ఏనాటిదో…. ఈ వేదన !?!

యం.ఆర్‌.అరుణకుమారి
”సత్యా ! సత్యా !
”ఆ! ఎవరూ?”
”నేనమ్మా ! సీతను”
”సీతా ! సీతా ?!? సీతంటే… శ్రీరామ…..”
”ఆ ! ఆ ! నేనే !”
”మీరా ? మీరు… నాతో…మాట్లాడుతున్నారా?”
”ఎంతకంత ఆశ్చర్యం సత్యా? నేన్నీతో మాట్లాడకూడదా?”
”అయ్యో! ఎంత మాట?”
”మరి?”
”మరి… మరి… ఆశ్చర్యమే కాదు… ఒకింత భయమూ….”
”ఎందుకమ్మా?”
”అందరూ నన్నాడి పోసుకుంటున్న వేళ… అమ్మలా… మీ ఆదర పలకరింపు…”
”ఉ. ధీరవనితవు. కంటిలో కన్నీటిపొర, గొంతులో దు:ఖపు జీరా తగునా”
”నేనున్న పరిస్థితి….”
”అభినందనీయమే కదా?”
”పరిహాసమా?”
”కాదు కాదు అక్షర సత్యం!”
”పతి పాదసేవే సతి మోక్షమైన పరమార్ధానికి పతిదేవుల శిరసుకు సత్య వామ పాద తాకిడి మహా అపచారమని విశ్వమే ఆక్షేపిస్తున్నవేళ… నాధుని కోరిక మేరకు అగ్ని ప్రవేశము, అరణ్యవాసమూ చేసిన మీరు నన్ను అభిశంసిస్తారుగానీ…. అభినందిస్తారా?”
”సత్యా! నీ సందేహం సహజమే! అనివార్య కారణాలవల్ల్ల మనం చెయ్యలేని ఒక కార్యం…. ఇతరులు చేసినప్పుడైనా అభినందించక పోవడం నైతిక బాధ్యతా రాహిత్యమే కాదా?”
”అంటే… క్షంతవ్యమేకాని ఈ అపచారాన్ని మీరు సమర్థిస్తున్నారా?”
”నిరంతరం మారే సత్యాలు, విశ్వాసాలు… ఆచారాల్ని నిర్దేసిస్తున్నప్పుడు అపచారమని, క్షమార్హం కాదనీ ఎలా అనుకొంటాం? ఐనా… సమర్థన వేరు, అభినందన వేరు కదా సత్యా?”
”ఎలా? సమర్థించనప్పుడు ఎలా అభినందించగలరు?”
”సత్యా సత్యాల ప్రసక్తి లేకుండా తాను నమ్మిన దాన్ని బలపర్చటం సమర్థన. తప్పొప్పుల ప్రసక్తి లేకుండా నచ్చిన దాన్ని మెచ్చుకోవటం అభినందన.”
”మహా పతివ్రత ఐన మీరే నన్ను అభినందిస్తున్నప్పుడు… మరి… అందరూ… నన్ను అభిశంసించడం…..”
”నిష్ఠూరమేల సత్యా! ఏటికెదురీదే ధైర్యం లేకపోవడమే! ఐనా.. సత్యా! అంత:పురంలో… అలకమందిరంలో… శ్రీవారు ఏమాత్రం నొచ్చుకోని… నీ అలకా ఉపశమన ఉపచారాల… ఏకాంత ‘సేవ’ జనంతో అల ‘జడి’ తరంగమవడం….?”
”ఉ. పుకారు కావచ్చుగా?”
”ఉ. చిరుకోపంతో నువ్వు మరింత అందంగా ఉన్నావు సత్యా! అందుకే శ్రీవారు.. నిన్ను కావాలని ఉడికిస్తారేమో! నీ అలకతో తానానందిస్తారేమో! మొత్తానికి ‘అలక’ నందవు నీవు. అల’కానందు’ లాయన.”
”పొండి. మీరు కూడా….”
”ఆ. సిగ్గే సింగారమని నిన్ను చూసే అనాలి. సరే గానీ… సత్యా! నిప్పులేనిదే పొగ రాదన్నట్లు పుకారు ఉత్తి పుణ్యానికే పుట్టి షికారు చెయ్యలేదుగా! చాలా పుకార్లు… ఏ స్వార్థమో… ఏ అసూయాగ్నితోనో పుట్టేవే! కానీ… నీ విషయంలో ఆ అవకాశం లేదు. తప్పో… పొరపాటో… ఏదో ఒకటి జరిగే వుంటుందని నాకన్పిస్తూంది.”
”జరక్కూడనిది జరిగేపోయినప్పుడు… తప్పయినా, పొరపాటయినా ఒకటే కదా!”
”ఎలా అవుతుంది సత్యా! తప్పు… ‘అహంభావం’. పొరపాటు.. ‘అనాలోచితం.’ రెండింటి తేడా తెల్సుకొని సరిదిద్దుకొనే విచక్షణే సంస్కారం”.
”నాకు అహంభావమనే కదా… అందరిభావన?”
”అలా… మొహం చిన్నబుచ్చుకొన్నా… ముడుచుకొన్నా… మల్లె మొగ్గలా… అందంగానే ఉన్నావు సుమా! ఐనా… అది నువ్వన్నట్లు… అందరి భావన కావచ్చేమోగాని… ‘శ్రీవారి’ది కాదు కదా?”
”కాదని ఎలా చెప్పగలరు?”
”సందేహమేల సత్యా? కాకపోతే జగన్నాటక సూత్రధారుడు ‘సత్యాపతి’ గా వినుతికెక్కగలడా?”
”ఉ”
”సత్యా! గర్వంతో ఆనందంతో నీ వదనమిప్పుడు వికసిత పద్మంలా  ఎంత సుందరంగా ఉందనీ! నిజమే సత్యా! నీ అహంభావమే నీ అపురూప సౌందర్య రహస్యమేమో!”
”అదిగో! మీరు కూడా….”
”ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోవడమే ధీరత్వం కదా సత్యా! ‘సబల’కు సజీవ రూపమైన నువ్వు బెంబేలు పడ్డం నాకు నచ్చలేదు. అందుకే ప్రత్యేకం… నిన్ను పలకరించి, అభినందించాలనే వచ్చాను. కానీ… సత్యా! రాగానే… నువ్వు… అందర్లానే నన్ను గుర్తించటంతో పొరపడ్డం నాకస్సలు నచ్చలేదు.
”పొరపాటా?”
”అవును సత్యా! ఒకరకంగా తప్పు కూడా!”
”తప్పా?!?”
”కాదా సత్యా? మనల్ని మనమే గుర్తించుకోలేక పోవటం తప్పు కాదా? తల్లులుగా, కూతుళ్ళుగా, భార్యలుగా తప్ప వ్యక్తులుగా మనం గుర్తింపబడ  లేకపోవటం… అందులోను… ‘విశ్వపతి’ నే ‘సత్యాపతి’ అన్పించిన నువ్వు కూడా నన్ను శ్రీరాముని భార్యగా తప్ప ‘సీత’ గా నా అస్తిత్వాన్ని గుర్తించలేకపోవటం నాకు బాధగా కూడా అన్పించింది.”
”నిజమేనండి. నన్ను మన్నించాలి. ఇది అలవాట్లో పొరపాటే గానీ… కావాలని చేసిన తప్పు మాత్రం కాదు.”
”హు! యుగాలెన్ని గడిచినా… మనమీ భావదాస్యంనుండి మనల్ని మనం విముక్తులం చేసుకోనంతవరకూ ఈ పొరపాటు అలవాటుగా సా… గా…. ల్సిందేలే! సరేగానీ… సత్యా! ఆ సంఘటన పొరపాటేనా… లేక……”
”అయ్యో! మీరు మళ్ళీ మొదటికే వచ్చారా?”
”అలా కినుక వహించకు సత్యా! కేవలం కుతూహలమే గానీ… పొరపాటా, తప్పా అన్న విశ్లేషణ, విచారణ నేనేమీ చెయ్యట్లేదుగా?”
”విశ్లేషణ, విచారణ వేరు వేరూనా?”
”అవును కదా సత్యా! సత్యా సత్యాల పరిశీలన విశ్లేషణ. అపనమ్మకమే విచారణ!”
”ఐతే… సమస్త జనం, సప్తలోకాలే కాదు… చరిత్ర కూడా ఈ అపరాధాన్ని ‘విచారిస్తూ’నే ఉంటుందన్న మాట.”
”నీ స్వగతం సత్యదూరం కాదు సత్యా!”
”ఈ విచారణ నుంచి స్త్రీలకు విముక్తే లేదా?”
”ఎందుకు లేదు? తప్పకుండా ఉంది.”
”ఎలా సాధ్యం?”
”మనల్ని ‘విచారించే’ అధికారం ఎదుటివారికి ఇవ్వనప్పుడు అది సుసాధ్యమే కదా?”
”కానీ… దానికి మీరు మినహాయింపు కాలేదు. మన్నించాలి. మిమ్మల్ని అవమాన పర్చాలని నా ఉద్దేశ్యం కాదు.”
”ఉన్నమాట అన్నందుకు నువ్వంతగా నొచ్చుకోనక్కర్లేదు. ఎవరి ఉద్దేశ్యాలతోనూ నిమిత్తం లేకుండా నాకు అవమానాలు జరిగిన మాట నిజమే సత్యా! స్త్రీలలో ప్రేమించే తత్వం సున్నితంగా ఉన్నంత వరకూ… అవమానం అంత బలంగానూ జరుగుతూనే వుంటుంది.”
”అంటే?”
”అంటే ఏముంది సత్యా! ‘నాకు నీపై బోలెడు నమ్మకం. అయినా లోకం కోసం పరపురుషుడి పంచన ఉన్న నువ్వు పవిత్రంగానే ఉన్నావని నిరూపించుకో’ మన్న రాముడి మీద ప్రేమతోనే కదా అగ్ని ప్రవేశం చేశాను. ఒక రజకుడి మత్తుమాటల్నే భరించలేక విలవిల్లాడుతున్న శ్రీరాముడి ‘బాధ’ భరించలేకే కదా నిండు గర్భిణిగా అడవుల పాలయ్యాను”.
”అవును. అందుకే మీరు ఆదర్శజంట అయ్యారు యుగాల తరబడీ….”
”హు. అదే నా బాధ కూడా సత్యా! భార్యను అనుక్షణం అనుమానించేవాడు, అగ్నిపరీక్షలు చేసేవాడు, అడవులకు తరిమేసేవాడూ… ఆదర్శప్రాయుడిగా ఎలా కీర్తింపబడుతున్నాడా అని!”
”ఆయన వీరత్వం….”
”యుద్ధ పిపాస!”
”శూరత్వం?”
”అస్త్ర పరీక్ష.”
”ఏక పత్నీవ్రతం?”
”కీర్తి కాంక్ష”
”అంతేనంటారా?”
”కాకపోతే…. తాము చెయ్యని తప్పులకు స్త్రీలు శిక్ష అనుభవించటం ఏమిటి? దేవేంద్రుని మోహం, మోసం తెల్సీ… అహల్యను గౌతముడు శపించటం అన్యాయం కాదా?”
”……………….”
”ఏమిటి సత్యా… దీర్ఘాలోచన?”
”ఏంలేదు. మీరన్నదే! ఐతే… అహల్య… తప్పు….”
”హు! తప్పొప్పుల నిర్దారణ చేసే శక్తి ఎవరికుంది సత్యా?”
”ధర్మ శాస్త్రాలు….”
”హు ! నీతులు, ధర్మాలు స్త్రీలకోసం మగవాళ్ళు సృష్టించినవే కదా!”
”ఐతే సకల ధర్మాలు, నీతులు స్త్రీల కోసమేనా?”
”తన పుణ్యాలకు, పాప విమోచనాలకు, ఆనందాలకు ‘లొసుగులు’, ‘మినహాయింపు’ లు సృష్టించి… వాటినే స్త్రీల పాలిట కఠిన కట్టుబాట్లుగా నిర్దేసించలేదా? ‘రేఖ’ దాటితే హింస తప్పదని నిరూపించలేదా!
”మీ మాటల్లో చాలా ఆవేదన….”
”నాకు కాక ఇంకెవరికుంటుంది సత్యా! ఈవేదన బడ బాగ్నిలా… నన్ను… నా మనసును ఎంత దహించి వేసి వుంటుందో ఆలోచించు సత్యా. భర్తను ఎడబాసి… పరాయి మగాడి రాజ్యంలో ఉన్నానన్న కారణంతో నన్ననుమానించిన రాముడ్ని… నేను గాని, లోకంగాని అనుమానించలేదు. శీల పరీక్ష చెయ్యలేదుగా?”
”వారు ఏకపత్నీ వ్రతులు కదా!”
”ఐతే స్త్రీలందరూ బహు పతీవ్రతులా?”
”ఛ! ఛ! నా ఉద్దేశ్యం…. వారు అడవిలో ఉన్నా అంత:పురంలో వున్నా మీకు… వేరే స్త్రీ లేదు కదా! ”
”ఎక్కడున్నా… నాకు మొగుడి పోరు తప్పలేదు కదా! లంకలో నేను అశోకవనంలో ఉన్నాను గానీ… రావణుడి అంత:పురంలో లేను కదా! ఐనా… భార్యాభర్తల్లానే కాదు.. ఏ ఇద్దరి మనుషుల్లో నైనా… ఒకరిపై మరొకరికి ఉండే నమ్మకం…. ఆ మనిషి ఎక్కడున్నా , ఎవరితో వున్నా అనుమానించనియ్యదు. నమ్మకం లేని చోటే గదా విచారణలు, పరీక్షలూ… ! ఇవి మనసునెంత కుంగదీస్తాయో ఊహించగలవా సత్యా?”
”ఆవేదనే… మిమ్మల్ని… మీ మాతృప్రేమను సైతం విస్మరింపచేసే మీ అమ్మఒడి చేర్చిందా?”
”వాల్మీకాశ్రమంలోనే వున్నా, కన్నబిడ్డల్తోనే వున్నా…. తిరిగి రాముని వెంట అయోధ్యకు వెళ్ళి… మళ్ళీ ఏ తాగుబోతో, వదరుబోతో… ఏదన్నా వాగితే…. ‘రాజధర్మం’ పేరిట… మళ్ళీ ఏ అగ్ని ప్రవేశమో, అరణ్యవాసమో… చెయ్యమంటే….? లేదు సత్యా! ఆ అవమానాలు భరించే శక్తి నాకు లేదు. అందుకే… నేనే… ఆయన్ని పరిత్యజించాను.”
”పరిత్యజించారా?!?”
”అవును సత్యా! నేనే ఆయన్ని తిరస్కరించాను. చెయ్యని తప్పులకు ఎన్నిసార్లని అపరాధిగా నిలబడను? నా దోషమేమీ లేదని నిరూపించుకోను? అయినా… నిరూపణలెవరికోసం? నా కోసమే ఐతే… నిజానిజాలేమిటో నా ఆత్మకు తెలీదా? రాముని కోసమా? తన అర్థాంగి పైన నమ్మకం లేని భర్తకు అగ్ని, అడివీ… సాక్ష్యాలా? అండా, దండాగా ఉండాల్సినవాడే కొండా కోనల వదిలేస్తే… ఆ వ్యక్తిత్వం ఆరాధ్యనీయమా? ఆదర్శ ప్రాయమా? ఇహ తాకమంటావా? పాతివ్రత్యం, మాతృత్వం అనే అగ్నుల్లో నిరంతరం… చచ్చేదాకా కాలి బూడిదవడం కన్నా స్త్రీల జీవితాలకు పరమార్థమే లేదనే లోకం కోసం… నా ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టాల్సిన అవసరమే కన్పించలేదు. అందుకే నేను… ఇందాక నువ్వన్న మాతృప్రేమను సైతం అధిగమించగల్గాను. ఐనా…. తన రాజ్యానికి, తన వంశానికి వారసులైన బిడ్డల్ని సంరక్షించాల్సిన బాధ్యత తండ్రికి మాత్రం లేదా సత్యా?”
”మీ మాటలు నోట మాట రానియ్యలేని అబ్బురంగా ఉన్నాయి. క్షమయాధరిత్రి ఐనా, భూపుత్రికే ఐనా… సహనానికీ ఓ హద్దుంటుందని, మీరితే… పరిణాములు తీవ్రంగానే ఉంటాయని, బిడ్డల బాధ్యత తండ్రికీ ఉందనీ…. మీరు చెప్పకనే… చేసి చూపారు కదా!”
”నువ్వు మాత్రం తక్కువా సత్యా? ఆగ్రహమొస్తే… స్త్రీలు కూడా ‘ఎవ్వరి’నైనా దండించగలరని నిరూపించావు కదా!”
”………………………”
”మాట్లాడక…. ముసి ముసిగా నవ్వుతావేం సత్యా?”
”నాకు చాలా ఆనందంగా ఉంది. మీతో మాట్లాడాక… నాలోని అనుమానాలు, భయాలు, బాధలు… అన్నీ దూదిపింజుల్లా ఎగిరిపోయి… నా మనసు చాలా…. నిర్మలంగా, సంతోషంగా ఉంది.”
”నిజంగానా సత్యా?”
”అవును. నిజంగానే. జరిగిన ఘటన… వాస్తవమైనా, అవాస్తవమైనా పుకారైనా, కవుల కల్పనైనా… నాకు ఆనందమే!”
”అదెలా సత్యా?”
”అంతే మరి! వాస్తవమైతే… ఆధిపత్యం! అహంకారం ఏ ”ఒక్కరి” సొత్తుకాదని గ్రహిస్తారు. అవాస్తవమైతే…. ‘విచారమే’ లేదు కదా!”
”చాలా బాగా చెప్పావు సత్యా! నీ మాటలు నీ మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిఫలిస్తున్నాయి. ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే… తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనే ఏ స్త్రీ కూడా ఎంతటి అధికారానికీ లొంగదు. అప్పుడే ‘ఆమె’ అస్తిత్వం ఉన్నతంగా పరిఢ విల్లుతుంది. అనుభవంతో చెప్పే మాటలు పాఠాలవుతాయి. స్వీయానుభవాలు… గుణపాఠాలవుతాయి. ఏది ఏమైనా… మంచి, మమత, మానవీయతే ఆచరణీయాలు.”
”యుగాంతాలదాకా… మీ మాటలు చిరస్మరణీయాలు.”

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.