‘ఉరుమి’ ఎందుకు చూడాలి?

జొన్నవిత్తుల
భారతదేశమునకు సముద్రమార్గమును కనుగొన్న పోర్చుగీసు నావికుడెవరు? లాంటి ప్రశ్నలు మన చరిత్ర పాఠాల్లో కనిపిస్తాయి. దానికి జవాబుగా ”వాస్కోడిగామా”లాంటి సమాధానాలు కనిపిస్తాయి. కాబట్టి యూరోపియన్లు, యూరప్‌ చరిత్రంటే ”ప్రపంచచరిత్ర” అని మోర విరుచుకుని తిరుగు తుంటారు.
మనం ఎంతమాత్రం సిగ్గులేకుండా ”వాళ్ళే లేకపోతే మనకి అభివృద్ధంటేనే తెలియదు. మనం ఈ రోజు ఇలా జీవించగలుగుతున్నామంటే దానిక్కారణం ఆ యూరోపియన్లే అనే భ్రమల్లో పిల్లిగెడ్డాలూ సైకీలూ, ఫోర్డులూ వేసుకుని మురిసిపోతుంటాం. కాబట్టి మనకి బుస్సీని ఎదిరించి పోరాడిన వీరుడెవరు? లాంటి ప్రశ్నలూ ఉండవు!” తాండ్ర పాపారాయుడులాంటి జవాబులూ ఉండవు. (ఇలాంటివాళ్ళకి పోర్చుగీసుల్ని తెలుగువాళ్ళు బుడతకీచులనేవారని ఏం తెలుస్తుంది.)
అందుకే ”ఉరుమి” సినిమా చూసి బయటకు రాగానే నాకు సినిమా చూసిన అనుభూతి కంటే పరాయీకరణలో పడి తమ ఉనికిని కోల్పోతున్న భారతీయులందరూ మదిలో మెదిలి కళ్ళలో రెండు కన్నీటి చుక్కలు నిలిచాయి. సంతోష్‌ శివన్‌ ఈ సినిమాలో మనకి చెప్పిన కథ ఇదే. మన్ని మనం కోల్పోకూడదు. ఎవరైతే తన అస్తిత్వాన్ని తాకట్టు పెడతాడో వాడికి ఏదో ఒకనాడు సమాజానికి జవాబు చెప్పక తప్పదు. ఆ జవాబుదారితనం లేకపోతే ఏదో ఒకరోజు ఎవరో ఒకరిచేత ఏదో ఒక విధంగా చెప్పుదెబ్బలు తినక తప్పదు.
ఇంతవరకు ఈ ఉరిమి తప్ప ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక సినిమా కూడా రాలేదు. సినిమా ఒక ప్రభావయుతమైన మాధ్యమం అని అందరూ కబుర్లు చెప్పేవాళ్ళు తప్ప దాన్ని ప్రభావయుతంగా ప్రయోగించిన కళాకారులు మన భారతదేశంలో చాలా తక్కువ. హిందీ తెలుగు సినిమాలైతే పక్కా పెట్టుబడిగా మారిపోయి కూరగాయల వ్యాపారంతో కూడా పోల్చలేనంతగా కుళ్ళిపోయాయి.
ఈ కథని అల్లడంలో సంతోష్‌ శివన్‌ చూపించిన నైపుణ్యం అపూర్వం. రచయితని కాగితంమీద దర్శకుడనీ, దర్శకుణ్ణి వెండితెరమీద రచయిత అనీ ఎందుకంటారో దీన్ని చూస్తే అర్థమౌతుంది. సినిమాని కళగా ఆరాధించే ప్రతి ఒక్కరూ దీన్ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే కథ, చిత్రకథ, దర్శకత్వం – ఈ మూడు ప్రతిభలనీ పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం ఎలాగో అర్థమౌతుంది.
మంచి సినిమా కథంటే కేవలం ఒకే ఒక్క వాక్యంలో చెప్పడానికి అనువుగా వుండాలనేది ప్రాథమిక సూత్రం. ఈ సినిమా కథ గతాన్నించీ వర్తమానాన్ని పిండుకుని భవిష్యత్తుని వండుకోవడమే సామాజిక బాధ్యత. ఎంత అద్భుతమైన వాస్తవికత నిండిన జీవిత సత్యమిది? దీన్ని ఎంత చక్కగా ఆవిష్కరించాడు? ఆ ఆవిష్కరణకి ఆయన ఎంచుకున్న కథానేపథ్యం ఎంత సమంజసంగా వుంది? దానిలో ఎంతటి దార్శనికత దాగివుంది?
భవితవ్యాన్ని దర్శించగలగడం కళాకారుని ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతని సంతోష్‌ శివన్‌ ఎంత బాధ్యతాయుతంగా నిర్వర్తించారో ఈ సినిమాని చూస్తే అర్థమౌతుంది. ఉరిమి అనేది ఒక ఆయుధం. ”అన్నాహజారే అనే ఒక ఆయుధం ఈనాటి సమాజాన్ని సరిదిద్దడానికి అవసరం అవుతుందని ప్రపంచీకరణ అనంతర పరిస్థితుల్ని నిశితంగా పరిశీలిస్తున్న దర్శకుడికి అర్థం కావడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దీన్నే జనరంజకంగా చెప్పడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు.
అంత చక్కని శాంతి సందేశాన్నివ్వడానికి ఇంత రక్తపాతాన్ని చూపించడం అవసరమా అనేది అసలు ప్రశ్న. గౌతమబుద్ధుడు, గాంధీమహాత్ముడు, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, అన్నాహజారేలు హఠాత్తుగా పుట్టుకురాలేదు. ఒకానొక సామాజిక సందర్భం వాళ్ళని నాయకులుగా అవతరించేలా చేసింది. ఆయా సామాజిక సందర్భాలన్నిటి వెనుకా ఉన్నది హింసే. అది భౌతికం కావచ్చు, లేదా మానసికం కావచ్చు. హింస…హింసే…! అందులోనూ చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూస్తే కనబడేది పూర్తిగా రక్తపాతమే. చరిత్రలు రాసుకునే మేధావులు కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే చూస్తారు. చూపిస్తారు. ఆ రెండోవైపున ఎంత కుత్సితం దాగివుందో ఎన్ని కుషకాలు నక్కివున్నాయో చూపించే ప్రయత్నం చెయ్యడం కళాకారుడి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి రక్తపాతమే ఉరిమి. అందుకే యుద్ధాలని చూపించినా ఇందులో మన వ్యాపార సినిమాల్లా రక్తపాతాన్ని వైభవీకరించడం జరగలేదు.
దీన్ని మనం ఎందుకు చూడాలంటే…
మనం కోల్పోతున్న అస్తిత్వాన్ని గురించి ఒక్క క్షణం అయినా నిలబడి ఆలోచించుకోవడం కోసం చూడాలి. సెజ్‌ల పేరిట బంగారం పండే భూముల్ని రసాయనాలతో విషతుల్యం చెయ్యకుండా కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి తెలుసుకోవడం కోసం చూడాలి.
తరతరాల సంస్కృతీ సాంప్రదాయాలు, వాటిని నిలబెట్టు కోవడం ద్వారా విలసిల్లే వైవిధ్యాన్ని కొనసాగేలా చేసుకోవడం ఎలాగో తెలుసుకోవడంకోసం చూడాలి.
మనిషి మౌలిక లక్షణాలయిన స్పందనలని కోల్పోకుండా వుండడంకోసం చూడాలి.
అటవిక దశనించీ మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగి ఎంత నాగరీకుడైనా అడవుల్ని రక్షించుకోకపోతే ఎలా నాశనమైపోతాడో తెలుసుకోవడం కోసం చూడాలి.
రాజకీయం ముదిరి నాగరికతనే ముంచేసేంత ప్రమాదకరంగా మారితే ఆ నాగరీకులు ఆటవికుల చేతుల్లోనే ఎలా చెప్పుదెబ్బలు తినాల్సి వస్తుందో తెలుసుకోవడం కోసమైనా చూడాలి.
మనిషి గుండెలోని తడిని తెరమీద ఎలా ఆవిష్కరించవచ్చో చూడటానికైనా మనం ఈ సినిమాని తప్పకుండా చూడాలి.
– ‘నవతరంగం’ బ్లాగ్‌  సౌజన్యంతో

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

One Response to ‘ఉరుమి’ ఎందుకు చూడాలి?

  1. పుల్లా రావు says:

    ఈ సమీక్ష, ఒక సినిమా సమీక్షలా కాకుండా ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికిల్ లా వుంది. సినిమా కథకి సంబంధించిన పాఠ్యాంశం అనుకోవచ్చు. ఈ సినిమాని చూసినప్పుడు అందులో ఇంత లోతు వుందని ఊహించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.