జూపాక సుభద్ర
నాలుగు రోజులకింద ఒక టీవి ఛానల్ వాళ్లు ఫోను జేసి ‘మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులు’ అనే అంశం మీద చర్చ వుంది రమ్మన్నరు అరే! యింకా యీ సమస్య మీద కొత్తగా తాజాగా మాట్లాడాల్సి రావడం ఏంటి? యింకా సమసి పోలేదేంటి అని బాధైంది. అప్పుడెప్పుడో 1995లోనే సుప్రీంకోర్టు ‘మహిళలు పనిజేసే స్థలాల్లో లైంగిక వేధింపులను నిరోధిస్తూ కొన్ని సూచనలు కొన్ని ఆర్డర్స్ యిచ్చింది. దాంతో మహిళా సంగాలు చాలా పెద్ద ఎత్తున స్పందించినయి. ప్రతి ఆఫీసుల్లోకిబోయి మీటింగులు బెట్టి సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ని వివరించి చైతన్యం జేసినయి. విస్తృతంగా ప్రచారం జేసినయి. యింకా చేస్తానే వున్నయి. అయినా యీ సమస్య వీసమెత్తు కూడా సమసిపోకపోవడం విచారకరం. యింకా యీ సమస్యమీద మాట్లాడాల్సి రావడం అంటే యిది ఎంత తీవ్రంగా వుందో అర్ధం చేసుకోవచ్చు.
యీ వేధింపులు హింసలు పనిస్థలాల్లో చిన్నా చితక ఉద్యోగుల్నించి కన్నా ఉన్నతస్థాయి అధికారుల్నించే ఎక్కువ జరుగుతుంది. అవి బైటకు రావ.ు వచ్చినా నిలబడవు. ఆ మధ్య ఒక ఐఎఎస్ ఆఫీసరు తన దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగినిని చాలా అసభ్యంగా లైంగికంగా వేధిస్తే… భరించి భరించి యిక భరించలేని పరిస్ధితుల్లో బైటకొచ్చి చెప్పుకుంటే మహిళా సంగాలు చాలా పెద్ద ఎత్తున గొడవలు చేసి ఆ నేరస్థున్ని సస్పెండ్ చేయించారు. తర్వాత కొంత కాలానికే మల్లా ఉద్యోగంలో చేరిండు ఆ నేరస్థుడు. తన కింద పనిచేసే మహిళా ఉద్యోగిని అంత వేధించి హింస బెడితే అతనికి పడిన శిక్షేంటంటే కొన్ని రోజులు యింట్ల కూచోబెట్టడం పనిపాటలేకుండా! జైల్లో ఎందుకు వేయలే. యీ కేసులో మహిళా కమీషన్ కూడా చాలా చొరవతో పనిజేసి సస్పెండ్ చేయించిన తర్వాత, అసలు మహిళా కమీషన్‌కు చైర్ పర్సన్’ని లేకుండా చేసినయి కొన్ని శక్తులు. అట్లా ప్రతీకారం తీర్చుకుంటున్నయేమో ఆ నేరస్థుడు మల్లా ఉద్యోగంలో చేరినప్పుడు మహిళా సంగాలు నిరసన తెలియజేస్తే బాగుండేదెమో. ఆ… సందర్భంగా అంటే నేరస్థుడు తన అధికారాల ప్రభావాలు వినియోగించి ఉద్యోగంలో కొచ్చినంక సదరు బాధితురాలైన మహిళా ఉద్యోగిని పలకరించితే ‘ యింత అల్లరిపాలై బతుకుబద్నామై, యింట్ల, బైట, చుట్టాలల్ల ఆఫీసుల అవమానాలు పడిన. గీమే..గీమే ఫలానా ఆఫీసరు మీద కంప్లేంటిచ్చిందని నన్ను విచిత్రంగా, వింత జంతువును చూపించినట్లు చూయించిండ్రు. గుస గుసలాడిండ్రు. వాడు బెట్టిన హింసకంటె బైట యీ అవమానాల హింస తక్కువేం గాదు. ఆ ఆఫీసర్ హింసను సెలవుబెట్టో, ట్రాన్స్‌ఫర్ అయ్యో తప్పించుకొని సేప్‌సైడ్ అయిండ్రు. 17 ఏళ్ల నుంచి ఎంతమంది మగవాల్లని శిక్షించారు? వేధింపులకేసుల్లో యిప్పుడేమయింది? అంత హింసించినోడు నా పట్ల నేరంగా ప్రవర్తించినోడు అంగరంగ వైభవంగా క్రాఫ్ చెడకుండా మల్లా జాయినయ్యాండు. హింస అవమానాలు యింట్ల బైట బద్నాం అయి మొకమెత్తుకోలేకుండా బజార్నబడ్డ నాకేమి న్యాయం జరిగినట్లు? ఏ సుప్రీంకోర్టు ఆర్డరు ఏ చట్టం నన్ను కాపాడలేకపోయింది, వ్యక్తిగా నా స్వేచ్ఛని, హక్కుని గౌరవాల్ని ప్రొటెక్టు చేయలేకపోయింది’ అన్నది ఆవేదనగ ఆ బాధిత ఉద్యోగిని.
అంతెందుకు రాష్ట్రానికి మేలుకొలుపు, తలమానికంగా నికరంగ నిలిచి పరిపాలించుతున్నానని చెప్పుకొనే సచివాలంలోనే మహిళా ఉద్యోగులకు రక్షణ లేదు అడుగడుగునా వివక్ష, చిన్నచూపు, హేళనభావం, ఏహ్యభావం ఎదుర్కోవాల్సొస్తుంటంది. యిక్కడనే సుప్రీంకోర్టు ఆర్డర్స్‌ని (తర్వాత చట్టం కూడా అయింది) చట్టాన్ని మహిళా ఉద్యోగులకోసం అమలు చేయడం లేదంటే యిక సబార్డినేట్ ఆఫీసులు ఎట్లా అమలు చేస్తయి. ఎపి సచివాలయంలో స్వీపర్స్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్‌దాకా దాదాపు రెండు వేల మంది మహిళాఉద్యోగులుంటరు. యిక్కడ లైంగిక వేధింపులు విచ్చలవిడిగా చాలామాములుగా జరుగుతుంటయి. బైటపడితే బద్నాం దప్ప ఏమి జరగదనే ఆలోచనలో మహిళా ఉద్యోగులున్నరు. దానిక్కారణం మహిళా సంగాలనే చెప్పుకోవచ్చు. మహిళా బాత్రూమ్స్‌లల్ల, లిఫ్టులల్ల సెక్స్ రాతలు విరివిగా కనిపిస్తుంటయి. ఎవరైనా సెక్రటేరియట్ ముఖ్యంగా ‘ఎల్’ బ్లాక్ లిఫ్టులోకి చూస్తే పురుషాంగాలు రకరకాల కోణాల్లో కోకొల్లలుగా చెక్కిన బొమ్మలు చూడొచ్చు. ‘యిట్లా వున్నయని అధికారికి చెబితే ‘ ఆ ఏముందమ్మా దానికంత రాద్థాంతం? దేనికి పెయింట్ వేస్తే పోతది! ఎంక్వయిరీలు ఎందుకు? ఎవడో ఏదో రాస్కుండు గీస్కుండని ఎక్కడ పనిచెట్టుకుంటం. నాకు చాలా పనులున్నయి చికాకు పెట్టకండి” అని తరిమేసిండు మహిళల్ని. సరే అదీ కూడా చూద్దామని ఓసారి పెయింటు వేయించిండ్రు మహిళా ఉద్యోగినులు. తర్వాత షరా మాములే. యివన్ని చేసి చేసి పోరి పోరి మహిళలక్కూడా చర్మం గడ్డగట్టిపోయింది.
చట్టం ప్రకారం మహిళలు పనిజేసే చోట తప్పనిసరిగా ఒక కంప్లయింటు బాక్స్ పెట్టాలి. ఒక ఐఎఎస్ మహిళా ఆఫీీసర్‌ని ఎంక్వయిరీ నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి. కాని సెక్రటేరియట్‌లో యిపప్పటి దాకా ఆ పనులు జరగలే. బాక్స్‌లు లేవు, నిఘా కమిటీ లేదు. సెక్రటేరియట్‌లాంటి రాష్ట్ర ఉన్నత స్థాయి కార్యాలయంలోనే పనిచేసే స్థలాల్లోనే మహిళా ఉద్యోగులకు చట్టరక్షణ లేదంటే, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటే యిక చిన్నచితకా ఆఫీసుల్లో, ప్రైవేటు కార్యాలయాల్లోని పరిస్థితిని మాట్లాడేవశం వుంటదా!
గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఆఫీసుసిస్టమ్ కూడా మార్చివేశారు. యిదివరకు ఒక హాల్లో 50 నుంచి 100 దాకా ఉద్యోగులు కనబడేవారు. యిప్పుడెవరికి ఎవరు కనబడకుండా గోడలు కట్టిండ్రు. యిదివరకు ఒక కేకేస్తె మహిళలంతా జమకూడేవాల్లు. యిప్పుడు గ్లోబల్ గోడలు వేరు చేసినయి. మగ ఆఫీసర్లు ఆడ ఆఫీసర్లకు ఒకే క్యాడరైనా బోలెడు వ్యత్యాసాలు. మగఆఫీసరుకు ఏసీకారు, రూము, ఫర్నిచర్, నౌకర్లు చాకర్లు గట్రా అన్ని సౌకర్యాలు. అదే ఆడ ఆఫీసర్‌కి యివేవీ వుండవు. అడిగితే బడ్జెట్ లేదంటరు. యిట్లా సెక్రెటేరియట్‌లో కూడా అడుగడుగునా హింస అవమానాలు, వివక్షతలు నిత్యం మాములు అయినవి. వీటన్నింటి మీద మహిళలు గొంతు విప్పి లొల్లి బెట్టి ధూంధాం జేస్తేనేగాని సక్కంగ కావు. గీరొచ్చులన్నింటిని రచ్చజేయాల్సిందే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags