అధ్యక్షురాలి ఉపన్యాసం
సోదరీమణులారా!
నేటి యీమహాసభకు నన్నగ్రసనాధిపురాలినిగ నొనరించుట నాస్థితికిమించిన గౌరవమైనది. గత రెండు పర్యాయములు విదుషీమణులు, అనుభవశాలినులు అలంకరించిన, యీ అధ్యక్ష పదవిని నేనుసరిగ నిర్వహింపజాలనేమో, నా లోపా లోపములను మన్నించెదరు గాక!
ఇన్నిదినములనుండి మన స్త్రీసంఘము అన్ని విషయములయందును చాలా వెనుకబడియున్నది. కాని యిప్పటికి అన్నిదేశములవలె మనదేశమున కూడ ఆ సేతు, శీతాచల పర్యంతము స్త్రీలలో స్వతంత్రవాంఛలు మొలకలెత్తినవి. నిజమునకు పురుషులిన్నిదినములనుండి స్త్రీల నణచియుంచినను ఇప్పుడు మాత్రము కొందరు సోదరమహాశయులు గూడ స్త్రీ సంఘమునకు చేతనైనసాయమొనర్చుటకు సంసిద్ధులైయున్నారు. ఎటులైననేమి? ఇప్పటి మనఉద్యమము చాలా అభివృద్ధిలోనికి వచ్చినది. స్త్రీలలో చాలామంది అనేకకళలయందు ప్రప్రథమమున నుత్తీర్ణులగుచున్నారు. పలువిధములగు పోటీలలో అతి విషమ పరిస్థితులలో పురుషులతో సమముగ, పురుషులకన్న నెక్కుడుగ గూడ విజయమును గాంచగల్గుచున్నారు. సంఘసంస్కరణము నందు, దేశసేవయందు, ధర్మకార్యములయందు పురుషులతోపాటు ముందంజవేయుచున్నారు. అనేకపదవులను ఉన్నతోద్యోగములను ఆక్రమించుకొని ప్రకాశించుచున్నారు. కాని భారతీయ మహిళోద్యమము జరుగవలసి నంత తీవ్రముగ జరుగక మందగమనమున నడుగులిడుచున్నది. దీనికి కారణము గ్రామవాసినులగు స్త్రీలయందెక్కువగ ప్రబోధము జరుగకపోవుటయే. ప్రతి స్త్రీయు పురుషులవలెనే సర్వస్వాతంత్య్రముల ననుభవించుటకు తమకుగూడ హక్కుగలదని తెలిసికొనిననేగాని ఏమాత్రము లాభముండదు. ఇంను చాలామంది స్త్రీలకు అనేకశతాబ్దముల నుండి స్థిరచరాస్తులతోపాటు పురుషుల స్వాధీనమైయుండుటే అలవడిపోయినందున, తాము కొంతహీనదశయందున్నామనిగాని, తమకు కొన్ని సంస్కరణముల వసరములనిగాని తెలియనుగూడ తెలియదు. ఏసంఘము అభివృద్ధికి రావలసియుండెనో ఆసంఘీయులకే దానితత్వము తెలియనియెడల నింకనభివృద్ధి జరుగుటట్లు? కొంతవరకు పురుషులసహాయమవసర మైనప్పటికి స్త్రీలు తమస్వీయశక్తిని గుర్తించి కృషిసలిపిననేగాని సత్వర స్వాతంత్య్రము లభింపజాలదు. కనుక ముందుగ సామాన్య స్త్రీలయందంతటను బాగుగ ప్రబోధము కలుగవలెను.
సామాన్యముగ స్త్రీజనమందంతటను విద్యవిరివిగ వ్యాపించినయెడల నేవిధమైన ప్రత్యేక ప్రచారము అవసరములేకయే వారియందే స్వతంత్రబుద్ధి బైలుదేరును. కనుక వారి యందు విద్య చాలా తక్కువగా నున్నది. కేవలము ఉత్తరములనువ్రాయుటకును చదువుటకును పనికి వచ్చునంతే విద్యగల ”సాక్షర”లగు స్త్రీలసంఖ్య 1931 సంవత్సరపు జనాభాలెక్క ప్రకారము వేయింటిలో పన్నెండుమాత్రమే గలదు. హిందూదేశములోని యితరరాష్ట్రముల యందలి సంఖ్యలు చూడుడు. దానిలో సాక్షరలఅంకెలు వేయింటికి యీ విధముగనున్నవి.
బంగాళము 188
మద్రాసు 110
బొంబాయి 149
మైసూరు 174
బరోడ 331
నిజాంరాష్ట్రములోని అత్రాఫుబల్ద జిల్లా తరువాత వరంగల్లు జిల్లాయెపెద్దది. ఈ జిల్లాలో గల జనాభాలో వేయింటిలో నలుబదిమంది సాక్షరలుండిరి. మొన్నటి జనాభాలో ఇది ఏబదియైదు వరకు వృద్ధి జెందినది. కాని స్త్రీలలో సాక్షరలసంఖ్య మునుపటికంటె తగ్గినది. ఇది చాలా విచారకరమగు అంశము.
ఇక విద్యనేర్పు పాఠశాలలసంఖ్యకూడ తృప్తికరముగ లేదు. మొత్తముమీద రాష్ట్ర మంతకును గలిపి మనకుగల పాఠశాలలు 691. అందు చదువుకొను విద్యార్థినుల సంఖ్య 45560. ఇందులో ఉన్నతవిద్యకు చదువువారిసంఖ్య నూటికి ఇద్దరికన్న తక్కువ. నూటికి తొంబదితొమ్మిదిమంది ప్రారంభవిద్యయందే ఉన్నారన్నచో మనవిద్యావిధానమెంత అననుకూలముగనున్నదో చూడుడు. ఆయున్నత పాఠశాలలోకూడ ఉరుదు, ఇంగ్లీషుద్వారా విద్యనేర్పు నవియై ఉన్నవి. అంతియేగాని మన మాతృభాషయగు తెలుగుద్వారా ఉన్నతవిద్యను నేర్పుటకింకను మనప్రభుత్వమువారు ఆరంభింపలేదు. ఆ కొరత దీర్చుటకు మన సోదరమహాశయులు కొందరు నగరమందొక ఉన్నత పాఠశాలను స్థాపించి యెంతయోసమర్థతతో దానినినడుపు చున్నను, ప్రభుత్వమునుండి యింతవరకు యే మాత్రము సహాయము లభింపక పోవుట మిక్కిలిశోచనీయము. మరియు స్త్రీలకు గౌరవ ప్రదముగ జీవనములభింపజేయు సంస్థలుగూడ నవీనపద్ధతిపై ఇంకను బయలువెడలలేదు. బొంబాయి, పూనా, మద్రాసులయందు ఇట్టి స్త్రీ సేవాసదనములను స్థాపించి ప్రత్యేకోపాధ్యాయినుల మూలమున వివిధకళలను పరిశ్రమలనేర్పుట కొఱకొక ఉత్తమసంస్థను హైదరాబాదులో పురుషుల కొరకేర్పరచి యున్నారు. దానియందే స్త్రీల కొరకొకశాఖ నేర్పరుచుటకవసరమని ప్రభుత్వమువారిని ప్రార్థింపవలెను. ఇప్పుడున్న యీ కొద్ది బాలికాపాఠశాలలుకుకూడ శిక్షణ పొందిన హిందూఉపాధ్యాయినులు దొరుకుట దుర్లభముగా నున్నది. కనుక యెక్కువమంది ఉపాధ్యాయినులను తయారుచేయు ప్రయత్నములు జరుగవలయును.
కేవలము పాఠశాలలమూలమున వీలుగానియెడల చిన్నచిన్న స్త్రీసంఘములద్వారా విద్య నేర్పవచ్చును. సామాన్యముగ గృహిణులగు స్త్రీలందరును ఇట్టిసమాజములమూలమున నెంతయో యభివృద్ధిచెందవచ్చును. మరియు వార్తాపత్రికలద్వారా ఇతర సాధనములద్వారా యితర దేశముల యందలి స్త్రీలెట్లు సత్వరాభివృద్ధినొంది, సక్రమముగ సర్వహక్కులను స్థాపించగలుగుచున్నారో గమనింపవచ్చును. కాని స్త్రీ విద్యాభివృద్ధికై చేయబడుచున్నకృషికన్న వారికే విద్యయోసగుట మంచిదను వివాదములెక్కువగ చేయబడుచున్నవి. వారికి బురుషులతోపాటు విద్య అనవసరమనియు, కేవలము గృహనిర్వహణము లలితకళలను మాత్రమే నేర్పవలయుననియు కొందరభిప్రాయపడుచున్నారు. కాని స్త్రీలకు విద్యావిషయమున రక్షణలు, మినహాయింపులు లేని సంపూర్ణస్వాతంత్య్రమే కావలెను. వారు పురుషులతోపాటు సర్వవిద్యలను సంపూర్ణముగ నభ్యసించుటకు హక్కుగలిగి యుండవలెను. స్త్రీ సంఘమంతయు కేవల మీయీవిద్యనుమాత్రమే నేర్వవలెననిశాసించుట కెవ్వరికిని యధికారములేదు. వారివారి అవసరములను, అభిరుచులను, ఆదర్శములను, ఆశయములను, అనుకూలములను అనుసరించియే ప్రత్యేకవిద్యనైనను నేర్చుకొను స్వతంత్రతకలిగి యుండవలెను. ఎటులైన నిప్పటికంటె విరివిగను, వీలుగను, చౌకగను, నిర్బంధముగను స్త్రీలకు విద్య దొరకవలసి యున్నది. వారిలోయింకను గొప్ప గొప్ప కవయిత్రీమణులు బైలుదేరవలసి యున్నది. స్త్రీ సంఘోపయుక్తములగు పుస్తకములుగూడ విరివిగ వెలువడవలయును. ఇతర భాషలయందు ప్రావీణ్యముగలస్త్రీలు ఆయాభాషలయందలి స్త్రీ జనోపయోగకర ములగు పుస్తకములను భాషాంతకరింపవలయును. కేవలము నవలాపఘనముతో మాత్రము తృప్తినొందక మన స్త్రీలు గూడ దేశమునందలి ప్రస్తుత మత, సాంఘిక, రాజకీయ చరిత్రములనెల్ల తెలిసికొని యుండవలెను. అప్పుడుగాని స్త్రీలకు విద్యాస్వాతంత్య్రము పూర్తిగ లభింపనేరదు.
ఇక సాంఘికకృషిని తలపెట్టినయెడల నెంతయో అభివృద్ధిజరుగవలసియున్నది. అదియేమి దురదృష్టమోగాని ప్రస్తుత హిందూసంఘదురాచారములన్నియు స్త్రీ సంఘమునకే యనర్ధదాయకముగ నున్నవి. పురుషులకు వానివలన నష్టము చాలాస్వల్పము. ముఖ్యముగ మన నిజామాంధ్ర దేశ ప్రాంతముల యందు యెక్కువవ్యాప్తి యందున్న అతి బాల్య వివాహముల వలన కలుగునష్టమెంతయోకలదు. దురదృష్టమున భర్తగతించినచో అతిబాల్యముననే దుర్భరమగు వితంతుత్వమునువహించి సుఖజీవితమునకును, శుభ కార్యములకును దూరమై ఆర్థిక దురవస్తలకులోనై నిరాశా నిస్పృహలకు జిక్కి మానసిక వ్యాధులకు బాల్పడి వ్యర్థ జీవితమును గడుపవలసిన వారగుచున్నారు. అటులగాక దంపతులిరువురును జీవించియున్నచో మిక్కిలి పసితనముననే మాతృత్వమునువహించి, ఒకశిశువుతోనే తన శరీరమునందలి బలమును, ఉత్సాహమును, తేజమునుగోల్పోయి, బలహీనులు, వికలాంగులు, అల్పాయుష్కులునగు నా దురదృష్ట శిశువులచే సంఘమునకును, దేశమునకును తీరని ద్రోహ మాపాదించుచున్నారు. కనుక స్త్రీలకుగూడ మైనారిటీ వదలువరకైనను వివాహముచేయక యుంచినచో ఇప్పటి నిశ్శక్తి, నిర్జీవతలనువదలి సుఖవతులై యుండగలరు. పునర్వివాహాధికారము లేకపోవుటచే లక్షలకొలది స్త్రీలుకష్టముల ననుభవించుచుండగ పురుషులకు ద్వితీయవివాహము, బహుభార్యాత్వము సంఘనియమమునకు విరుద్ధముకాకుండుటచే, కృత్యాకృత్యవిచారము లేక యెనుబదవయేట వివాహమాడిన పుణ్యపురుషులుగూడ కొందరుకలరు. అట్టివారు సమానవయస్కులుగు వితంతువులను వివాహమాడినను గొంతమేలే కాని, ఈ వృద్ధ మహాశయులకు కావలసిన వధువులు కేవలము బాలికలుమాత్రమే. ఇట్టివారిని దండించుటకు గూడ శిక్షాస్మృతియందలి యేనిబంధనము వర్తింపదేమో! వీరి యనుగ్రహమువలన దేశము నందు బాలవితంతువుల సంఖ్యమాత్రము వృద్ధియగుచున్నది. వితంతువివాహములిప్పటికిని పెద్దపెద్ద నగరములందు తప్ప దేశమునందన్ని ప్రాంతముల యందు విరివిగజరుగుట లేదు. వీరిని వివాహమాడుటకుగూడ తగినంతమంది యువకులు ముందునకువచ్చుట లేదు. కనుక స్త్రీల సాంఘిక పరిస్థితులు చక్కబడవలెనన్నచో దేశమునందచ్చటచ్చట వితంతూద్వాహ సంఘములను స్థాపించి మొన్న మొన్ననే శాసనసభచే నామోదింపబడిన విధవావివాహ శాసనము వలనలాభములనుబోధించి తగినవితంతువులకు వివాహములనుచేయింపవలెను. ఇట్లే అనేకవిధములగు సంస్కరణములింకనుజరుగవలసి యున్నవి.
ఇప్పుడు మనస్త్రీలు ఆర్థికముగ చాలదురవస్థయందున్నారు. ఈ విశాలప్రపంచమున స్త్రీకి నాదియని చెప్పుకొనుట కేదియునుండదు. తండ్రి యింటినుండి కాని, భర్తయింటి నుండికాని, ఆమెకొక్క పైసగూడ రాదు. ఉదారుడగుభర్తయు, విధేయురాలగుభార్యయు సమకూడినయెడల భర్తదయదలచి నగలుచీరలు కొనియిచ్చుట గలదు. ఇందువలన స్త్రీలకేమియు లాభము లేకపోగ పురుషులు యిచ్చవచ్చినపుడు దాచుకొనుటకును, సమయము వచ్చినపుడు తీసికొనుటకును యుపయోగించు ధనపుపెట్టెలుగా మాత్రము పనికి వచ్చుచున్నారు. అట్లు గానియెడల సామాన్య స్త్రీలెల్లరును ఆర్థికముగ పెక్కు యిడుములుబడువారై యున్నారు. స్త్రీలు తమకిష్టముగ పుస్తకములు, వార్తాపత్రికలు తెప్పించుకొనుటకును, స్త్రీ సంఘముల యందు సభ్యురాండ్రుగానుండుటకును తమకవసరమైన యితరఖర్చులనొనర్చు కొనుటకును స్వీయధనములేకపోవుటచే వారియభివృద్ధి కేవలము పురుషునియనుగ్రహముపై నాధారపడి యున్నది. ఈ విశాలప్రకృతిలో ఇన్నికోట్ల జీవరాసులలో ఒక్కభారత స్త్రీతప్ప మరియే ప్రాణియు తమ జీవనభారమును పురుషజీవిపై మోపుటలేదు. తక్కువజాతి కార్మిక స్త్రీలు గూడ తమ యుదర పోషణమును తమ స్వయంకృషిపై నిలుపుకొని జీవించుచున్నారు. కేవలము నాగరికులము, అగ్రజాతులవారము అనుకొను స్త్రీల యందే ఈ నికృష్టము వ్యాపించియున్నది. ఇట్లార్థికముగ, స్త్రీ పురుషునిపై నాధారపడుటచే పురుషులకు సహజముగ స్త్రీలపైనుండవలసిన భక్తి, ప్రేమ, గౌరవములునుపోయి వందలు, వేలు వరశుల్కము సమర్పించిననేగాని భర్త లభింపని హైన్యమునకుబాల్పడి యేమాత్రము విలువలేని పదార్థమైపోయినది. హాయిగ, నిర్భయముగ, స్వేచ్ఛగ, సమస్తశక్తులతోను ప్రకాశింపవలసిన స్త్రీ తిండికి బట్టకు గూడా పురుషునిపై నాధారపడివలసివచ్చుటచేతనే ప్రత్యేక వ్యక్తిత్వమునశించి కేవలము బురుషునిఛాయగ మాత్రమునిలిచిపోయినది. అనగ స్త్రీకి కుల, మత, గోత్రములు, పదగౌరవములు భర్త నుంచి యేర్పడునుగాని స్వీయప్రతిభచే నేర్పడుట లేదు. రాజకుమార్తె కూలివానిని పెండ్లాడిన నామెగూడ కూలిదియగుచున్నది. కాపువానికూతురు రాజును పెండ్లాడిన ఆమెరాణి యగుచున్నది. అంతియేగాని స్త్రీకి ప్రత్యేకముగ యేపదవియు లేదు. కనుక స్త్రీ లెల్లరు ముఖ్యముగ యీ ఆర్థిక స్వాతంత్య్రము లభింపజేయు హక్కులకై సంఘముల ద్వారా, వ్యక్తిపరముగ, మిక్కిలి యాందోళన సలుపవలసియున్నది. ఎటులైనను స్త్రీలు పురుషులతో సమముగ ధనమునకు వారసులైనచో బహుళ సంఖ్యాకములైన సాంఘిక నిర్భంధములు స్వాతంత్య్ర నిరోధకములగు పెక్కు చిక్కు సమస్యలు గూడ విడిపోవును. సమయమువచ్చినప్పుడు ధనసంపాదన కుపకరించు విద్యనే స్త్రీలుగూడ నేర్చుకొని యుండవలెను. సకలకార్యములును సర్వ స్వాతంత్య్రములును, కీర్త్యున్నతులును, ఆదరాభిమానములును ధనైక సాధితములు గనక స్త్రీలందరును అవసరము, అవకాశము, సామర్థ్యము గలిగినప్పుడు గౌరవముగ ధనము సంపాదించుట, దాని నుచితరీతిని వ్యయపరచుట నెరిగియ్నుయెడలనే సత్వర స్వాతంత్య్రము లభింపగలదు.
మతమును గురించికూడ స్త్రీలు బాగుగతెలిసికొని యుండవలెను. స్త్రీలకు మత గ్రంథముల యందెక్కువ ప్రవేశములేకపోవుటవలననే మతనియమములెందుకు నియమింపబడినవో. ఏ ధర్మసూత్రములెందుకొరకు సృష్టింపబడినవో తెలిసికొనజాలక అవసరములగుపనులు కొన్ని విడనాడుటయు, అనవసరమగుదాని నాచరించుటయు తటస్థించుచున్నది. కనుక నతిప్రాచీనమును, ఆదర్శప్రాయమును, అగు నీయార్యమతము జీవించియుండవలెనన్నచో స్త్రీలకుగూడ సంపూర్ణముగ దానితత్త్వము తెలిసియుండవలెను. వేదకాలమున స్త్రీలకు సర్వస్వతంత్రము లుండెడివి. గార్గి, సులభ, బడబ, మైత్రేయి, సరసవాణి మొదలగు విదుషీమణులు, వేదాంతమునందు అపారజ్ఞానమునార్జించి బ్రహ్మజ్ఞానచర్చల యందు మహాఋషులతోసమానముగ వాదించెడి వారు. విశ్వాల, ముద్గలానియను వీరవనితలు ఋగ్వేదకాలమున అఖండమగు కీర్తిని గడించిరి. మరియు లీలావతియను విదుషీమణి గణిత శాస్త్రమును, ఖనాదేవి జ్యోతిశ్శాస్త్రమును రచియించి స్త్రీలుగూడ సర్వవిద్యలయందును పురుషులకుతీసిపోరనుసంగతి ననేకరూపముల స్థాపింపజేసిరి. అంతవరకెందులకు? ప్రధమవేదమైన ఋగ్వేదమునందును, ఉపనిషత్తుల యందును, స్త్రీలురచియించిన కొన్ని భాగములుకలవని శ్రీ కావ్యకంఠగణపతిశాస్త్రుల వారొకసారి నుడివియున్నారు. అశోకుని కాలమునందుకూడ కేవలము బౌద్ధ భిక్షులేకాక అశోకుని అంతఃపుర స్త్రీలుకూడ కొందరు మత ప్రచారముచేసెడివారని తెలియుచున్నది. కాని పురాణకాలమున మాత్రము స్త్రీల హక్కులను చాల సంకుచితపరచి కేవలమువారికి సేవావిధానమును మాత్రమే నేర్పి వారి వ్యక్తిత్వములను చంపివైచినారు. ఐనను స్త్రీ పురుషులిరువురుకును పనికివచ్చు నుత్తమ ధర్మములుకూడ కొన్ని పురాణములయందు లేకపోలేదు. కాని స్త్రీలుగూడ సర్వమత గ్రంథములను సాకల్యముగజదివి వానియందే మాత్రమైన మంచియున్నచో గ్రహింపవలసి యున్నది.
ప్రస్తుత కాలమున స్త్రీలకు ధనసంపాదనావసరము లేదు గనుక వారియందు సోమరితనము చాలాప్రబలిపోయినది. చాలామంది స్త్రీలకు తమ జీవితోద్దేశ్యమే తెలియదు. మరి బర్మాదేశపు స్త్రీలు పురుషులకన్న గూడ అతి చురుకుగ గృహకృత్యములను, బైటి వ్యవహారములను గూడ నిర్వర్తించుకొనెదరు. వ్యవసాయమునకెక్కువ పేరొందిన హాలెండుదేశపుస్త్రీలు పురుషులతో సమానముగ వ్యవసాయమున పాటుబడుటయె గాక, మిగిలినకాలమునుగూడ నూలువడకుట మొదలగు గృహపరిశ్రమలతో ఒక్కనిమిషమును గూడ వృధాగపోనిచ్చుట లేదు. ఇంకను పాశ్చాత్య దేశములయందలి స్త్రీలు అనేక విషయములయందు కృషిసలిపి ప్రకృతిపరిణామము నందు, శాస్త్రీయ విషయములయందు, యంత్రనిర్మాణమునందు గూడ అనేకవిధముల పరిశోధన చేసి అత్యవసరములును, అమూల్యములును, అతి విస్మజనకములునుయగు పెక్కు విషయములను కనుగొని దేశమునకుహితము గూర్చుచున్నారు. కాని ఒక్కభారత స్త్రీలు మాత్రమే తమ యధాప్రకార జీవితమునకు భంగములేకుండ అసంఖ్యాక సంఘ దురాచారములలో శతసహస్ర దాస్య బంధనములలో స్వకీయ హీనదశనుగూడ తెలిసికొనజాలని స్థితిలో, ప్రపంచము నందెవ్వరికిని లేని సంతృప్తితో జీవనముగడుపుచున్నారు. ఉద్యోగములమాట, పెద్ద పెద్ద పరిశోధనములమాట అటుంచుడు. ప్రస్తుత గృహకృత్యుముల నన్నిటికి నెరవేర్చుకొనుచునే సంసారిణులగు స్త్రీలందరును నిర్వర్తింపదగిన సంఘ సేవయెంతయో గలదు. మనదేశమునందు విపరీతముగ బెరిగిపోవుచున్న కోట్ల కొలది స్త్రీల యాకస్మికమరణములకును, శిశుమరణమునకును కారణములరసి వారికి తగిన సహాయముజేసి, అట్టి అపాయముల నుండివారిని కాపాడుట, రోగార్తలు, కృశీ భూతలునగు బీదస్త్రీల కొరకాశ్రయగృహముల నేర్పరచి వారిబాధ నివర్తింపజేయుట, మనసంఘదురాచారముల నెరుగని సామాన్య స్త్రీల కందరికినిబోధించి, తన్నివారణోపాయములనుపదేశించుట మొదలగు సేవయెంతయో జేసినకాని మనదేశముగూడ సాటి దేశములలో తలనిలుపు కొనజాలదు. ఇంకను తగినవిద్య, సామర్థ్యము, పలుకుబడిగల స్త్రీలు చిన్నచిన్న సంస్థలనేర్పరచి వానిమూలమున స్త్రీలకు ప్రస్తుత ప్రపంచవిజ్ఞానమును కలిగింపవచ్చును. లలితకళలను, శిథిలమైన గృహ పరిశ్రమలను స్థాపింపచేసి వారి సోమరితనమును నిర్వ్యాపారత్వమును, విదేశీవ్యామోహమును పోగొట్టి దేశపు ఆర్థికస్థితిని చక్కబరుపవచ్చును. అతిబాల్య వివాహములను, వృద్ధవివాహములను అసంబద్ధవివాహములను సంఘముద్వారా మాన్పింపవచ్చును. ముఖ్యముగ గ్రామ ప్రాంతములందు విషజ్వరములు, అంటువ్యాధులు వ్యాపించినపుడు గ్రామమును పరిశుభ్రముగా నుంచుటయందును తగిన సేవాశిబిరముల నేర్పరుచుటయందును స్త్రీలేయెక్కువగ బాధ్యత వహింపవలసియున్నది. మరియు నిజామాంధ్రదేశపు తక్కువజాతులలో స్త్రీలయందు గూడ త్రాగుడు మొదలగు దురలవాటులుయెక్కువగా కలవు. నుక విద్యావంతులగు స్త్రీలు వానివలన కలుగునష్టములను బోధించివానినిమానునట్లు చేయవలెను. సంఘమున కనర్థదాయకమగు అస్పృశ్యతనుగూడ నివారించుటకు స్త్రీలేయెక్కువగా ప్రయత్నించవలయును. ఇట్లే వారి వారి పరిస్థితులకనుకూలమగు సంఘసేవ స్త్రీలు స్వయముగ నొనరించుకొనవలసినదెంతయో గలదు.
స్త్రీలయందీవిధముగ సోమరితనము, నిర్వ్యాపారత అధికమైన కొలది వారి ఆరోగ్యము కూడ బొత్తిగ చెడిపోవుచున్నది. జనపరిగణనపు నివేదికయందు మనరాష్ట్రమునందలి హిందువుల సంఖ్య నానాటికీ క్షీణించుచున్నదనియు దీనికి కారణము స్త్రీలెక్కువ అనారోగ్యముగ నుండుటయేననియు సూచింపబడినది. సగటున వారిజీవితముగూడ పురుషులకన్న తక్కువగనెయున్నది. దీనికి కారణములు వెనుక వివరించిన బాల్య వివాహములు, మద్యపానము మాత్రమే కాక అనవసరముగ తెచ్చి పెట్టుకొనిన గోషా పద్ధతి కూడా ఒకటియైయున్నది. సకలజీవరాసులకు సమానహక్కులతో ప్రకృతి మాత ప్రసాదించిన గాలిని, వెలుతురునుగూడ స్త్రీల ననుభవింప నీయకుండ చేయుటలో పురుషులు చాల అన్యాయమునే చేసినారు. అనేక శతాబ్దముల నుండి గోషా పద్ధతి నవలంబించుచున్న ఆఫ్ఘనిస్తాను, టర్కీ, ఈజిప్టు మున్నగు మహమ్మదీయ రాజ్యములలోని స్త్రీలె ఇప్పుడు బురఖాలనువదలివైచి పురుషులతో సమానముగ క్లబ్బులకును, గాలివిహారములకును పోవుచున్నారు. కనుక నీ విజాతీయమైన అవరోధమును స్త్రీలెంత త్వరగ వదలిన అంతమేలు.
ఇంకను స్త్రీలయనారోగ్యమునకు వారియందు ప్రబలియున్న మూఢనమ్మకములు గూడ నొకకారణమై యున్నది. గ్రామదేవతలన బడు క్షుద్రదేవతారాధనము, భూతప్రేతములవలన భయము, మ్రొక్కుబడులు, స్వాములవారిసేవ మొదలగు మూఢ నమ్మకములు ముఖ్యముగ గ్రామ స్త్రీ యందెక్కువగ వ్రేళ్లు పాతుకొని పోవుట చేత స్త్రీలు ఆరోగ్యము నందును, ఆర్థికమునందును కూడ నష్టపడుటయేగాక యితరదేశములయందుగూడ పరిహాస పాత్రలగుచున్నారు. ఈ విషయములో గూడ అనేక మంది మహాశయులు పరిశోధన చేసి భూతప్రేతములు లేవని నిరూపించియున్నారు. కనుక ఇట్టి వెఱ్ఱి నమ్మకములను స్త్రీలు సాధ్యమైనంతత్వరగ వదలి పెట్టవలెను.
ఇట్టి నమ్మకములచేతను, వెనుక వివరించిన గోషాపద్ధతిచేతను స్త్రీలలో పిరికితనమెక్కువగ వ్యాపించినది. కేవలము స్త్రీయొక్కతె ఎక్కడకుపోవుటకుగాని, ఏపని చేయుటకుగాని అసమర్థురాలు. ఎల్లవేళలనామె పురుష సహాయములేనిది యే కార్యమును నిర్వహింప జాలదు. ఈ పిరికితనమునకు ముఖ్యముగ మూడు కారణములు కనబడుచున్నవి. మొదటిది పిశాచములనిన భయము. ఇది ముఖ్యముగ రాత్రులయందు కలవరపెట్టును. కనుక నట్టిభయము నిజముగ భూతములు లేవనియు, వానికి సంబంధింంచినకథలన్నియు కల్పితములనియు వ్యాధులన్నియు పైత్య విభ్రమమములనియు దృఢముగ నమ్మినయెడల నశించిపోవును. రెండవది చోరులవలన భయము. స్త్రీలవద్ద యెక్కువ విలువగల నగలుండుటయె యిందులకుకారణము. అమితముగ నగలను వాడుట దేశపు ఆర్థికస్థితికికూడ భంగము కలిగింపగలదు. ఏలనన అవసరముగ వేలకొలది రూప్యముల నాభరణరూపముగనుంచుటకంటె వాని నేదేనియొక వ్యాపారసంస్థ యందిడినచో కొందరు నిరుద్యోగుల కాశ్రయము కలిగింపవచ్చును. కావున అట్టి నిబంధనముల విడనాడినను నష్టములేదు. ఇక మూడవది దుర్మార్గులగు పురుషులవలనన భయము, అట్టి భయము సామాన్యముగ యౌవన ప్రారంభమునుండియే పుట్టుచున్నది. ఇది స్త్రీలు విద్యావంతులైన గోషానువదలి పురుషులతో కలిసిమెలసి వర్తించుకటకలవడినయెడల నశించిపోగలదు. అప్పుడే స్త్రీలుకూడ సహజముగ, స్వతంత్రముగ, నిర్భయముగ పురుషులనెదిరించు సామర్థ్యమును గలిగియుండగలరు. స్త్రీలిట్లు తమసంఘములకేగాక వంశపారంపరానుగతముగ తమ సంతతియగు పురుషులకూగూడ బాల్యము నుండియు నీ పిరికితనమును, సోమరితనమును గూడ నేర్పియుండుటచేతనే భారతీయుల యందిట్టి సోమరిపోతులును వాక్శూరులును ఎక్కువగ కనుపించుచున్నారు. స్త్రీలు విద్యావంతులు, ధైర్యవంతులు, దేశ స్వాతంత్య్ర ప్రియులు నైనచో వారి యందు మహాత్ములుదయింతరునుట నిక్కము. ప్రపంచ మహాపురుషులగు నెపోలియన్ చక్రవర్తి, శివాజీ మహారాజు, గాంధీమహాత్ముడు మొదలగువారు తమతల్లుల ప్రభావముచేతనే తమకిట్టి యౌన్నత్యములభించెనని ప్రాప్తి నుడివియున్నారు. కనుక స్త్రీలయందీ పిరికితనము నశించి పోవలయునన్నచో పురుషులు కూడ విధిగ తోడ్పడవలసియున్నారు.
ఇంకను స్త్రీల యారోగ్యము సరిగనుండవలెనన్నచో వారునియమితమగు వ్యాయామము కూడ చేయవలసియున్నది. ఇంచుక చల్లగాలియందు తిరుగుటచేగాని, వినోదకరమై కొలదిగ పరిశ్రమయిచ్చెడి యాటలచేగాని సందర్భోచితమగు శరీరసాధనచేగాని ముఖ్యముగ స్త్రీల యందెక్కువ వ్యాప్తియందున్న క్షయ, అపస్మారకము, గర్భాశయవ్యాధులు మున్నగువ్యాధులు నివారింపవచ్చునని చాలామంది ప్రముఖులగు డాక్టరుల అభిప్రాయముల నిచ్చియున్నారు. కనుక యిట్టి దేహపరిశ్రమలకు గూడ స్త్రీ సమాజములు ముఖ్యముగ బాలికాపాఠశాలలు శ్రద్ధ తీసుకొనవలసియున్నది. విద్యార్థినులు తమ శరీరారోగ్యమును చక్కగనుంచుకొనుట నేర్చుకొనినను లాభముండదు. వారియారోగ్యము సరిగ నున్ననే పని జరుగగగలదు. ఇంతేకాక సంఘ శ్రేయమునకును, తమయారోగ్యమునును గూడ స్త్రీలు పదునెనిమిది, లేక యిరువది సంవత్సరముల వరకైన విధిగ బ్రహ్మ చర్యమును పాటింపవలసియున్నది. ప్రస్తుత హిందూ సంఘనియమములు స్త్రీలయెడ నతిక్రూరముగ నుండుటచే స్త్రీలకు బ్రహ్మ చర్యమనగనే సంఘము కండ్లెఱ్ఱచేయగలదు. కాని సంఘాభివృద్ధికిది ముఖ్యవసరము.
ఇంకొక విషయమునుజెప్పి ముగించివైచెదను. తరతరములనుండియు భారతస్త్రీలు పాతివ్రత్యమునకెక్కువ ప్రతిష్ట గలిగించినారనియు, ఏమాత్రము స్వాతంత్య్రమువచ్చినను వారు నైతిక దుష్టలగుదురనియు మనవారియందొక పెద్దభయము వ్యాపించియున్నది. కాని యిన్ని విధములగు రక్షణలలో బానిసత్వములో స్త్రీలు పతివ్రతలుగనున్నారన అదివారి గొప్పతనమును గాక పురుషుల నిర్బంధ పాలనానిశితమును చాటుచున్నది. కారాగృహంమందలి ఖైదీ దొంగతనమును చేయలేదన్నచో అందువాని ప్రతిష్ఠ యేమున్నది? ఎప్పుడు స్త్రీ స్వతంత్రయై సమస్తహక్కులతోను ప్రకాశించుచు, సకల జీవరాసులతో సమానముగ గాలిని, వెలుతురును అనుభవించుచు జీవించునో, యెప్పుడు తన శీలమును తానుస్వయముగ రక్షించుకొన దగి యుండునో అప్పుడే ఆమెకు నిజమైనప్రతిష్ఠ లభింపగలదు. మరియు మనప్రాచీన స్త్రీలు పూజనీయులుగా నుండిరని గాని వీరరుద్రమ్మ, ఝాన్సిరాణులవంటి వీరవనితలు నాదేశము నందు ఉద్భవించిరని కాని మనమూరకగర్వించినయెడల లాభము లేదు. కొంతవరకైనను వారిప్రతిష్టను మనము నిలుపదగినప్పుడే గర్వింపవలసి యున్నది.
సోదరీమణులారా? ఇంతవరకు మీ యమూల్యమైనకాలము నంతయు వినియోగించి యోపికతో నా యుపన్యాసమును వినినందులకు మీకందరకును నా కృతజ్ఞతానమస్కారములు.
అటుపైన యీ క్రింది తీర్మానములు ప్రవేశపెట్టబడినవి. ప్రతి తీర్మానము గురించి ఉపపాదకురాండ్రును, ఆమోదకురాండ్రును సభ్యురాండ్రందరకును నచ్చచెప్పిరి. వారి యంగీకారము గైకొనబడెను.
(ఈ అధ్యక్షోపన్యాసము-”తెలంగాణా చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు”- మొదటిభాగం లోనిది- రచయిత కె.జితేంద్రబాబు)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags