కొండేపూడి నిర్మల
హిందీ హీరో జితేంద్ర ముద్దుబిడ్డ ఏక్తాకపూర్ ”డర్టీపిక్చర్” తీసినట్టు తెలుసు కదా..ఎవరిమీద తీసిందో కూడా తెలిసే వుంటుంది. నిరంతర రక్తిలో మునిగిన స్వామీ నిత్యానందమీద కాదు. రాజభవన్‌లో రాసలీలలు నడిపిన గవర్నరు తివారీ మీద కాదు… అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన మంత్రులమీద కాదు. కొన్ని దశాబ్దాలపాటు ప్రజల మనోభావాల్ని పక్కదారి పట్టించిన పుట్టపర్తి సాయిబాబామీద కాదు. అలా తీస్తే అప్పుడవి ఖచ్చితంగా కల్తీలేని డర్టీ డయేరియా సినిమాలయ్యేవి. అప్పుడు ఆమె కలేజాకి అందరం మెచ్చుకునేవాళ్ళంకూడా.. ఆ పనిలో మజా ఏముంది అనుకుందేమో..
ఎలాంటి సంకోచం లేకుండా సిల్క్ స్మిత జీవితం మీద ఒక ఏకపక్ష వ్యాఖ్యాన చిత్రరాజాన్ని తీసిపడేసింది. ముక్కు చీదినంత తేలిగ్గా సినిమాలు, సీరియల్స్ తీసే ప్రతిభ ఆమెకుండొచ్చుగాక, అయితే చనిపోయిన ఒక నటీమణి జీవితం తీస్తున్నప్పుడు విశ్వసనాయ సమాచారం తీసుకోవాల్సిన బాధ్యత అయినా వుండాలా వద్దా…? ఆవిడ సెక్సు బాంబు అయినా, మానవ బాంబు అయినా తోడబుట్టినవాళ్ళో, కలిసి బతికినవాళ్ళో వుంటారు కదా. ఆమె పరోక్షంలో జరుగుతున్న ఈ సరదా సరదా రచ్చబండ లేక పోస్టుమార్టం కార్యక్రమాలకి అయినవాళ్ళ అనుమతి వుండాలి. వాళ్ళ మనోభావాల్ని పట్టించుకోవాలి. స్క్రిప్టు తయారీలో కూడా తమని ఏమీ అడగలేదని, తమ అక్క జీవితాన్ని గురించి వున్నవీ, లేనివీ తీసి అపఖ్యాతి పాలు చేస్తున్నారని ఆమె తమ్ముడు నాగవర ప్రసాదు, మిత్రుడు రాధకృష్ణలు కోర్టుకెక్కారు. తంతే బూర్లగంపలో పడ్డట్టు, తప్పులు కోర్టుకెక్కినప్పుడల్లా ఇంకా కీర్తి డబ్బు వచ్చిపడతాయి గా. ఇప్పుడు అదే జరిగింది. అస్సలు సెన్సార్‌కట్స్ లేవని కొన్ని గ్యాసిప్ పత్రికలు వూరించేస్తున్నాయి. ప్రధాన థియేటర్లన్నీ బుక్కయిపోయాయి. జనాలు గేట్లముందు పడిగాపులు కాస్తున్నారు. (ఉరి పోసుకుని చనపోయిన నటి గురిచి ఊరించే సినిమా తియ్యడం గొప్ప ఐరనీ కదా!)
కాగా ఆమె తరఫున తమ్ముడు, మిత్రుడు కూడా డబ్బుకోసమే కోర్టుకెక్కారని, సినిమాల్లో క్లబ్బు డాన్సరు పాత్రలు వేసే వాళ్ళకి కొత్తగా ఇప్పుడొచ్చి పడ్డ అపఖ్యాతి ఏమిటని మా కొలీగ్ ఒకడు నాతో వాదించి విసిగించబోయాడు..మనం ఎంతగా బండబారిపోయామో ఇలాంటి వాదనలు చెబుతాయి. ఎంత చిన్న బడ్జెట్ క్లీన్ సర్టిఫికెట్ సినిమా అయినా వాంప్ పాత్ర తప్పనిసరి అయినపుడు ఆ పాత్ర ఆమె రూపొందించుకున్నది కాదు. రాసేవాడు, తీసేవాడు, కూసేవాడు, కొనుక్కునేవాడు, అమ్ముకునేవాడు, సెన్సారు కత్తెర వేసేవాడు – ఇలా అనేకమంది వుంటారు. ఏసుప్రభువు పాత్ర లానే సెక్సుబాంబు పాత్ర కూడా తెరపరిధిలోనే నటిస్తుంది. రామరాజ్యం సినిమాలో సీతగా నటించిన నయనతారకొచ్చిన ఆనందభాష్పాలు స్మితకు ఎప్పుడూ ఏ చిత్రం ఇవ్వకపోవచ్చు. తెరవెనుక జీవితమే చిత్రించదలుచుకుంటే అది వాస్తవానికి దగ్గరగా వుంచడం కనీస మర్యాద. లేకపోతే అది మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది. ఆమెకున్న గోప్యతా హక్కు (రైట్ టు ప్రౖెెవసీ)ని భంగపరచినట్టు అవుతుంది. స్మిత అసలు వూరు ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలి అని, మాతృభాష తెలుగు అని, నిరుపేద కమ్మకులంలో పుట్టిందని, అమ్మానాన్నలు పెట్టినపేరు విజయలక్ష్మి అని, నాలుగోక్లాసు వరకు చదువుకుందని, ఒక సోదరుడు మాత్రం వున్నాడని, సినిమాలంటే చాలా ఇష్టమని, డొమెస్టిక్ వర్కర్‌గా, టచ్ అప్ గర్ల్‌గా సెట్స్ మీద పనిచేసిందని అరకొర సమాచారం తప్ప నటి కా ముందు ఆమె జీవితం గురించి ఎలాంటి వివరాలూ బయటికి రాలేదు. 200 సినిమాల్లో నటించి ఒక ఇమేజ్ సంపాదించి నాట్యతారగా అగ్రస్థానానికి చేరుకున్న ఆమె 1996లో చెన్నైలోని ఒక చిన్న అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకోవడానికి కారణమేమిటో తెలీదు. అసలది హత్యా, ఆత్మాహత్య అనే విషయం కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆమె బాల్యమూ, వ్యక్తిగతమూ, ఆర్తీ, ఆవేదనా పూర్తి అప్రధాన విషయాలుగా మిగిలిపోయాయి. (నట జీవితానికి త్వరలోనే స్వస్తి చెప్పి దర్శకత్వ బాధ్యత చేపట్టాలని వుందని చనిపోవడానికి ఏడాది ముందు ఇచ్చిన ఇంటర్వ్యూని, ఆమె ఉరివేసుకున్న రోజున మాత్రం పదే పదే చూపించారు. ”చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ అనే మాటకి అర్ధమే లేదని..” ఆమె ఒక స్టేట్‌మెంట్ ఇచ్చింది. బతికి వుంటే బహుశ ఈ డర్టీ ఇండస్ట్రీ గురించి ఆమె ఒక సినిమా తీసేదేమో…)
సిల్కుస్మిత మీద డర్టీపిక్చర్ పేరుతో సినిమాతియ్యడం గురించి వచ్చిన వివాదాలకి ఏక్తాకపూర్, విద్యాబాలన్ కలిసి సిఎన్‌ఎన్‌ఛానల్‌కి కొన్ని ఆసక్తికరజవాబులు చెప్పారు.
”డర్టీ” అనే మాట రెచ్చగొట్టడానికి వాడలేదు. అప్పటి చెన్నై ఫిల్ము ఇండ్రస్టీలో వున్న డ్రాకులాల్ని తట్టుకోవడానికి నటీిమణులు ఎలాంటి పని అయినా చేసేవారు. సిల్కుస్మిత జీవితమే వివాదాలమయం. ఆమె ఎలా కావాలనుకుందో అలా బతికింది. ఎవరేం అనుకుంటారో అని అవి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎక్కువ డబ్బులొస్తాయని నీలి సినిమాల్లో నటించింది. అయినా దాచుకున్నది తక్కువ. స్వతహాగా మంచివ్యక్తి. అసలు విజయలక్ష్మి లాంటి మామూలు అమ్మాయి సిల్కుస్మితగా పేరు మార్చుకోవడంలోనే ఒక ఉద్దేశ్యం వుంది. అందులో ఇండ్రస్టీ ప్రోద్భలం ఉండచ్చు. అయినా ఒప్పుకుంది కదా. సిల్కుస్మిత పేరులోనే ఒక సెక్స్ అప్పీలు వుంది..? సిల్కుస్మిత, నైలాన్ నళిని, పాలిస్టర్ పద్మినిలాంటి పేర్లు దేన్ని సూచిస్తాయి. వారి జీవితాల్ని తెరకెక్కించినప్పుడు ఇంకెలాంటి పేరు పెట్టాలి చెప్పండి. జనం వాళ్ళని ఏ కళ్లతో చూస్తారో నా సినిమాకి ఆ పేరే పెట్టాను. సినిమా పిచ్చిలో పడి ఇల్లు వదిలి వచ్చిన మహిళల పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఆమె అభినేత్రి సావిత్రి కావాలనుకుంది. కాలేదు.మరోలా మార్గం ఏర్పరుచుకుంది. జీవితాల్ని తెరకెక్కించమంటే కమర్షియల్‌గా కొంత కల్పన తప్పదు. మసాలా తప్పనిసరి. అసలది సిల్కు స్మిత జీవితం కాదు. అలాంటి అందరిది.”
”ఈ పాత్రకోసం అనేక గొప్ప పాత్రలు వదులుకున్నాను. ఇది నా కమిట్‌మెంట్..సిల్కుస్మిత పాత్రని రక్తి కట్టించే ఒక సన్నివేశం దగ్గర ఏకధాటిగా ఏడు సిగరెట్లు తాగి మరీ ప్రాక్టీసు చేశాను. అసలు, ఈ పాత్ర ఏమి చెబుతుంది..? ఎలాంటి నదురూ బెదురూ లేని జీవితం చెబుతుంది. బాడీ సెలబ్రేషన్ అంటే ఫెమినిజమే కదా” – విద్యాబాలన్.
కఫూర్ ప్రసంగంలో బోలెడంత లౌక్యం వుంది. ఓ పక్క బైట హోర్డింగుల్లో సిల్కుస్మిత శరీరం వుంది. విడుదలకి ఆమె పుట్టినరోజునే ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది..విద్యాబాలన్ శరీరం స్మిత శరీరానికి మ్యాచ్ అవలేదని, అయిందని బాహాటంగానే చర్చ జరిగింది. కోర్టుకి వెళ్ళేసరికి అసలా కథ సిల్కుది కాదు. అందరిది అంటున్నారు.
విద్యాబాలన్ స్టేట్‌మెంట్ అయితే పూర్తిగా వివాదాస్పదం. ఫెమినిస్టులే కాదు ఏ మానవ హక్కులు తెలిసిన వాడయినా ఏం చెబుతాడు. చాలా హక్కులతో బాటు లైంగిక హక్కు కూడా వుంటుంది. మనసులకయినా జంతువులకయినా అని కదా.
ఒక విశాలమైన కాన్వాసుని ఇలా ఎవరికి నచ్చిన చట్రంలో వారు ఇరికించి మాట్లాడడం తరచూ చూస్తునే వుంటాం. దీన్ని బట్టి ఇంకోసారి మళ్ళీ రుజువైనదేమిటంటే పితృస్వామ్య వ్యవస్థలో వున్నది మహిళా మంత్రులయినా, దర్శకులయినా, ఇంకెంత గొప్ప వాళ్ళయినా ఒక మూసలోనే ఆలోచిస్తారు. సమాజం మారిపోయిందని చెప్పదల్చుకున్నవాళ్ళు వీళ్ళనే మనకి దాఖలాగా చూపిస్తారు. అసలు వీళ్ళ సంఖ్య కొలబద్ద కాదని మనకి తెలుసు కదా…!
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags