మీ చిన్నారికి శత్రుస్పర్శ గుర్తుపట్టడం తెలుసా..?

కొండేపూడి నిర్మల
మీకు మీ పిల్లలంటే ఇష్టం… పిల్లలకి చాక్లెట్స్‌ అంటే ఇష్టం.
చాక్లెట్‌ అంటే పాలు చక్కెర, కోక్‌ లాంటి దినుసులే కాదు కదా, అందులో మీ ప్రేమ కూడా కలుస్తుంది, కాబట్టి తియ్య…గా రోజంతా చప్పరిస్తారు. పళ్ళు పాడయిపోతాయని చెప్పినా సరే వినరు. చెప్పినమాట వినకపోవడమూ, అదే కావాలని మారాం చేయడమూ వీటిపట్లా మనకి బోలెడంత మురిపెం వుంటుంది. కాదంటారా…? పెద్దయిపోయాక దేనికోసమూ ఇంక మారాం చేసే చాన్సు వుండదు కదా…
పెంకితనం బాల్యానందానికి చిహ్నం.
మీ పిల్లల బాల్యం ఎలా వుంది? వాళ్ళు ఎప్పుడూ మీరు ఇచ్చిన తియ్యటి చాక్లెట్లే తింటున్నారా…? తెలియకుండా ఇంకెవరైనా చేదు చాక్లెట్లు పెడుతున్నారా…? ఈ మాట అడగ్గానే మీకు ఏమి గుర్తు వచ్చిందో నాకు తెలుసు. పిల్లల్ని ఎత్తుకుపోయి, వాళ్ల చెవులకున్న లోలకులు తెంచుకుంటూన్న వాళ్ల గురించి నేను మాట్లాడ్డం లేదు. అవి చాలా పాత కబుర్లు. లోలకులు, బొమ్మలు, రిబ్బన్లు కావలసినన్ని మీ పిల్లల వొళ్ళోనే కుమ్మరించి కథలు, కబుర్లు చెబుతున్నట్టు నటిస్తూ ఆ పసి శరీరాలమీద దాడిచేసి ఆ తర్వాత ”ఎవరికీ చెప్పొద్ద”ని బెదిరించే అంకుల్స్‌, డ్రిల్లు మాస్టార్లు, వగయిరా వగయిరా గురించి… ఆలోచించమంటున్నాను.
ముక్కు పచ్చలారని పసిపిల్లల మీద జరుగుతున్న దుర్మార్గపు దండయాత్రల గురించి మీకూ ఆగ్రహమే వుండి వుంటుంది. ఇవాళ్టి రోజున ఇటువంటి వార్తలేని దినపత్రిక లేదంటే అతిశయోక్తి లేదు. గౌతమబుద్ధుడు పుట్టిన ఈ నేలమీదే నేను ఈ వాక్యం రాస్తున్న నిమిషంలో కూడా కొందరు పసిపాపలు శత్రుస్పర్శతో నిస్సహాయంగా రోదిస్తూ వుండచ్చు.
2007లో అచ్చయిన సంచలన కెరటం పేరు ”బిట్టర్‌ చాక్లెట్‌” నవల. పింకీ విరానీ అనే రచయిత్రి తన బాల్యంలో ఎదురయిన చేదు అనుభవంతో మొదలుపెట్టి అనేకమంది పసిపిల్లల పీడకలల్ని రికార్డు చేసిన నవల అది. 500 పేజీలున్న ఈ బరువైన నవల్లో వున్నవి అక్షరాలు కాదు పాలబుగ్గలమీంచి జాలువారిన కన్నీళ్ళు… అది చదివి ఎంతమంది ఉలిక్కిపడ్డారంటే, ”అయ్యో నాకూ ఇలాగే జరిగింది అని కొందరు, నేనూ ఈ తప్పే చేశాను అని కొందరూ మారుపేర్లతో తమ కన్సెషన్‌ను పత్రికలకి తెలియజేశారు. కనీసం తమ అంతరాత్మకు అయినా దొరికిపోయారు.
