కొండేపూడి నిర్మల
బ్రాండ్ అంబాసిడర్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ గర్భవతి అయిన శుభ సందర్భంలో దేశ జనాభాని అదుపు చేయడం కోసం ఐడియా సెల్యులర్ వాడకం ఒక మార్గంగా ప్రమోట్ చేసే పనికి కుదురుకున్నాడు. ఏమిటా ఐడియా ప్రకటన అంటే, ఒన్ డే క్రికెట్ మ్యాచ్ చూస్తూన్నరనుకోండి. బాల్ ఎగిరి ఎక్కడ పడిందో తెలుసుకునేలోపు కరెంట్ పోతుంది. లేదా మధ్యలో వచ్చే కమ్మర్షియల్ బ్రేక్‌లో ఒక అందాల తార సబ్బు రుద్దుకుని దిశమొలతో నీళ్ల తొట్టిలోకి దిగిన వెంటనే ఇల్లు అంధకారంలో మునిగిపోతుంది. ఏం చేస్తాం చెప్పండి? జీవితమే శూన్యమైపోయినట్టుగా వుంటుంది. వీలయితే ఎవరినైనా హత్య చేయాలనిపిస్తుంది. కాదా మరి..? అయినా ఎలాగోలా గుండె దిటవు చేసుకుని, సరేలే పోనీలే మనకంతే భాగ్యం అనుకుని భార్యాపిల్లలతో/భర్తా పిల్లలతో సరదాగా గడుపుతారేమో జాగ్రత్త, అలాంటి తప్పుడు పన్లు ఎప్పుడూ చెయ్యకూడదు. అప్పుడు జేబులో వున్న ఐడియా సెల్యులర్ బైటికి తియ్యండి. మొబైల్ టివి, గేమ్స్, వీడియో కాలింగ్స్ లాంటి రకరకాల ఆప్షన్స్ వున్నాయి చూశారా. హమ్మయ్య… ఇంక, ఎవరు పలకరించినా పట్టించుకోండి. ఐడియాతో పడి కొట్టుకుపోండి. నిరవధిక సంతోషంతో ఉప్పొంగిపోండి. దీనివల్ల వేరే పిచ్చి ఆలోచనలేవీ రావు. సంతానం ఉత్పత్తి కాకుండా వుంటుంది. దేశ జనాభాని చక్కగా అదుపు చేసుకోవచ్చు. ఈ ఆలోచనకు అన్ని శాఖల మంత్రివర్యుల హర్షధ్వానాలు దక్కాయి. మా బామ్మ కనక ఇది చూస్తే, ”హవ్వ కొంపలు ముంచడం అంటే ఇది కాదటే..” అని బుగ్గలు నొక్కుకునేది. సరే వదిలేద్దాం. వస్తువుల్ని కొనిపించే వ్యాపారానికి వివేకం ఎందుకులే అనుకుందాం, కానీ….
ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అయిన గులాం నబీ ఆజాద్ గారు కూడా అపరిమితంగా పెరిగిపోతున్న దేశ జనాభాని తల్చుకుని ఎంతో బాధపడుతూ దాన్ని అరికట్టడానికి ఇంకో సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశారు, అదేమిటంటే,
”చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని గ్రామాలకీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలి. దానివల్ల అందరూ టివి సెట్లు కొనుక్కుని అర్థరాత్రి వరకూ కూచుండిపోతారు. పగలంతా పని, రాత్రంతా టివి, అలసిన శరీరానికి దుష్ట ఆలోచనలేవీ రావు కదా, అప్పుడు గమ్మున నిద్రపోతారు. దీనివల్ల జనాభా పెరిగే ప్రమాదం తప్పుతుంది. అర్థమయిందా…. మనం ఇంత కాలంపాటు విద్యుత్ కొరత వల్ల పొలంలో మోటార్లుతిరగడం లేదని, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని, గ్రామాలు చీకటిలో మునిగిపోయి వున్నాయని, నేరాలు పెరిగిపోతున్నాయని, జీవన ప్రమాణాలు అడుగంటిపోతున్నాయని ఏమిటేమిటో అనుకున్నాం, కానీ అసలు నష్టం అది కాదు. టివి లేని చీకటి కారణంగా మనలో వివిధ రసాయనిక మార్పులు జరిగిపోయి తగుదునమ్మా అని సంతానోత్పత్తికి కారణమైపోయి తద్వారా దేశానికి తీరని ద్రోహం చేస్తున్నాం. అది కూడా ఒక ప్రతిష్టాత్మక రాజకీయ ప్రతినిధి చెప్పేదాకా తెలిసి చావలేదు, చా… సిగ్గేస్తోంది దూ.
ఇంత లావు విషయం విన్నాక మరి తప్పుతుందా..? ఎట్టి పరిస్థితిలోనూ టివిని, సెల్‌ఫోన్ని వదిలే పని లేదు. అన్నట్టు సెల్‌ఫోన్ తాలూకు రేడియేషన్ వల్ల దానికోసం కట్టిన టవర్ల వల్ల బ్రెయిన్ కాన్సరు వస్తుందంటున్నారు కదా, పిచ్చుకలు, పావురాలు పిట్టల్లాగా రాలిపోయాయి కదా మళ్ళి ఇదేమిటి అని తిక్కతిక్కగా ప్రశ్నించకండి. రాజకీయాలకీ వ్యాపారానికీ గొప్ప వేవ్ లెన్త్ వుంది. అయినా గాని గులాం నబీ గారి ఆలోచన బానే వుంది తొమ్మిది నెల్లూ మోసి బిడ్డని కనడం కంటే టివి ముందు కూచుని జీళ్ళపాకం సీరియళ్లు చూడ్డం అలుపు లేని పని కదా. కానీ ఈ సీరియళ్ళు పగలే వస్తాయి, రాత్రిళ్ళు మిడ్ నైట్ మసాలా వస్తుందేమో. అప్పుడు ఎలా తట్టుకోవాలి. ఇవి సంతానాన్ని పెంచుతాయా తగ్గిస్తాయా, హనుమాన్ చాలీసా చదువుకోవాలా…? నలభైరోజులకి బదులు ఏటికేడాదీ అయ్యప్పని శరణు వేడుకోవాలా..
పోనీ జనాభా అరికట్టడానికి భక్తి, జీవన విరక్తి – అని కొన్ని కార్యక్రమాలు టెలికాస్ట్ చేస్తే నయమేమో, మరి భక్తిలోనూ రెండు రకాలున్నాయి కదా. అన్నమయ్య సినిమా చూసి రుద్రాక్ష మాలని తిప్పుదామా అంటే పాత సినిమాలు రావు, కొత్తదానిలో నాగార్జున గారు ఇద్దరు భార్యలతో ప్రదర్శించిన అతివాద భంగిమలు మతిపోగొడుతున్నాయి.. యోగి వేమనని తెరకి ఎక్కించినా గాని అతని తత్త్వాలకంటే గోచీ ప్రదర్శనే ఎక్కువ ఆకర్షణీయంగా వుంటుంది.
దానాదీనా జనాభాని అరికట్టడానికి ఇంత మృదువైన మార్గాలు వుండగా రోడ్ల మీద యాచక బాలల సంఖ్య అంతగా కనబడుతోందేమిటబ్బా, వాళ్ళకి కూడా తలకొక ఐడియా సెల్యులర్ ఫోను, ఫుట్ పాత్ కొకటి చొప్పున టివి సెట్లు ఇస్తే తెలుసుకుంటారేమో… అసలే మూర్ఖులు కదా పాపం.
మొన్నటి విజన్ ట్వంటీ ట్వంటీ ముఖ్యమంత్రి కంప్యూటర్లో కూరగాయలు ఎలా పండించి అమ్ముకోవాలో రైతులకి, ఎలా కొనుక్కోవాలో వినియోగదారులకి తెగ బోధన చేసినంత బావుంది కదా ఇది కూడా.
ఈ సందర్భంలో ఇంకోటి కూడా మాట్లాడుకుందాం.
మామూలుగా జనాభా గురించి మాట్లాడ్డం మొదలు పెట్టగానే మన ధ్యాస నిరుపేదల మీదికి పోతుంది. లేదా మైనారిటి వర్గాలమీదికి పోతుంది. తినడానికే లేదు వీళ్లకెందుకేమిటి ఇంత మంది పిల్లలు? అనేస్తాం. వాళ్ళే అన్ని అనర్థాలకీ కారణమని నిస్సిగ్గు ప్రకటనలు, అభిప్రాయాలు కూడా ఇస్తూ వుంటాం. ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పరిమిత సంతానం వుండాలన్న నిబంధన పెద్దగా పట్టించుకోని అభ్యర్థులకి ఓటేసే చేతుల్తోనే, భార్యల సంఖ్యే లెక్కలేనివారికి పిల్లల అంకె గుర్తు వుంటుందా…? అనుకుని సరదాగా కార్టూన్లు చదువుకునే కళ్లతోనే పేదల జీవితాలు మన చేతిలోనే వున్నట్టు నచ్చిన వ్యాఖ్యానాలు చేస్తాం. వాళ్లకి ఎంత తక్కువమంది సంతానం వుంటే మన కార్లకి అడ్డంపడి అడుక్కోకుండా వుంటారో అది కావాలి. ఇళ్ళు వాకిళ్ళు లేక ఫుట్‌పాతుల మీద కూచోవడం వల్ల, పోలీసు దెబ్బ తగలదనుకున్నచోట వాళ్ళు చేస్తున్న రోడ్డువార సంసారాల వల్ల తద్వారా ఉద్భవించే సంతానం వల్ల ఎంత ఆహార సమస్య, వనరుల సమస్య, పర్యావరణ సమస్యలు చుట్టూముడుతూ వున్నాయో కూడా బాగానే చెబుతాం.
మనసు పెట్టి ఆలోచన చేస్తే అసలు ఆహార సమస్య ఎలా వచ్చిందో మనకి తెలీదా? రైతుకి రుణాలివ్వక, ఇచ్చిన రుణం తీర్చుకునే మార్గం కనబడక, పుచ్చులేని విత్తనం దొరక్క, పంటకి గిట్టుబాటు ధరలివ్వక, భూముల్ని బతకనియ్యక రియల్ ఎస్టేట్లకు తరలించడం వల్లనూ, ఇంకా అనేకానేక ప్రభుత్వ, పెట్టుబడిదారీ దొంగల దుర్మార్గాల వల్లనూ వస్తుంది. పేదలు ంటున్న జనాభా వల్లనే వచ్చిందనడం న్యాయమేనా…?
పర్యావరణ సమస్య ఎలా వచ్చింది? ఫ్యాక్టరీ కాలుష్యాల వల్లనూ, యంత్ర భూతాలు విడిచే పొగల వల్లనూ వస్తోంది. అక్రమంగా నరుక్కున్న కలప తరలింపుల వల్ల వస్తోంది. చెట్లు కొట్టి వేయడం వల్ల వస్తోంది. కేవలం గ్రామస్తులు విసర్జించే మల మూత్రాల వల్లనే వస్తుందంటున్నారే, ఇది నమ్మాలా.?
నీటి కరువు ఎందుకు వస్తోంది? డబ్బున్న బాబుల అంతస్తుల్లో పొర్లుతున్న బాత్ టబ్స్ కారణంగానో, అక్రమ లీకేజీల కనెక్షన్ల వల్లనూ వస్తుంది. కబ్జాకు గురి అవుతున్న చేపల చెరువుల వల్లనూ వస్తోంది. సినిమాల్లో వానపాటల పేరిట ట్యాంకర్ల కొద్దీ కుమ్మరించే నీటి వృథా వల్ల కూడా వస్తుంది.
మీ ఇంట్లో పెట్టుకున్న ఎసి వల్ల పక్కనే వున్న చిన్న ఇంటికి ఆక్సిజన్ కరువు అవుతోందని తెలుసా?
సామాజికంగా మనం చాలానే నేరాలు చేస్తూ వుంటాం.
అనంత పద్మనాభస్వామి ఆలయం ఆరోగదిలో ఏం వుందో, పుట్టపర్తి పుట్టలో ఎన్ని పాములూ పురుగులూ వున్నాయో తెలుసుకోవాలనే తీరిక కోరిక వున్నదెవరికి? సామాన్యుడికి కాదు కదా.. రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని వాడికి ఇవి పడతాయా. పట్టవు. కాబట్టి వాళ్లకయినా మానవ సంబంధాలు మిగలనిద్దాం. ఈ భూమి మనదే కాదు వాళ్ళది కూడా. పని చెయ్యడానికి గాని, అది దొరక్కపోతే అడుక్కుని తినడానికి గాని వారసుల్ని కని చూసుకోవాలని వాళ్లకుండచ్చు కదా. మనలాగానే వాళ్లకీ వార్ధక్యం ఒకటి వుంటూంది కదా, అప్పుడెవరు ముద్ద పట్టుకొచ్చి పెడతారు. మనమా? వాళ్ల సంతానమా? చనిపోతే తల్చుకుని ఎవరు ఏడుస్తారు? మనమా వాళ్ల సంతానమా? ఇవి కూడా వారి జీవితాలకి అందకూడని విషయాలేనని మనం తీర్పు ఇద్దామా? సమయం వచ్చినప్పుడల్లా జంతువుల్ని స్టెరిలైజ్ చేసినట్టు బలవంతపు ఆపరేషన్లు చేసేస్తూ వున్నారే.. వాళ్ల గర్భసంచుల్ని కడిగేస్తూ వున్నారే. గినీ పిగ్‌ల మాదిరి నానా చెత్త పరిశోధనలు చేస్తూ వున్నారే. బుద్ధుడు పుట్టిన దేశమంటే ఇదేనా?
జనాభా విషయంలోనే కాదు అవినీతి విషయంలో కూడా మన దేశం రెండవ స్థానం దక్కించుకుంది. అసలు అవినీతి తగ్గితే జనాభాకి కావలసిన వనరులు ఒక సమస్య కాదు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
మీర్రాసినదాంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా తప్పులు పట్టాలని చూస్తూంటాను. కానీ దొరకరే.., ప్రతి వాక్యంలోనూ సునిశితమైన పరిశీలన సుతిమెత్తని చురకలూ కనిపిస్తూంటే కంతలమాట మర్చిపోయి మీ వాక్యాలవెంట పరుగులు పెడుతూంటాను. అలుపూ సొలుపూ లేకుండా,,,
చాలా చక్కగా వ్రాసారు, చివరగా వ్రాసినవి చదువు తుంటే చాలా బాధ ఉంది
నిర్మల గారూ,
బాగా రాశారు. నిజంగా బాగా రాశారు. కొన్ని చోట్ల బాగా నవ్వు కూడా వచ్చింది. చాలా నిజాలు చెప్పారు. శాశ్వత పరిష్కారం ఇప్పట్లో కుదరదు గానీ, ఆ శాశ్వత పరిష్కారంతో వైరుధ్యం లేకుండా, ఏవన్నా కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చెప్పి వుంటే, ఇంకా బాగుండేది.
ఈ మధ్య కాలంలో, భూమిక రచయిత్రులకు పెట్టుబడి దారీ వ్యవస్థ గురించి చైతన్యం పెరగడం చాలా సంతోషంగా వుంది. అసలు కారణం అర్థం అయ్యాక, మంచి మంచి తాత్కాలిక పరిష్కారాలని సులభంగా తెలుసుకోవచ్చు.
ప్రసాద్
నిర్మల గారు
భాగ చెప్పారు