ముదిగంటి సుజాతారెడ్డి
ఈ కథా సంకలనంలో యాభైఆరు కథలున్నాయి. సంపాదకులు ఆధునిక రచయిత్రులవే కాక తెలంగాణాలో తొలితరం, మలితరం రచయిత్రుల కథలను తీసుకోవటం ఒక విశేషం. ఆరంభకాలం నుంచి ఇప్పటి తరం వరకు కథ ప్రాతినిధ్యం లభించింది.
చివర్లో నివాళి పేర తొలితరం, మలితరం రచయిత్రుల కథలు ఇందులో వున్నాయి. తెలుగులో మొట్టమొదటి కథను వ్రాసిన భండారు అచ్చమాంబ బాల్యంలో తెలంగాణాలోనే జీవించారు. అందుకే ఆమె కథ ‘నివాళి’లో మొదటిస్థానంలో చేరింది. తన కథల్లో స్త్రీల వ్యక్తిత్వాన్నీ, స్త్రీల సమస్యలను చిత్రీకరించారు. నందగిరి ఇందిరాదేవి, కుటుంబ కథలు ఎక్కువగా వ్రాసారు. వరంగల్‌జిల్లా ప్రజా జీవితాన్ని చిత్రించారు. యశోదారెడ్డి (1960-70ల్లో) మాండలిక ప్రయోగం చేసిన ఏకైక రచయిత్రి! తర్వాత 1960 దశకంలో ప్రసిద్ధ రచయిత్రులు మాదిరెడ్డి సులోచన, బొమ్మ హేమాదేవి కథలు ఈ సంకలనంలో చోటు చేసుకున్నాయి. ఇక ఒక ధ్యేయంతో… అదీ తెలంగాణ నేపథ్యంలో రాయబడ్డ కథలు ఆధునిక రచయిత్రులవి!
కొంత మంది రచయిత్రులు తెలంగాణేతరులు, కానీ తెలం గాణాలో పుట్టి పెరిగినవారు, తమనుతాము తెలంగాణ వాళ్ళుగా చెప్పుకుని గర్వపడుతున్న వాళ్ళు.
ఒకరిద్దరు తెలంగాణను మెట్టినిల్లుగా చేసుకొని వచ్చినవాళ్ళు. అప్పుడప్పుడు వాళ్ళల్లో తమ ప్రాంతపు అభిమానం మొలకెత్తినా అత్తవారింటిమీద గౌరవాదరణల చేత ఉక్కిరిబిక్కిరై తమ అభిమానాన్ని పక్కనబెట్టి తెలంగాణ భాషా సంస్కృతులనూ ఆచార వ్యవహారాలనూ అక్కున చేర్చుకున్నవాళ్ళు!
ఒకరిద్దరు తెలంగాణావారు కాదు, తెలంగాణ గడ్డమీద నివసించడం లేదు, పూర్తిగా తెలంగాణేతరులే! కానీ తెలంగాణ – ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్ష తీరాలని కోరుకునేవాళ్ళు, ‘సచ్ఛే దిల్ సే’ తెలంగాణాని ప్రేమించే వాళ్ళు. వాళ్ళల్లో మొట్టమొదట కన్పించింది మల్లీశ్వరి. ఆమె యువ రచయిత్రి, మంచి కథలు వ్రాస్తున్నారు. విశాఖపట్నంలో వుంటూ స్త్రీవాదం మీద పరిశోధన చేస్తూన్న రచయిత్రి. ‘ఇటూ చూస్తే న్నా – అటు చూస్తే చిరంజీవి’ అనే కథను వ్రాసారు.
ఆ విధంగా ఈ పుస్తకంలోని కథలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చిత్రీకరిస్తున్నాయి. ఒకప్పుడు రజాకార్లను ఎదిరించిన పిల్లలమర్రి మల్లయ్య వున్న ఐదెకరాల భూమిని ఆడపిల్లల పెండ్లిళ్ళకని కొడుకు యాదగిరి చదువులకని అమ్మేసి, భూమిలేని బర్రెలు కాసుకునే మల్లయ్యగా మిగిలాడు. ఒకరోజు యాదగిరి దోస్తు వెంకట్ వచ్చి తన దుఃఖగాథను వినిపించాడు. అతడు అప్పుచేసి దుబాయ్‌పోయి మోసపోయి జైల్లో ఇరుక్కున్నాడు. మల్లయ్య ఇంతకుముందే తన కష్టాలతో వికలమైవున్నాడు. ఇప్పుడు వెంకట్ విషాద గాథను విని ‘మనం మంచిగుండాలంటే – మనమంతా ఒక్కటై తెలంగాణా తెచ్చుకోవాలె’ అంటాడు (రావుల కిరణ్మయి – ‘చైతన్యం’)
నీళ్ళు లేని, నీళ్ళునా ఆ నీళ్లు తాగి ఫ్లోరైడ్ వ్యాధితో బాధపడే నల్లగొండ జిల్లా వాసులు ‘ఉద్యమాల ద్వారా తెలంగాణ’ సాధిద్దాం!’ అంటున్నారు (యం.రత్నమాల – ‘నీళ్ళకోసం’) స్వగ్రామం వచ్చిన లలిత. పాడువడిన ఊరును చూసింది. మునుపటి పచ్చని పొలాలు గట్లులేవు. చిక్కటి పాలగోకు లేదు. వాగుల ఆటలు లేవు, మగ్గాల చప్పుడులు లేవు, పంటపొలాలన్నీ ముళ్ళపొదలైనయి. అందాల పల్లెను ఏ గద్దఎత్తుకపాయే అని లలిత ఉద్యమాన్ని గుర్తుకురాంగానే తాను సిద్ధమై పిడికిలి బిగించింది. (శారదాహన్మాండ్లు – ‘పల్లె ఇల్లు ఖాళీ చేసింది’)
ప్రసిద్ధ కవయిత్రి అనిశెట్టి రజిత కథ ‘సోపతి’లో చందు పక్కా సమైక్యాంధ్రవాది. స్నేహితులతో తెలంగాణ తిరిగి చూసినతర్వాత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మనసు మార్చుకుంటాడు. తెల్లవారి వంటావార్పూ కార్యక్రమంలో పాల్గొని స్నేహితులను ఆశ్చర్యపరచాలనుకుంటాడు.
‘నా తావుల కెల్లి లెవ్వు!’ కథలో అన్యాపదేశంగా తెలంగాణ వదిలి వెళ్ళమన్న నినాదాన్ని ధ్వనింపజేసారు కిరణ్‌బాల.
సమతా రోష్ని కథ ‘అమ్మ’. ఆ కథలో తెలంగాణ యాసను చూసి ‘ఈ భాష నాకర్థం కావటంలేద’ని చికాకు పడ్తుంది తల్లి. కాని కూతురు తను కొత్తగా వచ్చినప్పటి అనుభవాలను అమ్మకు చెప్తుంది. అవన్నీ విన్న తరువాత అమ్మ మనస్సు మారిపోయి ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం రావాలని కోరుకుంటుంది.
శిలాలోలిత ‘తెలంగాణ బిడ్డను నేను’ కథనం ఉత్తమ పురుషలో సాగింది. నాయిక చిన్నప్పట్నుంచి కష్టాలే అనుభవించింది. ఒకరోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే ఒక విద్యార్థి నాయకుని ఉపన్యాసం విని తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాలను తెలుసుకొని తెలంగాణా విముక్తి కోసం నడుంకడ్తుంది.
నెల్లుట్ల రమాదేవి ‘చెల్లని చెక్కు’ కథలో కథనం బాగుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న ఒక విద్యార్థి పోలీసు కాల్పుల్లో చనిపోయిన వృత్తాంతం చిత్రింపబడింది.
అట్లా సామాన్య ప్రజల మనసుల్లో రాజుకుంటున్న తెలంగాణ ఆకాంక్షను రచయిత్రులు అన్ని రకాల జీవిత నేపథ్యం గల పాత్రల చిత్రణతో పాఠకులకు బొమ్మ కట్టించారు. పాఠకుల మనసును కలచి వేసి కదలికలను సృష్టించారు.
తెలంగాణ భాష మీద జరిగే వివక్షను, వెక్కిరింతలను రచయిత్రులు కొన్ని కథల్లో చిత్రించారు. గర్శకుర్తి శ్యామల ‘ఉక్రోషం’ కథలో వెంకట్ విద్యార్థి అతడు మాట్లాడే తెలంగాణా భాషను మరో విద్యార్థి ప్రకాశం వెక్కిరిస్తూ వుంటాడు. వెంకట్ ఈ విషయాన్ని సార్‌కు చెప్తాడు. ఆ సార్ ‘మన అలవాటును, భాషను వెక్కిరిస్తూ మేం చాలా గొప్పవాళ్ళం అని చెప్పుకోవడం వాళ్ళలో పెద్ద పెద్ద వాళ్ళకే అలవాటైపోయింది, ఇక పసివాడు ప్రకాశం ఎంతనీ’, వాడిమాటలు పట్టించుకోవద్దంటాడు.
ఏ భాషలోనైనా ప్రాంతీయ యాసలో వైవిధ్యం వుంటుంది. అదే తెలంగాణ భాష విలక్షణంగా వుంటుంది. తెలంగాణ భాషలో ప్రాచీన కవులు నన్నయ, తిక్కనాదులు ప్రయోగించిన భాషాపదాలు, నుడికారాలు కన్పిస్తాయి. అవి ఇతర ప్రాంతాల్లో వాడుక నుంచి తొలిగిపోయినా తెలంగాణా పల్లె ప్రజల భాషలో అచ్చమైన తెలుగు పదాలు నుడికారాలు ఇంకా నిలిచివున్నాయి. తిరగలి, వెళ్ళడం, సాంబారు వంటి ఎన్నో తమిళ పదాలను మద్రాసు రాష్ట్రంలో నుండి తమ వాడుక భాషలో చేర్చుకున్నారు కాబట్టి, ఆంధ్రావాళ్ళకు విసుర్రాయి, పోవటం, చారు వంటి అచ్చమైన తెలుగు పదాలు వింతగా కన్పిస్తాయి.
తెలంగాణాలో కంచాన్ని ‘తలె’ అని కూడా అంటారు. ఇది సంస్కృతి పదం ‘స్థలి’ నుంచి వచ్చిన పదం. హిందీలో ఇప్పటికీ ‘థాలీ’ అంటారు. అట్లాగే సంస్కృతం/ప్రాకృతం పదాలెన్నో తెలంగాణా తెలుగులో, వాడుకలో వున్నాయి. ‘తోలుక పోవటం, తోలుక రావాలి’ పదాలు ఆంధ్రావాళ్ళకు వింతగా కన్పిస్తాయి, నవ్విస్తాయి. వాళ్ళ ‘షికారు, పేచీ! అబ్బే! అట్టే’ పదాలు తెలంగాణ వారికి విచిత్రంగా, హాస్యాస్పదంగా వుంటాయని వాళ్ళు తెలుసుకోరు. ‘తోలుక రావటం’ అనే పదం ‘తోడుకొని రావటం’ అనే పదం నుంచి వచ్చింది. ‘డ’ ‘ల’ గా మారి తోలుకరావటం అయింది. తోడుకొని రావటం పదాన్ని ప్రాచీన కవులు ప్రయోగించారు. అట్లా కొంత తెలుగు ప్రాచీన రూప, ప్రాంతీయంగా ఇతర భాషల ప్రభావం గురించి శాస్త్రీయమైన చారిత్రమైన అవగాహన వుంటే ఎవరు ఎవరి భాషలను వివక్షతో చూడరు, వెక్కిరించరు, నవ్వరు.
గోగు శ్యామల ‘ఎల్లమ్మ దస్కింది’ మంచి కథ. కథంతా తెలంగాణా భాషలో వుంది. ఈ కథల సంకలనంలో కొన్ని కథల్లో కథనంలో అక్కడక్కడ తెలంగాణ పదాలను ప్రయోగిస్తే, మరికొంతమంది రచయిత్రులు కొన్ని కథల్లో పూర్తిగా తెలంగాణ భాషను ఉపయోగించారు. గోపి భాగ్యలక్ష్మి, యం. రత్నమాల, శిరీషారాణి, దేవికారాజ్, జ్వలితలు తమ కథల్లో పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు తెలంగాణ భాష యాసలను ప్రయోగించి చిత్రించారు.
గోగు శ్యామల ఎల్లమ్మ సంవేదనను చాలా వాస్తవికంగా తెలంగాణ యాస నుడికారాలను ప్రయోగించి చిత్రించారు. ఎల్లమ్మ దళిత స్త్రీ కష్టపడి ఇరవై ఎకరాల భూమిని సంపాదించింది. పన్నెండు మంది పిల్లలను కన్నది. ఏడు మంది బిడ్డల పెళ్ళిండ్లు చేసింది. పురుళ్ళు పోసింది. ఐదుగురు కొడుకులకు ఇరవై ఎకరాల భూమిని అప్పులేకుండ వుంచింది. అటువంటి ఎల్లమ్మ దగ్గరికి తెల్లబట్టల ఆంధ్రోళ్ళు ‘ఎల్లమ్మ గారూ!’ అంటూ వినయంగా సంబోధించి ‘మీ భూమి ఖరీదుకున్నదట’ అని అడిగారు. ధరల ఆశ చూపి ఆంధ్రోళ్ళు తెలంగాణ రైతుల నుంచి భూములు అగ్వసగ్వకు కొన్నారన్నది చారిత్రక సత్యం. కాని ఎల్లమ్మ వంటివాళ్ళు తమ భూమిని అమ్మేటందుకు ముందుకు రాలేదు. గట్టిగానే ఎదిరించి నిలబడ్డారు. ఎల్లమ్మ ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని రచయిత్రి చాలా బాగా చిత్రించారు.
ఐనంపూడి శ్రీలక్ష్మి ‘ఎడారిగాయం’ కథలో భర్త దుబాయ్ పోయి సంపాదించి డబ్బు పంపితే కుటుంబమంతా ఏ పనులు చేయకుండా సుఖాలు అనుభవిస్తుంటారు. భర్త ఒక యాక్సిడెంటులో దుబాయిలో మరణిస్తాడు. కుటుంబసభ్యులు కూతురుకు బాల్య వివాహం చేయాలనుకుంటారు. ఇతివృత్తం సహజంగా వుంది. తన కూతురికి బాల్యవివాహం జరగకుండా ఎదిరిస్తుంది నాయిక.
వరకట్నం సమస్యను చిత్రించే మరోకథ ముదిగంటి సుజాతారెడ్డి ‘దీనికి అంతం లేదా!’ కడుపులో వుండగానే ఆడపిల్లల్ని చంపేసే బ్రూణ హత్యను గురించి చెప్పేకథ. జి. విజయలక్ష్మి ‘నిన్ను చూడాలని వుంది’.
ప్రసిద్ధ రచయిత్రి గీతాంజలి ‘నేను పోలేపల్లి పీనుగని మాట్లాడుతున్న’ కథ ‘సెజ్’ల పేరున పేదల కొద్దిపాటి భూముల్ని కూడా సర్కారు బలవంతంగా లాగేసుకోవడం వల్ల ఏర్పడిన పెనువిషాదపు పరిస్థితులను బహిర్గతం చేస్తుంది.
షహనాజ్ ఫాతిమా, హిజలు తెలంగాణ భాషయాసలను వ్రాసి కథలను రక్తికట్టించారు.
ప్రసిద్ధ నవలా రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి ‘చామంతి’ కథలో స్కూలులో జరిగిన ఒక సంఘటన చేత ప్రేరేపితురాలైన రజనీ టీచర్…. ‘అన్నపూర్ణ’ అనే పేరుతో అసోసియేషన్ పెట్టి దిక్కులేని వాళ్ళకు ఊర్లో అన్నదాన కార్యక్రమం ఆరంభిస్తుంది.
ప్రసిద్ధ విమర్శకులు కాత్యాయని విద్మహే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఎంత నాజూకయిన విషయమో చెప్తూ తెలంగాణ రాష్ట్రావతరణ అత్యవసరమన్న విషయాన్ని సమర్థిస్తారు.
ఈ కథల సంకలనాన్నికి ఒక ప్రత్యేకత వుంది. ఇది కేవలం రచయిత్రుల కథల సంకలనం. రచయిత్రుల గుండె చప్పుడు ఆ కథలు! ముఖ్యంగా ఈ కథల సంకలనం ఒక చారిత్రక సందర్భంలో వచ్చింది.
సరయిన సమయంలో గురిపెట్టి ఈ కథలను ఏరికూర్చిన సంపాదకులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
(వెతలే..కథలై! – ముందుమాటనుంచి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
సుజాత గారు మీరు చెప్పినత్తుగాఇప్రాచీన కవులు వాదిన పదాలులచాలా మందికి తెలియ కలొవాదుకలొ మాత్లదినప్పుదు నవ్వుతరు.నా పెల్లైన కొత్తలొ మావాళ్ళు
తోలుకొస్తము, తోల్తము ఇలాంతి పదాలు వాదితె నవ్వెవల్లు.
తెలంగాన భాష ఒక విలక్ష్నమైనదిలతెలంగాన రచయిత్రుల కథా సన్కలనమ రావదము బాగుంది .
వసంత
తోలడం అనేది త్రోయడం అనే పదానికి వికృతి. ఆ పదం కోస్తా ఆంధ్ర భాషలో కూడా ఉంది. ఉదాహరణకి గేదెలు తోలడం అంటారు.