కానీ నేరాలు చేసే దొరల సంగతి ఏమిటి…? వీరి గురించి ఫిర్యాదు చేసే సమర్థత ఆ చిన్నారి చిట్టి తల్లులకి వుందా…? వీరి తరఫున ఎవరు వాదిస్తారు లాంటివి అంతులేని ప్రశ్నలు… ప్రతి వందమంది బాలబాలికల్లో కనీసం అరవైమంది అయినా తమ జీవితంలో ఎప్పుడో అప్పుడు అత్యాచారంతో సమానమైన వేదనకి గురయ్యారని రిపోర్టులు చెబుతున్నాయి. ఇప్పుడు మనం ఒకసారి మన బాల్యంలోకి తొంగి చూసుకుందాం… మన బంధువుల్లోనే, స్నేహితుల్లోనే మనకు నచ్చని ధోరణి ప్రదర్శించేవాళ్లెంతమంది వున్నారు. ఎక్స్‌రే కళ్లతో చూసేవాళ్ళు, ఏదో వంకతో భుజం తట్టేవాళ్ళు, పిచ్చి చలోక్తులు విసిరి పగలబడి నవ్వేవాళ్ళు, అవకాశం కోసమే ఎదురుచూస్తున్నవాళ్ళు… ఏం చెయ్యగలిగాం వాళ్లని…?
…తప్పించుకు తిరుగుతామే గాని ఈడ్చిపెట్టి కొట్టామా ఎవరినైనా, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావురా ఒరే అని చొక్కా పట్టుకుని అడిగామా…? అలా చేస్తే మొత్తం మనకున్న మానవసంబంధాలన్నీ గంగలో కలిసిపోతాయని భయం కదూ… అవును మన భయమే నేరస్థుడి బలం. అఘాయిత్యాలు బైట ఎక్కడో తెలియని పరిసరాల మధ్య, మనుషుల మధ్య జరుగుతుందనుకుంటే అది అమాయకత్వమే అవుతుంది. మన సొంత ఇంట్లోనే, నమ్మకంగా నిద్రపోయేచోటో, అ ఆ లు రాసుకున్న నల్లబల్ల సాక్షిగానో కూడా జరుగుతున్నాయి. కొన్నిసార్లు కన్న తండ్రులు, అన్నదమ్ములు కూడా ఈ నీచానికి ఒడిగడుతున్నారు.
1995లో నేను సుప్రభాతంలో పనిచేస్తున్నప్పుడు గుంటూరు జిల్లా ముప్పాళ మండలం పలుదేవర్లపాడు గ్రామంలో ఇరవైఏడు మంది స్కూలు విద్యార్థినులు సాక్షాత్తూ హెడ్‌మాస్టర్‌ చేతిలోనే అత్యాచారానికి గురయ్యారనే వార్త మా జిల్లా రిపోర్టర్లు పంపారు. నిజానికి మేమది నమ్మలేదు, అది అచ్చు వెయ్యడంవల్ల అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటామేమో అని కూడా ఆలోచించిన మాట వాస్తవం. కానీ ఎందుకైనా మంచిదని మా టీంలో కొందరు అక్కడి పిల్లల్ని చూడ్డానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన వివరాలు విని కళ్ళు తిరిగాయి… ఇటువంటి వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా ఇది పాశ్చాత్య దేశాల ప్రభావమనో, సినిమా సంస్కృతి అనో ఓ సమర్ధింపుఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. కానీ ఆ నేరం జరిగిన ప్రదేశం ఇలాంటి ప్రభావాలన్నిటికీ దూరంగా వున్న ఒక ప్రశాంతమైన పల్లెపట్టు. అప్పటికి అక్కడ ఒక సినిమా హాలయినా లేదు. నేరస్తుడు పిల్లలకి కన్నతండ్రిలాగా విద్యాబుద్ధులు నేర్పాలని ఏభైరెండేళ్ల పెద్దమనిషి, మంచివాడు, నెమ్మదస్తుడు అని పేరు తెచ్చుకున్నవాడు. కాగా నవంబరు ఒకటవ తేదీన ఇద్దరు స్కూలు పిల్లలు తీవ్రమైన రక్తస్రావంతో నడవలేక నడవలేక వొంటినిండా గాయాలతో ఇంటికి చేరుకున్నారు, ఎంత అడిగినా తల్లిదండ్రులకి చెప్పలేదు… ఎవరితో అయినా చెబితే చంపేస్తానని బెదిరించిన సార్‌ గొంతు వాళ్ళు మర్చిపోలేరు… ఆటల్లో కిందపడ్డామని అందుకే గాయాలయ్యాయని చెప్పారు. అనుమానం తోచిన తల్లిదండ్రులు బుజ్జగించి అడిగేసరికి బావురుమన్నారు. ఒకటి నుంచి అయిదవ తరగతి దాకా వున్న అరవైఆరుమంది బాలికల్లో అత్యధికులు అత్యాచారానికి గురయ్యారనే వార్త నాగరిక ప్రపంచాన్ని తల్లకిందులు చేసింది. వ్యక్తిగతంగా అతని కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న కొందరు కాదని వారించినప్పటికీ వైద్యపరీక్షల్లో తేలిన నిజాలు చూసి నోరెత్తలేదు. సంఘటన ఎలా జరిగిందన్న ప్రశ్నకు పిల్లలందరూ మూకుమ్మడిగా ఒకే జవాబు చెప్పారు.
స్కూలు వదిలిపెట్టే సమయానికి నలుగురు పిల్లల్ని ఎంపిక చేసుకుని ”కథలు చెప్పుకుందాం” అనే సాకుతో వుండిపొమ్మనేవాడట. ఇద్దరిని మూసిన కిటికీల దగ్గర, ఒకరిని గుమ్మం దగ్గరా కాపలాపెట్టి మిగిలిన బాలికపై అఘాయిత్యం చేసేవాడు. ఈ తతంగం ప్రతిరోజూ జరిగేదని ఆ బాలికలే  చెప్పారు. ఇంత జరుగుతున్నా బైటికి పొక్కలేదంటే అతడు ఆ పిల్లల్ని ఎంతగా భయపెట్టాడో మనమే ఊహించాలి. అత్యాచారానికి గురయినవారిలో అత్యధికులు దళితులు, పేదలు, వైద్యపరీక్షకు కూడా ఆర్థికస్థోమత లేనివారే అవడం విచిత్రం కాదు… చాలా కేసుల్లానే అది కూడా బుట్టదాఖలు అయిందో, శిక్ష పడిందో నాకిప్పుడు తెలీదు. ఇప్పుడా పిల్లలందరూ పాతికేళ్ళు దాటిన తల్లులయి వుండచ్చు. బాల్యం ఒక పీడకలగా, చదువొక పీడనగా మార్చిన ఆ మనిషిని వాళ్ళెన్ని శాపాలు పెడుతున్నారో ఏమో…
చిన్నపిల్లల మీద ఈ విధమైన నేరాలకు పాల్పడే మానసిక స్థితిని పీడోఫీలియా అంటారు. కొందరు నిజంగానే తీవ్రమైన వ్యక్తిత్వ వైపరీత్యంతో వుండచ్చు. కానీ ఎక్కువమంది ఈ వంకతో శిక్ష తప్పించుకోవాలని చూస్తారు.
మన పిల్లల్ని ఇలాంటివారినుంచి కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి…? పాలనీ నీళ్లని వేరుచూసి చూడగల నీర క్షీర న్యాయం నేర్పాలి. నీరమూ, క్షీరమూ అంటే ఏమిటి…?
మంచి స్పర్శ, చెడ్డ స్పర్శ లాంటివి గుర్తుపట్టడం ఎలాగో చెప్పాలి. నిజానికి అయిదేళ్ళుదాటిన పిల్లలు కూడా ఇది గుర్తుపట్టగలుగుతారు. ఎటొచ్చీ వ్యక్తీకరణ వుండకపోవడంతో వారి మనసులో ఏముందో మనకి తెలీదు.
స్పర్శ మనిషి ఉద్దేశ్యాన్ని తెలియజేస్తుంది. కరచాలనం చేసినప్పుడు, తల నిమిరినప్పుడు రాని ఇబ్బంది వీపు గోకినప్పుడు, నడుంమీద చెయ్యి వేసినప్పుడు ఎందుకు వస్తుందో పిల్లలకి చెప్పాలి. చేతులు, పాదాలు తల ముట్టుకున్నప్పుడు రాని అయిష్టత చాతీ, పొట్టలాంటి గోప్య శరీరభాగాల్ని ముట్టుకున్నప్పుడు వస్తుంది. దాన్ని వ్యతిరేకించమని చెప్పాలి. భద్రతతో కూడిన స్పర్శ సంతోషాన్ని ఇస్తుంది. మృదువుగా వుంటుంది.
అభద్రతతో కూడుకున్న స్పర్శ నొప్పిని, విచారాన్ని, భయాన్ని కలిగిస్తుంది. ఎవరైనా గాని ”మీ ఇంట్లో ఎప్పుడూ చెప్పొద్దు” అంటే అది మానవ హక్కుకి భంగం కలిగించే నేరమని అర్థం చేయించాలి.
ప్రతి మనిషికి కొంత వ్యక్తిగత ఎరీనా వుంటుంది. బ్రీతింగ్‌ స్పేస్‌ అంటాం కదా… ఆరడుగుల దూరాన్నించి ఎవరైనా మాట్లాడుతుంటే శబ్దాలు మాత్రమే వినబడతాయి. శబ్దాల్ని అర్థాలుగా మార్చుకునే ప్రయత్నంలో హావభావాల గమనిక కూడా అవసరమవుతుంది కాబట్టి కొంచెం దగ్గరికి వెళ్లి గాని, చెవులు రిక్కించి గాని వినాలనుకుంటాం. కానీ అపరిచిత వ్యక్తి అయిదు అంగుళాల కంటె దగ్గరికి జరిగేసరికి పిల్లలకి అసౌకర్యం మొదలవుతుంది. తెలియకుండానే ముడుచుకుపోతారు. అది అసంకల్పిత ప్రతీకార చర్య. తెరిచి వున్న కంటిలోకి దుమ్ము ఏదయినా పడబోతుంటే రెప్పలు వాలతాయి చూశారా అలాంటిదే. ఉద్దేశ్యపూర్వకంగా అటువంటి అసౌకర్యం స్కూలులో పునరావృతం అవుతుంటే స్కూలు మానేస్తారు. ఇంట్లోనే పునరావృతం అవుతుంటే తలుపులు వేసుకుని ఒంటరిగా వుండిపోతారు. నిద్రలో మూత్రవిసర్జన, వేలు చీకడం అంతకు ముందు లేకపోయినా గాని ఇప్పుడు కొత్తగా మొదలుపెడతారు. ఆగ్రహంగా, దుఃఖంగా వుంటారు. ఎదుగుతున్న తన శరీరాన్ని తామే ద్వేషిస్తారు. ఈ శరీరం మూలంగానే ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయి కదా అనుకునే ఆత్మన్యూనతకు గురవుతారు. కిటకిటలాడే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఊపిరాడని మాట నిజమే అయినా అది వత్తిడికి సంబంధించిన సమస్యే తప్ప హింస ఏమీ వుండదు. పని కట్టుకుని వెర్రివేషాలు వేస్తేనే అది హింస అవుతుంది. కాబట్టి కొందరు డబాయించినట్టు చేతులూ కాళ్ళు తగలడానికి ఇరుకైన బస్సు కారణం కాదు. ఉద్దేశ్యమే అసలు కారణం. ఈ తేడా పిల్లలకి బాగానే తెలుస్తుంది. అసలు ఒక మనిషి అంతదూరాన వుండి కూడా చూపులద్వారాగాని, మాటలద్వారాగాని, ప్రేరేపిత చిత్రాల ద్వారా గాని పిల్లల్ని ఇబ్బందిపెడితే అది తీవ్ర నేరమే అవుతుంది. భారత రాజ్యాంగం ప్రకారం హింసని వ్యతిరేకించే హక్కు బాలబాలికలందరికీ వుంది.
వందేమాతరం నేర్పినంత గర్వంగా మన పిల్లలకి హింసని వ్యతిరేకించే హక్కుని బోధించాలి. పిల్లలూ మనలాంటి మనుషులే, పిట్టలు కాదు కదా చేదు చిగుళ్ళు తిని కూడా తియ్యగా పాటలు పాడటానికి…!
పనికిరాని గుట్టలు కాదు కదా, నరికిన కొద్దీ గరికపచ్చ మొలవడానికి…!
మన పిల్లల్ని మనం ప్రేమించే మాట నిజమే అయితే వాళ్ళు చప్పరిస్తున్న బాల్యానందాల చాక్లెట్‌ చేదువిషం కాకుండా చూసుకుందాం. అది మన కనీస బాధ్యత కూడా.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.