జూపాక సుభద్ర
ఎంతదేవిపోత యీ నెలపదిరోజులు. రోడ్లు, వూర్లు, వాడలు, గల్లీలు, ఆఫీసులు ‘జై తెలంగాణ’ జాగారం జేసినయి.
అటు బడి గంటలు బందైనయి. పోరగాండ్లంత రోడ్లమీద క్రికెట్, డాబాలమీద పతంగులాడుకున్నరు. వూల్లల్ల పోరలు సదువును సిలక్కొయ్యకు తగిలిచ్చి కూలినాల్లకు బొయిండ్రు. ఆర్టీసీ పయ్యలు పలిగి రోడ్డెక్కలే. డిపోలల్లనే ‘జై తెలంగాణకు జై’ అంటూ మస్తుగ రెస్టు తీస్కున్నయి. యిక సింగరేణిల ఒక్క బొగ్గుపెల్ల పెగల్లే. సుక్క కరెంటు బైటికి రాలే. సింగరేణి సీకటి సూయించింది. ఉద్యోగులు మొత్తం ఫైల్లుకట్టేసి ఆఫీసు ముందు ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పులు, మానవహారాలు, దీక్షలు, బత్కమ్మలు (కొన్నిచోట్ల మొగోల్లే బత్కమ్మలాడిండ్రు) ‘జై తెలంగాణ’ అంటే జై తెలంగాణ బొబ్బల్తో ఢిల్లీ అబ్బో అనేట్టుగ తెలంగాణ పది జిల్లాల పర్యావరణమంతా తెలంగాణ నినాదమైంది. తెలంగాణ లొల్లితో డిల్లం డిల్లం మోతమోగింది. యిక తెలంగాణల కూలినాలి జేసుకునేటోల్ల కష్టాలు చెప్పవశంగానివి. సందట్ల సడేమియగ విపరీతమైన రేట్లు బెరిగి ‘బువ్వకు సచ్చినం’ అన్నరు. సత్తెమాయెగని తెలంగాణత్తె మంచిగుండన్నరు.
యీ ఉదృత ఉద్యమంలో సామాజిక తెలంగాణ నినాదం పాయలు పాయలుగా జలపాతమోలె దునుకుతనే వున్నది. యిగొస్తది, అగొస్తది, రేపే వస్తది, మాపే వస్తది అని జనం కొండకెదురు చూసినట్లు ఎదురుచూస్తున్నం.
తెలంగాణల దాదాపు లక్షన్నరమంది టీచర్లున్నరు. ప్రతి ఉద్యమంలో వాళ్లే ముందు కదిలేది. వాళ్లు రావాలంటే బడుల్ని బందువెట్టాల్సిందే. యిట్లా ప్రతిదానికి బడుల్ని బందుపెట్టడంవల్ల ప్రభుత్వబడుల్లో చదువుకునే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల చదువే అన్యాయమైపోతుంది. ప్రైవేటు టీచర్లు బడులకు యీ ఉద్యమాలకు బైటనే వున్నరు. సకలజనుల సమ్మె కూడ ఏవో మెయిన్‌రోడ్ల మీని ప్రైవేటులు ఒకటి అరా బందైనయేమోగాని మిగతావి బాగానే నడ్చినవి. రకరకాల సమ్మెలవల్ల కిందికులాల చదువు దెబ్బతినిపోయింది. వాళ్లు డ్రాపవుట్స్ అయి వెట్టిమనుషులుగా, కూలీలుగా, స్వీపర్లుగా, మట్టిపనిచేసేవాల్లుగానే మిగిలిపోయిండ్రు. యీసారి దీనిమీద చాలనే చర్చ జరగడం ఆహ్వానించదగ్గదే. ఏ ఉద్యమమైనా, బందులైనా, సమ్మెలైనా స్కూల్లను మినహాయించాలనే ప్రతిపాదన ఆహ్వానించాల్సిందే.
విప్లవవాదులు ‘యీ చదువులు మాకొద్దు’ మెకాలె చదువనీ, బానిస చదువులనీ, నూతన ప్రజాస్వామ్యం వచ్చేదాక యీ చదువులొద్దనీ కింది కులాలకు చదువులు లేకుండా చేసిండ్రు. ఆ నూతన ప్రజాస్వామ్యం ఎప్పుడొచ్చేను ఎన్ని తరాలు గడిచేను. అప్పటి దాక సదువులేని సన్నాసుల్లాగ, వింతపశువుల్లాగ బత్కాలా! కాని ఆ విప్లవవాదుల పిల్లలు కుటుంబాలు మాత్రం అదే బానిస విద్య, మెకాలె విద్యను మెడబంటిదాకా అభ్యసించిండ్రు. చదువుకు దూరముంచిన కింది కులాలమీద యీ సదువర్లైన విప్లవకారులు పెత్తనం చేయనీకి ఎప్పటికప్పుడు మెకాలె విద్య చదివి రడీగుంటరు.
తెలంగాణ కూడ ఒక రాజకీయమైన సమస్య. అది యీ దొరలు చెప్పినట్లుగ యియ్యాల రేపొచ్చేదిగాదు. అన్ని సౌలతులున్న తెలంగాణ మేధావులు తెలంగాణ వచ్చేదాక సదువులు బందువెట్టాలె అని వూగిపోతూ మాట్లాడేవాల్ల పిల్లలు చదువుకు డిస్టర్బ్ అయిలేరు. జనం పిల్లలు అంటే కింది కులాల పిల్లలే సదువుల్లేక రేపటి భవిష్యత్ లేక తరతరాలుగ వెట్టిబాంచలుగానే మిగిలిపోతరు. ఓవైపు విద్యాహక్కు చట్టం వచ్చి పిల్లలు బడిలోనే వుండాలె బడిబైట వుండొద్దనీ, నిర్బంధ విద్య అమలుచేయాలని చెపుతుంది. కాని ప్రభుత్వాలకు చిత్తశుద్ధిలేక అది విద్యాహక్కు చట్టం సరిగ్గా అమలుకావట్లేదని సామాజిక శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నరు.
యింకోవైపు అగ్రకులమేధావులు ఉద్యమాల పేరుతో డ్రాపవుట్స్‌గా మారే బడిపిల్లల గూర్చి ఆలోచించడంలేదు. విద్యాహక్కు చట్టం పరిరక్షణ కోసం ప్రభుత్వ సలహాదారులుగా వున్న మేధావులు కూడా ఉద్యమాల పేరుతో బడుల్ని బందుబెట్టి స్కూల్లకు తాళమేసే టీచర్స్‌కి సామాజిక బాధ్యతపట్ల చైతన్యం కలిగించడం లేదు. సెన్సస్ పేరుతో, ఎన్నికల నిర్వహణకు-కౌంటింగ్‌లకు యిట్లా రకరకాల ప్రభుత్వ కార్యక్రమాలకు ఎక్కువగా టీచర్స్‌నే వినియోగించడం జరుగుతుంది. యిట్లా బడుల్ని, పిల్లలకు చెప్పే చదువుల విధుల్ని వొదిలేసి బైటకు ‘పంపొద్దు’ అనే సలహాల్ని యీ ప్రభుత్వ సలహాలు ఎందుకివ్వడం లేదు. ప్రభుత్వ సలహాదారులంతా ఆధిపత్యకులాలవాళ్లే. వాల్లకు కింది కులాల చదువు పట్టదు. కింది కులాలు చదువుకుంటే వాల్ల పొలాలల్ల, యిండ్లల్ల నౌకర్లు చాకర్లుండరనీ, వాల్ల పనులకాటంకం వస్తుందేమోననీ, వారి ఆధిపత్యాలకు గండిపడ్తుందనే భయంతోని కింది కులాల పిల్లల చదువుల గూర్చి మాట్లాడరు, స్పందించరు.
యిక తెలంగాణ విషయానికొస్తే రకరకాల రాజకీయ ఆధిపత్యాలు తెలంగాణని అడ్డుకుంటున్నయి. తెలంగాణ పుణ్యమాని ప్రజాకంటకులు కూడా ప్రజానాయకులైండ్రు. పొలిమేరకు తరమబడిన దొరలు మల్లా వూర్లె నాయకత్వ జెండా పాతిండ్రు. తరిమిన జనం మల్లా బాంచలైండ్రు. అయితే తెలంగాణ ఉద్యమం అస్తిత్వ, ఆత్మగౌరవ చైతన్యం రగిలించగలిగింది. యిది విజయమే. కాని రేపటి తెలంగాణ నీది, నాది, మనందరిది అనే నమ్మకాన్ని తెలంగాణ అణగారిన కులాల్లో, మహిళల్లో, వర్గాలో కల్పించలేకపోయింది. యిదో పెద్ద వైఫల్యం దీనిక్కారణం నాయకత్వం అగ్రకులాలు నెరపడం. పారదర్శకత లేకపోవడం, జవాబుదారీతనం లేకపోవడం. కిరోసిన్ చల్లుకొని డ్రామా చేసిన నాయకులు, మెడకోసుకుంటా, తొడ నరుక్కుంటా, విషమ్మింగుతా అని చెప్పిన నాయకత్వం తమ ప్రాణాలు పోగొట్టుకోకుండా యితరులు ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్ని ఉత్పన్నం చేసింది. దానివల్ల దాదాపు 700 మంది అణగారిన తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానాలు చేసిండ్రు.
బస్సులు బందైనా, పోరగాండ్లు సదువుకు బోకున్నా, యింట్ల లైటుబుగ్గ యెలుగకున్నా, తెలంగాణ వస్తదనే ఆశతో గీ తక్లీబుల్ని లెక్కజేయలే. తెలంగాణకోసం, తెలంగాణ రావాలని మా అవ్వ (తల్లి) నేను, నా బిడ్డ మూడుతరాలకాంచి కొట్లాడ్తనేవున్నం. ఎన్ని తరాలైనా ఎన్ని మోసాల్ని ఎదుర్కున్నా మా పోరు సల్లారని కుంపటే.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags