భారత దేశం సరే వెనుకబడిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం. ఇక్కడ ఆడపిల్లల్ని తల్లిదండ్రులే చంపి పాతేస్తున్నారు. పిండాల్నయితే కడుపులోనే కరిగించేస్తున్నారు. ఒక్కళ్ళా? ఇద్దరా? 2005 నుండి 2011 వరకు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే 78,847 మంది ఆడపిండాల్ని గుట్టుచప్పుడు కాకుండా గర్భంలోనే చంపేసారు. 2001లో 1000 మందికి 927 వుంటే, 2011లో దారుణంగా 914కి పడిపోయింది. ఆడపిల్లల్ని చంపుకోవడంలో చాలా అభివృద్ధిని సాధించాం. మహిళల మీద పెరిగిపోతున్న హింసల్లో అత్యంత అభివృద్ధిని సాధించాం.
భారతదేశం మొత్తం మీద 2005-11 మధ్య కాలంలో 1,078,378 మంది ఆడపిల్లలు పుట్టకుండా హతమైపోయారు. అందులో 78,847 మంది పిల్లలు మన రాష్ట్రంలోనే చంపేయబడ్డారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్ధమవుతోంది. వీధి వీధికీ అల్ట్రాసౌండ్ మిషన్‌లు పెట్టి పుట్టబోయేది ఆడో, మగో తెలుసుకుని ఆడపిండాల్ని అంతం చేసేస్తున్నారు.
అన్ని రకాలుగాను వెనుకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో 2004-08 మధ్యకాలంలో స్కానింగ్ సెంటర్లు 146% పెరిగాయని, అదే విధంగా నల్గొండ, అనంతపూర్,కడప జిల్లాల్లో కూడా విపరీతంగా స్కానింగ్ మెషీన్లు వెలిసాయి.మహబూబ్‌నగర్‌లో ఇన్ని స్కానింగ్ మిషన్లు ఎలా చేరాయి? ఎందుకు చేరాయి? ఆ సెంటర్లలో ఏం జరుగుతోంది అనే ఆరా గానీ, సవ్యమైన పర్యవేక్షణగానీ లేవు. గర్భం దాల్చిన ప్రతి మహిళకి అల్ట్రా సౌండ్ టెస్ట్ చేసి ఆడో, మగో చెబుతున్న డాక్టర్లు అసలు నేరస్థులు. వేలల్లో ఆడపిల్లల్ని ప్రతి రోజు హత్య చేస్తున్న ఈ డాక్టర్లు- నిజానికి ఒక మహోన్నతమైన వృత్తికోసం మలచబడిన వాళ్ళు. వీళ్ళు హంతక ముఠాల్లా మారి ఆడపిల్లల్ని మాయం చేస్తున్నారంటే డబ్బు కోసం ఎంతటి నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతోంది. వీళ్ళ డబ్బు లాలస, తల్లిదండ్రుల కొడుకు ప్రేమ కలగలసి సమాజంలో ఎంతటి అసమతుల్యానికి కారకులవుతున్నారో వీళ్ళకర్ధమవుత్నుట్టు లేదు. ఆడపిల్లల ఉసురు పోసుకుంటున్న వీళ్ళు కిరాయి హంతక ముఠాలకేమీ తీసిపోరు. వాళ్ళు డబ్బు కోసం హత్యలు చేస్తారు. వీళ్ళూ డబ్బుకోసమే హత్యలు చేస్తున్నారు.
నిన్నటికి నిన్న ”లాన్సెట్ మ్యాగజైన్” భారతదేశంలో తగ్గిపోతున్న సెక్స్ రేషియో గురించి గగుర్పొడిచే అంశాలు బయట పెట్టింది. బాగా డబ్బున్న, బాగా చదువుకున్న కుటుంబాల వాళ్ళే ఎక్కువగా లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి ఆడపిండాలను చంపుతున్నారట. ముఖ్యంగా మొదటి బిడ్డ ఆడపిల్ల అయితే రెండో బిడ్డ ఖచ్చితంగా మగపిల్లాడే వుండాలట. ఒక వేళ కడుపులో ఆడపిండం వుంటే అంతే సంగతులు. ఆడపిండాన్ని అబార్షన్ చేసేసి, మళ్ళీ గర్భం ధరించడం మళ్ళీ ఆడపిల్లయితే మళ్ళీ అబార్షన్. ఇలా మగ పిల్లాడు పుట్టేవరకు ఈ హత్యల పరంపర కొనసాగుతుంది. ఇంట్లో ఖచ్చితంగా మగపిల్లాడుండాలి. ఆడపిల్ల లేకపోయినా ఫర్లేదు. ఇదీ వీళ్ళ కుతంత్రం.
‘లాన్సెట్’ ఇంకా ఏం చెప్పిందంటే, వాళ్ళు నిర్వహించిన అధ్యయనం ప్రకారం 1980 నుంచి 2110′ వరకు ఇలాంటి అబార్షన్ల సంఖ్య కనీసం 40 లక్షలు అత్యధికం ఒక కోటి ఇరవై లక్షలు ఉండొచ్చని చెబుతున్నారు. అంతేకాక గత ముఫ్పై ఏళ్ళల్లో ఇలాంటి అబార్షన్లు పెరగడంతో పాటు ఉత్తర భారతం నుంచి ఈ జాడ్యం దక్షిణ భారతదేశానికి కూడా పాకిందట. ఇటీవలి సెన్సెస్ సమాచారంతో పాటు 2.5. లక్షల పుట్టుకలను వారు విశ్లేషించినపుడు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూసాయి. కుటుంబంలో రెండో సంతానం ఉన్నపుడు బాలిక-బాలురకు నిష్పత్తిని గమనించారు. 1990 లో ప్రతి 1000 బాలురకు 906 మంది బాలికలుండగా 2005 నాటికి బాలికల సంఖ్య 836కి పడిపోయింది.
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అమెరికాలో తిష్ట వేసిన భారతీయుల్లో కూడా ఆడపిల్లల పట్ల ఇవే ధోరణులుండడం. అక్కడ కూడా గర్భస్థ ఆడపిండాలని యధేచ్ఛగా గర్భంలో చంపేస్తున్నారు. భారతదేశంలో కనీసం పిిిిసిపిఎన్‌డిటి చట్టం అమలులో వుంది. (దీని అమలు ఎంత ఘోరమో అది వేరే విషయం) అమెరికాలో ఇలాంటి చట్టాలేమీ లేవు. తమకి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి 40% మంది అబార్షన్‌లు చేయించుకున్నారట. మొదటి సంతానం ఆడపిల్లవుంటే గర్భవతులు రెండోసారీ కూడా గర్భంలో ఆడపిల్లే వుంటే కనుక 89% గర్భస్రావం చేయించుకుంటున్నారు.
ఆడపిల్లకి (ఆడపిండానికి) ఆంధ్ర అయినా అమెరికా అయినా ప్రాణరక్షణ లేదనేది ఈ అధ్యయనం రుజువు చేసింది.
ఆడపిల్లలకి ఆస్థి హక్కు ఇవ్వరు. ఇచ్చినా అమలు చేయరు. చదువు చెప్పించరు. చెప్పించినా సంపాదించుకోనివ్వరు . సంపాదించుకున్నా నిర్ణయాధికారమివ్వరు. పెళ్ళి పేరుతో నిప్పుల కొలిమిలోకి కట్నమిచ్చి మరీ తోస్తారు. అదనపు కట్నం తెమ్మని వాడు చిత్రహింసలు పెడుతుంటే అత్తింట్లోనే చావమని శాసిస్తారు. పుట్టింటి గౌరవాన్ని పాడు చెయ్యొద్దంటారు. గొంతు కోసేవాడొకడు, గొంతు నులిమే వాడొకడు. దెబ్బ కనబడకుండా ఎముకలు విరగ్గొట్టే వాడొకడు. ముక్కలుగా నరికి సూట్ కేసుల్లో పెట్టేవాడొకడు. ఇన్ని చావులు చచ్చే ఆడపిల్లలని అన్ని దశల్లోను పరమ కిరాతకంగా హత్యలు చేస్తున్న ఈ సమాజం, భారతీయ సమాజం పురోగమించిందని, అభివృద్ధి పధంలోకి దూసుకెళుతోందని ఎవరురా కూసింది. జనాభాలో సగ భాగం చావుబతుకుల్లో కొట్టుమిట్ట్లాడుతుంటే, పుట్టకుండానే ఆడపిల్లల్ని చంపేసే దరిద్రగొట్టు కాదు కాదు మదమెక్కిన ధనిక ప్రపంచం దృష్టిిలో ”అభివృద్ధి” జరుగుతోందేమో కాని ఆడవాళ్ళ పరంగా మనమింకా అథ:పాతాళంలోనే వున్నాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
చాలా బాగుంది మీ వ్యాసము.. దీనివలన మన0 నెర్చుకున్నది ఆడది అబల అని మాత్రమె. కాని ఇప్పతి ఆడపిల్లలు ఇందిరాగాంధి, విజయలక్ష్మి పండిత ని మించి అన్ని రంగాల్లొ దూకుతున్నరు..అన్న0 పెడుతున్న చెయ్యిని నరికెందుకు ప్రాంతీయ బెధాలు ఉండవని మరీ వివరించి చెబుతున్నారు అన్ని ప్రాంతాలవారు..
ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా అన్నట్టు , ప్రపంచం లో ఎక్కడయినా ఆడపిల్లలకి సరయిన రక్షణ లేదు. అబార్షన్లు జరుగుతున్నాయని నోరెత్తి చెప్పినా సరయిన చట్టాలు రావడం లేదు. పేదరికం వల్లనో మరొకటో అని సరిపెట్టుకునేవాళ్ళకి కూడా ఇది నిజం గా ఒక షాక్ లాంటిది. బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ కూడా ఇల్లంటివి చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి ?
ఇలాంటి దరిద్రగొట్టు పనులు చేసేవాళ్ళని ఏమి చెయ్యలేమా ? అన్ని తెలిసి, అన్ని వసతులు వుండి, ఇంకా కళ్ళయినా తెరవని పసిగుడ్లను దారుణం గా చిదిమేయ్యడం అమానుషం.