‘కిరణ్‌ బాల’ స్వాప్నిక దర్శనం

డాక్టర్‌ శిలాలోలిత
నిజామాబాద్‌లో చాన్నాళ్ళక్రితం అమృతలతగారి పిలుపు మేరకు మీటింగ్‌కి వెళ్ళాను. అక్కడ కవిత్వం చదివిన కొందరిలో కిరణ్‌బాల ఒకరు. ఇన్నేళ్ళయినా ఆమె కవిత నాకింకా గుర్తుండడానికి కారణం ఆమె కవిత్వమే. ‘సఫకేషన్‌ సఫకేషన్‌’ అన్న కవిత ఎంతో భావోద్వేగంతో చదివారు. ఊపిరాడనితనంతో ఉక్కిరిబిక్కిరయ్యే స్త్రీ జీవన దృశ్యాన్నీ, మానసిక ప్రపంచాన్ని ఆ కవిత ఆవిష్కరించింది.
ఆ కిరణ్‌బాల ఇప్పుడు ‘నా కలల ప్రపంచంలో’ అనే కవితా సంపుటితో పుస్తక ప్రచురణలోనికి అడుగిడుతున్నారు.
స్త్రీలు కవిత్వరచన చేయడం నాకు ఎంతో ఇష్టమైన విషయం కాబట్టి చాలా సంతోషమన్పించింది. కుటుంబం, బరువు బాధ్యతలు, ఊపిరాడనితనం, వెసులుబాటు, ప్రోత్సాహం, సమయం లేక ఎందరో ఎందరెందరో మొగ్గలోనే రచనకు ముగింపులు చెప్తుంటారు. ఒక పాజిటివ్‌ దృక్పథంతో, కవిత్వం పట్ల అపరిమితమైన ఇష్టంతో కవిత్వాన్ని రాస్తున్న కిరణ్‌బాల అభినందనీయురాలు.
ఇక, తన ‘కలల ప్రపంచంలో’కి అడుగిడితే… ఇందులో మొత్తం ముప్పై రెండు కవితలున్నాయి. వాటిని మూడు విధాలుగా కూడా వర్గీకరించుకోవచ్చు. ఒకటి స్త్రీల అస్తిత్వం కోసం పడుతున్న తపన, రెండు సామాజిక పోకడలపై విమర్శ, మూడు వేదాంత ధోరణి.
‘కత్తి తపస్సు’ – కవిత మార్మిక చిత్రణతో సాగింది ‘ఒకే ఒరలో రెండు కత్తులిమడవు’ – అనేది ఒకనాటి సామెత. రాజ్య వ్యవహారాలకు, రాజులకు సంబంధించిన కాలానిది… కానీ కిరణ్‌బాల ఇక్కడ కొత్తచూపుతో కొత్త దృశ్యపటాన్ని మనముందుంచింది.
ఒరను కుటుంబంతో పోల్చి, కుటుంబ వ్యవస్థలో కొత్త భార్యను తెచ్చుకున్నాక, వుండే ఘర్షణను చిత్రించింది. పాత కొత్త భార్యల మానసిక స్థితి – స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలు, వాటిని ఆమోదిస్తూ సమర్థిస్తున్న సమాజం, ఊపిరాడని స్థితిలో స్త్రీలు – అద్భుతమైన కవితా శిల్పంతో, ఉద్వేగభరితంగా ‘ఒరలో పాత-కొత్త కత్తుల కలయిక!’ కవిత కదలిపోతుంటుంది.
ఇదొక చిత్రమైన సన్నివేశం! బహుభార్యత్వం వల్ల పురుషుడి సుఖమే ప్రధానం అనుకుంటున్న సమాజానికి స్త్రీల మానసిక ఘర్షణ అస్సలు పట్టదు. తుప్పు పట్టిన, వయస్సు ఉడిగిన పాత కత్తిని విసిరేసిన రాజుపై ఇంకా కనికరం చూపిస్తూ…. ఆ ప్రాంగణంలోనే సేవచేస్తూ ఉండాలనుకునే నాటి కాలపు స్త్రీల బానిస మనస్తత్వాన్ని చిత్రీకరించింది.
ఇలాంటిదే ఇంకో కవిత – ‘సవాల్‌’ – చాలా వ్యంగ్యంగా విసుర్లు విసురుతూ సాగుతుంది. ఒక విషయాన్ని వాస్తవాన్ని చెబుతూ, కౌంటర్‌గా ఇదన్నమాట అసలు విషయం అని, నిజాల్ని నిప్పుల్లా జిమ్ముతూ పోతుంది. ఒక్కొక్క సంఘటనతో మగ స్వభావాన్ని అంచనా కడ్తూ కవిత చివర్లో – పుట్టిన నా బిడ్డని… / ఈ పురుషాధిక్య ప్రపంచానికి ‘సవాల్‌’గా / పెంచాలనే నిర్ణయ ప్రకటన చేస్తుంది. వ్యక్తీకరణలో కొత్తదనంతో మానవస్వభావాల్లోని వైరుధ్యాలను, వివక్షతలను వెల్లడించిందీ కవిత.
‘కన్నీటి చుక్క’ – కవితలో/’కారే కన్నీటి చ్కుకవిత్వం రాస్తుంది/నా మనసనే కలానికి/అది సిరాగా నిలుస్తుంది’ – అంటుంది.
స్త్రీ పురుషుల స్వభావాన్ని బట్ట బయలు చేసిన కవిత ‘నువ్వు-నేను’, వార్ధక్యం బాల్యం లాంటిదే సుమా అని చెప్పిన కవిత ‘చరమాంకం’.
‘నిన్ను మాత్రం’…. కవిత చదవగానే ప్రముఖ స్త్రీవాద కవయిత్రి రేవతీదేవి కవిత గుర్తొచ్చింది. నువ్వున్నావని ఇంట్లోంచి, ఊర్లోంచి వెళ్ళిపోయాను. కానీ, హృదయంలోంచి మాత్రం వెళ్ళిపోలేదు అంటుంది. అలాంటి ఉద్వేగభరిత కవితే ఇది. ‘ఈ మౌనం బాగుంది’… కవితలో –
సునిశితమైన పరిశీలన, జీవనకాంక్ష, సామాజిక అవగాహన, కుటుంబ జీవితాలపట్ల మమకారం, స్త్రీ పురుషుల సమానస్థితి ఎప్పటికీ కొనసాగాలన్న తపన ఇవన్నీ కవితావస్తువులయ్యాయి. జీవన సూత్రాలను అలవోకగా చెప్పడం కిరణ్‌బాల ప్రత్యేకత!
చాలా మామూలు మాటల్లోనే, సరళంగా చెప్తున్నట్లున్నా – లోతైన జీవితావగాహన తళుక్కున మెరుస్తుందందులో. విభిన్నమైన భావాలు, విచిత్రమైన పోకడలు కవిత్వమైనాయి.
పురుషుడిలో తాను కోరుకుంటున్న అంశాలను వ్యక్తీకరిస్తూ-
‘చూడాలి’ అనుకున్నవి… అన్ని నీలో చూసాను!
‘చూడకూడదు’ అనుకున్నవి కూడా చూసాను.
ఇక్కడ మనం ఓ క్షణం ఆగితే ఎంతైనా చర్చించుకోవచ్చు.
ఒక ఆశావాదిగా, వాస్తవవాదిగా, బతుకుపట్ల గల మమకారం కన్పించే కవిత – ‘నా కలల ప్రపంచంలో’… ప్రాణంకంటే మిన్నగా స్వేచ్ఛను ప్రేమిస్తారు! హక్కులకంటే ముందుగా బాధ్యతలు గుర్తిస్తారు – ఇక ‘కల-నిజం’ కవితలో… స్త్రీలలో ‘పిరికితనం’ అనే వ్యాధి పోయి ‘ఆత్మవిశ్వాసం’ అనే వెలుగు రావాలని ఆకాంక్షించింది.
”ఒక ‘ఉనికి’ని సాధించాలంటే –
ఎంత ‘శూన్యం’ శోధించాలో!? / నిర్లిప్తత సాధించాలంటే – ఏ ‘భావం’ త్యజించాలో!? వైరాగ్యం సాధించాలంటే – ఏ ‘తత్వం’ – జీర్ణించాలో!?” అంటూ వేదాంత ధోరణిని ప్రదర్శించింది.
‘నీవొస్తావని’… కవితలో
‘మిత్రమా,/కలయికలో ఏముంది?/అనుభవం తప్ప!
ఏ అనుభవానికి అందని/అనుభూతిని మిగిల్చావు’
గొప్ప జీవన మర్మాన్ని విప్పిన కవిత ఇది. అనుభూతిని మించినదేదీ లేదన్నది నిజం!
బ్రతుకంతా నిన్నే ప్రేమిస్తానని చెప్పలేను ప్రియా
చిన్నదైన బ్రతుకుని – ఎంతో పెద్దదైన ప్రేమతో ఎలా పోల్చను?
జీవితమెంత చిన్న బిందువో, ప్రేమతత్వమెంత ఉన్నతమైందో, ఉదాత్తమైందో విప్పిచెప్పిన సారవంతమైన కవిత ఇది.
ఆర్మూర్‌ వీధుల్లో బుద్ధిమాంద్యంతో నగ్నంగా తిరిగిన అనాథ అంధబాలుని చూసి – ద్రవించిన మనసుతో రాసిన ఆర్ద్రత నిండిన చినుకులాంటి కవిత –
‘వృక్షచ్ఛాయ లేదు/ఛత్రచ్ఛాయ లేదు/ తనువును కప్పివుంచాల్సిన
కనీస ఆచ్ఛాదనమైనా లేదు!
గతంలో ఒకసారి అనాథ శరణాలయానికి వెళ్ళిన పదిమంది కవులం ఆ ఇరవై ఏడు మందిని గురించి తలా ఒక కవితా రాశాం కన్నీళ్ళతో. మళ్ళీ అప్పటి కవితలొక్కసారిగా గుర్తొచ్చాయి ఇది చదువుతుంటే –
‘మా అమ్మకొడుకు కాడు’ – కవిత కూడా ప్రయోగాత్మక ధోరణిలో నడిచింది. దేశ సరిహద్దుల మధ్య జరుగుతున్న యుద్ధాలు, దేశద్రోహుల గురించి అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. మరొక అర్థంలో చూస్తే – ఆస్తి విభజనల్లో ఆడపిల్లలపై వివక్షను చూపిస్తూ, ఆఖరికి కన్నతల్లిని కూడా ఒంటరితనానికి గురిచేస్తున్న నేటి కొడుకుల గురించేననే స్ఫురిస్తుంది.
కిరణ్‌బాల కవిత్వం పుస్తకరూపంలో ఇప్పుడొచ్చినా… ఎప్పట్నుంచో ఆమెలో నిగూఢంగా, కవయిత్రి దాగుంది! కథలు, నాటికలు కొన్ని రాసినప్పటికి ఆమెకు కవిత్వం అంటేనే మమకారమెక్కువ, ఈ మొదటి సంపుటి తొలి అడుగు మాత్రమే! ఇక ముందు ముందు తాను నడిచే కవిత్వ పాదయాత్రలో ఎన్నెన్నో కవిత్వ సంపుటులు వస్తాయని, చిక్కని కవిత్వాన్ని రచిస్తూ… సాహితీవనంలో తనదైన స్థానాన్ని నిలుపుకుంటుందనీ విశ్వసిస్తున్నాను.
కమలాదాస్‌ లాంటి ప్రముఖమైన రచయిత్రులు కూడా తమకు ‘సమయం’ దొరకడమనేది ఎంత అపురూపమైన విషయమో చెప్పారు. కుటుంబ బాధ్యతలు, పనులు, సేవలు అన్నీ పూర్తయ్యాక అర్ధరాత్రి దాటాక, డైనింగ్‌ టేబుల్‌ పైన ఉన్నవన్నీ తీసి సర్దేసి, నీట్‌గా తుడుచుకోని, తెల్లవారుఝామున ఐదు గంటల వరకూ రాస్తూ కూర్చునేవారట! అందరూ నిద్రపోయినప్పుడు మాత్రమే ఆమె రాయగలిగేదాన్నని అన్నారు. కుటుంబంలో భర్త ప్రోత్సాహం ఉన్నప్పటికీ, అది వాళ్ళ సౌకర్యాలు, సేవలు, ముగిసిన తర్వాత మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది అనేది వాస్తవం. ఇది ఒక కమలాదాస్‌ విషయమే కాదు. స్త్రీలందరి పరిస్థితీ అంతే! ఎక్కడన్నా వెసులుబాటు ఒకరిద్దరికి దొరుకుతుందంతే! ఇలాంటి అననుకూల వాతావరణం నుంచి వారిలో ఉన్న రచనాసక్తిని, రాయాలనే తీవ్రకాంక్షను, తపనను అర్థం చేసుకోవాలి. అందుకే రాయాలనే తపన వున్న కిరణ్‌బాలలాంటి వాళ్ళపై నాకెంతో అనురాగం!
‘కిరణ్‌బాల’ మున్ముందు మరింత మంచి కవిత్వం రాసి నన్ను సంతోషపెడ్తుందని భావిస్తున్నాను.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.