వి. ప్రతిమ
జీవితం మళ్ళీ మళ్ళీ ఉత్తేజభరితం కావాలంటే అప్పుడప్పుడు అరుదుగానైనా సరే స్నేహితుల్ని కలుసుకోవడం అవసరం…
ఆగస్టు ముప్పయిన విజయవాడలో ఒక పురస్కార సభ వుంది. రాగలిగితే కలుద్దాం. రీఛార్జవుదాం అంటూ సత్యవతి నుండి మెసేజ్ అందింది. పనుల ఒత్తిడిని తట్టుకుని కష్టమైన ప్రయాణం చేసినప్పటికీ నిజానికి నాకదో గొప్ప అనుభవం…
అటునుండి కె. సత్యవతి, గీత ఇటునుండి నేను ఆ ఉదయానికి విజయవాడ పి. సత్యవతి గారింట్లో కలుసుకున్నాం… కబుర్లూ, కథలూ, కేకలూ,సాహిత్యమూ, సంగీతమూ, పుస్తకాలూ, నవ్వులూ, సరదాలూ ఒక పార్శ్వమైతే… పన్నెండింటికి బయల్దేరి మచిలీపట్నం దగ్గర కప్పలదొడ్డి అనే ప్రాంతంలో నేతపనివారల కుటుంబాలన్నింటినీ కలిసి వారి హీన దీన పరిస్థితులను విచారించి దిగులుతో ఉద్వేగం చెందడం మరో పార్శ్వం…
అక్కడ్నుండి సాయంత్రం ఆరింటికి తిరిగొచ్చి హడావుడిగా సభాస్థలికి చేరుకున్నాం… అప్పటికే అక్కడ శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రవిూల, విశ్వేశ్వరరావుగారు, మందరపు హైమావతి వంటివారు వచ్చివున్నారు.
ప్రజానాట్యమందలి వ్యవస్థాపక అధ్యక్షులు కర్నాటిలక్ష్మీ నరసయ్య గారు, పురస్కార ప్రదాత నన్నపనేని నాగేశ్వరరావుగారు యింకా మరికొందరు సత్యవతితో పాటు మమ్మల్నందరినీ ఆత్మీయంగా, స్నేహపూర్వకంగా స్వాగతించిన తీరు చెప్పుకోదగింది…
లక్ష్మీనరసయ్యగారి మన్నన, మర్యాద, పిన్నలయినా గౌరవించే తీరు వీటన్నింటి గురించి ఆ మధ్యాహ్నం ఇరువురు సత్యవతులద్వారా విని వున్నప్పటికీ ఆయన ఆదరణ, అందరినీ పేరుపేరునా పలకరించి పరిచయం చేసుకోవడం విభ్రమగొల్పింది…
”స్త్రీలకు రక్షణ లేని సమాజం మనకొద్దు
హింసలేని సమాజమే స్త్రీల హక్కు’ అంటూ ప్రతీక్షణం స్త్రీలకోసం పనిచేస్తూ, ఆపన్న మహిళలకు అవసరమైన సలహా, సంప్రదింపులనందిస్తున్న సంపాదకురాలు, రచయిత్రి, అన్నింటికీ మించి స్త్రీలందరికీ మెలకువ కల్గిస్తోన్న యాక్టివిస్ట్… భూమిక సత్యవతిగా మనమంతా పిలుచుకుంటున్న కొండవీటి సత్యవతి. ఆమె చేసిన సేవలకు, ఆమె సాహిత్యానికి గతంలో అనేకానేక పురస్కారాలనందుకుని వుండొచ్చు కానీ ఇప్పుడు విజయవాడలో అందుకున్న నన్నపనేని లక్ష్మి పురస్కారం వాటన్నింటి కంటే విభిన్నమైనది… విశిష్టమైనది.
మనమెప్పుడూ మనకి తెలియని మన చరిత్ర గురించి, మనకి తెలియాల్సిన మన చరిత్ర గురించి చెప్పుకుంటూంటాం. ఇంకా చరిత్ర చీకట్లో మినుకు మినుకు మంటోన్న వెలుగు రవ్వల్ని వెలికి తీయాల్సిన అవసరాన్ని గురించి ప్రస్తావించుకుంటాం…
మంగళగిరిపట్నంలో మహిళా చైతన్యానికి ఆద్యురాలైన నన్నపనేని లక్ష్మి వివిధ సాంఘిక, సేవా కళా సాంస్కృతిక, విద్య, వైద్య, న్యాయసంస్థలకు ఆమె అందించిన సహాయ సహకారాల గురించి ఆ సభలో వేనోళ్ళ ప్రశంసిస్తుంటే సంభ్రమాశ్చర్యాలకు, ఒకింత దుఃఖానికి గురికావడం జరిగింది. ప్రేమాస్పదురాలు, సేవాన్విత అయిన ఆమె జీవితం అర్థాంతరంగా ముగియడం నిజంగా శోచనీయం. ఆ వెలుగురవ్వ గురించి భూమికలో మరో విస్తృతమైన వ్యాసం రావాల్సే వుంది.
ఆమె పేరుతో స్థాపించబడిన ఈ స్మారక పురస్కారం కొండవీటి సత్యవతికి ప్రదానం చేయడం ఎంతైనా సముచితం…
ఆ సభలో సత్యవతి గురించి ఇద్దరు అతిథులు మాట్లాడుతూ ఒకరు విహారిగారు, రెండు పి సత్యవతిగారు…
స్మారక పురస్కారం అనగానే కొంత దుఃఖమూ, ఒక ఆనందమూ సమ్మిళితమైన ఒక ప్రత్యేక సందర్భం అంటూ ప్రారంభించి సత్యవతి యొక్క జీవిత వ్యక్తిత్వాన్ని సాహిత్య వ్యక్తిత్వంతో సమాజసేవలో కలుపుకుంటూ విహారిగారు చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ఉపన్యాసాన్ని అందించారా సభలో… సభికులకు, తెలియని వారికి కూడా సత్యవతి చాలా బాగా పరిచయమైనటయ్టింది.
ఇక స్నేహితురాలు పి. సత్యవతి గురించి చెప్పేదేముంది? రెండు దశాబ్దాలుగా భూమిక, కొండవీటి సత్యవతి ఇద్దరూ కూడా తనకెంత సన్నిహితులో చెప్తూ పశ్చిమగోదావరి జిల్లా సీతారాంపురం లోని ఒక మామూలు వ్యవసాయ ఉమ్మడి కుటుంబంలో పుట్టిన సత్యవతి ఇంట్లోనే స్త్రీల మీద జరిగే అణచివేతని గమనిస్తూ వచ్చి స్త్రీలపై హింసలేని సమాజం కోసం ఎలా అహరహమూ శ్రమిస్తూ ఈ స్థాయికి చేరుకుందో చెప్పుకొచ్చారు…
భూమిక స్త్రీవాద పత్రిక బాధ్యతను తలకెత్తుకుని అనేక ఆటుపోట్లనెదుర్కొని గత రెండు దశాబ్దాలుగా నిరాఘాటంగా కొనసాగిస్తూ మహిళలకు సంబంధించిన విస్తృతమైన సమాచారాన్నే కాకుండా సృజనాత్మక రచనలను కూడా ప్రోత్సహిస్తూ, హెల్ప్‌లైన్ ద్వారా అనేకమంది స్త్రీలకు అండగా నిలుస్తూ స్త్రీవాద ఉద్యమాన్ని పరిపుష్టం చేస్తున్నందుకు కొండవీటి సత్యవతిని మనస్ఫూర్తిగా అభినందించారు పి సత్యవతి…
పురస్కార గ్రహీతని నిర్వాహకులు సన్మానించిన తీరు ఒక కుటుంబ వాతావరణంలోలా చాలా సహజంగా అన్పించి, ఆమె స్నహితుల్లోనే కాక సభికులందరిలోనూ ఆనందోత్సాహాలను నింపింది… ముఖ్యంగా సత్యవతి స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది… చిన్న పిల్లలా సంబరంగా నవ్వుతూ సన్మానం చేయించుకోవడమేకాక సత్యవతిలో ఎప్పుడూ చూడని వినయం, ఒద్దిక చూసి ఆశ్చర్యమన్పించింది
ఈ పురస్కారం సత్యవతిలో సమాజం పట్ల మరింత బాధ్యతను పెంచినట్లుగా అన్పించింది…
ఇతిహాసపు చీకటికోణపు అట్టడుగున పడి కన్పించని కథలన్నీ కావాలిప్పుడు అన్న మహాకవి వాక్యం ఎందుకో తెలీదుగానీ నాకక్కడ కూర్చున్నంత సేపూ నాలుక మీద ఆడుతూనే వుంది…
నన్నపనేని లక్ష్మి… ఆమె పేరుతో వున్న ఈ విశిష్ట పురస్కారాన్నందుకున్న సత్యవతి ఇద్దరూ అభినందనీయులే…
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags