ప్రకృతి

సింహప్రసాద్‌
బ్రహ్మదేవుడి కార్యాలయం చాలా రద్దీగా వుంది.
అన్ని రకాల జీవులూ ఆయన దర్శనార్థం క్యూలో వున్నాయి. శిక్ష పూర్తయి పునరావాసం కోసం ఎదురు చూస్తోన్న ఖైదీల్లా వున్నాయన్నీ.
మరి ఆయనేం మాటాడుతున్నాడో ఏం దారి చూపిస్తున్నాడో గాని ఒక్కొక్కరి నుదుటి మీద ముద్రవేసి పంపడానికి చాలా సమయమే పడుతోంది.
నా టర్న్‌ కోసం ఎదురుచూస్తూ క్యూలో నిల్చున్నాను.
‘దీని కన్నా తిరుపతి క్యూయే నయం’ విసుక్కున్నాను. అంతలో గోడలకు చెవులుంటాయేమోనని కలవరపడుతూ దిక్కులు చూశాను.
నా భవిష్యత్తు బ్రహ్మదేవుడి చేతుల్లో వుంది. గత జన్మలోని నా చేతల్ని తూకం వేసి నా నుదుట రాస్తాట్ట. అప్పట్లో మేం ఆడవారి నుదుటి రాతలు రాస్తే ఇప్పుడీయన మా రాత రాస్తాడు కాబోలు. మగ పక్షపాతం చూపించకపోడు. అయినా జాగ్రత్తగా వుండటం బెటర్‌.
ఆయన్ని కొంచెం పొగిడి కొంచెం కాకా పడితే ఉజ్వల భవిష్యత్తు నా ముఖాన రాసెయ్యొచ్చు కదా అన్పించింది. మళ్ళీ మగ మహారాజులా మీసం మెలేస్తూ ఇష్టారాజ్యంగా బతకొచ్చు కదా అనీ అన్పించింది.
దండకం చదవటమో ప్రార్థన చెయ్యడమో చేద్దామని ప్రయత్నించాను గాని ఏమీ గుర్తురాలేదు. ఆయనకి భూమ్మీద ఎక్కడో ఒకచోట తప్ప గుడిలేదన్న సంగతి గుర్తొచ్చింది.
పవర్‌ఫుల్‌ గాడ్‌ అయినా ‘మాస్‌ గాడ్‌’ కాలేకపోవడం బ్యాడ్డే మరి!
క్యూ ముందుకి జరిగింది. బ్రహ్మదేవుడి ప్రక్కన కూర్చుని వీణ వాయిస్తోంది సరస్వతి. ఆయన్ని అలరించడానికో మూడ్‌లో వుంచడానికో మరి!
‘ఇక్కడా ఆడవారిది ద్వితీయ స్థానమే!’ నవ్వుకున్నాను.
సరస్వతి అందంగా వుంది. నవ యౌవనంతో వెలిగిపోతోంది.
నా వంతు వచ్చింది. ఎంతో వినయంగా వంగి భక్తిభావం ఉట్టిపడేలా పాదాభివందనం చేశాను.
ఆయన మందహాసం చేశారు ”భాగ్యశాలివోయ్‌ పురుషా”
”అంతా తమ దయ….”
”ఒక అపరిచిత స్త్రీని అమ్మా అని పిలిచి పాపపంకిలాన్ని కడిగేసుకున్నావు. మళ్ళీ మానవ జన్మ ఎత్తేందుకు అర్హత పొందావు…”
చటుక్కున ఎన్నెన్నో ఏళ్ళ పొరల క్రింద మరుగున పడిన అవాళ్టి ఘటన గుర్తొచ్చింది.
తాగివెళ్తూ చూసుకోక మూతలేని మ్యాన్‌హోల్‌లో పడ్డాను. సాయం కోసం పిలిచాను. అరిచాను. ఎవరూ రాలేదు.
ఒకావిడ గొంతు విన్పించింది. ”అమ్మా! రక్షించు తల్లీ” అంటూ ఆర్తితో దుఃఖంతో అర్థించాను. ఆమె నిజంగానే రక్షించింది. అప్పుడు ఆ హోల్‌నుంచి. ఇప్పుడు కుక్క నక్క ఈగ దోమ లాంటి అథోజన్మల నుంచి!
అమ్మ అన్న పిలుపుకే అంత మహత్యం వుంటుందని తెలిస్తే రోజుకి లక్షసార్లు జపించేవాడ్ని!
”మళ్ళీ మగాడిగా పుడతావా లేక ఆడజన్మ ఎత్తుతావా?”
”జన్మజన్మలకీ మగజన్మే ఎత్తుతాను. చచ్చినా ఆడజన్మ ఎత్తను”
”ఏం పురుషా. ఆడజన్మంటే అంత ద్వేషమెందుకు?”
”మా దేశంలో ఆడపిల్లల్ని హీనంగా చూస్తాం. ఆడపిల్ల పుట్టిందంటే ముసలం పుట్టినట్టు భావిస్తాం. గర్భంలో వుండగా స్కానింగులో చూచి ఆడపిల్ల అయితే వెంటనే భ్రూణహత్య చేసేస్తాం. ఖర్మకాలి పుట్టేస్తే నోట్లో వడ్లగింజ వేసేస్తాం. అప్పటికీ బ్రతికి బట్టకడితే లైంగికంగా వేధిస్తాం. మొఖం మీద యాసిడ్‌ పోస్తాం. కట్నాకలి మంటల్లో నిలువునా కాల్చేస్తాం. ఆడవాళ్ళు చావటానికి పుట్టిన పిపీలికాలన్న మాట”
”మీరు చనిపోరా?”
”ఆహ. అలా అని కాదు. వాళ్ళది చచ్చే జాతి. మాది చంపేజాతి. మాదెప్పుడూ పైచెయ్యే. ఆస్తి మాదే. అధికారం మాదే. పెత్తనం మాదే. మా కాలి చెప్పుకింద వాళ్ళని తొక్కి పెడతాం. మీకు తెలీదేమో మేం మగ మహారాజులం! అందుకే భారతదేశంలోనే మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకుంటాం”
”కాని మీ దేశాన్ని ‘మాతృ’ దేశం అంటారు. ధనానికి లక్ష్మినీ విద్యకి సరస్వతినీ శక్తికి పార్వతినీ అధినేత్రిని చేసి అభిషేకిస్తారు. స్తోత్రాలు పఠిస్తారు. మీ పురాణాల్లో ఆదిశక్తి అనీ అదనీ ఇదనీ ఆకాశానికెత్తేస్తారు. నువ్వేమో ఇంకోలా మాట్లాడుతున్నావేంటి పురుషా”
”మీకో రహస్యం చెప్పనా? అలాటి మాయమాటల్జెప్పేది అమాయకుల్ని ఆడించడానికే. చెప్పు చేతల్లో వుంచుకోడానికే. మోస పుచ్చి అణచివుంచడానికే. ఆకాశంలో మీరు సగం అంటూ కవితలు రాస్తాంగాని భూమిలో సగంకాదు పదోవంతుకూడా ఇవ్వం. అధికారంలో మూడోవంతు భాగం కల్పిస్తామని వూరిస్తాం తప్ప ఇవ్వనే ఇవ్వం. మా స్ట్రాటజీ మీకు తెలీదులే స్వామీ”
”ఏవిటో అనుకున్నాను. మీరు చాలా ఘటికులేనే. ఇంతకీ మగజన్మ మీదేశంలోనే ఎత్తుతావా లేక ఇంకెక్కడైనా…”
”వద్దొద్దు. భారత భూమే బెటర్‌. అక్కడి విశ్వాసాలు సంస్కృతి ఇప్పుడప్పుడే మారవు. మాకెదురు గాలి కూడా వీచ సాహసించదు. సో – నన్నక్కడే పుట్టించండి. మగజన్మనే ప్రసాదించండి…”
”తథాస్తు. నీకు ఒక్కరోజు గడువిస్తున్నాను. భూమ్మీద కెళ్ళి ఎవరి గర్భాన జన్మించ దలచుకున్నదీ నువ్వే నిర్ణయించుకో”
”ఒక్కరోజు అక్కర్లేదు. ఒక్క క్షణం చాలు. టాటాలు బిర్లాలు అంబానీలు గాలిలు ఎందరెందరో వున్నారు. వారిలో ఒకర్ని చూజ్‌ చేసుకుంటా”
”చెప్పేను గా. ఒక్కరోజులో నిర్ణయించుకో. ఆలోగా ఎవరి గర్భం అన్నది నిర్ణయించుకోలేకపోతే నీకు మానవ జన్మ దక్కదు. క్షుద్ర భూతమో పిశాచమో ఐ గాలిలో వేలాడాల్సొస్తుంది. విపరీతమైన దాహంతో ఆకలితో అలమటించాల్సి వస్తుంది మరి…”
నవ్వేను. ఆయనో ‘పిచ్చిబ్రహ్మ’లా కన్పించాడు నా కళ్ళకి.
”మీకు తెలీదు మా జనం గురించి, మా దేశంలో మగబిడ్డకి ఎలాంటి వీరోచిత స్వాగత సత్కారాలు లభిస్తాయో చూసి తీరాల్సిందే. భూమ్మీద మరెక్కడా అంత విలువ లభించదంటే అతిశయోక్తి కాదు. పుత్రుడు పున్నామనరకం నుంచి తప్పిస్తాడు. తల కొరివి పెట్టి జన్మకి ధన్యత చేకూరుస్తాడు. పిండప్రదానం చేసి మూడు తరాల వారిని తరింపజేస్తాడు – అని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు తెలుసా?”
”అదంతా తెలుసుకోవాలని లేదు గాని నువ్వు మీ లెక్కప్రకారం కొన్నేళ్ళు యమలోకంలో గడిపిన సంగతి గుర్తుందనుకుంటాను…”
”అక్కడెన్నేళ్ళు వున్నానో తెలీదు గాని శిక్షలు బాగానే గుర్తున్నాయి. కట్టేసి కొట్టడం, నిప్పుల మీద నడిపించడం, కాగుతున్న నూనె మూకుళ్ళో చేతులు పెట్టించడం వగైరా పిచ్చిపిచ్చి శిక్షలు వేసేర్లే. మేం అంతకంటే పెద్ద శిక్షలు ఆడవారికి రోజువారీగా వేస్తాం అన్న సంగతి వాళ్ళకీ తెలీదు మీకూ తెలీదు” మీసం మెలేస్తూ ఫోజు కొట్టాను. మగజాతి కీర్తి పౌరుషాలు చాటే అవకాశం వస్తే తేలిగ్గా ఎలా వదుల్తాను?!
”నీకెందుకలాటి శిక్షలు వేశారో గ్రహించి పశ్చాత్తాప పడకపోవడం పునీతుడవ్వాలనుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది”
”పశ్చాత్తాపం అన్నమాట మా డిక్షనరీలోనే లేదు. పాపభీతి అసలే లేదు. ఇక శిక్ష భయం అస్సల్లేదు. మా దేశంలో చట్టాలెన్నోవున్నా అవన్నీ మా చుట్టాలై వూడిగం చేస్తాయి. ఒక ఉదాహరణ చెప్పనా? రుచిక అనే అమ్మాయిని ఓ పోలీసు పెద్దాయన లైంగికంగా వేధింపులకి గురి చేస్తే ఏవైందో తెలుసా?. ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది. ఆ పెద్దాయన రొమ్ము విరుచుకు తిరగటమే కాదు ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొట్టేసేడు. ఏడాదిన్నర సాధారణ జైలు శిక్ష విధించడానికి ఇరవై ఏళ్ళు పట్టింది. అపహరణలు, ర్యాగింగులు, ప్రేమవేధింపులు, అత్యాచారాలు, వరకట్న దహనాలు అతి మామూలు ఘటనలక్కడ!”
”ఏం చేసినా చెల్లుతుందనే ధీమా వల్ల నువ్వా గడ్డ మీదే మగాడిగానే జన్మించాలని కోరుకుంటున్నావన్నమాట”
”ఎగ్జాక్ట్లీ. ఆడదాన్ని అణచగల హక్కు అధికారం ఆ గడ్డ నాకిస్తుంది. నన్ను ప్రేమించనన్న ఇద్దరి అమ్మాయిల ముఖం మీద యాసిడ్‌ పోశాను. పోలీసులు కేసుకి మసి పూసేశారు. ఒకమ్మాయిని నేనూ మా ఫ్రెండ్సూ ఏదేదో చేశాం. మా దూరపు బంధువైన ఓ బుల్లి నాయకుడు చక్రం అడ్డువేశాడు. ఆఫీసులో నామీద అరిచిన ఒకావిడి ఇంటికెళ్ళి ఆమెకు ఎయిడ్స్‌ వుందని గోలచేశాం. ఆవిడ ఉరిపోసుకోగా ఆత్మహత్య అని ముద్రేయించాం. పార్టీలో ఒక ఉన్నతాధికారిణి పృష్ఠభాగం నున్నగా బావుందని సరదాగా చరిచాను. ఆవిడ గోలచేసినా నామీద ఈగ వాలలేదు. అందర్లో ఆవిడే పలచనైంది. నేను చచ్చే ముందు దాకా ఆ కేసు నడుస్తూనే వుంది. అవి కథలు కాదు పచ్చినిజాలు. ఇలాటివి ఎన్నైనా ఉదాహరించగలను.”
బ్రహ్మదేవుడు చెవులు మూసుకున్నాడు. భార్య వంకా నా వంకా మార్చి మార్చి చూసి, ”ఇక దయచెయ్‌, గడువు ఒక్కరోజే అని గుర్తుంచుకో” అంటూ నా నుదుట ఠపీమని ముద్ర కొట్టేసి గుమ్మం చూపించాడు.
‘నీ భయం నాకు తెలిసిందిలే’ అని నవ్వుకుని గుమ్మంలోంచి బయటికి నడిచాను. అమాంతం భూమిమీదికొచ్చి పడ్డాను.
‘పుణ్యభూమి నాదేశం నమో నమామి…’ అని హమ్‌ చేస్తూ ఫైవ్‌స్టార్‌ హాస్పిటల్‌ కెళ్ళాను.
గర్భం దాల్చాలని వచ్చిన ధనిక స్త్రీలకోసం అలవోకగా చూశాను. ఒక్కరూ కన్పించలేదు. కొడుకు పుట్టాలని ప్రార్థిస్తోన్న వారికోసం పరీక్షగా చూశాను. ఊహు. ఒక్కరంటే ఒక్కర్లేరు.
గర్భం ధరించాలని చెట్లకీ పుట్టలకీ రాయికీ రప్పకీ ప్రదక్షిణాలు చేసే ఆడజనమంతా ఏమైపోయారు?
ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఒక పెద్దాయన – నిస్తేజంగా వున్నవాడ్ని-కలిశాను.
”పిల్లల్ని కనకపోవడం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయిందా ఏవిటండీ? లేక బ్యూటీ కాన్షస్‌నెస్‌ అంతగా పెరిగిపోయిందా ఏవిటి కర్మ?”
”పిల్లల సంగతలా వుంచు. పెళ్ళికాక నేను అఘోరిస్తున్నాను. బ్రహ్మచారిగానే చస్తానేమోనని గుబులుగా వుంది.”
”మీకు పెళ్లి కాలేదా? ఒంటిమీద దాదాపు యాభైపైనే వుంటాయేమో?”
”ఏమో కాదు. ఉన్నాయి. యాభైరెండేళ్ళు. కాని అమ్మాయిలెక్కడా  దొరకట్లేదయ్యా. మొన్నటిదాకా పదిమందికి ఒక్కరైనా దొరికేవారు. ఇప్పుడదీ లేదు.”
”ఏవిటి ఆడ జనాభా అంత దారుణంగా పడిపోయిందా? నిజంగానే?!”
”ఇంకా నెమ్మదిగా అంటావేంటయ్యా. అంతరించిపోతున్న జాతి కిందవాళ్ళని లెక్క కట్టేస్తోంటేనూ!”
ముచ్చెమటలు పోస్తోంటే చిన్నగా కంపిస్తూ అడిగాను.
”మైగాడ్‌! పరిస్థితి మంత్రించినట్టుగా అలా ఎలా మారిపోయింది? నిన్న మొన్ననే చచ్చిపోయినట్టుగా వుంది నాకు. ఇంతలో ఇంత మార్పా?”
నావంక చిత్రంగా చూశాడు. నన్నో అమాయకుడిగా జమకట్టి జాలిగా చూశాడు.
”అప్పుడే కడుపులో పడ్డ ఆడశిశువు మొదలు అన్ని వయస్సుల ఆడవారినీ నానా కారణాలతో చంపుకుతిన్నాం కదా. ఇప్పుడను భవిస్తున్నాం!”
అయోమయంగా చూస్తూ అన్నాను. ”ఇప్పుడెలా? నేను అర్జంటుగా ఏదో ఒక గర్భంలో ప్రవేశించాలి. ఇంకొన్ని గంటల గడువే వుంది. లేకపోతే నా బతుకు ఘోరమైపోద్ది. నాకేదో దారిచూపి పుణ్యం కట్టుకోండి.”
”ఏదో సామెత చెప్పినట్టుంది. పెళ్లాట్టానికి ఆడది దొరకట్లేదని నేనేడుస్తోంటే ఇతగాడికి తల్లవ్వబోయే ఆడదాన్ని చూపించాల్ట – వెళ్ళెళ్ళవయ్యా…”
అతడు దులపరించుకు నెళ్ళిపోయాడు.
నేనలా వెళ్ళిపోలేనే? ఇంకొద్ది గంటల్లో…! ఊహించు కోవడానికే భయమేస్తోంది!
మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే కుదరదు. అర్జంటుగా ఒక స్త్రీని – గర్భం ధరించగల స్త్రీని – వెదికి పట్టుకోవాలి. తప్పదు గాక తప్పదు.
ప్రసూతి ఆసుపత్రుల మీదా పిల్లల ఆసుపత్రుల మీదా పడ్డాను. చిత్రాతిచిత్రం. అన్నీ మూతబడి వున్నాయి.
దేశంలో ఏం ఘోరం జరిగిందో ఏమో పిల్లలూ యువకులూ ఎక్కడా కానరావట్లేదు. ఎటుచూసినా ముసలి మగాళ్ళే. ఈసురోమంటూ వున్నారు. నీరసంగా వున్నారు. జవం జీవం లేనట్టుగా వున్నారు.
”ఏంటంతా అలా వున్నారేంటి? ఏవైంది మీకు?”
”ఎలా వున్నాం?”
”ప్రేమరాహిత్యంలో వేలాడు తున్నట్టు ఆశల ఆకులన్నీ రాలిపోయి నట్టు బతుకులోని పచ్చదనమంతా ఆవిరైపోయినట్టు….”
”అవునలాగే అయిపోయింది. ఆడదంటే ప్రేమ, ఆశ, పచ్చదనం, తీపి, తోడు, నీడ, ధైర్యం అని ఇప్పుడర్థమవుతోంది. ఏం జేస్తాం చేతులు కాలిపోయాయి. బ్రతికినన్నాళ్ళూ ఇలా బతుకుని ఈడ్చాల్సిందే…ఈడుస్తూ బ్రతకాల్సిందే”
గుండెలు గుభిల్లుమన్నాయి.
వర్తమానం తెలీక మగజన్మ కోరుకున్నాను. రేపు తన స్థితీ ఇలాగే వుండబోవట్లేదు కదా? ఛాఛా – అలా అవ్వనే అవ్వదు.
ఎడారిలో ఒయాసిస్సులా ఓ స్త్రీమూర్తి కన్పించింది. దయానిధిలా వుంది. వయస్సు మళ్ళినామె. అయినా ఆశతో పరుగునెళ్ళి ఆమె కాళ్ళ మీద పడ్డాను. నాకు బతుకునిమ్మని అర్థించాను. ఆమె కడుపున నలుసుగా పుట్టనిమ్మని ప్రార్థించాను.
నిరసనగా చూసింది. సృష్టిలోని అసహ్యాన్నంతా ముద్దగా చేసి నా మీద విసిరేస్తూ చూసింది.
”సారీ, పులి పులిని చంపదు. కాని మీ మగాడు ఆడదాన్ని చంపుకుతింటాడు. మీది రాక్షస జాతి. దానికి ఊపిరి పోయలేను…”
”తప్పైపోయింది. లెంపలేసుకుంటున్నాను. మగవాళ్ళందరి తరపునా క్షమాపణ వేడుకుంటున్నాను. రక్తాశ్రువులు రాలుస్తున్నాను…”
విరక్తిగా నవ్వింది. నా గొంతు తడారిపోయింది.
”పిచ్చివాడా! ఒక్కసారి కళ్ళు తెరచి చుట్టూ చూడు. అకాల వర్షాలు మండే ఎండలు కొత్తరోగాలు గతితప్పిన ఋతుపవనాలు పెరిగిన భూతాపం! మితిమీరిన స్వార్థంతో పర్యావరణాన్ని కలుషితం చేసినందున వచ్చిపడిన అనర్థమిది. ప్రకృతిని వికృతిని మార్చినందున సంభవించిన దారుణ పరిణామమిది! సరిగ్గా ఇలాగే ముందుచూపు లేని మీ మగజాతి ప్రకృతిని అంటే స్త్రీని అణచివేసింది. ఉక్కుపాదాలతో త్రొక్కేసింది. ఆడజాతి రెక్కలే కాదు శిరస్సులూ ఖండించింది. చూడు ఇప్పుడెలాటి పరిస్థితి వచ్చిందో. సమాజంలో ప్రకృతిలో సమతుల్యత నశించింది. అస్తవ్యస్త అసహజస్థితి ఏర్పడింది! స్త్రీ లేకపోతే మనిషి వుండడు. మనుగడ వుండదు. ప్రకృతే తల్లక్రిందులైపోతుంది! ప్రళయం విలయతాండవం చేస్తుంది!”
సత్యసాక్షాత్కారమైంది. పశ్చాతాపాగ్నిలో కాలిపోయాను. నువ్వూ నీవాళ్ళూ చేసిన విష కర్మల ఫలం అనుభవించండంటూ ఆమె వెళ్ళిపోతోంటే వెంటబడ్డాను. ప్రాధేయపడ్డాను. శక్తిస్వరూపిణిలా మారి మాడ్చేసేలా చూసింది. గుండె గుబగుబలాడింది. ఆగిపోక తప్పలేదు.
కాళ్ళ క్రింది భూమి దగా చేస్తున్నట్టుగా వుంది.
పిచ్చోడినై ఊళ్ళ మీద పడ్డాను. ఆశ చావక ప్రతి ఇంట్లో ప్రతి అంగుళం గాలించాను.
నేను జన్మించడానికి ఒక్కటంటే ఒక్క కడుపు దొరకలేదు.
ఎందరి కడుపుకోత కోశానో మరెందరి కడుపు మీద తన్నానో – లేకపోతే ఇదేమి శిక్ష? ఇదెక్కడి శిక్ష?
దుఃఖం వెల్లువెత్తింది. గుండెలు కీచుగా అరుస్తున్నాయి. బాధ సుళ్లు తిరుగుతోంది.
గంటలు నిమిషాలుగా కరిగిపోయాయి. నిమిషాలు క్షణాలైపోతున్నాయి… మైగాడ్‌!… ఎలా? ఇప్పుడెలా?
పిచ్చిగా తిరిగాను. ఏడుస్తూ తిరిగాను. అర్థిస్తూ తిరిగాను. బ్రతుక్కోసం పోరాటం. జన్మించడానికి ఆరాటం… ఆవేదన…!
అంతకంతకూ ఊపిరి పీల్చడం కష్టమవుతోంది. సృష్టి ద్వారాలన్నీ ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ప్రకృతి ధర్మం అధర్మ రూపం దాల్చుతోంది. ప్రళయానికిది సంకేతం కాదు కదా?
ప్రళయం వస్తే? సృష్టి ఆగిపోతే… మానవాళి ఏం కావాలి? నేను… నేనేమైపోవాలి?
గాలినై దెయ్యాన్నై, భూతాన్నై, పిశాచాన్నై…వద్దొద్దు… ఆ నరకయాతనొద్దు… లెంపలేసుకుంటున్నాను. కసిదీరా వాయించు కుంటున్నాను… తప్పు… ఘోరతప్పిదం చేశాం. మగాళ్లమని భేషజం ప్రదర్శించాం. అహంకారంతో విర్రవీగాం. అకృత్యాలకు పాల్పడ్డాం. అమానుషకాండకు తెరతీశాం. ఇంకెప్పుడూ అలా ప్రవర్తించం. ఆడమగ మధ్య ఎక్కువతక్కువల్లేవు. యజమాని బానిసల్లేరు. ఇద్దరూ సమానమే. అన్నిటా సమభాగస్తులే. ప్రకృతి పురుషు లిద్దరూ రెండు అర్థానుస్వారాలే. నాకు జ్ఞానోదయమయ్యింది. అగ్నిపునీతుడ్న య్యాను…. అభిషిక్తుడ్నయ్యాను….
‘అమ్మా! కనికరించడమ్మా! నాకు మీ కడుపులో కాస్తంత చోటివ్వండి. భద్రంగా ఎదగనివ్వండి. మీ పాలు త్రాగి పెరగనివ్వండి. మీ ముద్దు మురిపాలతో ఎదగనివ్వండి. మీ మాటల పాటల పాఠాలతో మనిషినవ్వనీండి. అపరబ్రహ్మలైన మీ మీద – కాదు కాదు సాక్షాత్తు సృష్టికర్తలైన మీ మీద ఒట్టేసి చెబుతున్నా. ఇక మగాడినని మీసం మెలెయ్యను. నిలబడ్డ నేలని తన్నను. పాలిచ్చిన రొమ్ముని గుద్దను. బ్రతుకిచ్చిన భార్యని అవమానించను. ప్రతిస్త్రీలోనూ అమ్మనే చూస్తాను. ఆరాధిస్తాను. రెండుచేతులడ్డుపెట్టి ఆడజాతిని కాపాడతాను. మగ ఆడ అంతా సమానమేనని ఎలుగెత్తి చాటుతాను. ప్లీజ్‌… ప్లీజ్‌… నాకో ఛాన్స్‌ ఇవ్వండి… ఒకే ఒక్క అవకాశం. లేకపోతే అనాథప్రేతాన్నై పోతాను. అనుక్షణం ఏడుస్తూ ఆకలితో అరుస్తూ గాలిలో వ్రేలాడుతూ… వద్దొద్దు. ఆ నరకం నాకొద్దు… నాకు జన్మ భిక్ష పెట్టు తల్లీ! జన్మదాతా కరుణించు! భవతీ భిక్షాందేహి! సృష్టికర్తా పాహిమాం పాహిమాం!….’

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.