అనువాదం : ఆర్. శాంతసుందరి
శివరాణీదేవి ప్రేమ్‌చంద్
మా ఆయన దానికి జవాబు చెపుతూ, ”చూడండి! పొజిషన్ కావాలంటే బాగా చదువుకుని ఉండాలి. మన ప్రాంతాల్లో బాగా చదువుకున్న వాళ్లు ఇక్కడ చాలా తక్కువగా ఉన్నారు, అందుకే వాళ్లకి పదవులు దొరకటం లేదు. మన పక్క బాగా చదువుకున్న వాళ్లు ఇల్లొదిలి ఎక్కడికీ పోరు. ఇక శ్రమ చేసుకుని బతికేవాళ్లు ఎలాగోలాగ డబ్బు సంపాదించాలి కాబట్టి ఎక్కడికైనా పోయి పని చేస్తారు. వాళ్లకి హోదాలూ, పదవులూ అక్కర్లేదు. పొజిషేన్ అనేది సంపాదించుకోవాల్సినది. దానంతట అది దొరకదు. అందుకు చాలా పని చెయ్యాలి. ఇక్కడి వాళ్లు మన ప్రాంతానికి వెళ్తే మంచి హోదాలో పనిచేస్తారు. మనపక్క ఆంగ్ల పత్రికలన్నిటికీ సంపాదకులుగా వీళ్లే ఉంటారు. కొందరు స్కూలు ప్రిన్సిపల్స్‌గా పనిచేస్తున్నారు. డాక్టరు వృత్తిలో కూడా వీళ్లే ఎక్కువగా ఉన్నారు. మొట్టమొదట కష్టపడి ఆంగ్ల భాష నేర్చుకున్నది దేశంలో ఈ ప్రాంతం వాళ్లే కాబట్టి మంచి పొజిషన్లలో ఉన్నారు. ఇప్పుడు అంతే కష్టపడి వీళ్లు హిందీ నేర్చుకుంటున్నారు, ఎప్పుడో ఒకప్పుడు ఈ భాషలో కూడా మనని మించిపోతారు చూస్తూ ఉండు!” అన్నారు.
మర్నాడు మేమొక ఎత్తైన పెద్ద ఆర్చి చూసేందుకు వెళ్లాం. అది చాలా ప్రాచీన కాలం నాటిది. అక్కడి వాళ్లని దాన్ని గురించి అడిగితే, దాన్ని ఎప్పుడు కట్టారో, ఎవరు కట్టారో, ఎందుకు కట్టారో వివరాలేవీ తెలీదని అన్నారు. ఎన్నోసార్లు దాన్ని పడగొట్టి చూద్దామని ప్రయత్నించినా వీలుకాలేదన్నారు. మేం ఒక పదిహేనుమందిమి దానిమీదికి ఎక్కాం. పాదం మొపినప్పుడల్లా అది ఊగటం మొదలుపెట్టింది. దానిమీద మా ఆయన కొంతదూరం నడిచి తలపట్టుకుని కూర్చుండిపోయారు. నేను ముందుకెళ్లి వెనక్కి తిరిగిచూస్తే ఆయన అలా కూర్చునంఉడటం కనబడింది. నేను వెనక్కి వచ్చి, ”ఏమైంది?” అని అడిగాను. ”తల తిరుగుతోంది,” అన్నారాయన. పక్కనే కూర్చుని ఆయన కేసి చూస్తూంటే, నా కళ్లలో గాభరా కనిపించిందో ఏమో, ”గాభరా పడకు, ఈ ఆర్చి ఊగుతోంది కదా అందుకే కళ్లు తిరిగినట్టున్నాయి. కిందికి దిగాక సర్దుకుంటుందిలే,” అన్నారు.
ఇంతలో ఇద్దరు తమిళ సోదరులు వచ్చి ఆయన చేతులు పట్టుకుని కిందికి దింపారు.
అక్కణ్ణించి ఇద్దరం చాముండి కొండకి వెళ్లాం. అదికూడా చాలా ఎత్తుగా ఉంది, కానీ పైకి వెళ్లేందుకు పాములా మెలికలు తిరిగిన కొండదారి ఉంది. పైకి కారులో వెళ్లచ్చు. అలా కారులో వెళ్లినా ఈయనకి మళ్లీ తల తిరుగుతుందేమోనని భయపడ్డాను.
”పోనీ మీరు పైకి రాకండి,” అన్నాను.
”ఏం పరవాలేదు. ఇక్కడ ఆర్చిలాగ ఊగటం ఉండదుగా!” అన్నారు.
అలా ఆరురోజులు మద్రాసులో ఎలా గడిచాయో తెలీలేదు. అప్పుడు నాకు చాలా గర్వంగా, సంతోషంగా అనిపించింది. మా ఆయన్ని అక్కడి జనం అంతగా ఇష్టపడటం, ఆప్యాయత చూపించటం చూస్తే, నాకు మహాదానందంగా ఉండేది, కారణం ఇంత గొప్ప వ్యక్తి నావాడు కదా అనుకోవటమే! మద్రాసుకి మైసూర్‌నించి ఒకాయన వచ్చాడు. ఆయన మమ్మల్ని మైసూర్‌కి రమ్మని ఆహ్వానించాడు.
ఆర్రోజులు మద్రాసులో ఉండి మైసూర్‌కి వెళ్లాం. అక్కడా అలాంటి స్వాగతమే, అలాంటి ఉత్సాహమే కనిపించింది. మైసూర్ రాజు ఆస్థానంలోని ఒక మంత్రిగారు మాతో చాలా లుపుగోలుగా ఉన్నారు. అక్కడ అలాగఢ్‌కి చెందిన ఒకాయన కూడా కలిశాడు. ఆయన తన ఇంట్లో దిగితేగాని వదలనని చాలా పట్టుపట్టాడు. మైసూర్ నిజంగానే చాలా రమణీయంగా, అందంగా ఉంది.
రాత్రి అందరం కలిసి కూర్చున్నాం. ”మైసూర్ లాంటి అందమైన ఊరు ఇంకొకటుందని అనుకోను. కనీసం నేనింత వరకూ చూడలేదు!” అన్నారు మా ఆయన.
”నాకిక్కడే ఉండిపోవాలని అనిపిస్తోంది!” అన్నాను.అక్కడ కూడా సభలు జరిగాయి. నన్ను కూడా మాట్లాడమన్నారు. మేము మా ప్రాంతానికి వీళ్ళు వచ్చినప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించామో తలుచుకుంటే చాలా సిగ్గేసింది. మీరంతా నా సొంతవాళ్ళలాగా ఉన్నారని వాళ్ళతో చెప్పాను. ఆ స్త్రీలలో ఒక వయసుమళ్ళినావిడ కూడా ఉంది. ఆవిడ బెనారస్ వచ్చినప్పుడు నా ప్రవర్తనకి ఆవిణ్ణి క్షమాపణ అడగాలనిపించింది. ఆవిడ పక్కన వెళ్ళి కూర్చున్నాను. ఆవిడ నా వీపు నిమురుతూ, ”ఎందుకమ్మా క్షమాపణలు? మీరలా అడగకూడదు! అంది. నేనావిడతో నన్ను ‘మీరు’ అనద్దనీ, నేనామె కూతురిలాటిదాన్నని అన్నాను.
ఆ మాటంటూంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాళ్ళు ఆనాడు చూపించిన ప్రేమ ఇప్పటికీ నా మనసులో అలాగే ఉంది. అలా ఐదు రోజులూ ఇట్టే గడిచిపోయాయి. విందులూ, ఫలహారాలూ, ఒక్కోరోజు ఒక్కొక్కరి ఇంట్లో.
అక్కణ్ణించి మమ్మల్ని బెంగుళూరుకి రమ్మని పిలుపు వచ్చింది. అక్కడ ఒక తమిళ కుటుంబం మాకు ఆతిథ్యమిచ్చింది. ఆ ఇంట్లో ఆడవాళ్లకి హిందీ అసలే రాదు, నాకేమో ఆంగ్లం రాదు. అప్పుడు కాస్త ఇబ్బందనిపించింది. కానీ మగవాళ్ళు హిందీ అర్థం చేసుకోగలిగారు, మాట్లాడగలిగారు. మా ఆయనకి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు.
”నీకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది కదా?” అన్నారు మా ఆయన.
”అదేమీ లేదే,” అన్నాను.
”ఎందుకు లేదు? ఆడవాళ్ళకి ఆడవాళ్లతో మాట్లాడితేనే బావుంటుంది. నీ అవసరాలు వాళ్ళతోనే కదా చెప్పుకోగలవు?”
బెంగుళూరులో ఉండగానే రామేశ్వరం నించి కొందరు మమ్మల్ని పిలవటానికి వచ్చారు. ”పద రామేశ్వరం కూడా చూసొద్దాం!” అన్నారు మా ఆయన.
”రామేశ్వరం వెళ్ళే ఓపిక నాకు లేదు,” అన్నాను.
”ఒక్కసారి చూసివస్తే బావుంటుంది కదా?” అన్నారు.
”వద్దు, ఇక నేరుగా బొంబాయికి వెళ్దాం.”
”మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో! ఇంతదూరం ఎలాగూ వచ్చాం. వెళ్తే సరిపోతుంది.”
”లేదు, నాకు వెళ్ళాలని లేదు.”
”ఇప్పుడు బొంబాయికెళ్ళి నువ్వు చేసే పనేముంది? అక్కడా మనమిద్దరమే ఇక్కడా ఇద్దరం కలిసే ఉన్నాం.”
”అక్కడికి ఉత్తరాలూ అవీ వచ్చుంటాయి. అమ్మాయికి కనే రోజులు, ఒంట్లో ఎలా ఉందో ఏమిటో?”
”అయితే వెళ్ళద్దని నిర్ణయించుకున్నావా?”
”అవును.”
అక్కడివాళ్ళు మమ్మల్ని వెళ్ళద్దని ఒకటే గొడవ. మద్రాసు, మైసూరు, బెంగుళూరు, మూడు ఊళ్ళల్లోనూ మాకు ఎంతో ఆత్మీయత దొరికింది. ఇంకా కొన్నాళ్ళు ఉండమని అడుగుతున్నా, మళ్ళీ వేసవిలో వస్తామని, ఈసారి పిల్లల్ని కూడా వెంటపెట్టుకుని వచ్చి ఒక పదిహేను రోజులైనా ఒక్కో ఊళ్ళో ఉంటామనీ చెప్పాం.
రాత్రి మేమిద్దరమే ఉన్నప్పుడు, మా ఆయన, ”చూడు ఈ ప్రాంతం ఎంత బావుందో, మనుషులు కూడా సభ్యతాసంస్కారం గలవాళ్ళు. ఈసారి పిల్లల్ని కూడా తీసుకొచ్చి చూపించాలి,” అన్నారు.
”నాకు మాత్రం ఈ ప్రాంతం నచ్చలేదా ఏమిటి?”
”కాదులే నేను అర్థం చేసుకోగలను. పిల్లలు దూరంగా ఉంటే మనకి చాలా లోటు అనిపిస్తుంది, అది సహజం. వాళ్ళ గురించి ఆందోళనగా ఉంటుంది. అందుకే నీకింక ఎక్కడికీ వెళ్ళాలని లేదు. అమ్మాయికి కనేరోజులవటం కూడా నిన్ను ఇక్కడ నిలవనివ్వటంలేదు.”
అక్కడినించి బైలుదేరాం. అందరూ స్టేషన్‌కి దిగబెట్టేందుకు వచ్చారు. అంతకుముందే పూనానించి ఒకాయన ఉత్తరం రాశాడు, వెళ్ళేప్పుడు ఒకసారి ఇటు వచ్చి వెళ్ళండి అని.
”పూనా వెళ్దామా?” అన్నారు ఈయన.
”ఎక్కడికీ వద్దు, నేరుగా బొంబాయికే వెళ్దాం.”
”ఆయన చాలా తెలివైనవాడు. మన ఇంటి తాళంచెవి తన దగ్గరుందనీ, పూనా వచ్చి తీసుకోమనీ రాశాడు. తప్పనిసరిగా పూనా వస్తామని ఆ పనిచేశాట్ట. ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో తిరిగారు, రెండురోజులు నాతో గడిపితే ఏమౌతుంది? అని అంటున్నాడు!”
”అలా అయితే వెళ్ళక తప్పదు. కానీ ఇన్నిచోట్లకి వెళ్తే ఆత్మీయుల సంఖ్య పెరిగిపోతుంది. కొత్త స్నేహాలూ, ఆత్మీయతలూ ఏర్పడతాయి. అదే సమస్య.”
”ఇందులో నీకు సమస్యేముంది? మన స్నేహాల పరిధి పెరిగితే దానివల్ల లాభమే గాని నష్టమేమీ ఉండదే!”
”లాభం అనుకున్నా, మనసుకి చాలా బాధ కలుగుతుంది. నేను ఉండేది బెనారస్‌లో, హఠాత్తుగా వీళ్ళందర్నీ చూడాలని మనసు పీకితే ఎలా?”
”నాకైనా అలాగే అనిపిస్తుందిగా?”
”ఏంకాదు. మగాళ్ళ విషయం వేరు. మీరు అందరికీ ఉత్తరాలు రాస్తారు, వాళ్ళు జవాబులు రాస్తారు. కావాలంటే మీరిక్కడికి రాగలరు. ఇక్కడి మగవాళ్ళు బెనారస్ రాగలుగుతారు. ఆడవాళ్ళ సంగతి వేరు. కలవాలన్నా కుదరదు.”
”నాతోబాటు నువ్వూ వస్తావుగా?” అన్నారు.
మేమక్కణ్ణించి పూనా వెళ్ళాం. అక్కడ ఎవరింట్లో అయితే ఉన్నామో వాళ్ళు కూడా ఆత్మబంధువులంత ప్రేమగా చూసుకున్నారు. మాకు ప్రయాణంలో తినేందుకు కూడా ప్యాక్ చేసి ఇచ్చిందామె. మళ్ళీ సావకాశంగా వస్తామని మా దగ్గర మాట తీసుకున్నారు వాళ్ళు. కానీ మళ్ళీ పూనా వెళ్ళనేలేదు… పూనా ఏమిటి ఇంకెక్కడికీ వెళ్ళలేదు. కానీ నాకు మాత్రం అన్ని ఊళ్ళల్లోనూ గడిపిన ఆ రోజులు జీవితాంతం గుర్తుండిపోయాయి. అది ఒక కలలాగా గుర్తొచ్చినప్పుడల్లా మనసు ఆనందంతో ఒక పక్క, ఆ రోజులు మళ్ళీ రావుకదా అనే విచారంతో ఒకపక్క నిండిపోతుంది. ఆ కల మళ్ళీ నిజమవాలని కోరుకుంటే నన్ను పిచ్చిదాన్నని అనుకుంటారు ఎవరైనా.
తరవాత ఇల్లు చేరుకున్నాం. నన్ను దింపి, ”నేనలా స్టూడియోదాకా వెళ్ళొస్తాను,” అన్నారు మా ఆయన.
”స్నానం చెయ్యరూ?” అన్నాను.
”ఆలస్యం అవుతుంది.”
”ఆలస్యమైతే ఏం?”
”లేదులే, ఉత్తరాలేమైనా వచ్చాయేమో చూడాలి. అమ్మాయి ఎలా ఉందో కూడా తెలుస్తుంది. ఉత్తరాలు తీసుకుని వెంటనే వచ్చేస్తాను. నువ్వు హడావిడిగా బైలుదేరింది వాటికోసమేగా?”
ఒక గంటసేపట్లో ఆయన వచ్చేశారు. ”అమ్మాయికి ఎనిమిదో తారీకునే పురుడు వచ్చిందట. అబ్బాయి పుట్టాడు. తల్లీ, పిల్లాడూ కులాసాగా ఉన్నారట. అబ్బాయిల దగ్గర్నించి కూడా ఉత్తరాలు వచ్చాయి. నువ్వు అక్కడ ఉండగా అమ్మాయికి నొప్పులొచ్చి నిన్ను తలుచుకుని ఉంటుంది. అందుకే నీ మనసు వెళ్ళిపోవాలని కొట్టుకుపోయింది” అన్నారు.
ఆ తరవాత ఏప్రిల్‌లో మేం బొంబాయినించి బైలుదేరాం. అక్కణ్ణించి వచ్చేస్తూంటే మా ఆయన, ”పద అలా బజారులోకెళ్ళి పిల్లలకేమైనా కొందాం,” అన్నారు.
”అయితే వెళ్ళి రాకూడదూ?” అన్నాను.
”నువ్వు కూడా రా. నీకు కూడా ఏమైనా కొనాలని అనిపించచ్చు కదా?” అలా అనగానే అమ్మాయికి ముక్కుపుడక కొనాలని ఆయనకి గుర్తొచ్చింది. దాన్ని గురించి కొంత చెప్పాలి…
రాఖీపండగనాడు అమ్మాయి మా దగ్గర ఉంది. మా ఆయన దాన్ని ”ఏం కొనుక్కుంటావు?” అని అడిగారు.
”మీ ఇష్టం,” అంది అమ్మాయి. ఇంతలో మా మనవడు దానిమీదికి దూకాడు. మాముందు అమ్మాయి వాణ్ణి దగ్గరకి రానిచ్చేది కాదు, సిగ్గుపడేది. వాడు పాలు తాగుతానని మారాం చేస్తే దానికి సిగ్గు. అందుకే లోపలికి వెళ్ళిపోయింది.
”అమ్మాయికి ముక్కుపుడక కొనుక్కోమని చెప్పు. ఇక్కడ రవ్వల ముక్కుపుడకలు మంచివి దొరుకుతాయి.”
”మీరు కొనివ్వదల్చుకుంటే నన్ను అడగటం దేనికి?” అని అమ్మాయి లోపలినించే జవాబు చెప్పింది.
”నేనొకవేళ కొనివ్వకపోతే నువ్వు పోట్లాడి కొనిపించుకోవాలి!” అన్నారు.
”ఛా! పోట్లాటలేమిటి?” అన్నాను.
”అక్కచెల్లెళ్ళూ, కూతుళ్ళూ ఇలా తమకి అందవలసిన వాటికోసం పోట్లాడితే నాకు బావుంటుంది!” అన్నారు.
”ఓహో ఇది ఆ స్త్రీల పాటల ప్రభావం లాగుంది!” అన్నాను.
”అవును, పాపం వాళ్ళు మంచిమంచి పాటలు రాశారు. వాటివెనక బోలెడు అర్థం ఉంది, ఊరికే రాయలేదు. మనదేశంలో ఇంగ్లీషువాళ్ళ ప్రభావం అన్నిటినీ నాశనం చేస్తోంది. మనని సున్నితమైన భావాలకి దూరం చేస్తున్నట్టు కనబడుతోంది.”
ఇదే ముక్కుపుడక నేపథ్యం.
ఇద్దరం బజారుకెళ్ళి పిల్లలకి వస్తువులు కొన్నాం. ఒంటిరాయి ముక్కుపుడక నూటపాతిక రూపాయలకి దొరికింది. బన్నూకోసం ఒక చేతిగడియారం తీసుకున్నాం. నన్ను కమ్మలు కొనుక్కోమని మా ఆయన అన్నారు.
”అవి కొని ఏం చేసుకోను?” అన్నాను.
”చాలా బావున్నాయి, తీసుకో. చెవులకి పెట్టుకుందువుగాని.”
”నాకు అక్కర్లేదు.”
”నే చెపుతున్నాగా, ఎంత బావున్నాయో చూడు. కొందాం.”
”వీటి ఖరీదెంత?”
”ఎంతో కాదులే ఏడువందల యాభయ్యేగా?”
”ఏడువందల యాభై రూపాయలు తేరగా వస్తున్నాయా?”
”లేదనుకో, కానీ నీ దగ్గర డబ్బుందిగా!”
”రూపాయలుంటే బ్యాంకులో ఉంటాయి. ఇవెందుకు కొనటం?”
చేసేదేం లేక ఊరుకున్నారు. ఇంటికొచ్చాక, ”అయినా నువ్వా కమ్మలు ఎందుకు కొనుక్కోలేదు?” అని మళ్ళీ మొదలుపెట్టారు.
”నేను ఒట్టుపెట్టుకున్నాను. అది మీకూ తెలుసు. గాంధీగారు గోరఖ్‌పూర్ వచ్చినప్పుడు అలా ఒట్టుపెట్టుకున్నాను. ఆ మీటింగులో ఉన్నవాళ్ళందరూ స్త్రీలే వాళ్ళతో ఆయన, ‘ఏ దేశంలో మనుషుల సగటు సంపాదన ఆరు పైసలో, అక్కడి స్త్రీలకి నగలు పెట్టుకునే హక్కెక్కడిది? వాళ్ళు నగలు పెట్టుకుంటే దొంగతనం చేసినట్టే లెక్క’ అన్నారు. ఆరోజు చాలామంది స్త్రీలు ఒట్టుపెట్టుకున్నారు, నేను కూడా నగలు కొననని ఒట్టుపెట్టుకున్నాను. మీరు లక్నోలో నాకోసం చేయించిన నెక్లెస్ కూడా అలాగే పెట్టెలో ఉంది. ఇవి కొంటే వీటిని కూడా పెట్టెలోనే పెట్టాల్సి వచ్చేది. అంతకన్నా బ్యాంకులో ఉండటమే మంచిది కదా? అక్కడ ఎంతో కొంత వడ్డీ అయినా వస్తుంది. మీరు చెయ్యమనే పనిలో ఇబ్బందే తప్ప సుఖమేమీ లేదు,” అన్నాను.
”మరయితే అప్పుడు అలహాబాద్ నించి నాకోసం ఉంగరం ఎందుకు కొనితెచ్చావు? దానికి డబ్బు ఖర్చు చెయ్యలేదా? అలా ఒట్టుపెట్టుకున్నప్పుడు కొని ఉండకూడదు కదా? నేను మాత్రం నువ్వు చెప్పిన మాట వినాలి, నువ్వు వినవా?”
”మీరు చెప్పింది నేను ఏది కాదన్నాను? నగలు పెట్టుకోనని ప్రమాణం చేశాక ఎలా ఒప్పుకోను? అసలు నామాట నిలబెట్టుకునేందుకు మీరే నాకు సాయం చెయ్యాలి!”
”అయితే ఎవ్వరికీ నువ్వు నగలు కొనకూడదు.”
”అదెలా కుదురుతుంది. పిల్లా పీచూ ఉంటే వాళ్ళని వద్దని ఎలా అంటాను?”
”మరి నేనేమైనా చిన్నపిల్లవాడినా, నువ్వు కొన్న ఉంగరం ఇంకా నా వేలికే ఉందే!”
”పిల్లల్ని మాత్రమే ప్రేమిస్తామా? పెద్దవాళ్ళపట్ల ప్రేమ, అభిమానం ఉండవా?”
”నువ్వు ఉత్త పిచ్చిదానివి!”
పొద్దున్నే ఇంట్లో సామానంతా ప్యాక్ చేస్తున్నాం. దాన్ని బెనారస్‌కి గూడ్సు బండిలో పంపాలి. ఈయన స్నేహితులు చాలామందే వచ్చారు. వాళ్ళే సామానంతా పంపే ఏర్పాట్లు చూస్తున్నారు. అందరూ యూపీ వాళ్ళే. అంతలో ఈయనకి జ్ఞానూ కోసం సైకిల్ కొనలేదని గుర్తుకొచ్చింది. ”జ్ఞానూ సైకిల్ ఉండిపోయింది!” అన్నారు నాతో.
”ఫరవాలేదు వదిలెయ్యండి. అలహాబాద్‌లో కొనుక్కోవచ్చు,” అన్నాను.
”లేదు. అవి ఇక్కడ బావుంటాయి. ఇప్పుడేం మునిగి పోయిందని? మిగతా సామానంతా ఎలాగూ పంపిస్తున్నాం, వాటితోపాటే ఇదీనీ.”
”అనవసరంగా రవాణాకి ఖర్చు చెయ్యటం ఎందుకు?”
”అదేం మాట? అక్కడ వస్తువు ఇంత బావుండదు, పైగా ఖరీదెక్కువ.” అని నా దగ్గర డబ్బు అడిగి తీసుకునివెళ్ళి సైకిల్ కొనుక్కొచ్చారు. వస్తూనే, ”చూడు, నలభై రూపాయలయింది. అక్కడ అరవై. ఇక రవాణాకి నాలుగైదుకన్నా ఎక్కువ అవదుకదా!” అన్నారు.
”సరే!” అన్నాను.
”ఇప్పుడు అందరికీ అన్నీ తీసుకున్నాం.”
”అవును, మీకుతప్ప,”
”పోన్లే మనిద్దరికీ ఏమీ తీసుకోలేదు, ఇద్దరికీ హుళక్కే!” అన్నారు నవ్వుతూ.
ఇక బొంబాయినించి బైలుదేరుదామనుకుంటూ ఉండగా మాఖన్‌లాల్ చతుర్వేదీ దగ్గర్నించి ఉత్తరం వచ్చింది. ఆయన మమ్మల్ని ఖండవాకి రమ్మని రాశాడు.
”ఖండవా వెళ్దాం పద,” అన్నారు ఈయన.
మేము అక్కడికి చేరేసరికే చతుర్వేదీ గారు కొంతమందిని వెంటపెట్టుకుని స్టేషన్‌లో మాకోసం వచ్చి ఉన్నారు. ఇంటికెళ్ళేసరికి ఒక గది మాకోసం సిద్ధంగా కనిపించింది.
చతుర్వేదీగారు ఏదో పనుండి బైటికెళ్ళారు. ఇంట్లో మేమిద్దరమే మిగిలాం.
”ఈ ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేరా?” అని అడిగాను మా ఆయన్ని.
”అలాగే కనిపిస్తోంది. వచ్చాక ఆయన్నే అడుగు,” అన్నారు.
కొంతసేపటికి ఆయన రాగానే ”ఇంట్లో ఆడవాళ్ళెవరూ లేనట్టుందే!” అన్నాను.
”మా అమ్మా, వదినలూ ఉన్నారు,” అన్నాడాయన.
మా ఆయన నవ్వుతూ, ”ముందీవిణ్ణి లోపలికి తీసుకెళ్ళండి,” అన్నారు.
చతుర్వేదీ గారు నన్ను లోపలికి తీసుకెళ్ళి అందరికీ పరిచయం చేశారు. ఆయన తల్లి చాలా స్నేహశీలిలా అనిపించింది. నాతో కొంతసేపు కబుర్లు చెప్పి నన్ను స్నానానికి లోపలికి తీసుకెళ్ళింది. మగాళ్ళు బైటే భోంచేశారు. ఆడవాళ్ళందరం కలిసి కూర్చుని భోజనం చేశాం. ఆ తరవాత చతుర్వేదీ గారు మమ్మల్ని బైటికి తీసుకెళ్ళి ఊరు చూపించారు.
మర్నాడు ఆయన మమ్మల్ని అడవికి తీసుకెళ్ళారు. నది ఒడ్డున, ఖండవానించి పదిహేను ఇరవై మైళ్ళ దూరంలో ఉందా అడవి. అక్కడ మా ఇద్దరినీ ఒక చెట్టుకొమ్మమీద కూర్చోబెట్టి, తను కూడా ఎక్కి కూర్చున్నారు. మా ఇద్దరికీ చెరో కమలాపండూ ఇచ్చి, ”వీటిని ఒలిచి తినండి. తింటూ ఫొటో తీయించుకుందాం,” అన్నారు.
”నేను కమలాపండు తినను, నాకివ్వకండి,” అన్నాను. ”మొత్తం బుట్టెడు పళ్ళూ ఈవిడ ముందుపెట్టండి. అప్పుడు ఫొటో చూసినవాళ్ళు, ఈవిడ పళ్ళు అమ్ముతోందనీ, మనం కొనుక్కుని తింటున్నామనీ అనుకుంటారు!” అన్నారు మా ఆయన నవ్వుతూ.
నేను కొంచెం జంకుతూ, ”అలా చేస్తే నేనీ కొమ్మమీంచి దిగిపోతాను. నాకు మీ ధోరణి నచ్చటంలేదు,” అన్నాను.
నా బెరుకు చూసి వాళ్ళిద్దరూ ఇంకా నవ్వసాగారు. చివరికి పళ్ళబుట్ట అక్కణ్ణించి తీసేశారు. నేనొక పండుని చేతిలోకి తీసుకున్నాను. ఫొటో తీసుకున్నాక మేం ముగ్గురం కింద కూర్చుని పళ్ళు తిన్నాం. ఆ ప్రదేశం చాలా అందంగా ఉంది. దట్టమైన అడవి, నది ఒడ్డు, కానీ ఎండ మాత్రం తీవ్రంగా ఉంది.
పళ్ళు తిన్నాక, మా ఆయన అక్కడ నేలమీదున్న ఒక ఎండుకొమ్మని విరిచి గిల్లీ, దండా తయారుచేశారు. వాటితో గిల్లీదండా ఆడటం మొదలుపెట్టారు.
”ఇలా కూడా ఒక ఫొటో తియ్యమంటారా?” అని అడిగారు చతుర్వేది.
”వద్దండీ నేనిలా ఫొటోలో కనిపిస్తే ఈ ముసలి వయసులో ఈయనకి ఈ ఆట ఏమిటని జనం నవ్వుతారు!”
”ఓహో, మీ విషయం వచ్చేసరికి అందరూ నవ్వుతారని పిస్తోందేం? ఇంతకుముందేగా నన్ను పళ్ళమ్మే మనిషిలా ఫొటో తీయించుకోమన్నారు? మీరు గిల్లీదండా ఎంత బాగా ఆడేవారో ఇప్పటికీ మీ ఊళ్ళో జనం చెప్పుకుంటారు. ఇప్పుడు ఎందుకంత భయపడుతున్నారు?” అన్నాను.
అందరం కారెక్కాం. కారులో కూడా ఈయన గిల్లీదండా ఆట గురించే చతుర్వేదీకి చెప్పటం మొదలుపెట్టారు, ”చూడండి, పండిట్‌జీ, రోజురోజుకీ మన బతుకులు ఎంత ఖరీదైనవిగా మారిపోతున్నాయో! పిల్లల ఆటల విషయమే తీసుకోండి, ఈ రోజుల్లో స్కూళ్ళల్లోనూ, కాలేజీల్లోనో పిల్లలు ఖరీదైన ఆటలే ఆడుతున్నారు. మునుపు గిల్లీదండా, గోళీలాటలూ ఉండేవి. అవి ఇప్పటికీ నా ఉద్దేశంలో మంచి ఆటలే. అవి ఆడేందుకు ఎవరూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. ఈరోజు వీళ్ళు ఆడే ఆటల్లో దొరికే వ్యాయామం వాటిల్లోనూ ఉంది.”
ఐదురోజులు ఖండ్వాలో ఉన్నాం. మా ఆయన రెండు మూడురోజులు అక్కడి స్కూళ్ళకి వెళ్ళారు. రెండు సాహిత్య సభలు ఈయన అధ్యక్షతలో జరిగాయి. నేను మాత్రం మళ్ళీ బైటికి ఎక్కడికీ వెళ్ళలేదు. చతుర్వేదీ గారి తల్లితో గడిపితే వచ్చే ఆనందం నాకు ఇంకెక్కడా రాలేదు.
– ఇంకా ఉంది
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags