డా|| జె. అనూరాధ
నాకన్రెప్పల వెనుక నేను…
ఉదయకాలపు ఆర్థ్రత మనసంతా నింపుకుని-
పూల సౌరభసారాన్ని గుండెల్లో పొదుముకుని-
అలికిన ముంగిళ సౌభాగ్యాన్ని కళ్ళకు కాటికెట్టుకుని-
వరినాట్ల నాటుపాటల సరాగాల్తో గొంతు తడుపుకుని-
ఆప్యాయతాపాయసాలు తాగి కడుపు నింపుకుని-
పడుచందాల నడకల గమకాల్ని కాళ్ళకి చక్రాలుగా మార్చుకుని-
చకచకమని నడిచేస్తున్న జీవితం స్వప్నంగా తెల్లారింది.
విచ్చిన కన్రెప్పల బయట నేను…..
కోయిలకూత… డిజిటల్ అలారం కూసినమోత.
ఉదయ కాఫీ రాగానికి అంట్లగిన్నెల వాద్యసహకారపు కోత.
తెల్లారకుండానే వుడకేసిన పిండాన్ని డబ్బాల్లో సర్దేసేరాత.
గెజిటెడ్ పనిమనిషికోసం ఎడతెగని చూపుల బాణాలుసంధించి-
ఆవిడెంతకూ రాని మంత్రిగారి జాతిమనిషని చివరికి తెగించి-
మనసు కసిని విడిచిన బట్టలపై మోత మోగించి-
నీళ్ళు కారిన శరీరంతోనే నీళ్ళోడే దుస్తుల శరీరాల్నిఎండలో బంధించి-
చెమటతో చల్లారిన మేనుని మళ్ళీ చన్నీళ్ళతోనే స్నానించి-
గోడమీద దేవుడికి, బట్టలేసుకుంటూ చెంపలేసుకుంటూ నమస్కరించి-
ఎవరి వాహన యోగాల్ని వారికి సకాలంలో అందించి-
వారి వారి టాటాల నవ్వులపువ్వుల్ని సిగలో ధరించి-
ఖాళీఅయిపోయిన నెలాఖరు హ్యాండ్‌బ్యాగ్‌లాంటి ఇంటికి బీగా బంధనం చేసి-
మారథాన్‌రేస్‌లో వేటకుక్కనై చెప్పులనాడాలతో పరిగెత్తేసి-
గానుగెద్దు పనిలాంటి నిస్సారపు అని బద్దకపు పనుల్నే మళ్ళీ మళ్ళీ చేసి-
మళ్ళీ ఉదయపు సీన్లే రివర్స్ చేసుకుంటూ పోతే-
రాత్రికన్రెప్పల వెనుక వెతుక్కునే సౌందర్యాతిశయం మాత్రమే నన్ను మనిషిగా రగిల్చింది.
జీవితం ఒక్కో ఇంచి చొప్పున కుదించుకుని కలలు మాత్రమే మిగిల్చింది.
ఊగుతున్న ఉయ్యాలలు
అనువాదం : కల్పనరెంటాల
దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడే దాదాపు లక్షలాదిమంది ప్రజల రక్తంతో తడిసి రెండు దేశాలకు సరిహద్దులేెర్పడ్డాయి. ఆ సమయంలో లాహోర్ నుంచి ఢిల్లీకి వలస వస్తూ సరిహద్దులకు అటూ ఇటూ దారుణ మారణకాండని చూసి రైలులో అప్పటికప్పుడు దొరికిన చిత్తు కాగితం మీద ప్రముఖ రచయిత్రి అమృతా ప్రీతం రాసిన కవిత ఇది. విషాద విభజన రేఖ మీద వచ్చిన మంచి కవితగా” అజ్ ఆఖాన్ వారిస్ గుర్తింపు పొందింది.
ఎక్కడున్నావు వారిస్ షా?
ఈ రోజు నేను వారిస్ షాను పిలుస్తున్నాను
”నీ సమాధి నుండి మేలుకో, మాట్లాడు”
ఈ రోజు నీ ప్రేమ పుస్తకంలోని
మరో ఆప్యాయమైన పుటను తిప్పేయి
ఒకప్పుడు ఓ పంజాబీ ఆడపిల్ల శోకించింది
నువ్వొక దీర్ఘకావ్యాన్ని రచించావు
ఈ రోజు వేలాది మంది స్త్రీలు
శోకిస్తూ నిన్ను పిలుస్తున్నారు వారిస్‌షా
మేలుకో, విషాద గాయకుడా!
మేల్కొని నీ పంజాబ్‌ని చూడు
పంట పొలాల్లో చెల్లా చెదురై పడి వున్న శవాలను చూడు
చెనాబ్ నది రక్తపుటేరులై ప్రవహిస్తోంది.
ప్రవహించే పంచ నదుల్లో
ఎవరో విషం కలిపారు
మన పంట పొలాలలను
ఇప్పుడు పండించేది ఆ నీరే
సస్య శ్యామలమైన ఈ నేల మొలకెత్తుతూ
ఎక్కడ చూసినా విషాన్ని పారిస్తోంది.
గడ్డకట్టిన నిరంతర శోకాలతో
ఆకాశం ఎర్రబారుతోంది.
లోపల నుంచి వచ్చే గట్టి కేకలతో
కలుషితమైన అరణ్యగాలి
ప్రతి వేణువు వెదురుని
భయంకరమైన సర్పంగా మారుస్తోంది
మొదటి పాము కాటుతో
పాములోళ్ళ మంత్ర శక్తి ఎటో పోయింది
రెండో పాముకాటు
అందరినీ పాములుగా మార్చేసింది
ఈ మృత్యు ప్రవాహం నుంచి తాగుతూ
ఈ నేలను విధ్వంసంతో నింపుతూ
నెమ్మదిగా, పంజాబ్ బాధతో
నల్లగా, నీలంగా మారుతోంది.
వీధి పాటలన్నీ నిశ్శబ్దమైపోయాయి
పత్తి దారాలన్నీ విడిపోయాయి
ఆడపిల్లలు తమ ఆట పాటల
స్నేహితులకు దూరమైపోయారు
మర మగ్గాలన్నీ విరిగిపోయాయి
మన పెళ్ళిపందిళ్ళన్నీ పడవలయ్యాయి
వాటి మొద్దులన్నీ తలో దిక్కయ్యాయి
మన ఉయ్యాలలన్నింటిని
మర్రి చెట్టు ఎక్కడెక్కడో విసిరేసింది కోపంగా
ఒకప్పుడు గుండెచప్పుళ్ళు పలికించిన
ఆ వేణువు ఎక్కడో పోయింది
ఈ రోజు ‘రంజా’ సోదరులకు
వేణు నాదమంటే ఏమిటో తెలియదు
మన పవిత్ర క్షేత్రాల నెత్తుటి వాన
తడిసి ముద్దయిన మన నేల
వాటి ముంగిట కూర్చొని
ప్రేమ దేవతలు శోకిస్తున్నారు
ఈ రోజు, ప్రతి ఒక్కరూ ఒక్కో ‘కైడో’
ప్రేమ, సౌందర్యాలను దోచుకెళ్ళేవాళ్ళే
ఈ రోజు మరో వారిస్ షా
మాకెక్కడ దొరుకుతాడు?
ఈ రోజు, నిన్ను పిలుస్తున్నాను వారిస్ షా,
నీ సమాధి లోపల నుంచి మాట్లాడు
ఈ రోజు ప్రేమ పుస్తకంలోని
మరో ఆప్యాయమైన పుటను తిప్పేయి.
(వారిస్‌షా- పంజాబ్ సూఫీ కవి. అతను రాసిన ‘హీర్‌రంజా’ అమర ప్రేమ కావ్యం. హీర్ రంజానినొకరు ప్రేమించుకుంటారు కానీ హీర్ మేనమామ వారి పెళ్ళి జరగకుండా ఉండేందుకు పెళ్ళి రోజు విషం కలిపిన లడ్డు ఒకరికి ఇస్తాడు. హీర్ మరణించిన వార్త తెలియగానే రంజా కూడా ఆ విషం కలిపిన లడ్డూని తిని ఆమెతో పాటు మరణిస్తాడు.
విజ్ఞాపనా పత్రం
డా|| సి. భవానీదేవి
పగలంతా అలసి సొలసిన
ఉద్యోగినీ భారం ఇల్లుచేరింది.
రోజంతా వళ్ళంతా కళ్ళు చేసుకున్నబాల్యం
అమ్మ ఒడి కోసం ఉరకలేసింది.
గారాబం చేతులు చాపినప్పుడు
అసహనం, అలసట చిరాకు
దోసిళ్ళ నిండా విరుచుకుపడింది
చిన్నబోయిన చిన్నారికి
అడిగనన్ని పైసలిచ్బిన అమ్మ ఆత్మవంచన
బుడి బుడి నడకల బెరుకు భయం
చిన్నారి దోసిళ్ళనిండా చిల్లర నాణాలతో
అమ్మ కాలాన్ని
ఒక గంటయినా కొనుక్కోవాలని
లేతకళ్ళు రాస్తున్న విజ్ఞాపనాపత్రం
ఉలిక్కిపడిన అమ్మతనం
ఇప్పుడు
కాలాన్నేకాదు
కన్నీళ్ళను కూడా వర్షిస్తోంది.
నానీలు
పసుమర్తి లలిత
1. చిత్రంగా నాకూ
రెక్కలు మొలిచాయి
దశాబ్ధాలుగా
బడినడిపాను మరి !
2. తల్లిని చేశానని
వాడికెంత గర్వమో!
కనడం చేతగాని
దద్దమ్మా మరి!
3. దేవదాసు
సిసలైన ట్రెండ్ సెట్టర్
‘ప్రేమ’ పాప్యులర్!
‘మందు’ పాప్యులర్ !!
4. చిక్కటి చీకట్లో
నల్లపిల్ల
ఆమె నవ్వే
వెలది వెన్నెల !
5. ఆడది
ముమ్మాటికీ సబబే
టీవీ ఛానల్స్‌లో
లేడీ విలన్లే సాక్షి.