కొండేపూడి నిర్మల
మనిషికి తోక జారిపోయిందెన్నడు…? నాలుగు కాళ్ళమీద గెంతినవాడు కాస్తా రెండుకాళ్ళమీద నిలబడి నప్పుడు కదా! దీన్ని కాస్మిక్ రేడియేషన్ థియరీ అంటారని చిన్నప్పుడెప్పుడో చదివాను. అంటేమనకి ఉపయోగపడని ప్రతి అవయవం మాయమవుతున్న కొద్దీ మిగిలినఅవయవాలే మరింత బలంగా పనిచేయాలి. కానీ జీవనవేగంలో శరీరం బలహీనమవుతూ వచ్చింది. కాళ్ళూ, చేతులూ, నడుమూ అందులో భాగాలే… మెదడు ఒక్కటయినా అభివృద్ధి చెందుతోందని దానిసాయంతో చుక్కల్లోకి ఎగరగలుగు తున్నామని ఎంతో సంబరపడుతున్నాం. మెదడు స్థానంలో మీటలు మొలిస్తే అప్పుడెలా వుంటుంది?… మన ఆలోచనలు ఇంకేవో అరలూ మరలూ చేస్తుంటే… మన రాగద్వేషాలు బ్యాటరీ సాయంతో కదులుతుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసరు బెస్టిస్పారో అనే మానసిక శాస్త్రవేత్త ఏమన్నాడంటే ఇక ముందు మన చేతివేళ్ళకి తప్ప మరిదేనికీ పని మిగలకపోవచ్చట, నమ్మలేకపోతున్నారా?… నేను నిజమే చెబుతున్నాను. గూగుల్, యాహూ, ఆల్టావిస్టా వగైరా… వగైరా సెర్చ్ ఇంజన్స్ ఇందుకు ఉదాహరణగా ఆయన చెబుతున్నాడు. ఒకరకంగా ఇవి మానవాళికి ఎంతో సేవ చేస్తున్న మాట నిజమే. కానీ ఈ క్రమంలోనే మనలో అన్వేషణకు చోటులేకుండా చేస్తున్నాయి. నీకు ఏ సమాచారం కావాలో చిటికెలో ఇస్తానని ప్రకటించిన సాఫ్ట్‌వేర్ తనదగ్గర వున్న కుప్పలోంచి మాత్రమే ఏరుకొమ్మంటుంది. ఎందుకంటే ఏం కావాలో దాని స్పష్టతగానీ, తయారీదినుసులు గానీ నీదగ్గర లేనప్పుడు, ఇక ఖాళీతనమే శాశ్వతమనే భావన కలుగుతుంది. వెతుకులాటలో మొదట పోగొట్టుకునేది వివేకాన్నే. నిండు సముద్రంలో కొట్టుకుపోతూ అమెరికా ఖండాన్ని కనిపెట్టిన కొలంబస్‌లకి ఇక్కడ పనిలేదు. కావాలంటే ఇప్పుడు రీసెర్చి చేస్తున్న కొందరు విద్యార్థుల్ని అడగండి. జస్ట్ కట్ అండ్ పేస్ట్ విధానంలో తయారీ అవుతున్న పేపర్లు దేనికి చిహ్నం…? పేపర్లే కాదు, కవిత్వమూ, అనువాదము, గ్రాఫిక్సూ గట్రా గట్రా ఎన్నో ఎన్నెన్నో ఈ విధానంలోనే తయారవుతున్నాయని ఆ ప్రొఫెసరు మొత్తుకుంటున్నాడు. కిరాణాదుకాణానికి వెళ్ళేవాడు తనకి ఏంకావాలో చిట్టా రాసుకుంటాడు. ఎగ్జిబిషన్‌కి వెళ్ళేవాడికి చిట్టాఅక్కర్లేదు, అక్కడ వున్నవాటిలోనే ఏది ఆకర్షణీయంగా కనబడితే అది కొనుగోలు చేస్తాడు. ఆకర్షణ చాలాసార్లు ప్యాకింగ్‌తోనే వస్తుంది. వస్తువు ఎలాంటిదో వాడుకలో తప్ప తెలీదు. అంటే కుప్పపోసినది సమాచారమైనా వస్తువులైనా మనిషిఆలోచనా, నాణ్యతా, ఎంపికలస్వేచ్ఛ తగ్గిపోతుంది. ఈ బానిసత్వం టీవీలను చూస్తున్న ప్రేక్షకులకి కూడా వర్తిస్తుంది. క్రియాశీలత లేకుండా సెర్చ్ ఇంజన్‌లో కుప్పపోసిన దానిలో ఏదో ఒకటి కత్తిరించుకుని అతికించుకునే రీమిక్స్ విజ్ఞానంలో భావశూన్యత తప్ప ఇంకేమీ లేదు. ఈకంప్యూటర్లు మనల్ని మీటనొక్కి తనలోకి ఈడ్చుకు పోతున్నాయని లీసా ఎమ్ క్రిజర్ శాన్ జోస్ మెర్క్యురీ అనే న్యూస్‌పేపరులో రాసాడు. ఒక కొత్త విషయాన్ని గురుముఖంతో నేర్చుకోవడంలో అటు నేర్పేవాడికీ, నేర్చుకునేవాడికీ మధ్య ప్రశ్నలు జవాబులూ వుంటాయి. సజీవత్వం వుంటుంది. ఇప్పుడు మీ చిన్నారి పిల్లలు కూడా కంప్యూటర్ క్లాస్ రూంలో కూచుని కళ్ళమీద పడుతున్న గ్రాఫిక్ బాణాల్ని తమాయించుకుంటూ గణితాన్ని నేర్చుకోబోతున్నారు. తను పాఠం చెబుతున్నప్పుడు పిల్లవాడు వింటున్నాడో, కడుపునొప్పితో ఏడుస్తున్నాడో రేడియేషన్ పొర్లుతున్న స్క్రీన్ గారు చేతులు చాచి చూడరు. అంటే ఇస్తున్న సర్వీస్‌కి స్పందన తెలుసుకోవడం జరగదు. ఆరుబైట మైదానంలో గాలికెగిరి ఎవరేనా బంతిఆడుతున్నప్పుడు ఆటగాడితో బాటు అక్కడ అదిచూస్తున్న అందరం ఉద్వేగానికి గురవుతాం. ఉద్వేగానికి ఆటపూర్వాపరాలు తెలియనక్కర్లేదు కూడా. కంప్యూటర్ తెరమీద వేళ్ళు కదిలిస్తూ మన చిన్నారి గుర్రపుస్వారీ చేస్తుంటే మాత్రం ఆ మజా వస్తుందా? బెస్టిస్పారో అనే శాస్త్రకారుడు చెబుతున్నది అదే. సమాచారమ్ మొత్తం మేమే ఇస్తాం, ఒకచోట కత్తిరించండి – ఇంకోచోట అతికించండి – అంటూ వెంటబడుతున్న ఉద్యోగసంస్థలు కూడా వున్నాయి. ఒకటి ప్లస్ ఒకటి, కూడిక చెయ్యడానికి బుర్ర అక్కర్లేదు. జేబులో వున్న కాలిక్యులేటర్లో వెతుకుతున్నాం. అక్షరదోషం దొర్లినప్పుడు దిద్దుకోవాల్సిన పనిలేదు. స్పెల్‌చెక్స్ ఎలానూ వున్నాయి. ఒక విద్యార్థి పరీక్ష పాసవడానికి ఏవి అర్హతలు అనుకుంటున్నామో, అవి ఇప్పుడు అనవసర భ్రమలు. పరమబోరు నాస్టాల్జియా… సృజనాత్మక రచనల విషయంలో అయితే ఈ కత్తిరించు ప్లస్ అతికించు విధానం పరమదుర్మార్గమైన చోరకళని పోషిస్తోంది. మూల రచయిత గుండెకి గండికొడుతోంది. రాసిన ఆలోచనకి గాని, సమాచారానికి గాని భద్రత లేదు. అచ్చయిన లేదా ప్రసారమైన తేదీని బట్టి ఒకప్పుడు మూలరచనని గుర్తించడం సాధ్యమయేది. అంతర్జాలం (ఇంటర్నెట్)లో అలాంటి సౌలభ్యం వుందో లేదో, వుండకపోతే దాని భద్రతకు సంబంధించిన మృదు అస్థి (సాఫ్ట్‌వేర్) ఎవరు కనిపెడతారో తెలీదు. తెలిసేలోపు చాలా అనర్థాలు జరిగిపోవచ్చు. మనిషినిమింగే టెక్నాలజీని గురించి తెలుసుకోవాలంటే గుడారం గాడిద కథ గుర్తుచేసుకోవాలి. తలదాచుకోవడానికి చిన్నచోటు ఇమ్మని గాడిద మనిషిని అడుగుతుంది. తలతో బాటు మెడ, వీపూ లోపల పెట్టేస్తుంది. పోనీలే పాపం అని మనిషి పక్కకి జరుగుతాడు. కొంతసేపటికి గాడిదే గుడారం అంతా ఆక్రమించి మనిషిని బైటికి నెట్టేస్తుంది. టెక్నాలజీ అయినా అంతే. అది మన చూపుడువేళ్లమీద నిలవాలి కానీ మనం దాని ఎలక (మౌస్) బోనులో ఇరుక్కోకూడదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అదే.
బాగుంధి నిర్మల గారు
చక్క గా చెప్పారు
నిజమె, ఈ రొజుల్లొ వెతికె ఇంజ న్ల పుణ్యమా అని గురు శిష్య సంబంధాలు ఎప్పుడొ పొయాయి. గురువు పట్ల గౌరవం లెదు, శిష్యుల పట్ల వాత్సల్యం లెదు. గురువు ఎక్కడొ, శిష్యులు ఎక్కడొ వుండె ఈ ప్రక్రియ వల్ల యాంత్రికత పెరుగుతొంది. వున్న విషయాలనె చెప్పుకొవడం తప్ప కొత్త విషయాల మీద అవగాహన, కొత్తగా తెలుసుకొవాలన్న అసక్తి పొతున్నాయి.