చల్లుకుంటారు (స్ప్రింగ్ రోల్స్ నూడిల్స్ చప్పరిస్తున్న స్వర్గానందం)
నా అమాయకత్వాన్ని ఆనందాన్ని
మిక్సీలో త్రిప్పి నూనె తగలకుండా
ఆవిరికి ఉడికించి
కడుపుతీరా క్షుర్బాధ తీర్చుకుంటారు
అప్పుడప్పుడు చిన్ని చిన్ని చిరుతిళ్ళు……
చెవులు మెలిపెట్టి చక్కిలాలు…
ముక్కు పిండి…. మురుకులు
జడను వడి త్రిప్పి…. జంతికలు…
మా వారి మాటలు….
ఊపిరి ఆడని ఘాటైన పోపులు
పరిహాసాలు….. మిరపకాయలు
మాడిన ముంతపొగలు
జిహ్వ చాపల్య మెక్కువ
కూరలు కుదరని రోజు
నేనే ఆయనకు పచ్చడిని
నంజుకు… (చంపుకు) తింటారు…..
బర్నర్ అవసరం లేదులెండి
కణకణలాడే చింతనిప్పులను
కళ్ళలోనే రగిలిస్తారు
నేనే తాంబూలాన్ని
నేనే టైంపాస్ పకోడిని
నేనే చవకగా లభించిన వంట సరుకుని
భోజన ప్రియుడు
ప్రీతిగా భుజిస్తాడు
భుక్తాయాసం ఎరుగడు
అమిత భోక్త అయితేనేం
అజీర్ణం దరికి రాదు…..
వంటల వల్లభుడు
నలభీములు, పాకశాస్త్ర ప్రావీణ్యులు
ఆయనకు సాటిరారు.
ఇక అనండి చూద్దాం మా వారికి
వంట చేతకాదని!
అన్నీ గొప్పలే….. అనుకుంటున్నారేమో….
పాపం! ఉన్నమాటే….
మా వారు ఎంతగొప్ప ప్రావీణ్యులైనా
సకల శాస్త్రములు పఠించినట్టులేరు
కొన్ని అమృత మాధుర్యరుచులు చేతకావులెండి…..
నా జాలి చూపులకు సుగంధపుష్పరేకలు చేర్చి
కమ్మని పాయసం…..
అనురాగ సహచర్యంతో
తీయని పరమాన్నం వండరాదు.
సున్నిత హృదయ మాధుర్యంతో
లేలేత పంచదార పూతరేకులు
ముద్దు మురిపాలతో చల్లని
కమనీయ పానీయాలు చేయలేరు
అంత మాత్రాన వంటరాదంటే ఎలా?
పాపం?! పతిదేవుడు…. ఏ మాటకామాటే….
అస్తమానం….
గరం… గరం… కారం… కార… ఘాటు…. ఘాటు….
గొంతు పొలమారి తల్లడిల్లుతుంటారు.
అయినా ఆ ”మజా” యే ఆయనకు ఆనంద మధురధారలు
నేను మా శ్రీవారిలా వంటలు చేయగలనా?
అంతటి పసందైన రుచులు ఆస్వాదించగలనా?
ఉవ్విళ్ళూరుతున్న ”జిహ్వ”ను ఎలా ఆపగలను?!!
సింగరాజు రమాదేవి
వంటింట్లో వచన కవిత్వం
నాకెందుకో గొప్ప గొప్ప ఆలోచనలన్నీ
వంట చేసేటప్పుడే వస్తుంటాయి!
మూకుడులో గరిటె లయబద్ధంగా కదులుతుంటే
నా మస్తిష్కంలో ఆలోచనలు వేగంగా పుడుతుంటాయి
చిటపటలాడే ఆవాల చప్పుడులో
చటుక్కున కథా వస్తువేదో స్ఫురిస్తుంది!
అందంగా తరిగిన కూరగాయలు
నిలువుగా చీరిన పచ్చిమిరప
అప్పుడే చెట్టు మీంచి దూసిన కరివేప
అన్నీ చేరి కథకో ఆకృతిని సంతరించి పెడతాయి!
మూకుట్లో అన్ని వేసి, ఇంత ఉప్పు పసుపు వేసి
మూత పెడితే, అబ్బ! అప్పుడే కథని
ముగింపుకి తెచ్చిన సంతృప్తి!
అదుగో వంటింటికి పదడుగుల దూరంలో
నా వ్రాత బల్ల, రారమ్మని పిలుస్తోంది
నన్ను, వెళ్ళనా?
మరే! అవతల పిల్లకి జడలెయ్యద్దూ!
చంటాడింకా నిద్దర లేవనేలేదు!
ఆయన గారి కాఫీ సరే సరి!
అసలే ఆఫీసులో ఆడిట్, నే త్వరగా వెళ్ళాలి
వంటింటి గుమ్మంపై నేనూ నా అంతరాత్మల
మీమాంస చర్చ!
కాఫీనా? కథా? కథా? కాఫీనా?
కాఫీ గెలిచింది! కథ ఓడింది!
అమ్మా జడ! చేతిలో రిబ్బన్లతో పిల్లది!
అమ్మా పేస్తు! చేత బ్రష్షు పట్టి చంటాడు!
నా నీళ్ళు కాగాయా? అయ్యగారి ఆరా!
బుర్రలో సుళ్ళు తిరిగే ఆలోచనలన్నీ
దెబ్బతో హాంఫట్! మాయమైపోయాయి
వెనక్కి తిరిగి చూద్దును కదా
అదిగో నా వ్రాత బల్ల, అందనంత దూరంలో
కాలపు ఆవలి ఒడ్డున నిలబడి, నన్ను వెక్కిరిస్తోంది!
అవును! అక్షర రూపం దాల్చే లోపే ఆవిరైపోయే భావాలెన్నో!
అయినా నాకెందుకో గొప్ప గొప్ప ఆలోచనలన్నీ
వంటింట్లోనే వస్తుంటాయి!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
పసుపులేటి గీతగారి దారి చాలా బాగుంది.
గీత గారు – దారి -చాల బాగుంధి —
నిర్మలాదేవిగారూ,
అలాంటి భర్తని “మావారు, శ్రీవారు” అని మర్యాదగా కవితలో రాయడం నప్పలేదు. – భూషణ్
పసుపు లేటి గీత కవిత ” దారి” చలా బాగుంది