సంభాషణ

చి. అజయ్‌ ప్రసాద్‌
గత ఇరవైఏళ్ళ కాలంలో తెలుగు సమాజం చాలానే చూసింది. పోగొట్టుకోగా ఇంకేమైనా మిగిలింది చూసుకోవాలనుకుంటే ఈ పుస్తకం చదవాల్సిందే. ఇప్పుడు మనం ఒక గొప్ప మలుపులోనో లేక మరొక యుగసంధిలోనో ఉన్నామని కాస్తంత రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారైనా చెప్తారు. అదలా ఉంచి కొన్ని సంవత్సరాలపాటు ధారాపాతంగా ప్రవహించిన కాలం ఇప్పుడు కాస్త ఒళ్ళు విరుచుకుని విస్తరించి ఇటు గ్రామాలను, పట్టణాలను, మహానగరాలను కబళిస్తూ ఉంది. అటు అడవి కన్న కలలనూ తనలో కలిపేసుకుంది. ఇప్పుడు ఎవరెక్కడ మునుగుతారో తెలియదు. ఎవరెక్కడ తేలుతారో తెలియదు. ఎవరేమి పోగొట్టుకుంటారో తెలియదు. ఎవరిచేతిలో ఏవి మిగులుతాయో తెలియదు. ఈ మహాసంగ్రామంలో అస్త్రసన్యాసం చేసినవారు కొందరు. కొంగొత్త శస్త్రాలను భుజానికెత్తుకున్నది మరికొందరు. అయినా ఎవరు మిత్రులో ఇంకెవరు శత్రువులో తెలియని సందిగ్ధంలో కడదాకా నిలబడేదెవ్వరు? ఇప్పుడు మనిషిలోపల వైరుధ్యాలను విరుచుకుతింటున్నదెవ్వరు? మరెందుకో ముఖాలన్నీ ఒకే పోలికలతో ఉన్న కాలమిది. భిన్నాభిప్రాయాలతో నిప్పులు చిమ్ముకున్న ఇరువురి మౌనం ఒకేలా ఉంది. ఉప్పెన ముంచుకువచ్చిన విపత్కర పరిస్థితుల్లో ఇక అవతలి ఒడ్డుకు చేర్చాల్సినవేమిటి?
ఇదంతా చాలాకాలం క్రితం సంగతి. అసలిదంతా చాలాకాలం తరవాత సంగతి. అప్పుడెప్పుడో బ్లాక్‌ & వైట్‌లో అంతా క్రిస్టల్‌ క్లియర్‌గా ఉండేది. మనమంతా కోరస్‌గా ఖండిస్తూ వచ్చాం. రానురాను మరెందుకో అంతా పునరుక్తిలా అనిపించింది. మరెందుకో మన గొంతులన్నీ తడబడ్డాయి. అంగీకరించడానికీ విభేదించడానికీ మధ్య రాగం శృతి తప్పింది. గందరగ్లోబళీకరణ కలర్స్‌ మనలను కన్‌ఫ్యూజ్‌ చేసాయి. అసలు మనం కళ్ళతో చూస్తున్నదంతా నిజమేనా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని ఎలా వర్ణించాలి. అక్షరాలు అవే. పదాలు అవే. అర్థాలే తెలియక పిచ్చిపట్టే స్థితి. చూడలేక ఆత్మ అవాక్కవుతుంది. చెప్పలేక మనసు మూగపోతుంది. ఆసాంతం తలకిందులయిన జీవన వ్యాకరణంలో మనకొక కొత్త భాష కావాలి.
ఇది వచనానికి కవిత్వానికి మధ్య సరికొత్త సాహిత్య ప్రక్రియని కొందరంటారు. ఇందులోని వచనం ఆశ్చర్యం గొలుపుతుంది. ఇదంతా మన గురించేనా అని సిగ్గు కూడా కలుగుతుంది. ఈ భాషలోని గాఢతకు ఏ రసాయనాలు మూలమో తెలియదుకాని అంతకు మించిన విషాద మైకమేదో కనిపిస్తూ ఉంది. మంచి వచనానికి హృదయమే ముడివస్తువు తప్ప చేతినైపుణ్యం కాదుకదా. ఈ గ్రంథకర్త అనేక గాయాలను చూసినవాడు. మనకు తెలియని అనేక అస్థిత్వ ఉద్యమాల ఘర్షణలనీ, వైరుధ్యాలనీ అవలీలగా మింగిన గరళకంఠుడు. మనమెవ్వరమూ ఇంకా చూడని యుద్ధాలని ముందే చూసిన నిర్వికల్పుడు. రూబెన్‌ చిత్రించిన వర్ణపటంలో గుహలోపల సింహాలమధ్య చెప్పలేనన్ని హావభావాలతో కూర్చున్న డేనియల్‌లా కనిపిస్తాడు. ఈ స్థితప్రజ్ఞత పలాయనం నుంచి రాదు. దీనికి చాలా ధైర్యం కావాలి. చాలా గాయపడాలి.
బోధివృక్షం కింద జ్ఞానోదయం సరే. నదీజలాల పంపిణీలో ఇరురాజ్యాల వాదప్రతివాదాలనుంచి రాకుమారుడైన సిద్ధార్ధుడు గౌతమబుద్ధుడిగా పరిణామం చెందాడని కొందరు నమ్ముతారు. ఇరువురూ యుద్ధం తప్ప మరింకేదైనా చేయండని చెప్తాడు సిద్ధార్ధుడు. అది క్రీస్తుపూర్వపు మానవుడి మొదటిసూత్రం. మనం చిక్కుకున్న ఆధునికతలో యుద్ధం అనివార్యం. నిశ్చల నిశ్చితాలులేని నైరూప్యదృశ్యంలో మరిక యుద్ధం దేనికోసం అన్నది మరొక ప్రశ్న. వైరివర్గాలు ఎప్పుడూ మోహరించే ఉంటాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుందనీ, అంతిమ విజయం మనదేననీ అందుకు చరిత్ర, వేళ్ళమధ్య సూత్రాలే సాక్ష్యమనీ అందరూ నిశ్చింతగా ఉంటారు. మరెందుకో యుద్ధం జరగకుండానే అందరూ క్షతగ్రాతులవుతూ ఉంటారు. నిరంతర యుద్ధరంగంలో ఎందుకు గాయపడాలో మరెందుకు రాయిగా మారాలో జీవకుడు జరిపే సంభాషణ ఇది. ఈ గాయం తీరేదికాదు. ఈ హృదయం చల్లారేదికాదు.
ఇంతకీ ఇదంతా చర్వితచరణమే. ఇదంతా ఎప్పుడో ఇంపోజిషన్స్‌ రాసేశాం. ఈ వ్యాసాలనిండా ఒక అంతఃసూత్రం కనిపిస్తూ ఉంది. అది కేవలం ఒక చూపుమాత్రమే కావచ్చు. ముఖచిత్రంలో ఒడ్డును తాకిన కెరటం విస్ఫోటనం చెందినట్లు ఈ సంభాషణలో శకలాలుశకలాలుగా విడిపోతున్న అంతర్ముఖం కనిపిస్తుంది. దుఃఖం నిత్యం కదా. బంధవిముక్తులం కావడానికి బహుముఖాలను అంగీకరించాలి. రచయిత కేవలం ఇదొక స్వగతమేనంటాడు. కొన్ని యుగాలపాటు వెనక్కువెళ్ళి పాతరాతియుగంతో చేసిన సంభాషణలు ఇందులో వినిపిస్తాయి. మరొకసారి అంతరిక్షం అవతలికి వెళ్ళి కూడా మనిషి అంతరంగంలోని ఊర్ధ్వలోకాలతో చెప్పుకొన్న ఊసులు వినిపిస్తాయి. తన సితార్‌తో అనేక స్వరాలను పలికించే ఈ పరివ్రాజకుడు ఖండాంతరాలను దాటి ఫిడెల్‌ కాస్ట్రో, సద్దాంలను పరామర్శించడమేకాక అంతరిక్షం చేరి చందమామ మీద నీటిఛాయ సరే, మనిషి మనసులో ఆర్ద్రత, కళ్ళలో నీటిపొర ఏదని పరితపిస్తాడు.
జీవితాన్ని వెలిగించడానికి ఒక అబద్ధం కావాలి ప్లీజ్‌ అంటూ ఆశ యొక్క ఆవశ్యకత గురించి చెప్తాడు. ఎన్నో పదాలూ, వాక్యాలూ మీద నుంచి వెళ్ళినా ఒక్క అక్షరమూ పలకలేని మనిషి ఆత్మహననం గురించీ చెప్తాడు. ఒక సముద్రప్రళయంలో కొట్టుకుపోయిన మనిషి అత్యున్నతమైన చైతన్యాన్ని పరిహసిస్తాడు. జ్ఞాపకముంచుకోవలసిన ఒక స్వప్నం గురించి గుర్తుచేస్తాడు. పాజ్‌ ప్లీజ్‌ అంటూ మనలను ఈడ్చుకుని వెళ్తొన్న సమయం గురించీ చెప్తాడూ, అంతేకాక అసంఖ్యాకమైన ఆలోచనల మధ్య చిక్కుకుపోయి మాటలులేక మ్రాన్పడిపోయే ఒక ఆరంభ సంశయం గురించీ మూగపోతాడు.
ఇతడు మార్క్సునూ కలవరిస్తాడు, నాస్తికుడై ఉండీ మార్మికతనూ కావాలంటాడు. అర్థంకాని సృష్టిరహస్యం మనిషిలో ప్రతిసృష్టిని ప్రేరేపిస్తుందంటాడు. ఆశాదీపం కొడిగట్టకుండా ఉండాలంటే మరి ఒక అబద్ధమైనా పరవాలేదంటాడు. వర్తమానంలో ఈ వైరుధ్యాలను అర్థం చేసుకోకపోతే దృష్టిగతమైనట్లే. అందుకేనేమో ”నేను వైరుధ్యాలను వెన్నెముకగా ధరించినవాడిని” అన్నాడు అజంతా.
ఈ సంభాషణ పత్రికారంగంలో ఒక తరం ప్రతినిధులకు ఒక జ్ఞాపిక. సిద్ధాంత రాద్ధాంతాలు లేకపోవడం చేత ఇందులో వైరుధ్యాలేం లేవు. పేచీ పడటానికి ఇందులో రాజకీయ అభిప్రాయాలేం లేవు. అందుచేతనే కావచ్చు దీనికొక సర్వకాల ప్రాసంగికత ఏర్పడింది. మెటామార్ఫాసిస్‌కు లొంగని మందుగుండేదో ఇందులో దట్టించి ఉంది. డైల్యూట్‌ కాని డెల్యూజన్స్‌ ఏవో ఇందులో ఉన్నాయి. ఈ పుస్తకంలో ఉన్న కొన్ని వ్యాసాల దృష్ట్యా ఇది తొందరగా ఎక్‌స్పైర్‌ అయిపోవాలని కోరుకుంటున్నాను. ప్రతిదినం ఒక ప్రతిధ్వని కాని కాలంలో ఈ పుస్తకం అవసరం లేదు. మన జీవితాలలో పునరుక్తిలేని సందర్భంలో ఈ పుస్తకం ఒక అసందర్భం. మరి ఇప్పట్లో అది జరిగేట్లు లేదు. అప్పటిదాకా ఇదొక నిత్యపారాయణ గ్రంథం. అంతేకాక చలనంలేని మన దైనందిన చిత్రాన్ని చూపడానికి ఇంతకుమించి ఇప్పట్లో మరొక భాషను ఊహించలేకుండా ఉన్నాను.
పుస్తకం : నెట్‌ సౌజన్యంతో

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.