ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -27

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌

అనువాదం : ఆర్‌. శాంతసుందరి
”అదేం కాదండీ, ఎప్పుడూ పిల్లల్ని వదిలి ఉండలేదు, అందుకే వాళ్ళు దగ్గరలేకపోతే ఆయనకి ఏమీ తోచదు,” అన్నాను.
జ్ఞానూ మా పక్కనే ఉన్నాడు. ”వీడు మీ చిన్నబ్బాయా?” అని అడిగారు వాళ్ళు.
”కాదండీ, మా అమ్మాయి కొడుకు, మా మనవడు,” అన్నారాయన.
ఆయన భోజనం ముగించి వాళ్లందరీతో తన గదిలోకెళ్ళారు. కొంతసేపు ఇలాగే కబుర్లు చెప్పుకున్నారు. వాళ్లు నాతో మాట్లాడితే నాకు జంకుగా ఉండేది. వాళ్లు వెళ్లిపోయాక, ”మీరేమిటి వాళ్లతో నాగురించి అంత పొగిడారు, నాకు చాలా మొహమాటం అనిపించింది!” అన్నాను.
”అరె, ఇందులో మొహమాటపడాల్సిందేముంది? వీళ్లదంతా దొరల తంతు. వీళ్లకి మన సంసారాలు ఎలా ఉంటాయో ఏం తెలుసు? నౌకర్లే అన్ని పనులూ చేస్తారు, వంటా వార్పూ, వడ్డనా కూడా. ఇంట్లో భార్య వండి, తన చేత్తో వడ్డిస్తే తినటం వీళ్లకి తెలీదు. అందులోని ప్రేమా, ఆ వంటలోని రుచీ వీళ్లకేం తెలుసు వీళ్ల మొహం? వీళ్ల జీవితాల్లో పనులన్నీ దొరల పద్ధతిలోనే ఉంటాయి. ఆకాశంలో ఎగురుతూ ఉంటారు. మన సంస్కృతిని పూర్తిగా మర్చిపోయి బతుకుతున్నారు.”
”అయితే వాళ్లు కూడా మీగురించి పల్లెటూరి బైతు, మొరటు మనిషి అనుకుంటూ ఉంటారేమో!”
”ఏమైనా అనుకోనీ, కానీ వాళ్లూ మానవత్వాన్ని మర్చిపోయి చాలా దూరం వెళ్లిపోతున్నారు. ఇంట్లో పిడికెడు మెతుకులు తింటే ఉండే రుచి, హోటల్లో ఎంతమంచి భోజనం చేసినా దొరుకుతుందా?”
”కానీ వాళ్లు నన్ను చూసి నవ్వుకుంటారు, అది నాకు నచ్చదు. ఇంట్లో విషయాలు నాలుగ్గోడల మధ్యే ఉండాలి,” అన్నాను.
”అలా ఉండిపోతే మనం పొందే ఆనందాన్ని వీళ్లు కలలో కూడా పొందలేరు. అసలు వీళ్ల వ్యవహారం ఏమిటో తెలుసా? ఆడా, మగా, ఇంట్లో కుటుంబ సభ్యులూ అతిధుల్లాగ ప్రవర్తిస్తారు. ఎవరి పనులు వాళ్లవి. ఎవరికి వాళ్లూ ఇంటికి రావటం, అన్నం తినటం, పడుకోవటం, వాళ్లుండేది ఇల్లుకాదు, హాస్టలో, బోర్డింగ్‌ హౌసో అనాలి. వాళ్ల జీవితాల్లో సంతోషాన్నిచ్చేదైనా ఉందా అంటే అది డబ్బే. వాళ్ల జీవితాల్లో ప్రేమా, ఆప్యాయతా లాటివాటికి చోటు లేదు. కలిసి ఉండటంలో ఆనందం లేదు, విడిపోవటంలో బాధ లేదు.”
దసరా సెలవలకి బొంబాయి వస్తున్నామని పిల్లలు టెలిగ్రామిచ్చారు. దాదర్‌లో దిగుతున్నామని పంపిన ఆ టెలిగ్రామ్‌ రాత్రే అందింది. ఉదయాన్నే స్టేషన్‌కెళ్లాలి. ధున్నూ, చిన్నూ వచ్చే రైలు ఉదయం చేరుకుంటుంది,” అన్నారు.
”ఉదయాన్నేనా?” అన్నాను.
”అవును, తోవలో జబల్‌పూర్‌లో టెలిగ్రామిచ్చారు.”
ఆయన పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకుని తయారయారు. నేను స్నానం చేసి యిలా బైట కాలు పెట్టానో లేదో మా అమ్మాయి, ”అమ్మా, సూబేదార్‌ పోయాడు,” అని చెప్పింది.
ఆయన పొద్దున్నే స్టేషన్‌కి వెళ్తారని తెలుసు. ఆయన బల్లమీద కొంత డబ్బు పెట్టి నేను కిందికి దిగి వెళ్లాను. అక్కడ బోలెడంతమంది ఆడా, మగా గుమిగూడి కనిపించారు, అందరూ ఏడుస్తున్నారు. బల్లమీది డబ్బులు అక్కడే వదిలేసి ఈయన కూడా కిందికి వచ్చారు. చాలా సేపు ఆయన కూడా అక్కడే ఏడుస్తూ నిలబడ్డారు. ఆ తరవాత స్టేషన్‌కి వెళ్లారు. ఆసరికి పిల్లలు వచ్చిన రైలు వెళ్లేపోయింది. తరవాత, ఆ రైల్లో పిల్లలు రాలేదని తెలిసింది. రైల్లోంచే టెలిగ్రామిచ్చిన వాళ్లు రాకుండా ఎక్కడికెళ్లారని చాలా కంగారు పడ్డాం. ఏం చెయ్యాలో తెలీక నౌకర్ని పిలిచి, ”స్టూడియోకి గాని వెళ్ళారేమో ఒకసారి చూసిరా!” అని చెప్పి పంపారు. నౌకర్‌ వెళ్లాడు.
స్టూడియోకెళ్తే శ్రీపత్‌రాయ్‌ స్టేషన్‌లో ఉన్నాడని తెలిసింది. నౌకర్‌కి అబ్బాయిల రూపురేఖల గుర్తులు చెప్పాం. నౌకర్‌ స్టేషన్‌కెళ్ళి ఇద్దర్నీ వెంటబెట్టుకుని వచ్చాడు. అప్పటికి గాని ఈయన స్నానం చేసి భోంచెయ్యలేదు. ”రైల్లో వచ్చిన పిల్లలు ఎలా మాయమయారా అని బలే గాభరా పడ్డాను,” అన్నారు నాతో.
నాలుగైదు రోజులు పోయాక మా అల్లుడి దగ్గర్నించి టెలిగ్రామ్‌ వచ్చింది, అతను కూడా వస్తున్నానని టెలిగ్రామిచ్చాడు. సాయంకాలం ఈయన ధున్నూతో, ”బాబూ, రేప్పొద్దున్నే వెళ్ళి మీబావగార్ని తీసుకురా. మిమ్మల్ని తీసుకొచ్చేందుకు నేను వచ్చాను, మీరు కనబడలేదు, ఇప్పుడిక ఆ బాధ్యత నువ్వు  తీసుకో.
”ఊరు కొత్త, వీడు కూడా తప్పిపోయాడంటే, ఇద్దర్నీ వెతకలేక చస్తాం,” అన్నాను.
”లేదు, ధున్నూ అంత తెలివితక్కువవాడేం కాదు,” అన్నారు.
నిజంగానే ధున్నూ బావ కోసం స్టేషన్‌కెళితే, వాడికి కూడా అతను కనిపించలేదు. అతను కూడా తిన్నగా స్టూడియోకే వెళ్లాడు. ఎంతసేపటికీ ఇద్దరూ రాకపోయేసరికి, ”పదండి డాబామీదికెళ్లి చూద్దాం. వస్తూఉంటే కనీసం కనిపిస్తారు,” అన్నారీయన. పైకెళ్ళి నిలబడ్డామో లేదో మా అల్లుడు కనిపించాడు. ధున్నూని కిందికి పరిగెత్తమని చెప్పి ఈయన కేక పెట్టారు, ”రా బాబూ! ఇదే ఇల్లు!” అతను పైకి వచ్చాక, ”మీ కుర్రాళ్లు రైలు దిగి ఎక్కడికి పోతారో తెలీదు, ఆరోజు ధున్నూ, చిన్నూ వచ్చినప్పుడు నేను స్టేషన్‌కి వెళితే ఇద్దరూ కనిపించలేదు. ఈరోజు నువ్వూ మాయమై పోయావు!” అన్నారు.
”నేను రైలు దిగి స్టేషన్‌ బైట కాసేపు నిలబడ్డాను. తరవాత స్టూడియోకి వెళ్లిపోయాను. స్టూడియోలో వాళ్లకి మీరుండే కాలనీ తెలుసు కానీ, ఇల్లు తెలీదు. ఒకసారి మీ ఇంటిముందునుంచే వెళ్లాను, మళ్లీ వెనక్కి వచ్చాను. అదృష్టం కొద్దీ మీకళ్లబడ్డాను,” అన్నాడతను.
”అయ్యో! అనవసరంగా ఇబ్బంది పడ్డావు బాబూ!”
”సరే, వాళ్ల ఇబ్బందిమాట అటుంచి, మీరెంత గాభరా పడ్డారు! ఈ దాదార్‌ స్టేషన్‌ ఏదో మయసభ లాగుందే, లోపల అడుగుపెట్టిన వాడికి దారే దొరకదు బైటికి రావటానికి?” అన్నాను.
మూడు రోజులపాటు ఉండి పిల్లలు మళ్లీ అలహాబాద్‌కి వెళ్లిపోయారు.
కాంగ్రెస్‌ సభలు మొదలైనాయి. మొదటిరోజు మేం నలుగురం వెళ్లాం. ఆయన దగ్గర టిక్కెట్టు ఉంది, ముందే కొనేసుకున్నారు. మా ముగ్గురికీ టిక్కెట్టు కొనేందుకు డబ్బులడిగారు. నేను డబ్బు తీసి ఇచ్చాను. మా అల్లుడు, వాసుదేవ్‌ ప్రసాద్‌ ఆయన దగ్గర్నించి వాటిని తీసుకుని తనేవెళ్లి టిక్కెట్లు పట్టుకొచ్చాడు. మేం ముగ్గురం, అమ్మాయీ, అల్లుడూ, నేనూ ఒకచోట కూర్చున్నాం, ఆయన విడిగా కూర్చున్నారు. ఆరోజు అందరం ఇల్లు చేరేసరికి అర్థరాత్రి పన్నెండయింది. మర్నాడు కూడా మేం ముగ్గురం ఒకచోట కూర్చున్నాం, ఆయన లోపలికెళ్లారు. గాంధీగారి ఉపన్యాసాన్ని ఎవరో చదవటం ప్రారంభించేసరికి లౌడ్‌ స్పీకర్‌ పాడయింది. అదేసమయంలో అందరూ పరిగెత్తటం మొదలుపెట్టారు. మొగాళ్లు దూకుతూ ముందుకి వెళ్తున్నారు. అప్పుడు నేనూ, మా అమ్మాయీ మధ్యలో కూర్చున్నాం. జ్ఞానూ కూడా మా వెంట ఉన్నాడు. అందరూ అలా పిచ్చిగా పరిగెత్తటం చూసి నేను లేచి నిలబడ్డాను. మధ్యవయస్కులిద్దరు నాతో, ”అమ్మా! మీరు కూర్చోండి.” అంటూ మామీదికి వంగి, మాకు అడ్డంగా నిలబడ్డారు. పాపం వందలకొద్దీ చెప్పులు వాళ్ల వీపులమీదపడి ఉంటాయి. నేను వాళ్లకి కృతజ్ఞతలు చెప్పేలోపలే గొడవ సద్దుమణిగింది, వాళ్లిద్దరూ నాకు కనిపించలేదు. వెంటనే నేనూ, అమ్మాయీ ఇంటికొచ్చేశాం. ఈయన ఏ అర్థరాత్రో ఇల్లు చేరుకుని, ”ఓ, మీరు ఇంటికెలా వచ్చారు?” అని అడిగారు.
నేను జరిగిందంతా చెప్పి, ”ఇవాళ మా అదృష్టం బావుంది, అందుకే భద్రంగా ఇంటికొచ్చాం. లేకపోతే బాగా దెబ్బలు తగిలుండేవి. అసలు ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నారేమో!”
”ఇక్కడి జనం బొత్తిగా అనాగరికులు. కొట్లాటలూ, తన్నుకోటాలూ లేకపోతే వాళ్లకి బావుండదు. దానివల్ల లాభమేమైనా ఉందా, నష్టం జరుగుతుందా అనే ఆలోచనే లేదు. మిగతా దేశాల్లో టిక్కెట్టు తీసుకునేందుకు జనం వరసలో నిలబడి నింపాదిగా వెళ్తారని విన్నాను. ఇక్కడిలా రౌడీల్లాగ ప్రవర్తిస్తే జైల్లో వేస్తారు. కానీ ఇక్కడ అడిగే నాథుడేలేడు!” అన్నారాయన.
”కాలేజీ కుర్రాళ్లలాగ కనిపించారు నా కళ్లకి.”
”అవును, ఇక్కడ చదువుకున్న గాడిదలు కూడా బైతుల్లాగే ప్రవర్తిస్తారు, అసలు బాధ్యతే తెలీనివాళ్లు.”
మరి ఈ పెద్ద పెద్ద డిగ్రీలు ఎందుకు సంపాదిస్తున్నట్టు?”
”అవి పెద్ద పెద్ద డిగ్రీలెందుకయాయి. బానిసత్వాన్ని మెళ్లో నగలా తొడుక్కోవటమే. తమ ఆఫీసర్లముందు కుక్కిన పేనుల్లా ఉంటారు వీళ్లు. ఆఫీసరెంత చెపితే అంతే, కానీ బైట విశ్వరూపం చూపిస్తారు. ఇక భయం భక్తీ అసలే లేవు. ఉంటే, అక్కడ ఆడవాళ్లూ, పిల్లలూ కూర్చున్నారని తెలిసి కూడా అంత గోల చేస్తారా? కాంగ్రెసు ఉద్యమం రోజుల్లో పోలీసులు గుంపుని చెదరగొట్టేందుకు గుర్రాలమీద వచ్చి తరిమేవాళ్లు, దానికీ దీనికీ తేడా ఏమీ లేదు! ఒకే ఒక తేడా ఏమిటంటే అప్పుడు బ్రిటిషు వాళ్ల ప్రభుత్వం, మనని అణిచేసేందుకు అలా చేసేది, కానీ ఇక్కడ అందరూ గుమిగూడింది మహాత్ముడి ఉపన్యాసం వినేందుకు, అక్కడికి వచ్చిన స్త్రీలనీ, పిల్లల్నీ గాయపరచటం ఎంత ఘోరం! వీళ్లని ఏమనాలి? ఎంతమంది ఆడవాళ్లూ, పిల్లలూ వాళ్ల కాళ్లకింద నలిగిపోయారో ఎవరికి తెలుసు? మరోపక్క మీకోసం చెప్పుదెబ్బలు తిన్నవాళ్లు కూడా ఉన్నారు. మీనుంచి కృతజ్ఞతలు కూడా ఎదురుచూడకుండా వెళ్లిపోయారు. ఇదంతా చూస్తే నాకేమనిపిస్తోందో తెలుసా? మన సమాజం రెండుదారుల్లో ముందుకి పోతోంది. ఒకదాన్లో అణగదొక్కేవాళ్లూ, మరోదారిలో అణగదొక్కబడే వాళ్లూ!”
”ఇలాటిది ఎప్పుడూ ఉన్నదే. ఎప్పుడూ ఉంటుంది కూడా,” అన్నాను.
”రేపు నాతోవచ్చి, నాపక్కనే కూర్చోండి.”
”లేదు, నేనింక అక్కడికి రాను, నిన్న జరిగింది చూసి నాకు చాలా బాధేసింది. మా విషయం అలా ఉంచండి, పాపం పసివాడు, జ్ఞానూకి ఏమైనా జరిగుంటే ఏమయేది?”
”అయితే నీ ఇరవై రూపాయల టిక్కెట్టు అనవసరంగా కొన్నట్టేనా?”
”మహాశయా! ఇప్పుడైతే ఇరవై రూపాయలతో పోతుంది, రేపు తగలరాని దెబ్బేదైనా తగిలితే ఏమవుతుందో ఆలోచించండి!”
”సరే, వెళ్లాలని లేకపోతే మానెయ్యి కానీ నా పక్కన కూర్చుంటే అలాటివేవీ జరగవు. అసలు ఆయన ఉపన్యాసం వినటానికి అక్కడికి వచ్చిన జనం అంత పశువుల్లా ప్రవర్తిస్తారని మహాత్ముడికి తెలిస్తే ఆయన వారం రోజులు నిరాహారదీక్షకి కూర్చుంటాడు!’
”ఆయన చెయ్యగలిగింది అంతకన్నా ఏముంది? ఆయన పాపం అన్నీ చేస్తూనే ఉన్నాడు, కానీ వాటిని ఎవరైనా పాటిస్తే కదా? ఈయనే కనక మరో దేశంలో పుట్టివుంటే అక్కడి జనం మనకన్నా ఎక్కువ పురోగతి సాధించేవాళ్లు,” అన్నాను.
”దేశం సవ్యంగా ఉండి, అన్నీ సవ్యంగా జరిగిపోతూ ఉంటే ఏమైనా చెయ్యాల్సిన అవసరం ఏముంటుంది? ఇటువంటి క్లిష్టపరిస్థితి ఏర్పడినప్పుడే మహాత్ములు పుట్టుకొస్తారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసుక్రీస్తు, మహమ్మదు లాంటివారు. అప్పుడు కూడా ఇలాటి పరిస్థితే ఉండి ఉంటుంది. వాళ్లు పుట్టి జనాన్ని ఉద్ధరించారు. అలా పుట్టినవాడే గాంధీ మహాత్ముడు కూడా.”
”కానీ ఆయన్ని మాత్రం జనం విడిచిపెట్టారా? ఆనందంగా ఉన్నారా? ఆయనతోనూ పోట్లాడుతూనే ఉన్నారుకదా?”
”ఒకానొకప్పుడు ఏసుక్రీస్తు అరచేతుల్లో మేకులు దిగేశారు. మహమ్మద్‌ ప్రవక్త నీళ్లకోసం అల్లల్లాడిపోయాడు. రాముడూ, కృష్ణుడూ మాత్రం తక్కువ యుద్ధాలు చేశారా? బుద్ధుడికి కూడా ఎంతమంది శత్రువులుండేవాళ్లు? ప్రస్తుతం గాంధీయుగం, మరి ఆయన కూడా యుద్ధాలు చెయ్యాల్సిందే. కానీ చివరికి గెలుస్తాడు, చూడు!” అన్నారు.
”ఎప్పుడో గెలుస్తాడేమో, కానీ ప్రస్తుతం ఎంత ఇబ్బందిగా ఉంది?” అన్నాను.
”అసలు నన్నడిగితే జీవితమే ఒక పోరాటం. పోరాటం లేకుండా అసలు జీవితమేమిటి?”
”ఎన్నైనా చెప్పండి, ఈ పోరాటాలు నాకు చాలా హడలెత్తిస్తున్నాయి!”
”పోరాటాలంటే భయమా? మరి నువ్వు కూడా పోరాటాల్లో పాల్గొంటావే?”
”లేదు, పోరాటాలకి ఒక నమస్కారం, బాబూ!”
”నువ్వు ఆడదానివి కదా! ఆడవాళ్లకే ఇలాంటి భయాలు ఎక్కువ. మగాడు పోరాటానికి భయపడడు!”
”వాళ్లెందుకు భయపడతారు? అసలు వాళ్లేకదా పోరాటాలకి కారణం?”
”అవును, పోరాటానికి భయపడే మగాడు పిరికిపంద.”
”ఇవన్నీ బహుశా కాంగ్రెస్‌ వాళ్లు చెప్పే మాటలై ఉంటాయి.”
”ఉత్త మాటలు కావు, మనసులో తలెత్తే బాధ. అన్యాయం చేసేవాళ్లకి, ఆ అన్యాయం మన పట్ల అయినా, ఇంకొకరి పట్ల అయినా, బలవంతుడైన వాడు చూస్తూ ఊరుకోలేడు. అన్యాయాన్ని అంతం చేసేందుకే అతను పుడతాడు.”
మేం బొంబాయి వెళ్ళాక, సినిమాకోసం ఆయన రాసిన ఒక కథలో చాలాభాగాలు తొలగించినప్పటికీ, సెన్సార్‌ బోర్డు దాన్ని నిలిపి వేసిందని తెలిసింది. అది చూశాక, ఇక్కడికి నేను వచ్చి చేయాలనుకున్న పని సవ్యంగా జరిగేట్టు లేదని ఆయనకి అనిపించింది. ”ఇక్కడ అంతా సినిమా రంగంలోని యజమానుల చేతుల్లోనే ఉన్నట్టుంది. రచయితకి ఏమాత్రం మర్యాద ఇవ్వరు, వాళ్లకి కావలసింది డబ్బు సంపాదించుకోవటమే!” అన్నారు నాతో.
”అయినా రచయిత వాళ్లని నిలదీయాలి, నా కథలో ఇన్ని మార్పులూ చేర్పులూ ఎందుకు చేశారని అడగాలి!”
”ఎవరు వినిపించుకుంటారు?”
”వినిపించుకోకపోతే, మంచి రచయితలు ఇలాటి పనుల్లో అసలు వేలు పెట్టనే కూడదు.”
”నేను కూడా మరో రెండు మూడు నెలలు చూస్తాను.”
”మీరు వాళ్లతో మాట్లాడండి.”
”మీదారిన మీరు వెళ్లచ్చు! మీ కోసం లక్షలు పాడుచేసుకో మంటారా? అంటారు నిజంగా వెళ్లదల్చుకున్నప్పుడు నాలుగూ అడిగి వెళ్దాం. ఈ లోపల నేను చెప్పటం, వాళ్లు వినటం అనేది జరిగేపని కాదు.”
”అందుకే నేను బెనారస్‌లో ఉన్నప్పుడే ఈ పని మనకొద్దు అన్నాను. కానీ మీరేమో అక్కడ మంచిమంచి సినిమాలు అందరికీ చూపిస్తానన్నారు. నవలలూ, కథలూ చదివి పొందలేని లాభం సినిమాల ద్వారా ఎక్కువమంది పొందగలరని అన్నారు. ఇప్పుడు అవన్నీ ఏమయాయి?”
”ఎవరైనా ఎంతకని ప్రయత్నం చెయ్యగలరు? నాలాటివాడు ఇంట్లో కూర్చుని చెయ్యగలిగినంత పని చేసుకోవటం ఉత్తమం. ఇక్కడ ఆపని కూడా చేసే వెసులుబాటు లేదు!”
ఆరోజుల్లో ఆయన ఆరోగ్యం కూడా అంత సరిగ్గా ఉండేదికాదు. జ్వరమో, జలుబో ఉంటూనే ఉండేది.
”అయితే ఇదంతా మానెయ్యండి. ఇంటికెళ్దాం పదండి!” అన్నాను.
అలా ఒక్కసారిగా ఎలా పారిపోతాం? ఆరోజు ఒక గుజరాతీ పెద్దమనిషి మనని ఒక సినిమాకి తీసుకెళ్లాడు. ఎంత అసహ్యంగా ఉందది! నీకాయనమీద ఎంత కోపం వచ్చింది! ఆ తరవాత అసలు సినిమాలే చూడనని శపథం పట్టావు. నేను ఈ సినిమా ప్రపంచాన్ని కొంచెం బాగుచేద్దామని అనుకొన్నాను. మరిప్పుడు నేను పారిపోతే అదెలా బాగుపడుతుంది? దానివల్ల సినిమాలు తీసేవాళ్లకేమీ నష్టం ఉండదనుకో, నాకే నష్టం, బాగుచెయ్యాలనుకున్న నా ప్రయత్నం కొనసాగకుండా పోతుంది.”
”కానీ మీ ఆరోగ్యం కూడా బావుండటం లేదు కదా! మరింత పాడైతే ఇక్కడ నేనొక్కదాన్నీ ఏం చెయ్యగలను అనేదే నాభయం.”
”అదేం లేదులే, ఇదంతా మనకి మామూలేగా. ఈమధ్యన నేను షికారుకి కూడా వెళ్తున్నాను, చూస్తున్నావుగా?”
నేను బొంబాయికి వెళ్లకముందునుంచే పనిచేసిన నౌకరు ఇంకా మీతోటే ఉన్నాడు. అతను వంటచేసే సమయానికి సరిగ్గా ఎక్కడో మాయమైపోయేవాడు. ఈయన స్నానం ముగించి వచ్చేసరికి నేనే రొట్టెలు కాల్చి ఇచ్చేదాన్ని. ”ఈ నౌకరు ఎక్కడ మాయమయిపోతాడో తెలీటం లేదు,” అన్నాను ఆయనతో ఒకరోజు.
”ఎటో వెళ్తుంటాడు,” అన్నారు.
”ఇవాళేకాదు, మూడు రోజులుగా వరసగా ఇదేతంతు. ఇంతకు మునుపు కూడా చాలాసార్లు చెప్పకుండా వెళ్లిపోయేవాడు. ఇవాళ వీణ్ణి పనిలోంచి తీసేస్తున్నాను!”
”పోన్లే, ఈసారికి వదిలెయ్‌. నేను వాడితో మాట్లాడతాగా,” అన్నారు నా కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ.
”ఇంతకు ముందు ఎన్నిసార్లు మీరు చెప్పలేదు? దానివల్ల ఏమైనా మారాడా?”
”సరే, ఈసారికి ఏమీ చెయ్యద్దు. మళ్లీ ఇలా చేస్తే తప్పకుండా పనిలోంచి తీసేద్దువుగాని.”
ఆరోజు నేను వాణ్ణి ఏమీ అనలేదు. ఈయనే మాట్లాడారు. ఒక పదిహేనిరవై రోజులు బుద్ధిగా ఉన్నాడు, మళ్లీ పాత అలవాటు వచ్చేసింది. ఇక నేను వాణ్ణి వెళ్లగొట్టేశాను. తరవాత రెండు మూడు రోజులు మా ఇంటికింది భాగంలోనే ఉన్నాడు. ”వాడెక్కడికీ వెళ్లలేదు, తెలుసా?” అన్నారీయన.
”అయితే నన్నేం చెయ్యమంటారు?”
”ఏం లేదు, పాపం బీదవాడు, తిండికి మాడతాడో ఏమిటో!”
”మీకంత జాలిగా ఉంటే వాడికేదైనా ఇవ్వండి, కానీ నేను మాత్రం మళ్లీ వాణ్ణి పనిలో పెట్టుకోను.”             – ఇంకా ఉంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.