నిర్మలా ఠాకూర్ (హిందీ కవిత)
తెలుగు సేత : నిర్మలానంద
సోదరా! ఇది నేటి పప్రంచం
పట్టపగలే ఇక్కడ బాహాటంగా
రోడ్డుమీద, నాలుగు రోడ్ల జంక్షనులో
బస్సులో టైయిన్‌లో
ఇంట్లో సయితం
రక్షణ లేని స్థితిలో వుంది సీత
ఆమె బలాత్కరించబడటం
అత్యాచారానికి గురికావడం
ఆత్మహత్య చేసుకోవడం
కట్టుకున్న వాడే ఆమె మీద
కిరసనాయిలు గుమ్మరించి
వొంటికి నిప్పు అంటించడం
తాను చేయని పనికి
ఆమె సిగ్గుతో కుంచించుకుపోవడం
నిరంతరం అనుభవిస్తూనే వుంది సీత
ఒక వైపు చెప్పరాని బాధని శరీరం అనుభవిస్తూనే
వేరొక వంక మనసు విలవిలలాడిపోవడం
ఎక్కడికి పోగలదు సీత ఈ పరిస్థితిలో
ఒక్క సారి గుమ్మం దాటిందా
వెనక్కి తిరిగి వెళ్లగలదా ఇంటికి స్త్రీ?
తన గౌరవ మర్యాదల్ని / వ్యక్తిత్వాన్నీ
కాపాడు కొనేందుకు ఏంచేయ్యాలి స్త్రీ?
మీకు… మీకు తెలిస్తే చెప్పరూ?