హిమజ
అసలైతే అరగంటలో
సర్దుకోవచ్చు ఈ అలమరని
హృదయపు అరలు కూడా
కొన్నున్నాయి
అందుకే ఇంతాలస్యం
మెత్తని నూలు చీరలు
రెపరెపల ఆర్గంజాలు
బుసబుసల ప్యూర్ సిల్కులు
చుట్టుకు పొయ్యే చందేరీలు
వేటికవే పొందిగ్గా పెట్టాలనుకుంటాను
పోటీల్లో గెలుచుకున్న పుస్తకాలు
తొలివలపు తొలకరిలో
కాన్కగా వచ్చిన ఎంకిపాటలు
మలిమలుపున హృదయంకితమైన రెండక్షరాలు
ఒక్క సంతకంతోనే నిండిపోయిన ఆటోగ్రాఫ్ పుస్తకం
బతుకంతా నిట్రాడై నిలబెట్టిన నెచ్చెలి స్నేహాకాంక్షలు
ఉత్తరాలు ఊహాజగత్తులు
ప్రత్యుత్తరాలు పదబంధాలు
ప్రణయపుప్పొడి గంధాలు
హృదయంలో ముంచి రాసినవేమో
దేన్నీ తీసేయాలనిపించదు
ఈ అలమరలో మరకలూ కొన్ని
బరువెక్కి బద్దలైన క్షణాలు
కొన్ని కన్నీటి కణాలు
కారుమబ్బు దొంతరలు
పదిలపరచిన పలు దు:ఖనిధులు
ఇన్ని గదుల ఇంటిలో
అలలై పొంగే అనుభూతుల
అలమర ఒకటే నా హృదయం
ఎప్పుడో తప్ప తెరవని ఈ అలమరని
సర్దకుండా అలా వదిలేయొచ్చేమో గానీ
తెరిచి మూసిన ప్రతిసారీ
నన్ను నేను సంభాళించుకోవాల్సిందే!
జీవితపు అంచులు అనంతంలోకి విస్తృతమయ్యేవేళ
జాలిగా బేలగా బోలుగా
నిలబడి పోకుండా నన్ను నేను సర్దుకోవాల్సిందే!
ఆకురాయి ఊతకఱ్ఱ
వై. శ్రీరంగనాయకి
ఒకానొక కాలంలో
విశేషణాల్లేని ఇంటిదీపాలు
అతనికి అరవైలో
ఆమెకు పదారు రాకుండానే
చిలకాగోరింకల్ని చూడమంటూ ముసలిమెదళ్ళు
సిగ్గులేకుండా సిద్ధమయ్యేది పందిరిమంచం!
ఘోరకలిలో బుగ్గిపాలైన లేత జీవితం
ఏం జరుగుతుందో ఎరుకలోకి రాకుండానే
అతడు పుటుక్కుమనేవాడు
ఆమె నిప్పులమీదికెక్కించే నీతిని సిద్ధం చేస్తూ!
పూలను దగ్ధం చేయగల పాషాణాల చెరలో
అతడు మహానుభావుడు, మర్యాదాపురుషోత్తముడు
ఆమె వస్తువు, లోహం!
కళంకాలు జారుడుబండలమీద ఎంతసేపునుంచుంటాయి?
కొన్నాళ్ళకు కొందరు పుట్టారు
వలయాల్లో ఇరుక్కుపోయిన వనితల్ని చూశారు
ఆమె శక్తిని లోకందాచింది, ఆమె శక్తిని ఆమే కనుగొంది
కన్నీటి ప్రవాహాన్ని కాల్చేసి పలకాబలపం పట్టింది
అక్షర పూతోటలోని ఆలోచనలకు హృదయాన్నిచ్చింది
ఆమె కలలు తొలిచూలులోనే నింగినేలను మూద్దాడాయి
అస్తిత్వానికి ఆధారం అక్షరం, స్వేచ్ఛ, శ్రమ
అలా… ఆమె
తాను మొత్తంగా తాళ్ళపాక పదకవితై
అదుగదుగో అటుగా ఆకాశంలోకి
ఇదిగిదుగో ఇటుగా సముద్రంలోకి
సమస్యల్లోకి, సంతాపాల్లోకి
సమున్నత శిఖరమై పరిష్కారాలిస్తోంది!
అన్ని పదవుల్నీ అమ్ములపొదిలో వేసుకుని
సానబెట్టిన సంతోషమై సాగుతున్న ఆమెను
నీతో సమమైనదాన్ని… తనలో సగమైనవాడివి
పలుకారా ప్రశంసించడానికి తటపటాయింపెందుకు?
గర్భగుడిలో అమ్మవారిని అర్చిస్తావు
గబగబా చెట్టేక్కే ఉడుతను ఆరాధిస్తావు
నిండా మట్టిసద్దును నిరంతరం కాపాడుకుంటూ
ఎదిగెదిగిపోతున్న ఆమెను మాటారా మెచ్చుకోవడానికి కినుకెందుకు?
ఒక్కమారు మెచ్చుకొనిచూడు
ఏడేడులోకాలు దాటే ఎత్తుకెదుగుతున్నా..
ఆమె
నిలువెల్లా నిన్ను ప్రేమించే అమాయికే
నీ సాంగత్యానికి మురిసిపోయే అల్పురాలే
తాదాత్మ్యంలో లోదీపం వెలిగించుకునే తాత్త్వికే
తన జీవితానికి ఉడుకుమోత్తనమూ నువ్వే! ఊతకఱ్ఱానువ్వే!
నీ జీవితానికి ఆకురాయీ ఆమే! అలంకారమూ ఆమే!!
అయినంపూడి శ్రీలక్ష్మి
మంచంలో మబ్బుతునక
చంద్రుని మింగిన రాహువులా
బాధని దిగమింగిన ముఖం
నీళ్ళను బళ్ళున కక్కుకున్న మేఘంగా
తలగడ పొట్టలో తల దూర్చుకుని దుఃఖాన్ని దింపుకుంటుంది
ఎన్నాళ్ళ అనుబంధం తలగడతో
ఎన్నేళ్ళ పోగుబంధం ఈ దిండు గుండెతో నాకు
గుబులు గుబులుగా దిగులు భూతం
భయపెట్టినప్పుడల్లా
ఒంటరి తనపు ఒంటికొమ్ము రాక్షసి
నోరు తెరిచినప్పుడల్లా-
ఈ తలగడే విస్తరించి
నన్ను తనలోకి లాక్కుంటుంది.
పత్తినుండి దారపు పోగు తీసినట్లుగా
ధారలు ధారలుగా జాలువారే కన్నీటి చినుకులు
ఉప్పెనగా ఉరికి దిండును ముంచేస్తాయి.
విచ్చుకున్న పత్తిపూలను చూసి గుండె విప్పార్చుకుని
కోసి కూర్చి తలగడగా మార్చిన వేళ
ఇసుకలో పిచ్చుక గూడు కట్టుకున్నంత సంబరం
కల్లమే కాష్ఠంగా ఎన్ని చావులు
చూసి చెదిరిపోయిందో
తెల్లని రూపం నీరుకారెక్కింది.
రేగడి మట్టిలో ఎన్నాళ్ళు ఒదిగిందో
మంచి తనపు మట్టి వాసనింకా వీడిపోలేదు
మనసు మయూరంలా నర్తించే వేళ
నాతో ఊసులు పంచుకుంటూ
నా అద్దాల చెక్కిలిని కొనుగోట మీటే
చెలికాడవుతుంది.
కల్లోలపు కడలిగా బతుకుతున్నప్పుడు
సహనపు చెలియలికట్టను
దాటనివ్వని మిత్రుడవుతుంది.
వెల్లకిలా తిరిగితే ఆదిశేషువయి
గొడుగుపట్టే తలగడ
బోర్లా పడ్డప్పుడు లాలించే
మమతల మాగాణవుతుంది
గిల్లి కజ్జాలతో వేరయిన జంటను
ఒకటిగా చేసే వలపువిడ్డూరమవుతుంది.
బోగిలెక్కి ఎన్ని ఊర్లెళ్ళినా
బాణి మార్చి బోణీలెన్ని చూపినా
గరుకు నేలమీద విసిరేసినా
పట్టుపరుపుల ఒడి చేర్చినా
ఆర్తిగా చేతులు చాచే ఆత్మీయతవుతుంది.
తల్లిలేని గడపలకే కాదు
పెద్ద తలకాయలే లేని ఆకారాలకు
తలగడలే తల్లులై
ప్రపంచపటంలో కన్పించని ప్రేమ సముద్రపు ప్రతిబింబమవుతుంది
మంచం మీద మొలిచే మెత్తని మబ్బు తునకవుతుంది.
రెప్పల మీద నిద్దుర ముద్దుపెట్టే
తియ్యని జ్ఞాపకమవుతుంది.