గీటురాయికి అటూ ఇటూ…

కొండేపూడి నిర్మల
పనిలేని క్షురకుడు పిల్లితలక్షవరం చేశాడనే సామెతలో ఎంత దుర్మార్గమైన అపవాదు వుందో తెలుసా..?
క్షురకవృత్తి చేసే కార్మికుడు పిల్లి తల జోలికి ఎప్పుడు వస్తాడో చెప్పండి… సానపెట్టిన కత్తికి ఒక్క తలకాయా దొరక్కపోవడం వల్ల వస్తాడు. బస్తీలో అందరూ గడ్డాలూ మీసాలూ పెంచేసుకుని గల్లీకొక బాబా చొప్పున జనాల్ని మోసం చేయడంలో బిజీగా వున్నప్పుడు, గుంపులు గుంపులుగా జనమంతా మెడమీద వాటాలన్నీ (తలలు) వడ్డీకాసులవాడికి మొక్కుకుని కల్యాణకట్టలో వాలిపోయినప్పుడు, మన వూరి కార్మికుడికి దక్కాల్సిన కనీస ఆదాయం ఏదీ కనుచూపుమేరలో లేకుండాపోయినప్పుడు… అప్పుడు కేవలం తన వృత్తిని మర్చిపోకుండా వుండేందుకు నిరుపేద అయిన ఆ క్షురకుడు ఒక పిల్లిని దొరకబుచ్చుకోవచ్చు. నోరులేని ఆ జీవాన్ని మనిషిమాదిరి నాగరికుడ్ని చేసే ప్రయత్నంలో గడ్డాలూ మీసాలూ తీసేపని పెట్టుకోవచ్చు.. ఇది రాజద్రోహం కాదు, పస్తులున్న అతని కుటుంబానికి ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వదిలేసిన ఈ సమాజమో, రాజ్యమో చేస్తున్న హింస అని నేను అంటాను. అయితే దీనివల్ల పిల్లితో సహా ఎవరికీ ఎటువంటి ప్రయోజనం లేదు కదా అనే లా పాయింటు మీరు నన్ను అడగచ్చు. ప్రయోజనంలేని పన్లతో దేశమంతా కిటకిటలాడ్డంలేదా. నిండునూరేళ్ళపాటు నిద్రపోవడానికే పదవి పుచ్చుకున్న మాజీమంత్రివర్యులు దేవెగౌడ వల్లగానీ, డబ్బుచేసిన ఒక సినిమా సుపుత్రుడు ఇటీవల చేసుకున్న అయిదురోజుల పెళ్ళివల్లగాని, ఇంకా ఇంకా అనేకానేక పనికిరాని పన్లవల్లగాని దేశానికేమిటి ప్రయోజనం అని నేను అడగను.
ఎందుకంటే కొన్ని వార్తలు వినడం మూలంగా ఎలా బతకడం దేశానికి అనర్థమో తెలుస్తుంది. గీటురాయికి మంచి నకళ్ళే కాదు, చెడ్డ నకళ్ళు కూడా కావాలి. ఆ మాటకొస్తే ఒక మంత్రిగారు తన పదవీకాలంలో వున్న అయిదేళ్ళూ ప్రశాంతంగా నిద్రపోవడంవల్ల, మెలకువగా వున్న మంత్రులకంటే తక్కువ అవినీతిపనులు మాత్రమే చెయ్యగలిగారని, దరిమిలా అందరికీ నిద్రమాత్రలు వేసి సీటులో కూచోపెట్టడంవల్ల భూమి కుంభకోణాలు నుంచి సెక్సు కుంభకోణాలదాకా తగ్గే వీలు వుందని ”ఓండ్రింతలు” అనే పుస్తకంలో నా అభిమాన రచయిత కలువకొలను సదానంద ఎప్పుడో చెప్పారు.
ఈ నేపథ్యంలో పిల్లికి గడ్డం చేయడంకంటే సృజనాత్మక మరియు మానవీయ దృశ్యం మరొకటి లేదని నా అభిమతం.
అసలు పిల్లికిగడ్డం చేయడమంటే ఎంత కష్టమో ఒకసారి ఊహించండి. మొదట భయపడి పారిపోతున్న దానిని ప్రేమతో బుజ్జగించాలి. చిన్నగిన్నెలో పాలు తాగించాలి. పాలు తాగుతున్నంతసేపు దాన్ని వెన్నుమీద నిమురుతూ మన ఉనికివల్ల దానికి భరోసా కలిగించాలి. ఇంతచేసినాసరే సాన మీద కత్తిని తిప్పగానే గుర్రున అరిచి గుడ్లు పీకేయవచ్చు. నువ్వు కత్తి పట్టుకున్న కారణం దానికి తెలియదు కదా. ఆ సందర్భంలో కూడా నిలదొక్కుకొని, సహనంగా పసిబిడ్డ మాదిరి దానిని ఒడిలో కూర్చోపెట్టుకొని క్షవరకార్యం పూర్తిచేయాలి. కాబట్టి అది పనిలేనివాడు చేసే పని కాదు, పనిలో ఆరితేరినవాడు మాత్రమే చేయగల పనియని విన్నవించదలుచుకున్నాను. ఎందుకంటే, దీనివల్ల ఎలాంటి పారితోషికమూ ఉండదు. తట్ట పట్టుకొని కెమెరాకి ఫోజులిచ్చే జన్మభూమి అధికారుల మాదిరి కాకుండా, జీవకారుణ్యంతో, నిజాయితీతో కత్తి నడపాలి. ఎక్కడ తెగకుండా, రక్తం చిందకుండా, కాచిన జున్నుగడ్డ మీద మిరియాలపొడి అద్దినంత నైపుణ్యంతో మార్జాలనీలాల్ని తీసేయాలి. కాబట్టి పనికి వంకలు పెట్టేవాళ్ళు నిజంగా పనిలేనివాళ్ళుగా మనం గుర్తించాలి.
మా బాబాయి ఒకడు నిద్రలేచిన వెంటనే ”సూర్యుణ్ణి చూసి ఓరి నీ మొహం మండ, అప్పుడే జొరబడి చచ్చావా”. వానాకాలం అనుకోండి అప్పుడు మబ్బులు పట్టిన ఆకాశాన్ని ఉద్దేశించి ”ఓరి నిన్ను తగలెయ్య ఇప్పటిదాకా ఎక్కడికి పోయావురా” అని అరిచేవాడు. అది మొదలు రోజంతా అన్నిటికీ తిట్లవర్షమే కురిసేది, ఒక్కసారి కూడా లేచిపోకుండా అతనితో అరవయ్యేళ్ళు కాపురం చేసిన మా పిన్నికంటే భూదేవి ఇంకెక్కడయినా వుంటుందంటే నేను నమ్మను.
ఆయన కంకణం కట్టుకున్న కార్యక్రమాలు తెలుసుకుంటే మీకు మతిపోతుంది. వాటి ప్లానింగ్‌లో, నిర్వహణలో అమాంబాపతు పొట్టి శ్రీరాములు లాంటి వాడిని అనుకొని మీసం తిప్పేవాడు. ఉదాహరణకు అతని కమ్యూనిస్టు మిత్రుడి తల్లి చనిపోయినప్పుడు అందరితోబాటు పరామర్శించి రాకుండా వాళ్ళ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పురోహితుడితో మాట్లాడి ఎలాగోలా ఉత్తరకర్మలు జరిపించి తద్వారా పుణ్యగతులు మంజూరు చేసి వచ్చాననేవాడు.
క్రైస్తవమతం పుచ్చుకున్న మరదలు నుదుట బొట్టు పెట్టుకునేదాకా సతాయించి, సాధించి బొట్టుదిద్దుకుంటేనే అక్కతో మాట్లాడ్డానికి అనుమతిస్తానని షరతు పెట్టడం ద్వారా వాళ్ళిద్దరి భావోద్వేగాల మీద దెబ్బకొట్టి సన్మార్గంలోకి నడిపించానంటాడు.
పెళ్ళి చేసుకోనని మొత్తుకున్నా పక్కింటి మార్క్సిస్టు కుర్రవాడి నోరునొక్కి నందికేశవ నోము తప్ప ఇంకేమీ తెలియని భక్తురాలినిచ్చి తాళి కట్టించడం ద్వారా చేసిన పాపాలన్ని పోయాయని ప్రకటించాడు.  అంతెందుకు ఐశ్వర్యారాయ్‌ తనకంటే ఆరేళ్ళు చిన్నవాడైన అభిషేక్‌బచ్చన్‌ని చేసుకొని వరహీనం అనబడు పాపం చేయడంవల్ల దిగులుపడి ఆ రాత్రంతా నిద్రపోలేదుట. ఈ రకంగా దేశంలో ఎవరి జీవితాన్నైనా తన చేతిలోకి తీసుకొని, వాడి మెదడులోని గుజ్జంతా తినేసి ఆ తరువాత అత్యంత ప్రేమతో కోతికొమ్మొచ్చి ఆడించేవాడు.
టూ మచ్‌ పొసెసివ్‌నెస్‌ అనబడు ఈ జబ్బుకి తెలుగు నిఘంటువులో ”తీవ్రాతితీవ్రంగా జొరబడి ఏలుకునే గుణం” అని రాసి ఉంది. స్త్రీలను ఇంకొకరు ఉద్ధరించేవాదం ఉండవచ్చుట గానీ ఎవరిని వారే ఉద్ధరించుకునే వాదం అంటూ ఎక్కడా ఉండదట.
ఫెమినిజం మీద కూడా సంచలనాత్మక అభిప్రాయాలు వీరికున్నాయి. ఫెమినిజానికి ఫెమినిజం అని పేరు కాకుండా కాళీమాత వ్రతమనో, ఇంకేదో ఉంటే అందరూ బాగా ఆదరిస్తారుట. బావుంది కదూ. ఈ జ్ఞానం కూడా అవసరమే. చుక్కలు పదునెక్కాలంటే అమావాస్య రావాలి. నాలో ఫెమినిజభావజాలానికి మా బాబాయే కారణం. సతీసక్కుబాయిని అత్తగారు ఎంత బాగా కాల్చుకుతినకపోతే, అంత చప్పున మధురానగరం పరిగెడుతుంది చెప్పండి. మనం నెమ్మదిగా చేసే పనులు చురుకుగా మరింత సమర్ధవంతంగా చేయాలంటే బలమైన ప్రత్యర్థి ఒకడు వుండే తీరాలి.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.