బి. శంకర్రావు
(మానాపురం గ్రామం, తిటుకుపాయి పంచాయితీ, సీతంపేట మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంప్రదాయ మూలికావైద్యులు శ్రీ ఆరిక ఎల్లారావుతో ఆర్ట్స్ సంస్థ, పెద్దపేట, శ్రీకాకుళానికి చెందిన
బి. శంకర్రావు నిర్వహించిన ఇంటర్వ్యూ వివరాలు)
శంకర్రావు : జై ఆదివాసీ! బాగున్నారా ఎల్లారావుగారూ?
ఎల్లారావు : జై ఆదివాసీ! రండి, రండి శంకర్రావుగారు చాలారోజులకి, ప్రొద్దుటే మా ఊరు వచ్చారు?
శంకర్రావు : ప్రత్యేకంగా పని ఏటిలేదుగానీ, తిటుకుపాయివరకూ వచ్చాను కదా! ఊరువాళ్ళకి పలకరించి పోదామని వచ్చాను.
ఎల్లారావు : చాలామంచిది, కూర్చోండి, నీరు త్రాగుతారా?
శంకర్రావు : వద్దు, మీ మూలికావైద్యం ఎలా వుంది? ఈ మధ్య వర్షాలు పడ్డాయి. ఎక్కడ చూసినా ఏజన్సీ అంతా జ్వరాలతో మంచం పట్టేసింది. ఇంటికి ఒకరిద్దరు మూలుగుతూనే వున్నారు.
ఎల్లారావు : అవునండి! మీరు చెప్పింది నిజమే. ఈ ఏడాది మరీ ఎక్కువైపోయింది. ఇంతకు ముందు వారానికి రెండురోజులు బుధ, ఆదివారాలు మందులు ఇచ్చేవాడ్ని. ఎప్పుడన్నా అత్యవసరమయితే తప్పా, మిగిలిన రోజుల్లో వైద్యం చేసేవాడిని మిగతా సమయం సొంతగా ఇంటిపనులు, పోడుపనులు చేసుకొంటూ ఆ రెండురోజులే వైద్యానికి కేటాయించేటోడ్ని.
ఇప్పుడు రోగులు ఎక్కువైపోయారు. సీతంపేట, వీరఘట్టం చుట్టుప్రక్కలా రెండు మూడు మండలాల్లోని దాదాపు 30, 35 గ్రామాల ప్రజలు ప్రతీరోజు ఏడెనిమిదిమందైనా వచ్చిపోతున్నారు. ఈ సీజన్ అంతా విషజ్వరాలు, విరోచనాలు, వాంతులు ఎక్కువ, ఇక ఆ గవర్నమెంట్ హెల్త్ సిబ్బంది అంటారా ఎక్కడో వుంటారు. వర్షాలు అవీ లేకుండా, రోడ్లు శుభ్రంగా ఉన్నప్పుడే సక్రమంగా రావడం కష్టం. ఇక ఈ వర్షాల్లో ఏమి వస్తారు? ఏమైతేనేం రోగుల రద్దీ ఎక్కువైంది. ఇక తప్పదు కదా! ప్రతీరోజు రెండు, మూడు గంటలైనా రోగుల కోసం ఇంటిదగ్గరే ఉండాల్సి వస్తుంది.
శంకర్రావు : మీరు అన్ని వ్యాధులకీ మందులు ఇస్తుంటారా?
ఎల్లారావు : లేదండి! నాకు తెలిసిన ఒక ఏడు, ఎనిమిది రకాల జబ్బులకు మాత్రమే ఇస్తుంటాను. చిన్న చిన్న జబ్బుల మాట విడిచిపెడితే ఎక్కువగా సాధారణ జ్వరం, విషజ్వరం, నీళ్ళ విరేచనాలు, పచ్చకామెర్లు, కంటి (చూపు)కి సంబంధించిన వ్యాధులు, దగ్గు, ఆయాసము, రక్తపోటు, మధుమేహం వంటి వాటికి వైద్యం చేస్తుంటాను.
శంకర్రావు : అయితే మీకు ఈ వైద్యం ఎలా తెలుసు? ఇంతకుముందు మీ ఇంటిలో ఎవరైనా మూలికావైద్యం చేసేవారా?
ఎల్లారావు : లేదండి! మా ఇంటిలో గతంలో ఎవరూ అంటే అమ్మా, నాన్నా ఎవరూ చేయలేదు. నేనే అదీ గత నాలుగు, ఐదు సంవత్సరాలుగా చేస్తున్నాను. ఏజన్సీలో మీకు తెలుసుగా, ఈ మూలికావైద్యం సర్వసాధారణం. పూర్వం ఇంకా ఎక్కువనుకోండి. ఇప్పుడు తగ్గిపోయారు. ఇప్పుడు నాలుగు, ఐదు ఊర్లకు కూడా ఒక్క సంప్రదాయ వైద్యుడు కనిపించడం లేదు.
నాకు చిన్నప్పటి నుండి ఈ వైద్యంపై కొంత శ్రద్ధ, ఆసక్తి ఉండేది. దాంతో చుట్టుప్రక్కల పెద్దల నుండి ఏవో చిన్న చిన్న బాధలకు మందులు తెలుసుకున్నాను, కానీ వైద్యం చేసే అంత స్థాయి లేదు. అయితే ఆ తరువాత ఐదు సంవత్సరాల క్రితం, లయ స్వచ్ఛంద సేవాసంస్థలో చేరి, సంవత్సరంపాటు ఈ ‘వనమూలికా వైద్యం’లో శిక్షణ పొందాను. ఆ తరువాత కూడా అప్పుడప్పుడూ అలా శిక్షణలకు వెళుతూ క్రొత్తక్రొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చాను. తూర్పుగోదావరి జిల్లా, అడ్డతీగల గ్రామంలో గల ‘వనంతరం’ (మూలికావైద్య పరిశోధన మరియు శిక్షణా కేంద్రంతో పాటు మూలికావైద్య ఆసుపత్రి)లో శిక్షణ పూర్తి చేసుకున్నాను. అప్పటినుండి ఈ ప్రాంతంలో ఈ వైద్యం చెయ్యడం మొదలుపెట్టాను.
శంకర్రావు : మరి మందులు ఎలా వస్తాయి?
ఎల్లారావు : చాలావరకూ మూలికలు మన చుట్టుప్రక్కల పోడుల్లోనూ, అడవుల్లోనూ దొరుకుతాయి. కొన్ని మొక్కలు సొంతంగా పెంచుతాము. కొన్ని దినుసులు బజారులో కొంటాము. ఉదాహరణకు కడుపులో నులిపురుగులు, అజీర్ణం, ఇతర బాధలకు ఉపయోగించే నేలవేము, కంటి వ్యాధులకు ఉపయోగించే మారేడు, మధుమేహం, రక్తపోటు వంటి వాటికి వాడే పొడపత్రి, చర్మవ్యాధులకు పనికివచ్చే సుగంధి, కరక్కాయ, ఉసిరి, తాడికాయలు మొదలైనవి మన చుట్టుప్రక్కలే దొరుకుతాయి. పాతబెల్లం, శొంటి, పటిక వంటి ఆయుర్వేద దినుసులు కొంటాము. ప్రస్తుతం మూలికలు అంత విరివిగా దొరకడంలేదు. బాగా వెతకాల్సివస్తోంది. కొన్నిరకాలు (నరమామిడి, కలబంద, కోడిపూడి/తిప్పతీగ) మన చుట్టుప్రక్కల పూర్తిగా పోయాయి. వేరే ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది.
శంకర్రావు : ఈ మందులు తయారుచేయడం, వాడడం సులువే నంటారా? జబ్బులు ఖచ్చితంగా నయం అవుతాయా?
ఎల్లారావు : సులువేనా! అంటే ఒకరకంగా సులువే. కష్టమంటే కష్టం కూడా. దేనికైనా నమ్మకం ఉండాలి. చేసేవారికి దాని పట్ల శ్రద్ధ, జ్ఞానం ఉండాలి. రోగనిర్ధారణ ఖచ్చితంగా చెయ్యగలగాలి. తెలిసిన వైద్యం మాత్రమే చెయ్యాలి. దేనికి పడితే దానికి చెయ్యకూడదు. రోగి కూడా శ్రద్ధగా చెప్పిన ప్రకారం మందు వాడాలి. మందుతోపాటు దీనికి పత్యం చాలా ముఖ్యం. పడని వస్తువులు తినకూడదు. కొన్నిరకాల జబ్బులకు దీనిలో మంచి మందులు ఉన్నాయి. మన ఆదివాసీ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాధులకైతే ఏయే మందులు అంటే ఏయే మూలికలు, పసర్లు వాడితే సరిపోతుందో ఇంచుమించు అందరికీ తెలిసే వుంటుంది. ఇప్పటితరంవారికి అంతగా తెలియకపోవచ్చుకానీ, ఇంతకుముందు చాలా జబ్బులకు ఇంటిలోనే పెద్దవాళ్ళు ఎవరో ఒకరు (నేటి) వైద్యం చేస్తుండేవారు. కాస్త పెద్దజబ్బులకు మాత్రమే గురువడ్ని/వెజ్జోడ్ని (వైద్యుడ్ని) కలిసేవారు.
శంకర్రావు : మీరు చేస్తున్న వైద్యం ప్రకారం కొన్ని సాధారణ జబ్బులకు మందుల తయారీ, వాడకం గూర్చి చెబుతారా?
ఎల్లారావు : తప్పకుండా, మన ఏజన్సీలో తరచూ వచ్చే వ్యాధులకు చికిత్సావిధానం చెబుతాను. మచ్చుకి మూడు, నాలుగు రోగాలకు సంబంధించి చెబుతాను.
పచ్చకామెర్లు : గుప్పెడు నేలఉసిరి (పల్లాందస్ అమారన్) సమూలం తీసుకుని కచ్చగా దంచి, శుభ్రమైన గుడ్డలో వేసి పిండి, ఏడెనిమిది చెంచాల రసం తీసుకొని, ఒక గ్లాసులో సగానికి ఆవుపాలలోగానీ, మజ్జిగలోగానీ ఆ రసాన్ని వేసి కలపాలి. ఇలా కలిపినదాన్ని ఉదయాన్నే పరగడుపున ఒక మోతాదు చొప్పున 3 నుండి 5 రోజుల వరకూ సేవించాలి. ఈ మందు వాడినన్నాళ్ళు చప్పిడి మజ్జిగ అన్నము మాత్రమే తినాలి. ఆ తరువాత 15 రోజులపాటు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఒక ఆరుమాసాలు కోడిమాంసం తినకూడదు. ఇదే వ్యాధికి కోడిపూడితీగ (తిప్పతీగ)తో కూడా వైద్యం చెయ్యవచ్చు.
అజీర్ణవ్యాధి : తెల్లచిత్రమూలం (ప్లంబాగో జిలానిక) వేరుపై బెరడు, శొంఠి, మిరియాలు, సైంధవ లవణం, వాము సమభాగాలలో కలిపి, వాటిని మెత్తగా దంచి, ఆ చూర్ణం 2 నుండి 4 గ్రాములు తీసుకుని, గోరువెచ్చని నీటితో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం రెండుపూటలా పది నుండి పదిహేనురోజులు వాడితే అజీర్ణం తగ్గిపోతుంది. మందు వాడినన్నాళ్ళు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తినాలి.
మలబద్దకం : కరక్కాయ (టెర్మినేలియా చెబులా), తాణికాయ (టెర్మినేలియా బెలిరికా), ఉసిరికాయ (ఎంబ్లికా ఆఫిసినాలిస్) మూడింటినీ నీడలో ఎండబెట్టి, వాటిపై ఒలుపు/తొక్క (గింజ తీసిన భాగం)ను సమపాళ్ళలో తీసుకుని చూర్ణం చేసుకోవాలి. దీన్నే త్రిఫలచూర్ణం అంటారు. దీన్ని ప్రతిరోజూ ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా చొప్పున గోరువెచ్చటి నీటిలో కలుపుకుని సేవించాలి. తగ్గేవరకూ వాడవచ్చు. ఎక్కువ వాడడం వల్ల చెరుపు ఏమీలేదు. ఆరోగ్యానికి మంచిదే. రెల్లచెట్టు (కాసియా ఫిస్టులా) లేత చిగుర్లను పచ్చడి చేసుకుని, అన్నంలో కలుపుకుని గానీ, విడిగా పచ్చడిని కొద్దికొద్దిగా తిన్నా కూడా సుఖవిరోచనం అవుతుంది. కృష్ణతులసి (ఆసిమం సాక్టమ్) ఆకులు, మిరియాలు 10 ట్రాముల చొప్పున, పొంగించిన పటిక 3 గ్రాములు తీసుకొని కొద్దిగా నీరుపోసి మెత్తగా నూరి కుంకుడుగింజ పరిమాణంలో మాత్ర చేసి వేసుకున్నా కూడా మలబద్దకం తగ్గుతుంది. రోజుకు మూడుపూటలు 5 రోజులపాటు ఈ మాత్రలు వేసుకోవాలి.
సాధారణ జ్వరం : పెద్దమాను/మహానింబ (అయిలాంతస్ ఎక్సల్‌సా) ఎండిన బెరడు, చిరుబొద్ది (సిగుంపిలస్ పరీరా) ఎండిన వేర్లపైబెరడు 40 గ్రాములు చొప్పున తీసుకొని దానికి జీలకర్ర 120 గ్రాములు కలిపి మెత్తగా దంచి, చూర్ణం చేసి, దానిలో కాకరాకు పసరుపోసి మెత్తగా నూరి కుంకుడుగింజ పరిమాణంలో మాత్రలు చేసుకొని నీడలో ఆరబెట్టాలి. ఆరిన మాత్రలను జాగ్రత్త చేసుకుని, రోజులో మూడుపూటలా (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) ఒక్కొక్క మాత్ర మంచినీటితో వేసుకోవాలి. దాహం ఎక్కువగా ఉంటే, ధనియాల రసంతో ఈ మాత్ర వేసుకోవాలి. జ్వరం తగ్గే వరకూ తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోవాలి.
దగ్గులు : పిప్పలికట్టి వేర్లు (పైపర్ లాగమ్), పాతబెల్లం సమభాగాలుగా తీసుకుని, బాగా నూరి ఒక గ్రాము మోతాదులో మాత్రలు చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున 3 నుండి 5 రోజులపాటు మంచినీళ్ళతో మాత్రలు వేసుకోవాలి. మందు వాడుతున్నప్పుడు వంకాయ, కొబ్బరి, గోంగూర, కోడిమాంసం వంటివి తినకూడదు. ఇదే మందును జీలకర్ర రసంతో సేవిస్తే, అజీర్ణవ్యాధి, నిద్రలేమి కూడా నయం అవుతాయి.
జిగట విరేచనాలు : కోడిసపాల / గంగాలమ్మ పూలచెట్టు (హెలరినా ఎంటిడి సెంటిరికా) గింజలు, శొంఠి సమపాళ్ళలో కలిపి బాగా నూరి గచ్చకాయ పరిమాణంలో మాత్రలు చేసుకోవాలి. రోజులో మూడుపూటలు ఒక్కొక్క మాత్రను బియ్యం కడిగిన నీళ్ళతో వేసుకోవాలి. లేదంటే దోరగా పండిన మారేడుకాయ (ఏగిల్ మార్మిలాస్) లోపలి గుజ్జు తీసుకొని, దానిలో తగినంత పంచదార కలుపుకుని ఉదయం, సాయంత్రం తిన్నా కూడా గుణం కన్పిస్తుంది. జిగట, రక్త విరేచనాలు ఏవైనా కూడా పై రెండు పద్ధతుల్లో ఏదో ఒకటి 2 నుండి 5 రోజులు ఉపయోగించవచ్చు. మందు వాడినన్ని రోజులు మజ్జిగ అన్నమే తినాలి.
గాయాలు (దెబ్బలు) : ఉత్తరేణి/దిచ్చరి (అభిరాస్తస్ అస్పరా) లేదా గడ్డిచామంతి (ట్రిబాక్స్ ప్రొడ్సమ్ చెన్స్) ఆకులను మెత్తగా నూరి గాయాలపై వేసి కట్టుకట్టినట్లయితే గాయం త్వరగా మానుతుంది. ఇది సెప్టిక్ అవ్వకుండా కూడా కాపాడుతుంది.
తెల్లబట్ట (తెల్లకుసుమ) : చంద్రకాంత/మొగమల్లె (మిరాబిలిస్ జలప), పచ్చిదుంప, మిరియాలు సమపాళ్ళలో తీసుకుని మెత్తగా నూరి రెండు గ్రాములు చొప్పున మాత్రలు చేసుకుని, ఉదయం, సాయంత్రం ఒక్కొక్కటి చొప్పున నీళ్ళతో 10-15 రోజులు వేసుకోవాలి. తెల్లపువ్వులు పూసే చంద్రకాంత దుంపను మాత్రమే వాడాలి. లేదంటే పిల్లితీగ (అస్పరాగస్ రసిమోనస్) దుంపలు ఒకమోస్తరు పరిమాణం గలవి ఉదయం మూడు, సాయంత్రం మూడు చొప్పున బాగా కడిగి దోరగా వేపుకుని తిన్నా కూడా గుణం ఉంటుంది. వేడిచేసే వస్తువులు ఏవీ తినకూడదు.
మానని వ్రణాలు (కురుపులు) : తెల్లమద్ది (టెర్మినేలియా అర్జునా) బెరడు ఆరబెట్టి మెత్తగా చూర్ణం చేసి ఉంచుకోవాలి. అలాగే రావిచెట్టు (ఫైకస్ రెలిజియానా) బెరడు పచ్చిది కషాయం కాయాలి (సుమారుగా 200 గ్రాముల పచ్చిబెరడు తెచ్చి, కచ్చగా దంచి, 4 గ్లాసులు నీళ్ళువేసి, అవి ఒక గ్లాసుకు అయ్యేవరకు మరిగించి తియ్యడం) ముందుగా రావి బెరడు కషాయంతో వ్రణాన్ని శుభ్రంగా కడగాలి. ఆ తరువాత తెల్లమద్ది చూర్ణాన్ని కురుపుపై చల్లాలి. ఇలా ఒక వారంరోజులు చేస్తే, ఎంత మొండి వ్రణాలైనా మానిపోతాయి. రావి కషాయం ఏ రోజుకారోజు తయారుచేసుకోవాలి.
ఇలా వనమూలికలతో రకరకాల జబ్బులను నయం చేయవచ్చు. అయితే ఇక్కడ కొన్నివిషయాలు గుర్తుపెట్టుకోవాలి. పైన చెప్పిన మోతాదులో పెద్దవారికి మాత్రమే, పిల్లలకు అందులో సగం మోతాదే ఇవ్వాలి. ఔషధాలన్నీ మూలికా వైద్యుని సలహా మేరకు, ఆయన సమక్షంలో వాడాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు సులువుగా అరిగే ఆహారం తీసుకోవాలి. వ్యాధి నివారణకు మందులు ఎంత అవసరమో, పత్యం కూడా అంతే ముఖ్యం. ఈ విషయాలు గమనించాలి.
శంకర్రావు : చాలా విషయాలు చెప్పారు. మన ఆదివాసీలకు మంచి వైద్యం అందిస్తున్నారని కూడా చుట్టుప్రక్కల విన్నాను. ఈ వైద్యం గూర్చి మీరు ప్రజలకు ఇచ్చే సలహాలు ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఎల్లారావు : సలహాలు అంటే, గ్రామస్థులు చుట్టుప్రక్కల ఔషధ మొక్కలను రక్షించాలి, ప్రస్తుతం అందుబాటులో లేనివి చుట్టుప్రక్కల ఖాళీప్రదేశాల్లో పెంచుకోవాలి కూడా. మునుపటికంటే ప్రస్తుతం యువతలో ఈ వైద్యంపై ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఇంకా శ్రద్ధ కావాలి. ప్రభుత్వం నుండి కూడా తగిన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మారుమూల మన ఆదివాసీ గ్రామాల్లో వైద్యసదుపాయాలను మరింత అందుబాటులోకి తేవడానికి ప్రత్యేకించి కొన్ని సాధారణ వ్యాధుల విషయంలో, ఎప్పటినుండో ఆచరణలో ఉన్న ఈ సంప్రదాయ పద్ధతులను ప్రోత్సహించి ఆరోగ్యం మెరుగుపరచడం ఎంతైనా అవసరం.
శంకర్రావు : మంచిది, ఇక నేను వెళ్ళి వస్తాను.
ఎల్లారావు : అలాగేనండి, జై ఆదివాసీ! (‘మన్యంలో’పత్రిక నుండి)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags