డా.శిలాలోలిత
‘కనకపుష్యరాగం’ – పొణకాకణకమ్మగారి స్వీయచరిత్ర. చరిత్రలో స్వీయచరిత్రరాసిన స్త్రీలు బహుకొద్దిమంది మాత్రమే. చరిత్రకారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తావనకు కూడా రానివారు అనేకమంది, ఇన్నాళ్ళకైనా, డాక్టరు కాళిదాసు పురుషోత్తంగారు సంపాదకులుగా వుండి ఈ స్వీయచరిత్ర వెలుగుచూడడానికి కారకు లయ్యారు. ఆంధ్రదేశంలో స్వాతంత్య్రోద్యమచరిత్రను రాసే చరిత్ర కారులు, ”నెల్లూరులో పొణకా కనకమ్మ ఖద్దరు గుడ్డలు అమ్మిందనీ, గాంధీజీకి బంగారు గాజులు తీసిఇచ్చిందనీ, ఉప్పు సత్యాగ్రహంలో జైలుకు వెళ్లిందనీ ”ఒక వాక్యం రాసి మొక్కు తీర్చుకున్నాను. అంతేనా… కనకమ్మ; అదేనా చరిత్రలో ఆమె స్థానం? కాదు. కానేకాదని నిర్ద్వంద్వంగా నిరూపిస్తుందీ స్వీయచరిత్ర. కనకమ్మది కొత్తబాట. తనంతట తానువేసుకొన్న బాట కావడంవల్ల దారిపొడవునా రాళ్ళూ, ముళ్ళూ, ఐనా ఆమె నడక కుంటుపడలేదు. నెల్లూరు జిల్లాలో పోట్లపూడి అనే చిన్నపల్లెలో బాల్యం, యవ్వనం గడిచినా, ఆమె తననుతాను ఆధునిక మహిళగా రూపొందించుకొంది. భూస్వామ్యకుటుంబంలోని ఆంక్షలన్నిట్నీ ఆమె ఎదుర్కొంది. ఐనా సరే ఆమె ఏ క్షణంలోనూ స్థాణువు అయిపోలేదు. జీవితమంతా చైతన్యమే; అలుపెరుగని, ఓటమికి తలవంచని ఒంటరి పోరాటమే. ఈ స్వీయచరిత్రను యథాలాపంగా కాకుండా పరిశీలనాత్మకంగా చదవండి. ఇది వట్టి ఘటనల పోగు కాదు. ఒక్కొక్క సంఘటన వెనక అచంచలమైన కనకమ్మ ఆత్మస్థైర్యం, వ్యక్తిత్వం కనబడతాయి. స్వచ్ఛమైన మంచితనం పలకరిస్తుంది. కంటనీరు పెట్టిస్తుంది. (పేజి 3 – పెన్నేపల్లి గోపాలకృష్ణ) కనకమ్మ చనిపోయినప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య ఇట్లా రాశారు. ”కనకమ్మ ఆర్థికకష్టాలతోపాటు మానసిక, శరీరకష్టాలను కూడా ఎన్నిటినో అనుభవించింది. మొదట ఆస్తినష్టము, తరువాత ప్రేమించిన భర్త వియోగము, అనుంగు కుమార్తె అకాలమరణము – వీటన్నింటికన్నా తాను సృష్టించి, పెంచిన కస్తూరిదేవి విద్యాలయము తన పెత్తనము నుండి జారిపోవడము – ఆమె ఆరోగ్యాన్ని ఆయువును కృంగదీసినవి. కనకమ్మది రైతుకుటుంబమే కాని, రాజకీయకుటుంబం కాదు. ఐనా రాజకీయ చైతన్యం ఆమెలో మూర్తీభవించింది. గడపదాటి రాకూడదు; స్వాతంత్య్రోద్యమంలో ఆమె చేపట్టని కార్యక్రమం లేదు. గాంధీజీ ప్రభావానికి ఒదగక ముందు, 1915లో మద్రాసులో ఓ.వి. చిదంబరం పిళ్ళె, గుంటూరులో ఉన్నవలక్ష్మీనారాయణలాంటి తీవ్రవాదులతో చేతులు కలిపి, రహస్యంగా పిస్తోళ్ళు, బాంబులు దిగుమతి చేసుకొని ”సమయం కోసం వేచి వుండిన” సాహసి ఆమె. గాంధీజీ ప్రభావానికి లోనైనతర్వాత ఆమెలో వచ్చిన మార్పును గమనించాలి. హరిజనుల కొరకు పొట్లపూడిలో స్కూలు పెట్టింది. రాట్నం వడికింది, అహింసను ప్రచారం చేసింది. మాదిగవాడలో కలరా సోకితే స్వయంగా చికిత్స చేస,ి మాలవాడలో విషజ్వరాలు ప్రబలితే మందూమాకు అందజేసి ఆదుకుంది. ఖద్దరు బట్టలు భుజాన వేసుకుని నెల్లూరులో వీధివీధి తిరిగి అమ్మింది. కస్తూరిదేవి విద్యాలయం ఆమె మహోన్నత వ్యక్తిత్వానికి సంస్థారూపం. నిరుపేదల, దళిత బాలికల కోసం స్కూలు స్థాపించడం ఆమె ఆశయం. కష్టకాలమంతా ఆమెతోనే గడిచింది. ఆమె ఊహించనంత ఉన్నతంగా సంస్థ పెరిగి, ప్రఖ్యాతికొచ్చిన తర్వాత ధనికస్వాముల పాలైంది. ఈమె రచనావ్యాసంగం ఇరవైఏళ్ళ వయస్సులోనే ఆరంభమైంది. శశిరేఖ, హిందూసుందరి, అనసూయ వంటి పత్రికల్లో పద్యాలు, వ్యాసాలు రాశారు. ‘చెట్టు నీడ ముచ్చట్లు’ పేరుతో వ్యాసాలు రాశారు. 1920 ప్రాంతంలో ‘రాణి పద్మిని’ అనే చారిత్రక నవల రాశారు. హిందీ నుండి తెలుగుకి అనువాదాలు చేశారు. పొణకా కనకమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మలు, తెలుగులో తొలిజంట కవయిత్రులుగా స్తుతిగీతాలు రాశారు. 1920 నుంచి 1935 వరకు అత్యంత సేవాత్యాగాలు చేసిన స్త్రీల ఉద్యమచరిత్రను ప్రత్యేకంగా గ్రంథస్థం చెయ్యాలనే ఆలోచన, ఈ రచయిత్రుల స్త్రీవాదదృక్పథాన్ని తెలియజేస్తోంది. కనకమ్మలోని స్త్రీవాదదృక్పథం ఆమె స్వీయచరిత్ర రచించడానికి పూనుకోవడంలోనే వ్యక్తమైంది. ‘స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనవలసినదే’ – స్త్రీలు సంకల్పిస్తే ఎంత పనైనా చేయగలము. ఒక పత్రికా నిర్వహణమునే కాదు రాజ్యాంగమునే శాసించగలము” అని స్త్రీశక్తి మీద గొప్ప విశ్వాసం ప్రకటించారు. పురుషోత్తం గారి కృషి వల్ల కనకమ్మగారి స్వీయచరిత్రను మనం చదవగలుగుతున్నాము. ఇందులో ప్రధానంగా 8 భాగాలున్నాయి. 1. మృత్యోర్మా అమృతంగమయ, 2. ఆ దినాలు ఇంకరావు 3. చీకటివెలుగులు, 4. నా రాజకీయ జీవితం, 5. మహాత్మునితో పరిచయభాగ్యం, 6. ఆశ్రమవాసం, 7. శ్రీ కస్తూరీదేవి విద్యాలయం చరిత్ర, 8. అనారోగ్యపర్వం. నెల్లూరు నగరంలో ఎవరెవరివో విగ్రహాలు వున్నాయి. కానీ కనకమ్మ విగ్రహం లేదు. ఎందుకు? కస్తూరీదేవి విద్యాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడానికి తయారుచేయబడిన కనకమ్మ కాంస్య విగ్రహం ఆ మూల ఒక చీకటిగదిలో ముప్పయ్యేళ్ళుగా మూలుగుతోంది. ఇప్పటికైనా స్థానికులు వెలికితీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇది అందరం చదవాల్సిన గొప్ప పుస్తకం. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వమున్న స్త్రీ జీవిత దర్శనమే ఇది.