పి. సత్యవతి
”వలయం” ”తిరోగామి” వంటి ఆలోచింపచేసిన కథలు వ్రాసిన చాగంటి తులసి 1946లో బాలపత్రికలో మొదటికథ వ్రాశారు. యాభయ్యవదశకంనించే పురోగామి దృక్పథంతో కథలు వ్రాస్తున్నారు. పరిమాణంలో తక్కువ అయినా గుణాత్మకమైన కథలు ఆమెవి. పధ్నాలుగు కథలతో వచ్చిన ”తులసి కథలు” కథాసంపుటి, ”యాత్ర” చిన్న నవల, ”సాహితీ తులసి” అనే వ్యాససంపుటి, ”తులసి కథలు” ప్రచురణానంతరం వ్రాసిన కొన్ని కథలు, ”తగవు” అనే నాటిక ఆమె తెలుగు రచనలు కాగా, అనువాదాలు ఎక్కువ చేసారు.
హిందీ నుంచీ రాహుల్‌సాంకృత్యాయన్ ”ఓల్గా నుంచి గంగ వరకు”, సఫ్దర్ అస్మి ”హల్లాబోల్”, డాక్టర్ అంబేద్కర్ జీవిత చరిత్ర అనువదించారు. ఒరియానించీ ”సచ్చిరౌత్రాయ్ కథలు” గోపీనాథ్ మహంతి ”బ్రతుకుతెరువు”, ఇంగ్లీష్ నుంచి కేంద్రసాహిత్యఅకాడమి కోసం సరళాదాసు, కాజీ నస్రుల్ ఇస్లాం మోనోగ్రాఫ్‌లు, తెలుగు నించీ హిందీకి ”సీతా రామ్ కి క్యా లగతీ హై” (రాముడికి సీత ఏమౌతుంది (ఆరుద్ర)) అనువదించారు. ప్రసిద్ధ తెలుగు కథలెన్నింటినో హిందీలోకి ఒరియాలోకి అనువదించి వివిధ పత్రికలలో ప్రచురించారు. హిందీలో ”మహాదేవీకీ కవితామే సౌందర్య భావన్” అనే విషయంపై డాక్టరేట్ తీసుకున్న తులసి, ఒడిశా ప్రభుత్వ విద్యాశాఖలో రీడర్‌గా పనిచేశారు. తరువాత దక్షిణ కొరియా సియోల్‌లోని హాంకుక్ యూనివర్సిటీలో గెస్ట్ ప్రొఫెసర్‌గా హిందీ బోధించారు. పదవీ విరమణ తరువాత ప్రస్తుతం విజయనగరంలో వుంటున్నారు.
యాత్ర నవలలో సీతమ్మ, తిరోగామి కథలో చిత్ర, ”ఆవిడ”, ”యాష్ ట్రే”, ”వలయం” కథల్లో కథకులు, ”హుందా” కథలో అక్కయ్యా స్త్రీల పట్ల తులసికి వుండే అభిప్రాయాలకీ, గౌరవానికి రూపకల్పనలు. యాత్రని నవలగా కాక పెద్ద కథ కింద విశ్లేషించుకున్నట్లయితే ఇందులో సీతమ్మ, అమ్మన్న అనే ఇద్దరు పెద్దవాళ్ళమధ్య కల వైరుధ్యాన్ని చెప్పకనే చెబుతూ, మారిన దేశకాల పరిస్థితుల్లో ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో పెద్దలు కూడా వాటికనుగుణంగా హృదయాన్ని విశాలంగా చేసుకోవలసిన అవసరాన్ని, ఒడిశాలోని దర్శనీయ ప్రాంతాల వర్ణనతో కలిపి, తులసి వ్రాసిన పద్ధతి ప్రశంసనీయం. సీతమ్మ కొడుకూ కోడలు మనమలతో కలిసి వుంటూ తన హుందాతనాన్ని, పెద్దరికాన్నీ నిలుపుకుంటూ పిల్లలను ప్రేమగా చూసుకుంటూ, పొరుగురాష్ట్రంలోని బస్తీ జీవితానికి తగ్గట్టు తన ఆచారాలను సవరించుకుని తను సంతోషంగా వుండి తనతో వున్న వాళ్లని సంతోషపెట్టే పరిణతి చెందిన బామ్మ. ఆచార వ్యవహారాలే ముఖ్యం అనుకుంటూ కొడుకు కోడళ్లలో లోపాలు మాత్రమే చూసి వాళ్లమీద అలిగివచ్చిన అమ్మన్నపై కూడా సీతమ్మ వెలుగు ప్రసరించగలిగింది. 1970 దశకంలో వచ్చిన ”వలయం” కథ ఆనాటి మధ్యతరగతి జీవితానికే కాక దేశంలోని పరిస్థితులకు కూడా అద్దం పడుతుంది. ఒక మధ్యతరగతి బ్రాహ్మణకుటుంబం కథగా కనిపించినా ఇందులో నిరుద్యోగం లంచగొండితనం విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులకు విద్యాబోధనపై ఆసక్తికాక ఇతర విషయాలపైనే ఆసక్తి వుండడం, ఆ క్రమంలో ఎంతకాలానికీ పరిశోధనలు పూర్తికానివ్వకపోవడం, పూర్తయిన ఉద్యోగాలు దొరకకపోవడం యువతలో అలజడి, ఇవన్నీ కూడా వలయం కథలో అంతర్లీనంగా చర్చకు పెట్టారు రచయిత్రి. అంతేకాదు మానవసంబంధాలను ఆర్థికకారణాలు ఎలాప్రభావితం చేస్తాయో కూడా సున్నితంగా స్పృశించారు. ఇద్దరు పోస్ట్‌గ్రాడ్యుయేట్లు వివాహం చేసుకున్నాక రిసెర్చి కొనసాగిస్తూ ఆ వచ్చే స్కాలర్‌షిప్పులో సగం ఇంటికి పంపిస్తూ అటు ఇంట్లో వాళ్ళూ ఇటు వీళ్ళూ కూడా చాలీచాలకుండా కాలక్షేపం చేస్తున్న పెద్ద కుటుంబం అది. ఆ కుటుంబంలో కోడలు దసరాకి అత్తగారింటికి వచ్చి అక్కడి కష్టాలను చూసింది. ఏమీ చేయలేని అసక్తత ఆమెను నీరసపరిచింది. అప్పుడు వీస్తున్న ఉద్యమ గాలులకు ప్రభావితుడౌతున్న ఒక మరిది, ట్యూషన్ చెప్పించుకోలేని పరిస్థితిలో ఒక మరిది, చదువు మానిపించి కూర్చోపెట్టిన ఆడబడుచు, పూజలూ ఉపోషాలతో ఆరోగ్యం చెడుతున్న అత్తగారు, కొడుకు ఉత్తరం కోసం ఆశగా ఎదురుచూసే మామగారు, ఎప్పుడెప్పుడూ కొడుకూ కోడలూ ఉద్యోగాలు తెచ్చుకుని కుటుంబ భారాన్ని పంచుకుంటారా అని వాళ్ల ఎదురుచూపులు, వచ్చిన రిసెర్చి అవకాశాన్ని వదులకోలేని తాము!! కనీసం తన గాగుల్స్ అయినా మరిది ముచ్చటపడితే ఇచ్చి వెళ్లలేని తన ఆర్థిక పరిస్థితి. ఆ పరిస్థితి తామొక్కరిదే కాదనీ ఉత్సాహం తెచ్చుకుని కొనసాగమని మరిది ఓదార్పు వాక్యాలతో రైలెక్కుతుంది ఆమె. ఈ కథను కొడుకు ద్వారా కూడా చెప్పించుకోవచ్చు. కానీ కోడలు ద్వారా చెప్పించడమే ఈ కథ ప్రత్యేకత. స్త్రీల మనసులోని సున్నితత్వం సంవేదన మళ్ళీ తన విలువ తనకు తెలియడం ఆత్మగౌరవం అన్నీ కలగలసిన వ్యక్తిత్వం ఈ కథలో కథకురాలిది. ఇదంతా పట్టించుకోవద్దని వూరికి వెళ్లవద్దనీ భర్త చెప్పినా ఆమె వాళ్లను చూడ్డానికి వస్తుంది. వాళ్లకెలా సాయం చేయాలో తోచక మథనపడుతుంది. చివరికి మరిదికి నోట్సువ్రాసి పోస్ట్‌లో పంపుతానంటుంది. అదొక్కటే ప్రస్తుతం ఆమె చెయ్యగల సాయం.
తులసి కథ ”యాష్ ట్రే” వంటి కథలు తెలుగులో చాలా వచ్చినప్పటికీ ఈకథలో యాష్ ట్రేని ఒక ప్రతీకగా వాడుకోడం ప్రత్యేకత. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఎక్కువ కట్నం కోసం మరో అమ్మాయిని కట్టుకుని విదేశాలకి వెళ్ళిపోయి పదిహేనేళ్ళ తరువాత మళ్ళీ ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు ఆ పెద్దమనిషి. ఆ వెతుక్కుంటూ రావడం పశ్చాత్తాపం ప్రకటించడానికో, తను తిరస్కరించినా ఆత్మస్థైర్యంతో నిలబడి, ఆర్థిక సుస్థిరతా సంఘంలో పేరుప్రతిష్టలూ, హోదా సంపాదించుకున్నందుకు అభినందించడానికో కాదు. చనిపోయిన తన భార్య స్థానాన్ని, తన పిల్లవాడి తల్లి స్థానాన్ని భర్తీ చెయ్యమని అడగడానికి. అతనెప్పుడూ ఒకటే తన మేలు చూసుకునే వ్యక్తి. పదిహేనేళ్ళు అవివాహితగా వుండిపోయిన ఆమె తను మళ్ళీ అడగ్గానే అంగీకరిస్తుందనే అతని ఆశ. అతను మారలేదని ఆమెకి తెలుసు. జీవితానికి పెళ్ళే పరమావధి కాదనీ తెలుసు. అందుకు అంతే సున్నితంగా తిరస్కరించింది. తులసి వ్రాసిన మరో కదిలించే కథ ”చిన్న దేవేరి”. ఈ కథంతా విజయనగరం గోదావరి జిల్లాల యాసలో వుంటుంది. ”ఆడదానికీ మగవాడికీ ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరాలి. తీరకపోతే అందులో ఆడపిల్ల దాని దారి అది వెతుక్కున్నా అది నిప్పుల కుంపటే” అనే లీడ్‌తో మొదలైన ఈ కథలో ఒక మధ్యతరగతి అమ్మాయి హైస్కూల్లో రాష్ట్రానికంతా ప్రథమంగా పాసైంది. కానీ ఇంకా చదవాల్సిన మగపిల్లలుండడాన వాళ్ళకే చెప్పించడం న్యాయమని ఈమెని మాన్పించేశారు. పెళ్ళి చేసేద్దామని. కట్నాలు కుదరక పెళ్ళి వాయిదాల మీద వాయిదాలు పడింది. ఊర్కే కూచోడమెందుకు టైపూ షార్ట్‌హ్యాండూ నేర్చుకోమన్నారు. అందునా బాగా నేర్చుకుంది. పోనీ ఉద్యోగం చేసుకోమన్నారు. పిల్ల బుద్ధిమంతురాలు. దేనికీ నోరు విప్పదు. చెయ్యమన్న పని చేస్తుంది. ఉద్యోగం చేసి ఇంటికి డబ్బు తెస్తోంది. ఇక పెళ్ళిమాట మర్చిపోయిన పుట్టిల్లు ఆమెను ఆధ్యాత్మికం వైపుకి మళ్ళించి భజనకి వెళ్ళి రమ్మంది. అదుగో అక్కడే గొడవైపోయింది. ఐహికానికీ, అముష్మికానికీ లంకె పడింది. ఒక పెళ్ళీ, ఎనిమిది మంది పిల్లలూ ఉన్నవాడిని కట్టుకుంది (ఈ కథలో పట్టుకుంది అంటారు). ఇదేమిటంటే అప్పుడు నోరెత్తి అన్నను కడిగిపడేసింది. నామీద మీకున్న ప్రేమేమిటీ? అని ప్రశ్నించింది. నా డబ్బు మీరు తిన్నట్టే అతనూ తింటే తప్పేమిటంది. నా సంగతి నేను చూసుకుంటాను పొమ్మంది. ఒక నిప్పుల కుంపటినించీ ఇంకొక దాన్లోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. మధ్యతరగతి ఆడపిల్లల పెళ్ళి సమస్యని తులసి ఈ కథలోనే కాక ”వైవాహికం” ”అప్పగింతల పాట” అనే కథల్లో కూడా చర్చించింది. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలపట్ల కనపడని వివక్ష. పెళ్ళే పరమార్థం అన్న ఆచారం ఇంకా వాళ్ళ చదువుల పట్ల రాని అవగాహన ఈ కథల్లో చూస్తాము. బామ్మ రూపాయి కథలో పెద్దవాళ్ల లౌక్యం చిన్నపిల్లల అమాయకత్వం, నిష్కల్మషమైన మనసుని సున్నితమైన హాస్యంతో చిత్రించారు. హుందా కథలో అక్కయ్య ఆత్మగౌరవానికి స్త్రీరూపం. తన తమ్ముళ్ల ఐశ్వర్యం ముందు తనస్థాయి తక్కువైనా ఆత్మగౌరవంలో వాళ్లన్న ఒక స్థాయి ఎక్కువగానే వుంటుంది. ఊళ్ళో వున్న ఆరు హైస్కూళ్లల్లోనూ పదో క్లాసులో ప్రథమంగా వచ్చి, కాలేజీ చదువు కాకపోయినా టీచర్ ట్రెయినింగ్ చేసి భర్తలాగా టీచర్ అవుతానన్నా అటు అత్తింటివాళ్ళూ ఇటు పుట్టింటివాళ్ళూ ఒప్పుకోలేదు. టీచర్ భర్తకన్న తనే తన పిల్లలకు బాగా చదువు చెప్పగలదు. మగపిల్లల చదువులకోసం చదువు మానుకున్నవాళ్లలో ఆమె కూడా ఒకతె.
ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగం చేసుకుంటూ పిల్లల్ని ఆత్మవిశ్వాసమిచ్చి పెంచుతూ నిబ్బరంగా నిలబడ్డ ఆధునిక స్త్రీ చిత్ర. వాళ్ల ఇల్లు విభిన్న వ్యక్తులకు చర్చావేదిక. ఒక ఆదర్శసమాజాన్ని కలగనే వ్యక్తులు అక్కడ తమ వూహలు కలబోసుకుంటారు. చర్చలు చేస్తారు. పిల్లల పెంపకంపైన, సెక్స్‌పైన ఒకటేమిటీ అన్ని విషయాలు బాహాటంగా పిల్లలముందే చర్చిస్తారు. ఉత్తమపురుషలో సాగిన ఈ కథని మనకి చెప్పేది బంధువుల దృష్టిలో చిత్ర అనే ”కులం తక్కువ పిల్లను” పెళ్ళి చేసుకుని వాళ్లను వెలిపెట్టేసి, చిత్రలాంటి సహచరి దొరకడం తన అదృష్టమని మనసారా నమ్మిన ఆమె సహచరుడు. అతని కూతురు రచన పిక్నిక్‌కు వెళ్ళి రాత్రి ఎనిమిదైనా ఇంటికి రాలేదు. అతని మనసు ఒక సగటు తండ్రి మనసులాగా అనేక కీడులను శంకించింది. ఆ పిల్లతో కలిసి వెళ్ళిన కుర్రవాడిని శంకించింది. పిల్లను పంపి వుండకూడ దనిపించింది. పిల్ల మీద చెక్ పెట్టాలనిపించింది. పిల్ల అమాయకురాలు ఎవరిచేతైనా మోసపోతుందేమో అనిపించింది. కూతురు ఇంటికి రాకపోయినా నిమ్మకు నీరెత్తినట్టు తన వ్రాత పనిలో మునిగిపోయిన సహచరిని విసుక్కుంది. ఒత్తిడి భరించలేక చలిలోనే ఆమె చదివే కాలేజీ వరకూ వెళ్ళొచ్చాడు. అప్పటికే తొమ్మిదైంది. ఇంటికొచ్చేసరికి పిల్లలూ తల్లీ కిలకిలలాడుతూ భోజనానికి ఉపక్రమించి అతడినీ రమ్మన్నారు. దూరపు ఇళ్ళ పిల్లల్ని దింపి రావడంలో ఆలస్యమైందని తొణక్కుండా చెప్పింది కూతురు. ఇన్నాళ్ళుగా తను పోషించుకున్న అభ్యుదయ భావాలు కదలబారుతున్నాయా? తనలో ఏదో మార్పు వస్తున్నది. ఏ భావాలనయితే వదుల్చుకుని ఇంత దూరం వచ్చాడో అవి తిరిగి తన మీద ప్రభావం చూపించి వెనక్కి లాగుతున్నాయా? అని మథనపడ్డాడు. బహుశా సంఘంలో పొడచూపుతున్న అభద్రతా వాతావరణం కూడా తిరోగామి భావాలను కలిగిస్తున్నదేమో!! ఈ కథను మంచి శిల్పనైపుణ్యంతో వ్రాసారు తులసి. తులసి కథల్లో చాలా వరకు ఉత్తమ పురుషలో వ్రాసినవే. అలా వ్రాయడం వల్ల కథ పాఠకులకు మరింత సన్నిహితంగా వచ్చింది. స్త్రీలకి రిజర్వేషన్ల పుణ్యమా అని తనకి పదవి రాకపోయినా తన భార్య ద్వారా దాన్ని సాధించుకునే అవకాశం దక్కింది పురుషులకి. అంతకుముందు వేషభాషల్లోనూ జ్ఞానంలోనూ ఒక ఇల్లాలుగా మాత్రమే వుండిపోయిన స్త్రీ ఆ పట్టణానికి ప్రథమ మహిళగా ఎన్నికవగానే ఆమెకు తనకు నకలుగా ”గ్రూమ్” చేస్తాడు భర్త. స్వలాభ రాజకీయాలను క్షుణ్ణంగా అభ్యసించింది ఆవిడ. అతనికి నకలుగా తయారైంది. స్త్రీలకు రిజర్వేషన్ల పేరు మీద ఇలాంటి వాళ్ళను తయారుచెయ్యడం దేశానికి లాభమా? ప్రమాదమా? ”ఆవిడ” కథలో ఈ ప్రథమ మహిళ ఆవూరు బదిలీ మీద వచ్చిన ఒక ఉద్యోగస్తురాలితో స్నేహం చేసే తన మనసులో మాటలన్నీ దాచుకోకుండా చెబుతుంది. తను ఎవరితోనైన అల్లుకుపోగలనని ఆ ఉద్యోగస్తురాలు తన భర్తతో చెప్పినప్పుడు అతనంటాడు. ”నువ్వు అన్నీ వింటావు దేన్నీ ఖండించవు. ఒకసారి ఖండించి చూడు నీకు ఎవరూ ఏమీ చెప్పరు” అని ఆమెకు అప్పుడనిపించింది. ఈ ప్రథమ మహిళ గ్రూమింగ్ స్టేజిలో తను కల్పించుకుని ఖండించవలసిందేమో అని. ఆ చట్రంలో బిగుసుకోకముందే ఆవిడని తప్పించక తను తప్పు చేసానేమో అనుకుంది. చదువుకుని జ్ఞానవంతులైన స్త్రీలు ”ఆవిడ”ల తయారీని కాస్తైనా అడ్డుకోకపోవడం తప్పు కాదా అనే ఆలోచన కలిగిస్తుంది ఈ కథ. అలాగే తగవు నాటికలో కుటుంబాన్ని ఒక దరి చేర్చడానికి పెద్దకొడుక్కి ఎంత బాధ్యత వుందో, పెద్ద కూతురికీ అంతే వుంది కనుక, నువ్వు నీ వాళ్లనీ నేను మా వాళ్ళనీ చూసుకోవాలి. అందుకని మావాళ్ళు కూడా మనదగ్గరే వుంటారంటుంది ఉద్యోగం చేస్తున్న విజయ. ఆమె భర్త అందుకు ఒప్పుకుని ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. కానీ కోడలు కుటుంబం తమతో వుండడం సంప్రదాయం కాదనే అభిప్రాయం పాతుకుపోయిన మధ్యతరగతి కుటుంబంలో అది పొసిగే విషయం కాదనితేలిపోయింది. ఎవరికి వారు విడిపోక తప్పలేదు. ఎవరికి అనువుగా వున్న సంప్రదాయాలను వాళ్ళు వదులుకోరు. ప్రతిపాదిత విషయం చాలా ప్రజాస్వామికమైనదైనా సరే. తులసి విజయనగరం జిల్లా మాండలికంలో చెయ్యి తిరిగిన రచయిత. ఆమె వ్రాసిన ”ఆడదాయికి నోరుండాలి” ”చోద” రెండూ ఆ మాండలికంలో వ్రాసిన ఉత్తమపురుష కథలే. మధ్యతరగతి జీవుల నెంత బాగా చిత్రిస్తారో బడుగు జీవుల్నీ అంతే సహానుభూతితో చిత్రిస్తారు. గుడిసెవాసులకి బుల్‌డోజర్లనించీ ఎంత ప్రమాదం వుందో ప్రకృతినించీ కూడా అంత ప్రమాదం వుందని చెప్పే కథ ”స్వర్గారోహణ”లో తన సత్తు బిందెకోసం ఇంట్లోకి వెళ్లి ముంపులో మునిగిపోయింది పోలి…వ్రాసినవి తక్కువ కథలే అయినా శిల్పంలోను వస్తువులోను తాత్వికతలోనూ గుణాత్మకమైనవి తులసి కథలు. తులసి కథలకు ముందుమాట వ్రాసిన రోణంకి అప్పలస్వామిగారు చాసో కథల కన్న తులసి కథలే తనకు నచ్చుతాయని కితాబిచ్చారు.
పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సర్వోత్తమ కథారచయిత పురస్కారం, ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది సమ్మాన్, కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అరసం సత్కారం, నాళం కృష్ణారావు స్మారక సత్కారం, మొదలైన పురస్కారాలను అందుకున్నారు. ప్రసిద్ధ కథారచయిత చాగంటి సోమయాజులు గారి ”చిన్న”మ్మాయి అయిన తులసి ఆయన పేరున 1994లో చాసో సాహిత్య ట్రస్టును స్థాపించి ప్రతి సంవత్సరం ఉత్తమ సాహిత్య స్రష్టలకు చాసో స్ఫూర్తి అవార్డు ఇస్తున్నారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags