యం. శ్వేత, ఓ. మాధవి, కె. జగన్‌మోహన్
కొన్నితరాలుగా భారత సమాజంలో స్త్రీలకు పురుషులతో సమానమయిన అంతస్తు, హక్కులు లభించడం లేదు. వారికి పురుషులకు ఉన్న స్వేచ్చాస్వాతంత్య్రాలు లోపించడమే కాకుండా వారి జీవితమంతా గృహకృత్యాలకు మాత్రమే అంకితమయింది.
అంతేకాక భారత స్త్రీలు అనేక అన్యాయాలకు, అరాచకాలకు గురి అయ్యారు. శాస్త్రీయ, సాంకేతిక విజ్ఞానం అభివృద్ధిచెందడం వల్లే పారిశ్రామికాభివృద్ధి జరిగి స్త్రీలు పురుషులతోపాటు ప్రబలడం వల్లా స్త్రీలకు సామాజిక న్యాయాన్ని చేకూర్చడంకోసం, సరి అయిన అంతస్తు ప్రసాదించడం కోసం గత 150 సంవత్సరాల నుండి కృషి జరుగుతుంది. ఆనాటి ప్రభుత్వాల ద్వారా స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టి వారికి అన్యాయం చేకూరేట్టు శాసనాలను కూడా రూపొందించి వాటిని అమలు జరిపేటట్టు చేసారు.
స్వాతంత్య్రానంతరం భారతరాజ్యాంగంలో స్త్రీ సాంఘికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. ఈ అవకాశం కల్పించడానికి ఎందరో కృషి చేసారు. ఇలా స్త్రీ హోదాని పెంచడానికి కృషి చేసినవారిలో ముఖ్యులు రాజారామ్ మోహన్ రాయ్, ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్, దయానంద సరస్వతి, రనడే. మహర్షి కార్వే, ఠాగూర్, వివేకానంద, గోఖలే, పండిత రమాబాయి, ఆనందీబాయి జోషి, ప్రాన్‌సినా సోరాబ్జీ అనిబిసెంట్, సరళాదేవి, చౌదరాణి, సరోజిని నాయుడు మొ||లగు వారు స్త్రీకి రాజ్యాంగంలో ప్రత్యేక హోదా కల్పించడానికి కారణం మహిళలు స్వతంత్ర పోరాటంలో భాగంగా 1928 సత్యాగ్రహంలో పాలుపంచుకోవడం, సహాయ నిరాకరణోద్యమంలో పాలుపంచుకోవడం బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్త్రీలు తమ విలువైన వస్త్రాలను దగ్దం చేయడం, పురుషులతో సమానంగా కృషిచేసిన స్త్రీకి రాజ్యాంగంలో ప్రత్యేక స్థానమిచ్చి, ప్రత్యేక అవకాశాలు, అంతస్తూ, హోదా కలుగజేయడానికి, వివాహ వ్యవస్థలోనూ, వంశపారంపర్య హక్కులలోను, ఆస్తి సంక్రమంలోనూ, ఆమె స్థితిగతులను పటిష్టం చేయడానికి సమాజంలో ఆమె పట్ల జరిగే హింస నుండి రక్షణ ఏర్పరచడానికి ప్రభుత్వం ఎన్నో శాసనాలు చేసింది, రాజ్యాంగ రక్షణలు కల్పించింది.
స్త్రీ బాల్యంలో తల్లిదండ్రులపైన వివాహానంతరం భర్తపైన, వృద్ధాప్యంలో కన్నపిల్లలపైన ఆధారపడి, పరాన్నజీవిగా స్త్రీని హిందూ సమాజం చిత్రీకరించింది. నిజానికి స్త్రీ, పురుషులు లేనిదే పునరుత్పత్తి లేదు-సృష్టి లేదు. పుట్టుకతో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. కాని స్త్రీ శరీరంలో సంభవించే సహజమార్పులవల్ల, కొన్ని ఇతర కారణాలవల్ల స్త్రీకి న్యూనతాభావనను ఆపాదించి, బలహీనురాలుగా చిత్రీకరించి సాపేక్షికంగా కొంత తక్కువ హోదాను కల్పించారు. ప్రాచీనకాలంలో స్త్రీకి ఉన్నతమైన స్థానం కల్పించారు. ”ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సర్వసుఖాలుంటాయని హిందూ సామాజిక వ్యవస్థలో వ్యక్తుల విశ్వాసం” ప్రకృతికావస్థలో గుంపు వివాహ పద్ధతివల్ల సంతానానికి తల్లి మాత్రమే తెలిసేది. తండ్రి తెలిసేవాడు కాదు. అందువల్ల పురుషాదికత్యత ఉండేది కాదు. స్త్రీ ఆధిపత్యమే ఉండేది. స్త్రీ ఆధిపత్యం ఉన్న వ్యవస్థను మాతృస్వామిక వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలు స్త్రీలు కుటుంబ యజమానురాలు. వారసత్వపు హక్కులు స్త్రీలకే చెందాలి. గృహ నిర్వహణ బాధ్యతలు, యాజమాన్య బాధ్యతలు, వ్యవసాయం-పశు పోషణతో పాటు పిల్లలకు తన ప్రేమ, అనురాగాలను పంచి ఇవ్వడం మొదలగు పనులతో పాటు ఉత్పత్తి సంబంధాలలో కూడా పురుషుని కంటే స్త్రీదే పైచేయిగా ఉండేది. ఈ రకమైన మాతృస్వామిక వ్యవస్థ ఆర్యులు భారతదేశానికి రాకపూర్వము ఏర్పడింది. రాహుల్ సాంకృత్యాయన్, దేవీప్రసాద్ ఛటోపాద్యాయులు పేర్కొన్నారు.
మాతృస్వామిక వ్యవస్థలో స్త్రీకి ఉన్నతమైన స్థానం కల్పించడం జరిగింది. ఇది కేవలం హిందూ సమాజంలోనే కాక ఇతర సమాజాలలో కూడా గోచరిస్తుంది. ఉదాహరణకు అట్లాంటిన్ నుండి మిసిసిపి వరకు, సెయింట్ లారెన్స్ నుండి కుంబర్ ల్యాండ్ వరకు స్త్రీలు కుటుంబంలోను, సమాజంలోను పురుషులతో సమానస్థానాన్ని పొందియున్నారు. సుమిత్రా దీవులలో స్త్రీలదే ఆధిపత్యము. ‘టైమోర్ ల్యూట్’ దీనిలో భార్యను కొట్టినపుడు భర్తను శిక్షించేవారు. అదే భార్య భర్తను కొట్టినప్పటికి శిక్ష ఉండేది కాదు. అయితే వేదాల్లో, ప్రాచీన ఈజిప్టు నాగరికతలో స్త్రీకి ఎంతో విలువ ఉండేది. అయితే వేదాల్లో, వివిధ మతగ్రంథాల్లో మాత్రము స్త్రీలకు అబలలుగా, స్త్రీ పురుషునికంటే అథమురాలుగా చిత్రీకరించిన తీరు మనకు తెలుసు. ఉదాహరణకు ఇస్లాం మతగ్రంథమైన బైబిలు ప్రకారము స్త్రీ పురుషునికొరకేగాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టించబడలేదు అని పేర్కొనడం జరిగింది. హిందూమతం స్త్రీ ఆదిశక్తి అని కీర్తిస్తూనే ‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి’ అని పేర్కొంది. సమాజ పరిణామక్రమంలో ఏర్పడిన ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలాలలో స్త్రీ అంతస్తును అంచనా వేసినట్లయితే ఈ అంశానికి కొంత సమగ్రత చేకూరుతుంది.
వేదకాలంలో పురుషులతో సమానంగా, అవకాశాలను హక్కులను స్త్రీ చూరగొన్నది. స్త్రీపట్ల, వివక్షత చూడలేదు. వేదకాలంలో స్త్రీకి పురుషునితో పాటుగా సమాన విద్యావకాశాలు ఉండేవి. వేదాలు అభ్యసించడానికి వారికి అనుమతి ఉండేది. ఉపనయన సంస్కారం ద్వారా, విద్యార్జనకు ప్రవేశం, బ్రహ్మచర్యాశ్రమానికి అనుమతి పురుషులకువలెనే స్త్రీలకు కూడా కల్పించబడియుండేది. వైవాహిక జీవనసాఫల్యానికి స్త్రీకి విద్య అవసరమని, విద్యావిషయకస్థాయి మతపరపు కార్యాలలో, జంతుబలి కార్యాలలో అర్హతను సంపాదించి ఇచ్చి, ఒక విధమైన అంతస్తును స్త్రీకి అపాదించినట్లుగా భావింపబడుతుంది. స్త్రీలు సాహిత్యరంగాలలో కూడా వారి విద్యా ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. వైదికయుగంలోని విశ్వసర, ఘోష లోపముద్ర, నికత, నివాసరి అనే హిందూస్త్రీలు సాహిత్యరంగంలోనే పేరు ప్రతిష్టలు పొందినవారిగా నేటికి చెప్పబడుతున్నారు. స్త్రీ విద్యావ్యాసంగాలతో పాటు యుద్దకళలను అభ్యసించేవారు. యుద్దకళల విద్యను పూర్తిగావించినవారిని వక్స్‌గా వ్యవహరించేవారు.
హిందూ సామాజిక వ్యవస్థలో స్త్రీకి వివాహవిషయంలో సంపూర్ణ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండేది. ఆమె అభీష్టం మేరకే వివాహం జరిగేది. ఒక మతపరమైన సామాజికధర్మంగా ఉన్నప్పటికి స్త్రీపట్ల ఎలాంటి నిర్బంధం ఉండేది కాదు. వివాహ వయోపరిమితి విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. పైగా ఆ కాలంలో గాంధర్వ వివాహాలకు అవకాశం ఉండేది.
మతపరమైన ప్రకార్యాలలో తన భర్తతో స్త్రీ పాలుపంచుకొనేది. మత, కుటుంబపరమైన ధర్మప్రకార్యాలలో భర్తతోపాటు స్త్రీ తన విద్యుక్తధర్మాలను నిర్వరించేది. పూజ సంస్కారాది విషయాలలో, బలిదాన నిర్వహణలలో పాల్గొనడానికి భార్యలేని పురుషునికి అర్హతలు ఉండేవికావు. వేదొక్తులనుసరించి భార్యభర్తలిద్దరికి ఆస్తి విషయంలో ఉమ్మడి యాజమాన్యపు హక్కులుండేవి. బృహదారణ్యకోపనిషత్తులో యజ్ఞవల్కుని భార్యలిరువురికి ఆస్తిని సమానంగా పంచి ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. వేదకాలంలో హిందూస్త్రీకి ఉన్నతమైన అంతస్తు ఇవ్వబడింది. వారికి ఆస్తిహక్కు వారసత్వంగా లభ్యమయ్యేది. మత విధులలో, బలిదాన కార్యక్రమాలలో స్త్రీలు పాల్గొనేవారు. రాచరిక మహాసభలలో, సమావేశాలలో స్త్రీలు కూడా హాజరు అయ్యేవారు.
స్త్రీపురుషుడికి అన్నివేళలో మార్గదర్శిగా, ఆపద సమయంలో సలహాదారునిగా-చేయూతనిస్తూ, సర్వసుఖాలను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఉన్నత అంతస్తును సంతరించుకున్నది. వేదకాలానంతరం సమాజంలో స్త్రీ అంతస్తు కొంతమేరకు సన్నగిల్లింది. సంతానంలో మగవారికి ఎక్కువ విలువలు ఇస్తూ వారి అంతస్తునే ఉన్నతంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో స్త్రీ అంతస్తును క్రమంగా నిమ్నస్థాయిక గురిచేశారు. తండ్రి మరణ సంస్కారాలలో జరిపే పిండప్రదాన కార్యంలో కుమారుడే నిర్వహించాలనే నియమం బలీయంగా ఉండటం మూలంగా స్త్రీ ప్రాధాన్యతను కోల్పోవడంవల్ల సమాజంలో స్త్రీ అంతస్తు తగ్గింది.
హిందూ సామాజిక వ్యవస్థలో కుమారులు లేని తండ్రికి మరణానంతరం నరకం ప్రాప్తిస్తుందనే బలీయమైన విశ్వాసం ఉన్నందువల్ల మగసంతానం లేకుంటే మరొకరిని దత్తత తీసుకొని కర్మకాండ, సంస్కారాలు జరిపించడంవల్ల ‘మోక్షసంప్రాప్తి’ సిద్ధిస్తుందనే భావం స్త్రీలు నిర్లక్ష్యానికి గురికాబడి పురుషులకంటే తక్కువ అంతస్తుకు నెట్టివేయబడ్డారు. ఈ క్రమంలోనే స్త్రీ అంతస్తును తగ్గించే అనేకమైన ప్రతిపాదనలు పెరుగుతూ వచ్చాయి. తదనుగుణంగా స్త్రీలను బలహీనులుగా, చపలచిత్తులుగా, కూపస్థమండూక స్వభావులుగా చిత్రీకరించడం జరిగింది. మనువు-వాత్సాయనుడు లాంటి మహానుభావులు ఒకవైపు స్త్రీని మహాశక్తిస్వరూపిణిగా అభివర్ణిస్తూనే మరోవైపు ఆ మహోన్నత లక్షణాన్ని కించపరుస్తూ వారి ఉన్నతస్థానాన్ని నీచ-నికృష్టమైన స్థాయికి పదిలంగా దిగజార్చారు. ఈ పరిణామక్రమంలో స్త్రీని మతాచారాలు, ధర్మసూత్రాల పేరిట, పవిత్రత మాటున, సాంప్రదాయాల చాటున స్త్రీ స్వేచ్ఛను బలిచేస్తూ వారి అంతస్తును మరింత వెనుకకు నెట్టివేశాయి.
భూస్వామ్య, పెట్టుబడిదారి సమాజం క్రమంలో స్త్రీ అంతస్తును కించపరిచే సంస్కృతి మొదలైంది. భూస్వామ్య సమాజంలో స్త్రీ ఉత్పత్తి సంబంధాలలో వెనక్కి నెట్టివేయబడింది. మగవాడి చాటున బ్రతికే మూగజీవచ్ఛవంలా మారింది. ఉత్పత్తి సాధనాలలో ఆమె ఆధీనంలో లేకపోవడమే స్త్రీ అంతస్తును దిగజార్చివేసింది. ఈ ఆర్థికాంశాల ఫలితాలు భాషా-సాంస్కృతిక అంశాలలో కూడా స్పష్టంగా చూడవచ్చు.
పెట్టుబడిదారి సమాజంలో స్త్రీ ఒక వినోద విలాస వస్తువుగా చూడబడుతున్నది. ఈ సమాజంలో ఉన్న పేదరికం-నిరుద్యోగపు సమస్యలు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలపై కూడా దీని ప్రభావం కనబడుతుంది. ఈ సమాజం నుండి పుట్టుకొచ్చిన మోడలింగ్, క్లబ్ నృత్యాలు, అశ్లీల సాహిత్యం స్త్రీ అంతస్తును, ప్రతిష్ఠను దెబ్బతీసింది. ప్రతీది ఆర్థికాంశం నుండే మొదలు కావడం మూలంగా చివరకు స్త్రీ శిశు భ్రూణ హత్యలకు పాల్పడుతూ మానవత్వాన్ని మంటగలుపుతూ అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రక్రియ హిందూ స్త్రీ అంతస్తునే కాకుండా సార్వత్రికంగా స్త్రీ అంతస్తును బహిర్గతంగా పాతాళానికి నెట్టివేస్తూ సజీవ సమాధిని చేస్తున్నది.
హిందూ సామాజిక వ్యవస్థలో స్వాతంత్య్రానంతరం స్త్రీలకు శాసనపరంగా కొన్ని హక్కులను, సదుపాయాలను ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అనాదిగా సామాజిక పీడనకు గురవుతూ, ఆర్థిక దోపిడీకి బలి అవుతూ ఉన్న స్త్రీకి ఊరట కలిగింది. ఈ నేపథ్యంలో స్త్రీ అన్ని రంగాలలో ముందడుగు వేస్తున్నది. ఇది వారి సామాజిక ప్రగతికి సోపానం. అదే సామాజిక వికాసానికి ప్రబల తార్కాణం అవుతున్నది.
ఉపయుక్త గ్రంథాలు :
1) దుర్గావతి : మహిళలు-అభివృద్ధి – తెలుగు, అకాడమి, హైద్రాబాద్ 2) యం.వి. రామమూర్తి – మహిళలు శాసనపరమైన హక్కులు
3) బృందాకారత్-సమాన హక్కులు/సమాన చట్టాలు 4) మల్లాది సుబ్బమ్మ- మహిళల హక్కులు, మానవ హక్కులు
(రిసెర్చి విద్యార్ధులను ప్రోత్సాహించుటకొరకు ప్రచురించబడింది)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags