పసుపులేటి గీత
హృదయం ఒక్కో ఆశను, ఒక్కో ఆకులా రాల్చుకుంటూ, శిశిరంలో చెట్టులా మోడువారి నెమ్మదిగా మరణిస్తోంది, ఇక ఆశలేవీ మిగిలిలేవు…’
‘గుడిలో ఒక కవిత ఉంది. దాని పేరు నష్టం. కానీ దాన్ని రచించిన కవి తన కవితను చెరిపేశాడు. ఆ కవితను అనుభూతించాల్సిందే తప్ప చదవలేం’ – సయూరి (మెమొయిర్స్ ఆఫ్ ఎ గీషా)
జపాన్‌లోని ‘సీ ఆఫ్ జపాన్’ తీరప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన సకమోటో చియో అనే తొమ్మిదేళ్ళ అమ్మాయిని ‘ఒకియా’ (గీషాల గృహం) కి అమ్మేయడంతో మొదలయ్యే ‘మెమొయిర్స్ ఆఫ్ ఎ గీషా’ నవల ఆద్యంతం మనసును కలచివేసి, పాఠకుల్ని కట్టిపడేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధకాలానికి చెందిన గాథ ఇది. మనదేశంలోని దేవదాసి సంస్కృతిలాంటిదే జపాన్‌లోని ‘గీషా’ సంస్కృతి. దేవదాసీలు దైవారాధకులైతే, గీషాలు కళారాధకులు. గీషాల ప్రపంచం ఒక వర్ణశోభిత కావ్యంలా ఉంటుంది. కానీ దాని లోలోతుల్లో ఎన్నెన్నో ఆవేదనలు, అపప్రథలు, అవమానాలు రగులుతూ ఉంటాయి. అలాంటి ఒక గీషా కథే ఆర్థర్ గోల్డెన్ 1997లో రచించిన ‘మొమొయిర్స్ ఆఫ్ ఎ గీషా’. గీషాల గృహం ఒక ‘తల్లి’ యాజమాన్యంలో నడుస్తుంటుంది. చియో తల్లి బోన్ కాన్సర్‌తో బాధపడుతుంటుంది. తండ్రి వృద్ధుడు. ఆమెకు సస్తు అనే చెల్లెలు కూడా ఉంటుంది. కానీ విచిత్రంగా చియోని మాత్రమే తల్లిదండ్రులు ఒకియాకి అమ్మేస్తారు. ఈ ఒకియాని ‘తల్లి’ నిర్వాహకురాలు. పిన్ని అనే మహిళలు నడిపిస్తుంటారు. ఒకియా తల్లికి డబ్బు యావ. ఇష్టం లేకపోయినప్పటికీ చియో, ఒకయాలో నిత్తా సయూరిగా పేరు మార్చుకుని, గీషాగా శిక్షణ పొందడానికి నిర్ణయించుకుంటుంది. ఆ ఒకియాలోనే ఆమెతో పాటు ‘పంకిన్’ అనే మరో అమ్మాయి కూడా గీషా సహాయకురాలు (ఈమెను మైకో అని పిలుస్తారు) మైకోగా శిక్షణ పొందుతుంటుంది. గీషాల జిల్లాగా పేరొందిన ‘జియోన్’లో హత్సుమోమో అనే గీషా సుప్రసిద్ధురాలు. హత్సుమోమో కూడా నిత్యా సయూరి శిక్షణ పొందుతున్న ఒకియాలోనే ఉంటుంది. ఈమె స్వభావరీత్యా అత్యంత దుర్మార్గురాలు. కానీ ఒకియా నడవాలంటే హత్సుమోమో సంపాదనే ఆధారం. అందుకే ఆమె దుర్మార్గాన్ని అందరూ సహించక తప్పని స్థితి. హత్సుమోమో ఘాతుకాల్ని సహించలేక సయూరి ఒకియా నుంచి పారిపోవడానికి ప్రయత్నించి, పట్టుబడుతుంది. అందుకు శిక్షగా ఆమెకు పరిచారికగా మారిన సయూరికి ఒకరోజు వీధిలో ఒక వ్యక్తి పరిచయమై, ఆమె కథ తెలుసుకుని ఓదారుస్తాడు. సయూరి అతనిపట్ల అభిమానాన్ని పెంచుకుంటుంది. తాను కూడా మంచి గీషాగా తయారైతే తప్ప అతని ఆదరణను పొందలేనని ఆమె భావిస్తుంది. కానీ ఆమె విధిలేక పరిచారికగానే కొనసాగుతుంటుంది. పంకిన్ గీషాగా తయారవుతుంది. హత్సుమోమో పూర్వవైభవాన్ని పోగొట్టుకుని, ఒకియా నుంచి బహిష్కృతురాలవుతుంది. గీషాల పవిత్ర వస్త్రమైన ‘కిమోనో’ని తయారు చేసే మహెమా దృష్టిని సయూరి ఆకర్షిస్తుంది. మహెమో ప్రోద్భలంతో సయూరి కూడా గీషాగా శిక్షణ పొందుతుంది. మైకో పూర్తిస్థాయి గీషాగా మారే కార్యక్రమాన్ని ‘మిజువేజ్’ అంటారు. అంటే గీషాని వేలం వేస్తారన్నమాట. నగరంలో ఐశ్వర్యవంతుడైన ఇవుమురా ఎలక్ట్రిక్ కంపెనీ అధ్యక్షుడు నొబు తొషికాజు అత్యంత ఎక్కువ ధరకు సయూరిని వేలంలో కొనుగోలు చేస్తాడు. ఇక అప్పటినుంచి ఆమెకు అతను భర్తవంటి వాడు. కానీ భర్త కాదు. ఆమెపై అధికారాలు అతనికి సంక్రమిస్తాయి. ఇంతలో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుంది. చుట్టుపక్కల జిల్లాలోని గీషాలంతా బతుకుతెరువు కోసం ఫ్యాక్టరీల్లో కూలీలుగా చేరాల్సిన దుర్గతిని ఎదుర్కొంటారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్న సయూరిని నొబు రక్షించి, ఉత్తర ప్రాంతంలోని ఒక కిమోనొ తయారీ సంస్థకి పంపేస్తాడు. యుద్ధం ముగిసిన తరువాత నొబు ఎలక్ట్రిక్ కంపెనీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతుంది. ఆ నష్టాల నుంచి బయటపడే నిమిత్తం కొత్త సహాయ మంత్రిని ‘మెప్పించాల్సిందిగా’ నొబు, సయూరిని కోరుతాడు. కానీ ఆమె నొబుని ప్రేమిస్తుంది. నొబు కోరికని మన్నిస్తుంది. అయినప్పటికీ పంకిన్ విశ్వాసఘాతుకానికి పాల్పడి సయూరిపై నొబుకు ద్వేషాన్ని నూరిపోస్తుంది. చివరికి సయూరి నొబు మీద ఆశల్ని వదులుకుని, ఎలక్ట్రిక్ కంపెనీకి కొత్త అధినేత అయిన చైర్మన్‌ని తన ‘దానా’ (సంరక్షకుడు) గా స్వీకరించడంతో కథ ముగుస్తుంది. ఆమె తన గీషా వృత్తికి కూడా స్వస్తి పలుకుతుంది. ఇది ‘మినెకో ఇవాసాకి’ అనే ప్రఖ్యాత జపాన్ గీషా స్వీయకథ ఆధారంగా రచించిన నవల. కానీ తన కథని రచయిత వక్రీకరించారని, తాను మిజువేజ్‌లో 72వేల డాలర్లకు అమ్ముడుపోయినట్టు రాసింది అబద్ధమని మినెకో ఇవాసాకి ఆరోపించింది. గీషాల చరిత్ర, గాథ శతాబ్దాలుగా వక్రీకరణకు గురవుతోందంటూ, మరో రచయిత సహకారంతో తన కథని ‘గీషా ఎ లైఫ్’ పేరుతో మళ్ళీ మరో నవలగా ఆమె ప్రపంచం ముందుకు తెచ్చింది. ప్రపంచ వ్యాప్త ఆదరణ పొందిన ‘మెమొయిర్స్ ఆఫ్ ఎ గీషా’ నవల 2005లో రాబ్ మార్షల్ దర్శకత్వంలో చలన చిత్రంగా వచ్చింది. ‘బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్’, ‘బెస్ట్ సినిమాటోగ్రఫీ’ తోపాటు పలు విభాగాల్లో ఆ సంవత్సరం ఈ చిత్రం అనేక ఆస్కార్ అవార్డుల్ని గెలుచుకుంది. మన సినిమాల్లో కూడా దేవదాసీల్ని అభ్యంతరకరంగానే చిత్రీకరిస్తుంటారు. కానీ మెమొయిర్స్ ఆఫ్ ఎ గీషా మాత్రం మన సినిమాలతో పోల్చి చూస్తే, విశిష్టమైన కళాత్మకతతో భిన్నంగా కనిపిస్తుంటుంది. గీషాల జీవితగాథల ఆధారంగా మరెన్నో నవలలు, సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ జపాన్ సాంస్కృతిక జీవితంలో గీషాల పాత్ర విడదీయలేని భాగంగానే ఉంది. ‘జియోన్ కౌబు, మియకవా-చొ, కమిషిచికెన్, జియోన్ హగాషి’ తదితర క్యోటో పరిసర ప్రాంతాల్లో నేటికీ జపాన్ గీషా వ్యవస్థ పదిలంగానే ఉంది. సౌందర్యం, నృత్యం, సంగీతాలతో ముడిపడిన ఆ ‘వెన్నెల బతుకుల’ చీకటి గాథ ప్రపంచంలోని ప్రతిమూలా ఏదో ఒక పేరుతో సలుపుతూనే ఉంటుంది. మన దేవదాసీలైనా, జపాన్ గీషాలైనా స్త్రీల జీవితం విలాసపురుషుల పాదాల కింద నలిగిపోయే కన్నీటి కథల సమాహారమే. దీనికి అక్షర రూపమే ‘మెమొయిర్స్ ఆఫ్ ఎ గీషా’
-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
March 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags