అబ్బూరి ఛాయాదేవి
(మరికొన్ని కథలు, వ్యాసాలు)
మద్దాలి సుధాదేవి.
సంకలనం : ఆచార్య ఎం.జి.కె. మూర్తి
సూర్య ప్రచురణలు – హైదరాబాద్. 2011/224 పే. వెల : అమూల్యం
ఈ సంకలనం కీ.శే. మద్దాలి సుధాదేవి సంస్మరణార్థం ఆమె భర్త ఆచార్య ఎం.జి.కె. మూర్తిగారు ప్రచురించిన గ్రంథం. సుధాదేవి ప్రసిద్ధ రచయిత్రి ఇల్లిందలసరస్వతీదేవిగారి రెండవ కుమార్తె. నేను నిజాం కాలేజిలో ఎం.ఏ. (పొలిటికల్ సైన్స్) చదువుతున్నప్పుడు తను నాకు జూనియర్.
ఈ సంకలనం సుధాదేవి జీవించి ఉండగా ప్రచురణకి నోచుకోక పోవడం దురదృష్టం. ఈ సంకలనంలో ముద్రిత రచనలూ, అముద్రిత రచనలూ కలగలిసి ఉన్నాయి. కొన్నింటికి రచనాకాలం తెలియదు. కానీ, ముద్రితమైన వాటి ప్రకారం 1970 నుంచి 2009 వరకూ రాసిన కథలూ, వ్యాసాలూ ఉన్నాయి. అంటే, మరణించేందుకు ఒక సంవత్సరం క్రితం వరకూ రాస్తూనే ఉంది- అనారోగ్యంతో ఇంటిపట్టునే ఉంటూ కూడా. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా వ్యాసాలు రాసింది. ఒక మహిళా కళాశాలలో పొలిటికల్ సైన్స్ లెక్చరర్‌గా రిటైరయేదాకా పనిచేయడంవల్ల, స్త్రీల సమస్యల గురించీ, సాంఘిక, రాజకీయ పరిస్థితుల గురించీ విశ్లేషణాత్మకంగా, ఆలోచనాత్మకంగా వ్యాసాలు రాసింది- చిన్నవీ, పెద్దవీ.
ఈ సంకలనంలో 13 కథలూ, 15 వ్యాసాలూ (11 తెలుగులోనూ, 4 ఇంగ్లీషులోనూ) ఉన్నాయి. వైవిధ్య పూరితమైన విషయాలను తీసుకుని ఆసక్తికరమైన కథలు రాసింది సుధాదేవి. సంకలనం పేరుతో ఉన్న మొదటికథ చూసి, అన్నీ భక్తి కథలూ, సంప్రదాయభావాలతో కూడిన కథలూ, వ్యాసాలూ అనే అభిప్రాయం కలుగుతుంది కొందరు పాఠకులకి కానీ, అభ్యుదయకరమైన ఆలోచనలతో కూడినవే తక్కిన కథలూ, వ్యాసాలూ చాలా వరకు. రెండు మూడు విలక్షణమైన ప్రేమకథలూ, మానవ సంబంధాలను కొత్తకోణం నుంచి చూపించిన కథలూ కూడా ఉన్నాయి.
‘బాబాని చూపించవా?’ అన్న కథకూడా, ఒక యువతి జర్నలిస్టుగా పుట్టపర్తి వెళ్ళినప్పుడు, అక్కడ ఆమె ఎదుర్కొన్న విచిత్ర సంఘటనని ఉత్తమ పురుషలో చిత్రించిన కథ. ఆసక్తికరంగా ఉంది.
ఈ రచయిత్రి మంచి అధ్యయన శీలి. తెలుగు పుస్తకాలూ, ఇంగ్లీషు పుస్తకాలూ, పత్రికలూ అన్నీ చదవడం, చదివి సమకాలీన సమస్యల గురించి ఆలోచించడం అలవాటున్న రచయిత్రి అని చెప్పడానికి ‘క్షణ క్షణం ప్రమధనం’ అనే కథ ఒక నిదర్శనం. ప్రమధనం అంటే క్లేశం, కలత పెట్టే దుఃఖం. రచయిత్రికి తెలుగు భాషలో కూడా విస్తృత పరిజ్ఞానం ఉంది. శైలి ధారాళంగానూ, చదివించేది గానూ ఉంది. అక్కడక్కడ గ్రాంధిక ప్రయోగాలు ఉన్నప్పటికీ ఇరాక్‌లో సామాన్యజనం ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో బాంబుల వాతావరణం ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో, ఎందరు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారో తెలిపేకథ ‘క్షణక్షణం ప్రమధనం’. ‘సెల్యూట్ దిగ్రేట్’ అనే పత్రికలో 2004 జూన్‌లో ప్రచురితమైంది ఈ కథ.
‘నాన్నని చూడాలి’ అనే కథలో ఒక ఉద్యమకార్యకర్తగా తన కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉద్యమంలో పాల్గొంటున్నాడో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తన తండ్రికి ఆనాటికీ ఈనాటికీ వ్యత్యాసం తెలియ బరుస్తాడు కథానాయకుడు.
మానవత్వాన్ని ఒక పేద బాలుడి అనుభవాల ద్వారా చూపించిన కథ ‘ఇది ఏనాటి అనుబంధమో?’ ‘నాకు నేనే’ అనే కథ ఆలోచనాత్మకమైన కథ. తను చాలా జ్ఞాన సంపన్నుడనీ, తెలివైనవాడనీ తనకున్న అహంకారాన్ని వదులుకుని, ”జీవితంలో ఎదురైన సుఖాలలోను, దుఃఖాలలోను సందర్భోచితంగా వ్యవహరిస్తే చాలదా” అనీ, జీవితంలో సాఫల్యం పొందడానికి పరిస్థితుల తగ్గట్టుగా మసలుకోవడం ముఖ్యం అనీ గ్రహిస్తాడు కథానాయకుడు చివరికి.
ఇందులోని 15 వ్యాసాలలోనూ, ‘మారుతున్న సంఘంలో స్త్రీ’, ‘నిజమైన స్వాతంత్య్రం రావాలి…’ ‘విజ్ఞాన శాస్త్రం-ఆధ్యాత్మికత’ అనే వ్యాసాలు ఆలోచింపజేస్తాయి. ”సుఖంగా కూర్చుని తింటున్నారు. కష్టమంతా మాదే” నంటూ మాటి మాటికీ దెప్పి పొడవడము స్త్రీలకు పెద్ద సమస్య అంటూ, ”స్త్రీలను విద్య నేర్వమనీ, సాంఘిక రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనమనీ ప్రోత్సహించి, రంగములోకి దింపినవారు పురుషులే. కాని దిగిన వారిని సహృదయంతో ఆదరించడము వారివంతు కాలేదు… సిద్దాంతాలకూ, ఆచరణలకూ లంగరు అందటము లేదు. ఈ రెండిటికీ సమన్వయము కుదరక కన్యలు బలిఅయిపోతున్నారు” అంటుంది రచయిత్రి. ”మన నిర్లక్ష్యవైఖరిని వదల్చుకుని క్రియాత్మకంగా ఆలోచించి పని చేసినట్లయితే, పాశ్చాత్య దేశాలవలె మనం కూడా శక్తి మంతులమయి ఉన్నతస్థాయిని చేరుకోగలము” అంటుంది రచయిత్రి ‘నిజమైన స్వాతంత్య్రం రావాలి’ అనే వ్యాసంలో. ”రాజకీయ, ఆర్థిక, సాంఘిక పురోభివృద్ధితోపాటు మానవుల ఆధ్యాత్మికత కూడా మేల్కొంటే ప్రపంచానికి కొంత హితము చేకూరగలదన్న” విజ్ఞుల అభిప్రాయాన్ని సమర్థించింది రచయిత్రి ‘విజ్ఞాన శాస్త్రం-ఆధ్యాత్మికత’ అనే వ్యాసంలో.
రాజనీతికీ, ప్రజాస్వామ్య పరిపాలనకీ సంబంధించిన విలువైన వ్యాసాలు ఆంగ్లంలో రాసినవి ఉన్నాయి కాని, అచ్చుతప్పులు లేకుండా ఉంటే బావుండేవి.
మొత్తంమీద మంచి కథలూ, వ్యాసాలూ రాసిన మద్దాలి సుధాదేవికి భూమిక పాఠకుల తరపున నివాళి అర్పిస్తున్నాను.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags