సి.సుజాతామూర్తి
అసలుకంటే ‘వడ్డీ’ముద్ద్దు అన్నట్లుగా, మతం, జాతి, జాతీయత, కులం అనే వివక్ష లేకుండా, తన పిల్లల్నీ, మనమల్నీ అందర్నీ ప్రేమతో అక్కున చేర్చుకుని జీవిత సారాన్ని తనదైన శైలిలో ఇటు పిల్లలకూ, పెద్దలకూ, కాచి వడబోసి చెప్పే స్త్రీ రూపమే అమ్మమ్మ.
తనకున్న పిల్లలకన్నా ఎంతో జాగ్రత్తగా సమాజపు దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడాలనుకునే తపన అమ్మమ్మకున్నంతగా మరెవ్వరికీ వుండదు! ఈ నేపథ్యంతోనే, ఎన్.ఎస్. లక్ష్మీదేవమ్మ ‘మా అమ్మమ్మకథ’ అనే వ్యాస సంపుటిని వాళ్ళ అమ్మమ్మ చెప్పిన జీవిత విషయాల ఆధారంగా రాసి ముద్రించిన పుస్తకం.
నిజాం పరిపాలనలో స్త్రీల అగచాట్ల నుంచి మొదలుపెట్టి ఎన్నో స్త్రీల సమస్యలను, పట్టించుకోని ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాలను, ఎండగడుతూ, చాలా ఆలోచింపచేసేట్టున్న వ్యాసాలతో నిండి ఉందీ పుస్తకం. అన్ని సమస్యలను విశదంగా చెప్తూనే, దానికి పరిష్కారమార్గం కూడా సూచించారు.
ఆమె మాటలలోనే : పెండ్లిలో అమ్మాయికి అబ్బాయివాళ్ళు ఒకటిన్నర తులం బంగారం ఇరవైతులాల వెండీ పెట్టాలి. ఎంత ఉన్నవాడైనా పందిట్లో ఇంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఇష్టం. ఇది ఆనాటి కుల తీర్మానం. దీనికి అందరూ కట్టుబడి వుండేవారు. అంటే ఇది పేదోడికీ, ఉన్నోడికీ ఒక్కటే సూత్రం. రెండో భార్యగా తాతయ్య అమ్మమ్మను పెళ్ళాడాక, పెద్ద భార్యను కొట్టడం మానేశాడు. ఆమె మూలంగా, తనను హింసించనందుకు అమ్మమ్మకు ఆమె దణ్ణం పెట్టి మొక్కేదట! ”ఈకాలంలో స్వార్థం చూస్తుంటే పరమ అసహ్యం వేస్తుంది. పరులకోసం పాటుపడే ఆనందం ఈ కాలంవారికి తెలియదు. ఇతరుల గురించి ఆలోచించే తీరికెక్కడిది? రోజురోజుకీ వినిమయ ప్రపంచంలో కూరుకుపోతున్నారు.”
”ఈ రోజుల్లో భర్తపోయిన స్త్రీని, ఇంకా ఎంత ఆలోచనారహితంగా, స్త్రీలే బాధపెడ్తున్నారో, చక్కగా రెండుమాటల్లో చెప్పారు. ” ఎందుకేడుస్తున్నావే, వాడికి పిలుపువచ్చింది వెళ్ళిపోయాడు. రేపు మనకు వస్తే వెళ్ళిపోయేవాళ్ళమే. ఎవ్వరం శాశ్వతం కాదు. గుండె గట్టి చేస్కో బిడ్డా. పిల్లలు గుండె పగుల్తరు” అన్న అమ్మమ్మ చెప్పిన మాటల్లో ఎంత నిజాయితీ, ఊరట ఉందో గమనించండి.
నిరంతరం స్త్రీలకే పరిమితమైన బాధలతో నలుగుతున్న వాళ్ళకు కాస్త న్యాయం జరిగితే బాగుండనుకునే ఆలోచనలో ఉన్నప్పుడు, పాపం పురుషులు మాత్రమే అంటే ఏం లాభం? స్త్రీలు కూడా కట్టకథలు కట్టే అమ్మలక్కల మీటింగులలోకి, ఈ విషయాలను గుంజి, వాళ్ళ అసహ్యకరమైన అనుమానాలను, అభిప్రాయాలను వెల్లడిస్తూ, భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టే స్త్రీలను మొదట సంస్కరించాలి” అంటారు అమ్మమ్మ. సమాజంలో ఆడ, మగ అన్న విచక్షణ లేకుండా ఇద్దరిపట్ల జరిగే అరాచలకాలను గర్హించగలగాలి.
సినిమాలు, టివిలో ధారావాహిక కార్యక్రమాలు, వాటిలో స్త్రీలను విలన్లుగా చిత్రీకరించే తీరును కూడా చూస్తున్నవాళ్ళు స్త్రీలే ఎక్కువగా కనబడతారు. ఇంకో పక్క పాలమూరు వలసకూలీలు ఎలా దోపిడీకి గురై, చిద్రమైన బతుకుతలను నిస్సహాయంగా గడుపుతున్నారో చదువుతుంటే, గుండె దొలిచనట్లవుతుంది…
కొన్ని సందర్భాలలో ఎంతో విలువైన ప్రశ్నలు వేస్తారు. ఉదా|| కేవలం చేతబడులకే ఎద్దులు చస్తే యుద్ధాలెందుకు ఒరే ఒరే” అన్నట్లు వ్రతాలతోనే మనుషుల ఆయుష్షు పెరిగితే ఆస్పత్రులెందుకు? చావడమెందుకు? మందులెందుకు? అని సంధించిన ప్రశ్నలలో ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించగలిగే స్త్రీలు మనలో ఎంతమంది ఉన్నారు? నిత్యం ఘర్షణ పడుతూ చైతన్యంతో ముందుకు మన స్త్రీ జన భవితకోసం సాగాల్సిందే అంటారు అమ్మమ్మ. ఒక మగపిల్లవాడు తల కొరివి పెట్టేందుకు కావాలని నలుగురు ఆడపిల్లలను భార్య చేత కనిపించే భర్తల గురించీ, విభజించి పాలిస్తోందని, బ్రిటిష్‌వాళ్ళను వెళ్ళగొట్టి స్వాతంత్య్రం సంపాదించి, మళ్ళీ మన కుళ్ళు రాజకీయాల్తో, కుర్చీలాటకోసం విభజిస్తున్నారంటూ రాజకీయ రంగం గురించీ, ఇళ్ళల్లో పనిచేసే స్త్రీల బాధల గురించీ, పిల్లలను సామాజిక స్పృహ కలిగించేలా ఎలా పెంచాలో అన్న దాని గురించి, ఆఖరున రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదించిన తరుణంలో రాసిన కవితతో ఈ సంపుటి ముగుస్తంది.
సమాజం అంటే ఎవరోకాదు. మనమే. మనం ఏర్పర్చిన మన చుట్టూ ఉన్న మనమందరం నాతో సహా మన మన భేషజాలతో, కుటిలత్వంతో, కుళ్ళుతో ఇలా ఎన్నో భావజాలాలతో ఏర్పరిచిన సమాజమే మన బాధలకు కారణమైంది. కాబట్టి మన సమాజం కాదు మారాల్సింది. మనం. మన నిబద్ధమైన మూఢాచారాల నుండీ, మతపరమైన, కులతత్త్వమైన, జాతీయపరమైన భావజాలాలనుండి విముక్తి పొంది మానవులుగా బతకడం ఆరంభించాలి. మనం మారితే సమాజం మారుతుంది. సమాజం మారితే బస్తీ బాగుపడుతుంది. బస్తీ బాగుపడితే ఊరు బాగుపడుతుంది. ఊరుమారితే నగరం మారుతుంనిది. నగరం మారితే దేశం మారి ఒక కొత్త అరోగ్యవంతమైన, స్నేహపూరితమైన మంచి సంస్కారవంతమైన దేశంగా అందరికీ ఆదర్శవంతంగా మారుతుంది.
ఇలా ఇన్ని రకాల కోణాల్లో స్త్రీల వ్యధను నిలువుటద్దంలో స్పష్టంగా చూపించారు. ఈ దుర్భర జీవన విధానాలకు మనమే కారణమన్న నగ్న సత్యాన్ని సూటిగా చెప్పారు ఎన్నో సందర్భాల్లో లక్ష్మీదేవమ్మగారు.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags