మా తెలంగాణలో మేము అవాచ్యమా!

జూపాక సుభద్ర
తెలంగాణంత గడ్కవుడికినట్ట్టుడుకుతుంది.
బుక్కెడు దిని బుగుల్లేకుండా వున్న పరిస్థితి లేదు తెలంగాణకు. చుట్టూ అనేకవుద్యమ గంటలు మోగుతున్నయి యెడ తెరిపి లేకుంట.తెలంగాణొస్తేనే గియన్ని సల్లగదులకుంట సద్దుమనుగు తయేమో! రాజీనామాలు, ఢిల్లీచర్చలు, బంద్‌లు, ఆత్మబలిదానాలు మల్లా మొదలైనయి. సకలజనసమ్మె సైరన్‌లు.
యివేగాక ఆంధ్ర- తెలంగాణ ప్రజాసంగాల జేఏసి (అజ్పుు) కల్సిన సభలు, ఢిల్లీ మంతనాలు, ఢిల్లీ పెద్దల సీమాంధ్రుల మాటలు. యింకోదిక్కు దళితులు రేపటి తెలంగాణలో ‘మా భూమేంది? నీళ్ళేంది,చదువు, ఉద్యోగాలు, పరిశ్రమలు రాజ్యాధికారం మాటేంది? అని నిలదీస్తున్నరు. ఓ మాదిగ గొంతు ‘తెలంగాణకంటే ఎస్సీ వర్గీకరణ ముందు చేయాలి. ప్రాంతంకన్నా కులం చాలా ముందునుంచి వున్నది. ముందు కులవర్గీకరణ (ఎస్సీ) వర్గీకరణ జరిగినంకనే తెలంగాణ పరిష్కారంచేయాలి. తెలంగాణ వస్తే దళితులకేం ప్రయోజనం? వెలమలు రెడ్లకు ప్రయోజనం. వారి నాయకత్వంలో, కనుసన్నల్లోనే నడుస్తుంది. బలిదానాలన్ని మాకులాలు చేస్తున్నయి. తెలంగాణకు అసెంబ్లీలో తీర్మానం కాలే మా వర్గీకరణ అసెంబ్లీలో మూడు సార్లు తీర్మానం అయింది కావున వర్గీకరణే ముందు తేల్చాలంటది ఆ గొంతు.
యింకొందరు అణగారిన మేధావులు, రచయితలు నేటి ఉద్యమంలో మేమున్నా బలిదానాలు మా కులాలు చేస్తున్నా రేపటి తెలంగాణలో మా వర్గాలకు ప్రయోజనాలుండవు, ఫలితాలందవు అయినా మాకు తెలంగాణ కావాల్సిందే, రేపు మేము మా పేర్లు మిగలవు ఏ రాజకీయ ఆర్థిక సామాజిక న్యాయాలు మాకు చేరవు అని తెలుసు అయినా మాకు తెలంగాణ కావాల్సిందే, రావాల్సిందే అంటరు.
యీమొత్తం చర్చలో, ఉద్యమంలో ఎజెండాలో సగం ప్రపంచంగా తెలంగాణలో వున్న తెలంగాణ మహిళల్ని కనుమరుగు చేయడం ఒక మింగుడుబడని బాధ. బాధ తెలంగాణ అన్ని కులాల మహిళలది అయినా వైఫల్యం మాత్రం ఖచ్చితంగా తెలంగాణఉద్యమ వైఫల్యానిదే అని చెప్పొచ్చు. తెలంగాణ మహిళల్ని అన్ని ప్రజాసంగాల్లోకి భాగస్వాములు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమానికి లేదా! ఉద్యోగ సంగాల్లో, రాజకీయ పార్టీల్లో విద్యార్ధి సంగాల్లో, రకరకాల జేఎసిల్లో మహిళల్ని ఎందుకు పక్కన బెడ్తున్నారంటే ‘రావడంలేదనే’ సమాధానం ఎంత బాధ్యతారాహిత్యం.
సాయుధ తెలంగాణ పోరాటంలో తూటాలై నిలబడినా చరిత్రలో వారి పేర్లే లేవు. తెలంగాణ సమాజంలో మాతృస్వామ్యం విలువలు మంటకలువలే అంటరు, కాశెబోసి గోసిగట్టి కదం దొక్కిండ్రు తెలంగాణ ఆడోల్లంటరు. గొప్పగ  చెప్పుకుంటరు తెలంగాణ మగవాల్లు. అయినా ఉద్యమంలో సగభాగంగా  ఎందుకు లేరనే ప్రశ్న ఎవరికి పట్టదా! ఎక్కడ వైఫల్యం?
తెలంగాణ మహిళల మాట వస్తలేదెవ్వరికి? యీ అన్యాయ  సామాజికాల పట్ల అప్రజాస్వామికాల పట్ల ఎవ్వరికి స్పందన లేదు. తెలంగాణ మగవాల్లకే కాదు అది ఆడవాల్లందరి ఆకాంక్ష. వాల్లంత ఉద్యమాల్లో వున్నా అనామకులే. యిది వేదికల్లేని గొంతుల ఆవేశం.
ఎప్పుడెట్లా వున్నా బోనాలకాడ, బత్కమ్మకాడ తెలంగాణ ఆడవాల్లు మస్తు కలర్‌ఫుల్‌గుంటరు. తెలంగాణ మహిళల్ని పెద్ద ఎత్తున వారే ముందుగ సాగే ఘట్టాలు బత్కమ్మ, బోనాలు, బోనాలెత్తుకున్నకాడ, బత్కమ్మ సుట్టు తిరిగి కొట్టే సప్పట్లకాడనే ఆడోల్లు . (ఆ కార్యక్రమాల మాటముచ్చట్లల్ల మల్లా మొగోల్లే).
తెలంగాణల యిప్పుడు బోనాల సీజన్‌. యిప్పటిబోనం తెలంగాణ ఆకాంక్షను నిండుగ వండుకున్న బోనం. తెలంగాణ పోరాటం అంతిమ రూపంలో చేస్కుంటున్న నిండు బోనాల కుండలు. అస్వతంత్ర తెలంగాణలో యివే ఆఖరి బోనాలనుకుంటనే ఏండ్ల తరబడి ఎడతెగని ఆశతోని తెలంగాణ బోనం జేస్కుంటనే వుంది.
బోనాల సందర్భంగానైనా తెలంగాణ మంజీర రచయితలకు ఆడవాల్లు, రచయిత్రులు గుర్తుకు రాకపోవడం దురదృష్టకరం. సీమాంధ్ర రచయితలని,(యిదివరకు హైద్రాబాద్‌ని ‘లంజ’ అని రాసిన) కూడా పిలిచి సందేశాలిప్పించుకున్నరు. కానీ వీరికి తెలంగాణలో రచయిత్రులే కనబడలేదు. ఎక్కువ మాట్లాడితే తెలంగాణలో కవయిత్రులు, రచయిత్రులే లేరని సీమాంధ్ర కవుల్లాగనే ఈసడిస్తారు. యిక్కడే కాదు పోయిన్నెెలలో అఖిలభారత తెలంగాణ రచయితల సభలు జరిగినప్పుడు కూడా తెలంగాణ రచయిత్రులకిదే వివక్షలు, అవమానాలు ఎదురైనయి.  ప్రారంభ సమావేశంలో మిగతా ఏసెషన్స్‌లో రచయిత్రులకు కవయిత్రులకు అవకాశం లేదు. ఆ సభలో స్జేజికింద చాలామంది ప్రముఖ తెలంగాణ రచయిత్రులున్నా వారికి పిలుపుల్లేవు గుర్తింపుల్లేవు. అందరు వెళ్ళిపోయిన ఆఖరి సమావేశంలో ఒకరిద్దరు రచయిత్రుల కవకాశమిచ్చి ‘హమ్మయ్య’ ఆడవాల్లక్కూడా అవకాశం కల్పించిన మనుకున్నరేమో!
సమాజంకన్నా, రాజ్యాంగంకన్నా రచయితలు చైతన్యంలో ముందుండాలి. సమాజంలో మగవాల్లు ఆడవాల్లపట్ల జెండర్‌ వివక్షలు కనబర్చినట్లు రచనా ప్రపంచంలో కూడా సగం రచనా ప్రపంచాన్ని పక్కన బెట్టడం, అవాచ్యంగా  వుంచడం రచయితలు చేయాల్సిన పని కాదు. రచయిత దీపంలాంటివాడు సమాజానికి. వీల్లుకూడా ఆడవాల్ల పొడతాకకుండా నీడ సోకకుండా సభలు సమావేశాలు జరపడం ఏమానవ విలువలు, ఏ అభివృద్ధి ప్రస్థానాలు అనే ప్రశ్నలకు జవాబు దారులు వారే. యిట్లాంటి వివక్షలన్నీ ప్రజాస్వామికాలందామా!
ఎవరెన్ని వివక్షలు చూయించినా తెలంగాణ కావాలె, రావాలె. తెలంగాణలో సగం యిస్స (భాగం) మాదే. స్జేజిమీద పైకెత్తిన చేతుల్ల మా చేతులుకూడా సగం వుండాలె. కాని ఏ కుట్రలో, ఆధిపత్యాలో రానిస్తలేవు. భూమి సదువు, ఉద్యోగం, రాజ్యాధికారంలో కూడ ‘యిస్స’ మాదే కావాలె రేపటి తెలంగాణల.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

One Response to మా తెలంగాణలో మేము అవాచ్యమా!

  1. BUCHI REDDY says:

    చక్కగా చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.